సాక్షి, హైదరాబాద్
సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో టీఆర్‌ఎస్ సత్తాచాటింది. మొత్తం 17 స్థానాలకు గానూ 9 చోట్ల గెలిచి ఆధిపత్యం చాటుకుంది. డిసెంబర్‌లో తెలంగాణ శాసనసభకు జరిగిన ముందస్తు ఎన్నికల్లో 119 సీట్లకు గానూ 88 సీట్లలో గెలిచి ప్రభంజనం సృష్టించినట్లే.. లోక్‌సభ ఎన్నికల్లోనూ అదే ఊపును కొనసాగిస్తామని టీఆర్‌ఎస్ నాయకత్వం ఆశించింది. టీఆర్‌ఎస్ 16 స్థానాలు, మిత్రపక్షం మజ్లిస్‌కు ఓ స్థానం కలిపి రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌సభ స్థానాలను తామే దక్కించుకుంటామని ప్రకటించింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో 11 లోక్‌సభ స్థానాల్లో నెగ్గిన టీఆర్‌ఎస్ తాజా ఎన్నికల్లో 9 స్థానాలకు పరిమితమైంది.సంఖ్యాపరంగా రెండు స్థానాలను కోల్పోయింది. మూడు సిట్టింగ్ స్థానాల్లో పార్టీ అభ్యర్థులు ఓడిపోగా, టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి అందని ద్రాక్షగా ఉన్న నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానాన్ని కైవసం చేసుకుంది.
నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి టీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎంపీ, సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత.. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో 71,057 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. కరీంనగర్ స్థానంలో సిట్టింగ్ ఎంపీ, పార్టీ కీలక నేత బోయినపల్లి వినోద్‌కుమార్.. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ చేతిలో 89,508 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఆదిలాబాద్ సిట్టింగ్ టీఆర్‌ఎస్ ఎంపీ జి.నగేశ్‌పై.. బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావు 58,493 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇక టీఆర్‌ఎస్ గెలిచిన స్థానాలను పరిశీలిస్తే.. కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై చేవెళ్ల నుంచి డాక్టర్ జి.రంజిత్ రెడ్డి 14,391 ఓట్ల బొటాబొటీ మెజారిటీతో గెలుపొందారు. మెదక్ నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి.. కాంగ్రెస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్‌పై భారీ 3,16,427 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
ఖమ్మంలో చివరి నిమిషంలో టీఆర్‌ఎస్‌లో చేరి ఎంపీగా బరిలో దిగిన నామా నాగేశ్వర్ రావు.. కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరిపై 1,68,062 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. మహబూబాబాద్ నుంచి మాలోతు కవిత.. కాంగ్రెస్ అభ్యర్థి పి.బలరాం నాయక్‌పై 1,46,663 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. మహబూబ్‌నగర్ నుంచి మన్నె శ్రీనివాస్ రెడ్డి.. బీజేపీ అభ్యర్థి డీకే అరుణపై 77,829 ఓట్ల తేడాతో గెలుపొందారు. నాగర్ కర్నూల్ నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థి పోతుగంటి రాములు.. కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ మల్లురవిపై 1,89,748 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. పెద్దపల్లి నుంచి బొర్లకుంట వెంకటేష్ నేత.. కాంగ్రెస్ అభ్యర్థి ఆగం చంద్రశేఖర్‌పై 95,180 ఓట్ల తేడాతో గెలిచారు. వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్.. కాంగ్రెస్ అభ్యర్థి దొమ్మాటి సాంబయ్యపై 3,50,298 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్ కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్‌రావుపై 6,229 ఓట్ల స్వల్ప తేడాతో గట్టెక్కారు.
ఉనికి కాపాడుకున్న కాంగ్రెస్
అసెంబ్లీ ఎన్నికలు, తదనంతర ఫలితాలతో రోజురోజుకూ అస్తిత్వాన్ని కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీకి ఈ ఫలితాలు కొత్త శక్తినిచ్చాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో రెండు లోక్‌సభ స్థానాలను మాత్రమే గెలిచిన కాంగ్రెస్, తాజా ఎన్నికల్లో 3 స్థానాలను గెలుచుకుంది. నల్లగొండ నుంచి పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి టీఆర్‌ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహా రెడ్డిపై గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన ఇద్దరు పార్టీ సీనియర్లు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎ.రేవంత్ రెడ్డి లోక్‌సభ ఎన్నికల్లో సత్తాచాటారు. భువనగిరి నుంచి టీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌పై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 5,219 ఓట్ల స్వల్పమెజారిటీతో గెలుపొందారు. మల్కాజ్‌గిరి నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డిపై ఎ.రేవంత్ రెడ్డి 10,919 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
కమల వికాసం!
తెలంగాణ గడ్డపై కమలం పువ్వు వికసించింది. రాష్ట్రంలోని నాలుగు లోక్‌సభ స్థానాలను అనూహ్యంగా గెలుచుకుని అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీ, టీఆర్‌ఎస్ కీలక నేత కల్వకుంట్ల కవితను ఓడించడం ద్వారా స్థానిక బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ జాయింట్ కిల్లర్‌గా నిలిచారు. 179 మంది రైతులు బరిలో దిగడంతో దేశం దృష్టిని ఆకర్షించిన ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. మరోవైపు, సిట్టింగ్ స్థానమైన సికింద్రాబాద్‌ను బీజేపీ నిలబెట్టుకుంది.
గత ఎన్నికల్లో బండారు దత్తాత్రేయ ఇక్కడినుంచి విజయం సాధించగా.. ఈసారి బీజేపీ ఎంపీగా పోటీచేసిన పార్టీ సీనియర్‌నేత కిషన్ రెడ్డి స్పష్టమైన మెజారిటీతో టీఆర్‌ఎస్ అభ్యర్థి తలసాని సాయి కిరణ్ యాదవ్‌పై గెలుపొందారు. అయితే.. కరీంనగర్‌లో బీజేపీ పోటీ ఇస్తుందని భావించినా.. అనూహ్యంగా బండి సంజయ్ విజయం సాధించడంతో పార్టీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఆదిలాబాద్‌లో చివరి నిమిషంలో బీజేపీలో చేరి టికెట్ సంపాదించిన సోయం బాపూరావు కూడా స్పష్టమైన మెజారిటీతో గెలుపొందారు.
Comments
Please login to add a commentAdd a comment