Shiv Sena Coalition
-
బీజేపీకి పదవి... కాంగ్రెస్‌కు పరువు!!
బీజేపీకి ఆశాభంగం. శివసేనకు నిరుత్సాహం. కాంగ్రెస్, ఎన్సీపీల్లో పరువు దక్కిన ఉత్సాహం! స్థూలంగా ఇదీ... మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల చిత్రం. ఈ సారి అధికార బీజేపీ, శివసేనలు కూటమిగా ఎన్నికల బరిలో దిగగా, కాంగ్రెస్, ఎన్సీపీలూ జట్టుకట్టి పోటీ చేశాయి. అయితే 220 స్థానాలు సాధించి దేవేంద్ర ఫడ్నవిస్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేస్తామని ధీమాగా ప్రకటించిన బీజేపీ బొటాబొటీ సీట్లతో మరోసారి పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమవుతూండగా... ఉనికిలోనే ఉండదనుకున్న కాంగ్రెస్, ఎన్సీపీ అటు ఇటుగా వంద సీట్లు సాధించి తమ ఉనికిని బలంగా చాటుకున్నాయి. అసంతృప్తులు అధికార కూటమికి చేటు చేయగా.. ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేసిన ప్రచారం ఆ పార్టీతోపాటు భాగస్వామి కాంగ్రెస్‌కూ కలిసొచ్చింది. వలసలతో బలం పెరగలేదు... మహారాష్ట్రలో ప్రతిపక్ష పార్టీల ముఖ్య నేతలు పలువురిని బీజేపీ తమవైపునకు తిప్పుకోగలిగినా పార్టీ బలం పెంచలేకపోయాయి. పైపెచ్చు అసంతృప్తుల రూపంలో కొంత నష్టం చేశాయనే చెప్పాలి. సహకార బ్యాంకు కుంభకోణంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేరును చేర్చడం ద్వారా మరాఠా ఓటును కొల్లగొట్టాలనుకన్న కమలనాథుల ఆశలు నెరవేరకపోగా పశ్చిమ మహారాష్ట్రలో పవార్ వర్గీయులు మరింత బలపడేందుకు అవకాశం ఏర్పడింది. పవార్ ఈ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించి పట్టును చాటుకున్నారు. 2014లో పశ్చిమ మహారాష్ట్రలోని మొత్తం 66 స్థానాలకుగాను ఎన్సీపీ 18 స్థానాల్లో మాత్రమే గెలిచింది. ఈ సారి ఈ సంఖ్య 30కి చేరువ కావడం విశేషం. బారామతిలో అజిత్ పవార్ సుమారు 1.62 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందడం.. సతారా లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఛత్రపతి శివాజీ వారసుడు, ఎన్సీపీ నుంచి బీజేపీకి మారిపోయిన ఉదయన్‌రాజే భోసాలే సైతం ఓటమి పాలు కావడం పవార్ ప్రభ ఇంకా తగ్గలేదన్న విషయాన్ని స్పష్టం చేస్తోంది. బీజేపీ గత ఎన్నికల్లో గెలుచుకున్న సీట్లు అనేకం ఈసారి ఎన్సీపీ వశమయ్యాయి. మరోవైపు కాంగ్రెస్ గత ఎన్నికల్లో సాధించిన 11 స్థానాల్లో చాలావాటిని నిలబెట్టుకోగలిగింది. శివసేన పశ్చిమ మహారాష్ట్రలో నాలుగు స్థానాల్లో మాత్రమే కొద్ది ఆధిక్యత కనబరచగలిగింది. రెబెల్స్ కొంప ముంచారా? 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేనలు విడివిడిగా పోటీ చేసి మొత్తం 288 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 122, శివసేన 62 స్థానాలు గెలుచుకోగలిగాయి. ఈసారి కలిసికట్టుగా బరిలోకి దిగినా గతంలో కంటే తక్కువ సీట్లు సాధించగలిగాయి. ప్రతిపక్ష పార్టీల నేతలను తమవైపునకు తిప్పుకునే క్రమంలో బీజేపీ, శివసేనల్లో అసంతృప్తులు పెరిగిపోవడం, టికెట్ల పంపిణీలో గందరగోళం విజయావకాశాలను దెబ్బతీశాయని విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్ మెరుగుపడిందా? కాంగ్రెస్‌కు మహారాష్ట్ర ఎన్నికలు నిరాశ కలిగించేవే. భాగస్వామిపార్టీ ఎన్సీపీ మెరుగైన ప్రదర్శన కనపరచడం ఒక్కటే ఊరటనిచ్చే అంశం. గత ఎన్నికలకన్నా రెండు మూడు సీట్లు ఎక్కువ సాధించినా సంతోషపడాల్సినంత విషయం కాదు. 147 స్థానాల్లో బరిలోకి దిగిన కాంగ్రెస్ దాదాపు 45 స్థానాలు గెలుచుకుంది. గత ఎన్నికల్లో ఈ పార్టీకి 42 సీట్లే దక్కాయి. రాహుల్, సోనియా, ప్రియాంక వంటి అగ్రనేతలెవరూ ప్రచారంలో పెద్దగా పాల్గొనకపోవడం, నాయకత్వ లేమి విజయావకాశాలను దెబ్బతీశాయని అంటున్నారు. కాంగ్రెస్ తన శక్తియుక్తులను వెచ్చింది ఉంటే బీజేపీ మరిన్ని స్థానాలు కోల్పోవాల్సి వచ్చేదని సీనియర్ జర్నలిస్ట్ ఒకరు వ్యాఖ్యానించారు. ఎగ్జిట్ పోల్స్ ఫెయిల్! మహారాష్ట్ర, హరియాణా ఎన్నికల్లో అధికార బీజేపీ సునాయాసంగా విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ వేసిన అంచనాలు తల్లకిందులయ్యాయి. ఇండియాటుడే–యాక్సిస్ మై ఇండియా మినహాయించి మరెవరూ ఓటరు నాడిని పట్టలేకపోయారు. న్యూస్ 18–ఐపీఎస్ఓఎస్ ఎగ్జిట్ పోల్ మహారాష్ట్రలో బీజేపీ–శివసేనకు 244 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. కానీ వాస్తవానికి ఆ కూటమి 161 దగ్గరే నిలిచిపోయింది. ఇక కాంగ్రెస్, ఎన్సీపీకి కలిసి 39 స్థానాలు మాత్రమే వస్తాయని చెబితే అనూహ్యంగా ఆ కూటమి 103 స్థానాలను దక్కించుకుంది. ఇక ఏబీసీ సీ ఓటరు బీజేపీ, శివసేనకి 230, కాంగ్రెస్ కూటమికి 54, రిపబ్లిక్ జన్‌కీ బాత్ బీజేపీ కూటమికి 223, కాంగ్రెస్, ఎన్సీపీకీ 54 స్థానాలు వస్తాయని అంచనా వేశాయి. ఒక్క ఇండియా టుడే మాత్రమే బీజేపీ –శివసేనకు 166 నుంచి 194 వస్తాయని, కాంగ్రెస్, ఎన్సీపీకి 72 నుంచి 90 వస్తాయని అంచనా వేసింది. ఇది మాత్రమే వాస్తవ ఫలితాలకు కాస్తంత దగ్గరగా వచ్చింది. హరియాణా అసెంబ్లీ విషయానికొచ్చేసరికి ఎగ్జిట్ పోల్స్ అన్నీ బీజేపీ క్లీన్‌స్వీప్ చేస్తుందని అంచనావేశాయి. ఏ సంస్థ కూడా ఐఎన్ఎల్డీ చీలిక వర్గం దుష్యంత్ చౌతాలా దూసుకుపోతారని, కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికలతో పోలిస్తే రెట్టింపు స్థానాలను గెలుచుకోగలదని అంచనా వేయలేదు. కేవలం ఇండియా టుడే–యాక్సిస్ మై ఇండియా మాత్రమే హర్యానాలో హంగ్ వస్తుందని అంచనా వేసింది. -
50:50 ఫార్ములా?
ముంబై: మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ, శివసేన అధికారాన్ని చెరి సగం పంచుకుంటాయా? ఫడ్నవీస్ రెండున్నరేళ్లు పాలించిన తర్వాత శివసేన తరఫున సీఎం కుర్చీపై ఠాక్రే వారసుడు ఆదిత్య ఠాక్రే కూర్చుంటారా? ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ జరుగుతోంది. ఈ సారి ఎన్నికలకు ముందే బీజేపీ, శివసేన కూటమిగా ఏర్పడ్డాయి కానీ గత ఎన్నికలతో పోల్చి చూస్తే బీజేపీ 20కి పైగా స్థానాలను కోల్పోయింది. ఇక శివసేన తన స్థానాలను ఇంచుమించుగా నిలబెట్టుకోవడంతో ఆ పార్టీ స్వరం పెంచింది. 288 అసెంబ్లీ స్థానాలకు గానూ తాజా ఫలితాల్లో బీజేపీ 103 సీట్లలో, శివసేన 56 సీట్లలో విజయం సాధించాయి. సాధించిన సీట్లను బట్టి అవసరమైతే శివసేనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని బీజేపీ భావించింది. కానీ సేన తన దారి మార్చుకొని ఏకంగా సీఎం పీఠంపైనే కన్నేసింది. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన అధికారాన్ని సగం సగం పంచుకోవాలని ఎన్నికలకు ముందు పొత్తు కుదుర్చుకున్నప్పుడే నిర్ణయించుకున్నాయని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ పేర్కొనటం ఈ సందర్భంగా గమనార్హం. రొటేషన్ పద్ధతిలో సీఎం పీఠాన్ని పంచుకోవాలని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మధ్య అవగాహన ఉన్నట్లు సంజయ్ వెల్లడించారు. ఇదే విషయాన్ని ఎన్నికల ఫలితాల అనంతరం శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కూడా చెప్పారు. ‘కూటమి ఏర్పాటు సమయంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మా ఇంటికి వచ్చారు. అప్పుడు జరిగిన చర్చల్లో అధికారం సమానంగా పంచుకోవాలనే 50– 50 ఫార్ములాకు ఆయన అంగీకారం తెలిపారు. ఈ విషయాన్ని ఇప్పుడు గుర్తు చేస్తున్నాను’ అని ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. ‘సీట్ల సర్దుబాటు సమయంలో బీజేపీ కన్నా తక్కువ సీట్లలో పోటీకి అంగీకరించాం. కానీ ప్రతీసారీ అలా బీజేపీకి అవకాశం ఇవ్వలేం. మా పార్టీ కూడా విస్తరించాలి కదా’ అన్నారు. అయితే ఫడ్నవీస్ మాత్రం దీనికి విరుద్ధంగా వ్యాఖ్యలు చేశారు. 15 మంది రెబెల్స్ తమతో టచ్‌లో ఉన్నారని అందుకే తమ సంఖ్య తగ్గే అవకాశం లేదని అన్నారాయన. వీలుకాకుంటే కాంగ్రెస్‌తో దోస్తీ? 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన విడివిడిగా పోటీ చేశాయి. బీజేపీ 122 స్థానాలు గెలుచుకోవడంతో ఎన్నికల అనంతరం శివసేన మద్దతు ఇచ్చినప్పటికీ కమలదళమే పెద్దన్న పాత్రని పోషించింది. కానీ ఈ సారి ఆ పరిస్థితి లేదు. బీజేపీ కాదంటే కాంగ్రెస్ – ఎన్సీపీతో కలిసి అధికారాన్ని పంచుకునే అవకాశం కూడా శివసేనకు ఉంది. అందుకే బీజేపీని అభ్యర్థిస్తున్నట్లు కాకుండా డిమాండ్ చేస్తున్నట్టుగా శివసేన నేతలు మాట్లాడుతున్నారు. -
‘మహా’నేత ఫడ్నవీస్
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల పట్ల ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు (49) అసంతృప్తి లేనప్పటికీ... పూర్తి సంతృప్తిగా లేరని మాత్రం కచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 122 సీట్లు గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ 2019 ఎన్నికల్లో 102 స్థానాలకే పరిమితమైంది. కాకపోతే మిత్రపక్షం శివసేనతో కలిసి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తగిన సంఖ్యాబలం బీజేపీకి లభించింది. నాగపూర్ సౌత్‌వెస్టు స్థానం నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ గెలుపొందారు. మహారాష్ట్రలో రెండోసారి గెలిచిన తొలి కాంగ్రెసేతేర ముఖ్యమంత్రిగా ఆయన రికార్డు సాధించారు. రాష్ట్రంలో పూర్తికాలం పదవిలో కొనసాగిన రెండో ముఖ్యమంత్రి కూడా ఆయనే!!. కలిసొచ్చిన ఆర్ఎస్ఎస్ నేపథ్యం దేవేంద్ర ఫడ్నవీస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌తో (ఆర్ఎస్ఎస్) సన్నిహిత సంబంధాలున్న కుటుంబంలో 1970 జూలై 22న జన్మించారు. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం ఉన్న నాగపూర్ ఫడ్నవీస్ స్వస్థలం. ఆయన తండ్రి గంగాధర్ ఫడ్నవీస్ ఆర్ఎస్ఎస్లో పనిచేశారు. దాంతో సహజంగానే దేవేంద్ర కూడా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల పట్ల చిన్నతనంలోనే ఆకర్షితులయ్యారు. నాగపూర్ యూనివర్సిటీ నుంచి లా గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. తర్వాత బిజినెస్ మేనేజ్మెంట్లో పీజీ చదివారు. 1990వ దశకంలో రాజకీయాల్లో ప్రవేశించారు. 1992, 1997లో నాగపూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించారు. నాగపూర్‌లో అత్యంత పిన్నవయస్కుడైన మేయర్‌గా రికార్డు సృష్టించారు. 1999, 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో నాగపూర్ సౌత్‌వెస్టు స్థానం నుంచి నెగ్గారు. ఆర్ఎస్ఎస్తో ఉన్న సంబంధాలు ఆయన రాజకీయ ఎదుగుదలకు తోడ్పడ్డాయి. 2014లో ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన ఫడ్నవీస్ ఐదేళ్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పదవిలో కొనసాగారు. అనేక సవాళ్లను చాకచక్యంగా ఎదుర్కొన్నారు. రాజకీయాల్లో క్లీన్ ఇమేజ్ దేవేంద్ర ఫడ్నవీస్ సొంతం. ఫడ్నవీస్ భార్య అమృత బ్యాంకర్‌గా పనిచేస్తున్నారు. -
వచ్చేది రామరాజ్యమే
పింప్రి, న్యూస్‌లైన్: రావణ రాజ్యం ముగిసిందని, ఇక రామ రాజ్యం వస్తుందని యువసేన నాయకుడు ఆదిత్య ఠాక్రే ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మధ్యాహ్నం పుణేలో మోషి నుంచి బోసిరి వరకు ఆదిత్యఠాక్రే రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. శివసేన కూటమి అభ్యర్థులను గెలిపించి ఎర్రకోటపై పార్టీ జెండా ఎగిరేవిధంగా చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్-ఎన్సీపీలు అటు దేశానికిగానీ లేదా ఇటు రాష్ట్రానికిగానీ చేసిందీ ఏమీ లేదన్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమేనన్నారు. వీరిని ఎన్నుకుంటే శూన్యమే మిగులుతుందన్నారు. ఎన్సీపీ అంటేనే నేషనల్ కరప్షన్ పార్టీ అంటూ ఎద్దేవా చేశారు. ముందుగా మోషిలోని ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాల వేసిన ఆదిత్య... బోసిరి వరకు రోడ్‌షో నిర్వహించారు. బోసిరిలోని పీయూటీ చౌక్ వద్ద ఉన్న శివాజీ విగ్రహం నుంచి రోడ్‌షోను ప్రారంభించారు. బోసిరి, ఆలంది మార్గం మీదుగా దిఘి వరకు రోడ్ షో జరిగింది. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు శివాజీరావ్ అడల్‌రావ్ పాటిల్‌తోపాటు కార్పొరేటర్లు సులభా ఉభాలే, సంగీత పవార్, శివసేన విభాగ ప్రముఖులు విజయ్ పాల్గొన్నారు.