కరీంనగర్‌ ప్రజల విభిన్న తీర్పు!  | Karimnagar Voters Thinking Differently Over Recent Election Results | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌ ప్రజల విభిన్న తీర్పు! 

Published Tue, May 28 2019 10:26 AM | Last Updated on Tue, May 28 2019 10:26 AM

Karimnagar Voters Thinking Differently Over Recent Election Results - Sakshi

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: రాష్ట్రంలో అనేక సందర్భాల్లో కీలక రాజకీయ మార్పులకు కారణమైన కరీంనగర్‌ ప్రజానీకం ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడంలో సైతం విజ్ఞతను ప్రదర్శిస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఇటీవలి కాలంలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో శాసనకర్తలను నిర్ణయించడంలో కరీంనగర్‌ ఓటర్లు వ్యవహరించిన తీరు పలువురి ప్రశంసలు అందుకుంటోంది. గాలివాటం తీరు తీర్పులకు భిన్నంగా స్థానిక, జాతీయ అంశాలను పరిగణనలోకి తీసుకొని ఓటర్లు తమ హక్కును వినియోగించుకుంటున్నారు. గత డిసెంబర్‌ నుంచి ఏప్రిల్‌ వరకు జరిగిన మూడు భిన్నమైన ఎన్నికల్లో ఒక్కో ఎన్నికలో ఒక్కో పార్టీకి అనుకూలంగా ఓటేసి తమ విభిన్నతను చాటుకున్నారు.

శాసనసభ ఎన్నికల్లో అధికార పార్టీకి అప్రతిహత విజయాలను అందించిన కరీంనగర్‌ వాసులు మార్చిలో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో పట్టభద్రులు కాంగ్రెస్‌కు పట్టం కడితే, ఉపాధ్యాయులు తెలంగాణ పీఆర్‌టీయూ వెంట నడిచారు. పార్లమెంటు ఎన్నికల్లో అందుకు భిన్నంగా వ్యవహరించి జాతీయవాద దృక్పథంతో బీజేపీని గెలిపించారు. మూడు ఎన్నికల్లో మూడు రకాల తీర్పునిచ్చి తమ పరిణతిని చాటుకున్నారు కరీంనగర్‌ వాసులు.

అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రయోజనాలకు ప్రాధాన్యత
గత సంవత్సరం డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వాసులు తెలంగాణ రాష్ట్ర సమితికి జై కొట్టారు. ఉమ్మడి జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏకంగా 10 చోట్ల టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలనే గెలిపించారు. కేవలం పెద్దపల్లి జిల్లా మంథనిలో కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును భారీ మెజారిటీతో గెలిపించి స్థానిక అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. రామగుండంలో టీఆర్‌ఎస్‌ టికెట్‌ లభించక సమాజ్‌వాది ఫార్వర్డ్‌బ్లాక్‌ అనే రిజిష్టర్డ్‌ పార్టీ గుర్తు మీద పోటీ చేసిన కోరుకంటి చందర్‌కు విజయాన్ని అందించారు. ఇక్కడ కూడా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోమారపు సత్యనారాయణ ఓడిపోయినా, చందర్‌ను సైతం టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగానే పరిగణించి గెలిపించడం గమనార్హం.

మిగతా పది అసెంబ్లీ సెగ్మెంట్లు అన్నింటిలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే విజయం సాధించారు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ప్రచారం జరిగినా టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు సైతం గెలుపొందడం గమనార్హం. కేసీఆర్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు తోడు తెలంగాణ వ్యతిరేక పార్టీగా ముద్రపడ్డ తెలుగుదేశంతో దోస్తీ చేసిన కాంగ్రెస్‌ పార్టీని విశ్వాసంలోకి తీసుకోలేక టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను గెలిపించి విభిన్న తీర్పును ఇచ్చారు. 

మండలిలో ప్రశ్నించే గొంతుకకు పట్టాభిషేకం
శాసనమండలిలో పదవీకాలం ముగిసిన మండలి చైర్మన్‌ స్వామిగౌడ్, పాతూరి సుధాకర్‌రెడ్డి స్థానంలో జరిగిన ఎన్నికల్లో పట్టభద్రులు, ఉపాధ్యాయుల నియోజకవర్గం నుంచి చాలా రోజుల తరువాత అధికార పార్టీకి తొలి షాక్‌ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేసిన టీఆర్‌ఎస్‌ బలపరిచిన గ్రూప్‌–1 అధికారిగా రాజీనామా చేసి పోటీలో నిలిచిన అభ్యర్థి మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్‌కు ఓటమి తప్పలేదు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి ఘన విజయం సాధించారు. మండలిలో ప్రశ్నించే గొంతుక అవసరమని ప్రచారం చేసిన జీవన్‌రెడ్డి పట్ల పట్టభద్రులు విశ్వాసం చూపారు. అలాగే ఉపాధ్యాయుల నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేసిన పాతూరి సుధాకర్‌రెడ్డిని టీచర్లు ఓడించి పీఆర్‌టీయూ అభ్యర్థిని గెలిపించి, మండలికి పంపించారు. 

పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి అండగా...
జాతీయ రాజకీయాల ప్రభావమో, ప్రధాని నరేంద్ర మోదీ మీద అభిమానమో, బండి సంజయ్‌ పట్ల సానుభూతో తెలియదు గాని లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్‌ జిల్లా వాసులు బీజేపీని నెత్తికెక్కించుకున్నారు. కరీంనగర్‌ జిల్లాలోని కరీంనగర్‌ లోక్‌సభ స్థానంలో టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎంపీ బి.వినోద్‌కుమార్‌కు వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. ఈ ఎన్నికల్లో పార్లమెంటు పరిధిలో 90వేల మెజారిటీ సంజయ్‌కు రావడం విశేషం. వరంగల్, సిద్దిపేట జిల్లాల ప్రభావం ఉన్న హుజూరాబాద్, హుస్నాబాద్‌లలో ఓటర్లు టీఆర్‌ఎస్‌కు అండగా నిలవగా, సిరిసిల్లలో సైతం బీజేపీకి మద్దతు పలికారు. మిగతా నియోజకవర్గాల్లో పూర్తిగా బీజేపీకి అనుకూలంగా ఓట్లు పడడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది.

నిజామాబాద్‌ లోక్‌సభ పరిధిలోకి వచ్చే జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల్లో సైతం ఓటర్లు బీజేపీకి అండగా నిలిచి, అక్కడి బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌కు అనుకూలంగా తీర్పునిచ్చారు. కాగా పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గంలో మాత్రం ఓటర్లు టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లకు అనుకూలంగా భిన్నతీర్పు నిచ్చారు. పెద్దపల్లి, ధర్మపురిలలో టీఆర్‌ఎస్‌కు మెజారిటీ ఇచ్చిన ఓటర్లు మంథని, రామగుండంలో కాంగ్రెస్‌కు అండగా నిలిచారు. 

ప్రాదేశిక ఎన్నికల్లో ఎటువైపో..?
పంచాయతీ ఎన్నికల్లో స్థానిక అంశాలకు అనుగుణంగా తీర్పునిచ్చిన పల్లె వాసులు ఈ నెలలోనే జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో ఎటువైపు మొగ్గు చూపారనే అంశం ఇప్పుడు చర్చనీయాంశమైం ది. పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్, నిజామాబాద్‌ లోక్‌సభ పరిధిలో బీజేపీ వైపు, పెద్దపల్లిలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లకు అనుకూల తీర్పు ఇచ్చిన ఓటర్లు ఆ తరువాత జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో ఎటువైపు మొగ్గు చూపారనేది ప్రశ్నార్థకంగా మారింది. సోమవారం వెల్లడి కావలసిన ప్రాదేశిక ఫలితాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ వాయిదా వేసిన నేపథ్యంలో మరో నెలరోజులకు పైగా సస్పెన్స్‌ కొనసాగనుంది. ఒక్కో ఎన్నికలో ఒక్కో రకమైన తీర్పునిచ్చిన కరీంనగర్‌ ఓటర్లు ప్రాదేశిక ఎన్నికల్లో ఎవరిని గెలిపించి జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌లను చేస్తున్నారోనన్న ఆసక్తి పెరుగుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement