పదోసారి హైదరాబాద్‌ మజ్లిస్‌ వశం | Asaduddin Owaisi secures comfortable 4th term from Hyderabad | Sakshi
Sakshi News home page

పదోసారి హైదరాబాద్‌ మజ్లిస్‌ వశం

Published Fri, May 24 2019 4:07 AM | Last Updated on Fri, May 24 2019 4:07 AM

 Asaduddin Owaisi secures comfortable 4th term from Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ లోక్‌సభ స్థానంలో మజ్లిస్‌ పార్టీ వరసగా పదో విజయాన్ని నమోదు చేసుకుంది. మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ తాజా ఎన్నికల్లో ఈ స్థానంలో ఘన విజయం సాధించారు. పోటీ చేసిన ప్రతిసారీ మెజారిటీని పెంచుకుంటూ వస్తున్న అసదుద్దీన్‌ ఈసారి భారీ మెజారిటీని సొంతం చేసుకున్నారు. ఆయన దాదాపు 2.82 లక్షల ఓట్ల మెజారిటీని సొంతం చేసుకున్నారు. హైదరాబాద్‌ పార్లమెంటు స్థానం నుంచి ఆయనకు ఇది వరసగా నాలుగో విజయం. గత ఎన్నికల్లో 2.02 లక్షల ఓట్ల మెజారిటీ సంపాదించారు. ఇప్పటికి వరుసగా పదిసార్లు ఈ స్థానాన్ని కైవసం చేసుకున్న మజ్లిస్‌పార్టీకి ఇదే అతిపెద్ద మెజారిటీ కావటం విశేషం. పాతనగరంలో తనకు తిరుగులేదని మజ్లిస్‌ పార్టీ మరోసారి నిరూపించుకుంది. ఈ పార్లమెంటు స్థానం పరిధిలో ఒక్క గోషామహల్‌ అసెంబ్లీ స్థానం తప్ప మిగతా ఏడు స్థానాలూ మజ్లిస్‌ చేతిలోనే ఉన్నాయి.  

ఎన్నికలకు ముందే ‘గెలుపు’..
కారు.. సారు... పదహారు.. నినాదంతో ఎన్నికల్లో ప్రచారం చేసిన టీఆర్‌ఎస్‌ తాను 16 స్థానాలు గెలుస్తున్నట్టు పేర్కొంది. ఆ పార్టీ అభ్యర్థి బరిలో ఉన్నప్పటికీ, హైదరాబాద్‌లో గెలుపు మాత్రం మజ్లిస్‌దేనని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నికలకు ముందే ప్రకటించటం విశేషం. గత పార్లమెంటు ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన భగవంతరావునే బీజేపీ ఈసారి కూడా బరిలో నిలిపింది. తమ పార్టీ విజయం సాధిస్తుందని పేర్కొంటూ చివరి వరకు పోటీ ఇచ్చింది. కానీ అధికార పక్షం మజ్లిస్‌ విజయాన్ని పోలింగ్‌కు ముందే చెప్పేయటంతో అక్కడ పోటీ అంత రసవత్తరం కాదని తేలిపోయింది.  

మజ్లిస్‌ కేడర్‌లో కొంత నిరుత్సాహం  
అసెంబ్లీ ఎన్నికల్లో ఏడుకు ఏడు సిట్టింగ్‌ ఎమ్మెల్యే స్థానాలను, పార్లమెంటు ఎన్నికల్లో హైదరాబాద్‌ సిట్టింగ్‌ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకుని మజ్లిస్‌ పార్టీ జోష్‌లోనే ఉంది. కానీ, లోలోన మాత్రం ఆ పార్టీ నేతల్లో ఈసారి కొంత నిరుత్సాహం ఆవరించింది. నగరంలోని ఒక్క రాజేంద్రనగర్‌ అసెంబ్లీ స్థానం మినహా కొత్త చోట్ల పోటీ చేయలేదు. రాజేంద్రనగర్‌లో టీఆర్‌ఎస్‌ గెలవడంతో మజ్లిస్‌ శ్రేణులు డీలా పడ్డాయి. గతంలో సికింద్రాబాద్‌ పార్లమెంటు స్థానంలో గట్టి పోటీ ఇచ్చినా, ఈసారి టీఆర్‌ఎస్‌కు మేలు చేసే క్రమంలో సికింద్రాబాద్‌లో పోటీ చేయలేదు. అటు అసెంబ్లీ స్థానాలు, ఇటు పార్లమెంటు స్థానాలకు సంబంధించి కొత్త స్థానాల్లో పోటీ చేయకపోవటం ఆ పార్టీ శ్రేణుల్లో నిర్లిప్తతకు కారణమైంది.

ఔరంగాబాద్‌లో మజ్లిస్‌ విజయం...
మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో మజ్లిస్‌ పార్టీ విజయం సాధించింది. ఇది ఆ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇప్పటి వరకు మహారాష్ట్ర నుంచి ఎమ్మెల్యేలను గెలిపించుకున్న మజ్లిస్‌ పార్టీ తొలిసారి ఒక ఎంపీ స్థానాన్ని సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి ఇంతియాజ్‌ జలీల్‌ దాదాపు 5 వేల ఓట్ల మెజారిటీతో ఎంపీగా గెలిచారు. అసదుద్దీన్‌ ఒవైసీతోపాటు ఆయన సోదరుడు, ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ, పార్టీలోని మిగతా ఎమ్మెల్యేలు విడతలవారీగా అక్కడ ప్రణాళికాబద్ధంగా ప్రచారం నిర్వహించారు. ఇంతకాలం పార్లమెంటులో ఒక్క సీటుకే పరిమితమైన మజ్లిస్‌ తరఫున ఈసారి దర్జాగా ఇద్దరు ప్రవేశించనున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement