సాక్షి, హైదరాబాద్ : గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన కాంగ్రెస్ పార్టీ లోక్ సభ ఎన్నికల్లో కాస్త పుంజుకుంది. ఒక్క చోట కూడా గెలుపు కష్టమే అనుకున్న కాంగ్రెస్ పార్టీ ఎవరూ ఊహించనిరీతిలో, ఎగ్జిట్ పోల్స్ అంచనాలను సైతం తలకిందుల చేస్తూ మూడు చోట్ల విజయం సాధించి చేవెళ్లలో గెలుపు దిశగా వెళ్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుతో పొత్తుపెట్టుకొని తీవ్రంగా నష్టపోయిన కాంగ్రెస్.. ఈ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించింది. పార్టీ సీనియర్ నేతలను బరిలోకి దింపి విజయావకాశాలను మెరుగుపరుచుకుంది. టీఆర్‌ఎస్‌పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్‌కు కలిసొచ్చింది. దీంతో నల్గొండ, భువనగిరి, మల్కాజ్‌గిరి నియోజకవర్గాలలో కాంగ్రెస్ విజయం సాధించింది. ప్లాన్ ప్రకారం సీనియర్లకు టికెట్ ఇవ్వడం, టీఆర్‌ఎస్ కొత్త వారికి బరిలోకి దింపడం కాంగ్రెస్‌కు కలిసొచ్చింది.
దేశంలో అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజ్‌గిరిలో రేవంత్ రెడ్డి సమీప ప్రత్యర్థి టీఆర్‌ఎస్ అభ్యర్థి రాజశేఖర్‌పై 6 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఫైర్ బ్రాండ్‌గా పేరొందిన రేవంత్ అసెంబ్లీ ఎన్నికల్లో కోడంగల్ నుంచి పోటీ చేసి టీఆర్‌ఎస్ చేతిలో ఘోర పరాజయం పొందారు. అయినప్పటికి కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానాన్ని కేటాయించారు. నగరంలో రేవంత్‌కు ఉన్న క్రేజీతో పాటు, అసెంబ్లీ ఎన్నికల ఓటమి సానుభూతి రేవంత్‌కు కలిసొచ్చింది. దీనికి తోడు టీఆర్‌ఎస్ అభ్యర్థిగా కొత్త వ్యక్తిని బరిలోకి దింపడం కూడా రేవంత్‌కు కలిసొచ్చిందని చెప్పొచ్చు.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున నల్గొండ నుంచి పోటీ చేసి ఓటమిపాలైన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లోక్‌సభ ఎన్నికల్లో భువనగిరి నుంచి పోటి చేసి గెలుపొందారు. హోరాహోరిగా సాగిన పోరులో కోమటిరెడ్డి సమీపీ టీఆర్‌ఎస్ ప్రత్యర్థి, సిట్టింగ్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌పై 4వేల పైచిలుకు ఓట్ల తేడాతో గెలుపొందారు. నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌పై ఉన్న వ్యతిరేకత, సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గతంలో ఈ నియోజకవర్గ ఎంపీగా ఉండడం కోమటిరెడ్డికి కలిసొచ్చింది.
నల్గొండ నుంచి పోటీ చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి భారీ మెజారిటితో గెలుపొందారు. సమీపీ ప్రత్యర్థి, టీఆర్‌ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డిపై 20వేల పైచిలుకు ఓట్ల తేడాతో గెలుపొందారు. చేవెళ్లలో కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment