బీజేపీకి పదవి... కాంగ్రెస్‌కు పరువు!! | Congress-NCP alliance performs better than expected | Sakshi
Sakshi News home page

బీజేపీకి పదవి... కాంగ్రెస్‌కు పరువు!!

Published Fri, Oct 25 2019 4:19 AM | Last Updated on Fri, Oct 25 2019 5:07 AM

Congress-NCP alliance performs better than expected - Sakshi

బీజేపీకి ఆశాభంగం. శివసేనకు నిరుత్సాహం. కాంగ్రెస్, ఎన్సీపీల్లో పరువు దక్కిన ఉత్సాహం! స్థూలంగా ఇదీ... మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల చిత్రం.  ఈ సారి అధికార బీజేపీ, శివసేనలు కూటమిగా ఎన్నికల బరిలో దిగగా, కాంగ్రెస్, ఎన్సీపీలూ జట్టుకట్టి పోటీ చేశాయి. అయితే 220 స్థానాలు సాధించి దేవేంద్ర ఫడ్నవిస్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేస్తామని ధీమాగా ప్రకటించిన బీజేపీ బొటాబొటీ సీట్లతో మరోసారి పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమవుతూండగా... ఉనికిలోనే ఉండదనుకున్న కాంగ్రెస్, ఎన్సీపీ అటు ఇటుగా వంద సీట్లు సాధించి తమ ఉనికిని బలంగా చాటుకున్నాయి. అసంతృప్తులు అధికార కూటమికి చేటు చేయగా.. ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేసిన ప్రచారం ఆ పార్టీతోపాటు భాగస్వామి కాంగ్రెస్‌కూ కలిసొచ్చింది.

వలసలతో బలం పెరగలేదు...
మహారాష్ట్రలో ప్రతిపక్ష పార్టీల ముఖ్య నేతలు పలువురిని బీజేపీ తమవైపునకు తిప్పుకోగలిగినా  పార్టీ బలం పెంచలేకపోయాయి. పైపెచ్చు అసంతృప్తుల రూపంలో కొంత నష్టం చేశాయనే చెప్పాలి. సహకార బ్యాంకు కుంభకోణంలో ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ పేరును చేర్చడం ద్వారా మరాఠా ఓటును కొల్లగొట్టాలనుకన్న కమలనాథుల ఆశలు నెరవేరకపోగా పశ్చిమ మహారాష్ట్రలో పవార్‌ వర్గీయులు మరింత బలపడేందుకు అవకాశం ఏర్పడింది.  పవార్‌ ఈ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించి పట్టును చాటుకున్నారు.

2014లో పశ్చిమ మహారాష్ట్రలోని మొత్తం 66 స్థానాలకుగాను ఎన్సీపీ  18 స్థానాల్లో మాత్రమే గెలిచింది. ఈ సారి  ఈ సంఖ్య 30కి చేరువ కావడం విశేషం. బారామతిలో అజిత్‌ పవార్‌ సుమారు 1.62 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందడం.. సతారా లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఛత్రపతి శివాజీ వారసుడు, ఎన్సీపీ నుంచి బీజేపీకి మారిపోయిన ఉదయన్‌రాజే భోసాలే సైతం ఓటమి పాలు కావడం పవార్‌ ప్రభ ఇంకా తగ్గలేదన్న విషయాన్ని స్పష్టం చేస్తోంది. బీజేపీ గత ఎన్నికల్లో గెలుచుకున్న సీట్లు అనేకం ఈసారి ఎన్సీపీ వశమయ్యాయి. మరోవైపు కాంగ్రెస్‌  గత ఎన్నికల్లో సాధించిన 11 స్థానాల్లో చాలావాటిని నిలబెట్టుకోగలిగింది.  శివసేన పశ్చిమ మహారాష్ట్రలో నాలుగు స్థానాల్లో మాత్రమే కొద్ది ఆధిక్యత కనబరచగలిగింది.

రెబెల్స్‌ కొంప ముంచారా?
2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేనలు విడివిడిగా పోటీ చేసి  మొత్తం 288 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 122, శివసేన 62 స్థానాలు గెలుచుకోగలిగాయి. ఈసారి కలిసికట్టుగా బరిలోకి దిగినా గతంలో కంటే తక్కువ సీట్లు సాధించగలిగాయి. ప్రతిపక్ష పార్టీల నేతలను తమవైపునకు తిప్పుకునే క్రమంలో బీజేపీ, శివసేనల్లో అసంతృప్తులు పెరిగిపోవడం, టికెట్ల పంపిణీలో  గందరగోళం విజయావకాశాలను దెబ్బతీశాయని విశ్లేషకులు అంటున్నారు.   

కాంగ్రెస్‌ మెరుగుపడిందా?
కాంగ్రెస్‌కు మహారాష్ట్ర ఎన్నికలు నిరాశ కలిగించేవే. భాగస్వామిపార్టీ ఎన్సీపీ మెరుగైన ప్రదర్శన కనపరచడం ఒక్కటే ఊరటనిచ్చే అంశం. గత ఎన్నికలకన్నా రెండు మూడు సీట్లు ఎక్కువ సాధించినా  సంతోషపడాల్సినంత విషయం కాదు. 147 స్థానాల్లో బరిలోకి దిగిన కాంగ్రెస్‌ దాదాపు 45 స్థానాలు గెలుచుకుంది. గత ఎన్నికల్లో ఈ పార్టీకి 42 సీట్లే దక్కాయి. రాహుల్, సోనియా, ప్రియాంక వంటి అగ్రనేతలెవరూ ప్రచారంలో పెద్దగా పాల్గొనకపోవడం, నాయకత్వ లేమి విజయావకాశాలను దెబ్బతీశాయని అంటున్నారు. కాంగ్రెస్‌ తన శక్తియుక్తులను వెచ్చింది  ఉంటే బీజేపీ మరిన్ని స్థానాలు కోల్పోవాల్సి వచ్చేదని సీనియర్‌ జర్నలిస్ట్‌ ఒకరు వ్యాఖ్యానించారు.

ఎగ్జిట్‌ పోల్స్‌ ఫెయిల్‌!
మహారాష్ట్ర, హరియాణా ఎన్నికల్లో అధికార బీజేపీ సునాయాసంగా విజయం సాధిస్తుందని ఎగ్జిట్‌ పోల్స్‌ వేసిన అంచనాలు తల్లకిందులయ్యాయి. ఇండియాటుడే–యాక్సిస్‌ మై ఇండియా మినహాయించి మరెవరూ ఓటరు నాడిని పట్టలేకపోయారు. న్యూస్‌ 18–ఐపీఎస్‌ఓఎస్‌ ఎగ్జిట్‌ పోల్‌ మహారాష్ట్రలో బీజేపీ–శివసేనకు 244 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. కానీ వాస్తవానికి ఆ కూటమి 161 దగ్గరే నిలిచిపోయింది. ఇక కాంగ్రెస్, ఎన్సీపీకి కలిసి 39 స్థానాలు మాత్రమే వస్తాయని చెబితే అనూహ్యంగా ఆ కూటమి 103 స్థానాలను దక్కించుకుంది.

ఇక ఏబీసీ సీ ఓటరు బీజేపీ, శివసేనకి 230, కాంగ్రెస్‌ కూటమికి 54, రిపబ్లిక్‌ జన్‌కీ బాత్‌ బీజేపీ కూటమికి  223, కాంగ్రెస్, ఎన్సీపీకీ 54 స్థానాలు వస్తాయని అంచనా వేశాయి. ఒక్క ఇండియా టుడే మాత్రమే బీజేపీ –శివసేనకు 166 నుంచి 194 వస్తాయని, కాంగ్రెస్, ఎన్సీపీకి 72 నుంచి 90 వస్తాయని అంచనా వేసింది. ఇది మాత్రమే వాస్తవ ఫలితాలకు కాస్తంత దగ్గరగా వచ్చింది.  హరియాణా అసెంబ్లీ విషయానికొచ్చేసరికి ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ బీజేపీ క్లీన్‌స్వీప్‌ చేస్తుందని అంచనావేశాయి. ఏ సంస్థ కూడా ఐఎన్‌ఎల్‌డీ చీలిక వర్గం దుష్యంత్‌ చౌతాలా దూసుకుపోతారని, కాంగ్రెస్‌ పార్టీ గత ఎన్నికలతో పోలిస్తే రెట్టింపు స్థానాలను గెలుచుకోగలదని అంచనా వేయలేదు.  కేవలం ఇండియా టుడే–యాక్సిస్‌ మై ఇండియా మాత్రమే హర్యానాలో హంగ్‌ వస్తుందని అంచనా వేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement