18 స్థానాలు మైనస్‌ | TRS lost most of the 18 seats in the parliamentary elections | Sakshi
Sakshi News home page

18 స్థానాలు మైనస్‌

Published Fri, May 24 2019 3:20 AM | Last Updated on Fri, May 24 2019 7:12 AM

 TRS lost most of the 18 seats in the parliamentary elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అసెంబ్లీ ఎన్నికల్లో 88 స్థానాల్లో గెలుపొందిన అధికార టీఆర్‌ఎస్‌.. పార్లమెంటు ఎన్నికల్లో ఆ జోరును కొనసాగించలేకపోయిందని గురువారం వెలువడిన లోక్‌సభ ఫలితాలు చెపుతున్నాయి. ఈఫలితాల్లో 9 పార్లమెంటు నియోజకవర్గాల్లో విజయం సాధించిన టీఆర్‌ఎస్‌ రాష్ట్రంలోని 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్పష్టమైన ఆధిక్యతను కనబర్చగలిగింది. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 18 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ ఆధిక్యత తగ్గిపోయిందని ఫలితాల లెక్కలు వెల్లడిస్తున్నాయి.

ఇతర పార్టీల విషయానికి వస్తే.. కాంగ్రెస్‌ పార్టీ 22 చోట్ల, బీజేపీ 21 స్థానాల్లో ఆధిక్యతను కనబర్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 19 స్థానాల్లో గెలుపొందిన కాంగ్రెస్‌కు 3చోట్ల అధికంగా మెజారిటీ రాగా, కేవలం ఒక్క స్థానం గెలిచిన బీజేపీ ఏకంగా 20 స్థానాలు ఎక్కువగా 21 చోట్ల ఆధిక్యత కనబర్చింది. మజ్లిస్‌ మాత్రం 6 చోట్ల తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 7 స్థానాలకు గాను ఆరింట మెజార్టీ నిలబెట్టుకున్న ఎంఐఎం, తాను పోటీ చేయని నాంపల్లి అసెంబ్లీ పరిధిలో టీఆర్‌ఎస్‌కు ఆధిక్యత తెచ్చిపెట్టింది.

స్వల్ప నష్టమే కానీ..
అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పార్లమెంటు ఎన్నికల్లో 18 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ ఆధిక్యత కోల్పోయింది. అయితే, గతం కన్నా పార్లమెంటు స్థానాలు కూడా తగ్గడం, తమ కంచుకోటల్లో కాంగ్రెస్, బీజేపీలకు ఆధిక్యత రావడం ఆ పార్టీని కొంత ఇబ్బందుల్లోకి నెట్టింది. మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో మహబూబ్‌నగర్, బాల్కొండ, సనత్‌నగర్, నిర్మల్‌ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ ఆధిక్యత కోల్పోగా, మంత్రులతో పాటు ఆ పార్టీ ముఖ్యులు ప్రాతినిధ్యం వహిస్తోన్న సిరిసిల్ల, సిద్దిపేట, హుజూరాబాద్, పాలకుర్తి, మేడ్చల్, వనపర్తి, ధర్మపురి స్థానాల్లో టీఆర్‌ఎస్‌ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చింది. కాగా, సీఎం కేసీఆర్‌ నియోజకవర్గమైన గజ్వేల్‌లో ఆ పార్టీ మరోసారి భారీ మెజార్టీ దక్కించుకుంది.  

ఓడిన చోట్ల గెలుపు
కాంగ్రెస్‌ పార్టీ ఆధిక్యత కనబర్చిన 22 నియోజకవర్గాల్లో 17 చోట్ల మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన హుజూర్‌నగర్, నకిరేకల్, మునుగోడు, మంథని, ఎల్బీనగర్‌ నియోజకవర్గాల్లో మాత్రమే ఈసారి కూడా మెజార్టీ సాధించింది. అయితే, సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నాగార్జునసాగర్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి నియోజకవర్గమైన జగిత్యాల, ఉత్తమ్‌ పద్మావతి ఓడిపోయిన కోదాడ, మాజీ మంత్రి షబ్బీర్‌అలీ నియోజకవర్గమైన కామారెడ్డిల్లో ఈసారి కాంగ్రెస్‌కు టీఆర్‌ఎస్‌ కన్నా ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. ఇక, బీజేపీ విషయానికి వస్తే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన గోషామహల్‌లో తన స్పష్టమైన ఆధిక్యాన్ని నిలబెట్టుకున్న బీజేపీ ఈసారి టీఆర్‌ఎస్‌ కంచుకోటలయిన చాలా నియోజకవర్గాల్లో మెజార్టీ సాధించింది. ఉత్తర తెలంగాణలోని 12 అసెంబ్లీ నియోజక వర్గాల్లో బీజేపీ ఆధిక్యత సాధించడం విశేషం.

పార్టీల వారీగా ఆధిక్యత స్థానాలు టీఆర్‌ఎస్‌
సిరిసిల్ల, హుజూరాబాద్, హుస్నాబాద్, సూర్యాపేట, నల్లగొండ, ఆలేరు, తుంగతుర్తి, జనగామ, సిర్పూర్, భూపాలపల్లి, ములుగు, సిద్దిపేట, మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్‌చెరు, దుబ్బాక, గజ్వేల్, పెద్దపల్లి, ధర్మపురి, మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి, పాలకుర్తి, పరకాల, స్టేషన్‌ఘన్‌పూర్, వరంగల్‌ (ఈస్ట్‌), వరంగల్‌ (వెస్ట్‌), వర్ధన్నపేట, తాండూరు, మేడ్చల్, కంటోన్మెంట్, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, ఖమ్మం, పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లి, కొత్తగూడెం, అశ్వారావుపేట, నారాయణపేట, కొడంగల్, దేవరకద్ర, జడ్చర్ల, షాద్‌నగర్, వనపర్తి, గద్వాల, ఆలంపూర్, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్, ముథోల్, నాంపల్లి, నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్, భద్రాచలం, పినపాక, ఇల్లెందు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, ఆందోల్, నారాయణఖేడ్, జుక్కల్, బాన్సువాడ, నిజామాబాద్‌ (అర్బన్‌), బోధన్‌.

కాంగ్రెస్‌
దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్‌నగర్, కోదాడ, నకిరేకల్, మునుగోడు, ఇబ్రహీంపట్నం, భువనగిరి, మంథని, రామగుండం, పరిగి, వికారాబాద్, ఉప్పల్, ఎల్బీనగర్, మల్కాజ్‌గిరి, నిర్మల్, ఖానాపూర్, చేవెళ్ల, జహీరాబాద్, ఎల్లారెడ్డి, కామారెడ్డి.

బీజేపీ
కరీంనగర్, చొప్పదండి, వేములవాడ, మానకొండూరు, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, బోథ్, అంబ ర్‌పేట, ముషీరాబాద్, సికింద్రాబాద్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్‌నగర్, మక్తల్, మహబూబ్‌నగర్, గోషామహల్, ఆర్మూర్, నిజామాబాద్‌ (రూరల్‌), బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల.
మజ్లిస్‌
మలక్‌పేట, కార్వాన్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పుర, బహుదూర్‌పుర.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement