Nandi Yellaiah
-
కరోనాతో నంది ఎల్లయ్య కన్నుమూత
సాక్షి, హైదరాబాద్/ముషీరాబాద్ : మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ కురువృద్ధుడు, టీపీసీసీ ఉపాధ్యక్షుడు నంది ఎల్లయ్య(78) శనివారం కరోనాతో కన్నుమూశారు. గత నెల 29న అనారోగ్యంతో నిమ్స్ ఆసుపత్రిలో చేరిన ఎల్లయ్యకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. చికిత్స పొందుతూ శనివారం ఉదయం 11 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. ఆయన భౌతికకాయాన్ని జీహెచ్ఎంసీ అధికారులు నిమ్స్ ఆసుపత్రి నుంచి బన్సీలాల్‌పేట శ్మశానవాటికకు తీసుకువెళ్లి కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు. 1964లో రాజకీయ ప్రస్థానం షురూ.. 1942 జూలై 1న హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో నాగయ్య, నరసమ్మ దంపతులకు నంది ఎల్లయ్య జన్మించారు. ఆయన అప్పట్లో పీయూసీ వరకు చదువుకున్నారు. 22 ఏళ్ల వయసులోనే 1964లో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఎల్లయ్య ఐదుసార్లు సిద్దిపేట నుంచి, ఒకసారి నాగర్‌కర్నూల్ నుంచి ఎంపీగా విజయం సాధించారు. రెండుసార్లు రాజ్యసభ సభ్యునిగా, ఒకసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని జమిస్తాన్పూర్ కౌన్సిలర్‌గా 1964లో ఎన్నికై తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. 1977లో జరిగిన ఎన్నికల్లో సిద్దిపేట ఎస్సీ రిజర్వ్డ్ స్థానం నుంచి మొదటిసారి ఎంపీగా విజయం సాధించారు. 1980, 1989, 1991, 1996 ఎన్నికల్లోనూ సిద్దిపేట ఎంపీగా ఎన్నికయ్యారు. 2014లో నాగర్‌కర్నూల్ ఎంపీగా గెలుపొందారు. రెండుసార్లు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇందిర, పలువురు సీఎంలతో సన్నిహిత సంబంధాలు నిరుపేద దళిత కుటుంబంలో పుట్టిన నంది ఎల్లయ్య సుమారు 40 ఏళ్లపాటు పార్లమెంటేరియన్‌గా పనిచేసిన ఘనతను సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలో అప్పటి ముఖ్యమంత్రులు టి. అంజయ్య, మర్రి చెన్నారెడ్డి, వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డితో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. 1969లో మర్రి చెన్నారెడ్డితో కలిసి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొని 22 రోజులపాటు జైలు జీవితం గడిపారు. ప్రధాని ఇందిరాగాంధీ పోటీచేసిన మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం పక్కనే ఎల్లయ్య పోటీ చేసిన సిద్దిపేట నియోజకవర్గం ఉండడంతో ఇందిరతో కూడా మంచి సంబంధాలను కొనసాగించారు. ఆ తరువాత సోనియాగాంధీతో కూడా మంచి సంబంధాలు ఉండడంతో రెండుసార్లు రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఏఐసీసీ, టీపీసీసీ ఉపాధ్యక్షుడితోపాటు పార్టీ, ప్రభుత్వానికి చెందిన పలు కమిటీల్లో సభ్యులుగా పనిచేశారు. సాదాసీదా ఒంటరి జీవితం 8 సార్లు ఎంపీగా పనిచేసినప్పటికీ ఎల్లయ్య సాదాసీదా రాజకీయ జీవితాన్ని గడిపారు. వివాహం జరిగిన కొద్దిరోజులకే భార్య నుంచి విడిపోవడంతో మళ్లీ పెళ్లి చేసుకోలేదు. ఇండియన్ ఎయిర్‌లైన్స్‌లో పనిచేసి పదవీ విరమణ పొందిన అతని సోదరుడు నంది కృష్ణతో కలిసి రాంనగర్‌లోనే ఉమ్మడిగా కలిసి జీవించేవారు. ఎల్లయ్య నిరాడంబరుడు, మితభాషిగా పేరొందారు. సీఎం కేసీఆర్ సంతాపం నంది ఎల్లయ్య మృతిపట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఎల్లయ్య కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. ఎల్లయ్య మృతిపట్ల హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్, మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, సత్యవతి రాథోడ్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత డాక్టర్ కే.కేశవరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పతాకం అవనతం.. నంది ఎల్లయ్య మృతికి సంతాప సూచకంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయమైన గాంధీభవన్‌లో పార్టీ పతాకాన్ని శనివారం అవనతం చేశారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ ఇన్చార్జి ఆర్.సి కుంతియా, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలు సంతాపం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి నిబద్ధతతో, క్రమశిక్షణతో ఎల్లయ్య పనిచేశారని కొనియాడారు. ఎల్లయ్య మరణం కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. సంతాపం తెలిపినవారిలో ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్ రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శులు సంపత్ కుమార్, వంశీచంద్‌రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, పార్టీ ముఖ్య నేతలు వీహెచ్, గీతారెడ్డి, షబ్బీర్ అలీ, అంజన్ కుమార్ యాదవ్, మల్లు రవి తదితరులున్నారు. సోనియా ఫోన్ పరామర్శ(బాక్సు) నంది ఎల్లయ్య మృతి చెందిన సమాచారం తెలుసుకున్న ఏఐసీసీ చీఫ్ సోనియాగాంధీ ఫోన్ ద్వారా ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. సోదరుడు నంది కృష్ణకు ఫోన్ చేసిన ఆమె విషయం అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, పార్టీ ఎల్లయ్య కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎల్లయ్య సోదరుడు చక్రధర్‌కు పార్టీ ముఖ్య నేత గులాంనబీ ఆజాద్ ఫోన్ చేసి పరామర్శించినట్టు గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలకు పాజిటివ్ హైదరాబాద్ : రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డితోపాటు తాండూరు, ఎల్బీనగర్ ఎమ్మెల్యేలు పంజుగుల రోహిత్‌రెడ్డి, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డిలకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గత ఆదివారం (ఈ నెల 2న) కోవిడ్–19 టెస్టు చేయించుకోగా పాజిటివ్ వచ్చిందని, అప్పటి నుంచి హోం ఐసోలేషన్‌లో ఉన్నానని, ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నానని మంత్రి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రెండు, మూడు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రోహిత్‌రెడ్డి శనివారం జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో కోవిడ్ పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. వెంటనే అపోలోలో అడ్మిట్ అయ్యారు. ఎమ్మెల్యే గన్మెన్లు, పీఏ, వ్యక్తిగత సిబ్బందికి కరోనా పరీక్షలు చేయించగా నెగెటివ్ వచ్చినట్లు తెలిసింది. అదేవిధంగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డితోపాటు కుటుంబసభ్యులకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కుటుంబసభ్యులందరం హోం ఐసోలేషన్‌లో ఉన్నామని, త్వరగా కోలుకొని ప్లాస్మా దానం చేస్తామన్నారు. -
సిద్దిపేట ముద్దుబిడ్డ, ఐదుసార్లు అక్కడి నుంచే
సాక్షి, హైదరాబాద్/సిద్దిపేట: కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కడవరకూ కట్టుబడి నడుచుకున్న సీనియర్ నేత, మాజీ ఎంపీ నంది ఎల్లయ్య (78) ఇకలేరు. 10 రోజుల క్రితం కరోనా బారినపడిన ఆయన నిమ్స్‌లో చికిత్స పొందుతూ శనివారం ఉదయం 10.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆరు సార్లు లోక్‌సభ, రెండు సార్లు రాజ్యసభ సభ్యునిగా ప్రాతినిథ్యం వహించిన నంది ఎల్లయ్య వివాదాలకు దూరంగా ఉండే నేతగా పేరు గడించారు. 1942 జూలై 1న హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో ఆయన జన్మించారు. నంది ఎల్లయ్యకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. ప్రస్థానమిలా సిద్దిపేట నుంచి 1977 లో మొదటి సారి సిద్దిపేట (ఎస్సీ) లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి నంది ఎల్లయ్య గెలుపొందారు. అప్పటి వరకు సిద్దిపేట ఎంపీగా పని చేసిన జి.వెంకటస్వామి శాసనమండలికి వెళ్లడంతో ఆ స్థానం ఖాళీ అయింది. దాంతో సిద్దిపేట పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి నంది ఎల్లయ్య పోటీ చేసి గెలిచారు. 1980లో జనతా ప్రభుత్వం కూలిపోవడంతో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో సిద్దిపేట నుంచి మళ్లీ పోటీ చేసి ఆయన గెలుపొందారు. 1984లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి డాక్టర్ గుండె విజయరామారావు చేతిలో నంది ఎల్లయ్య ఓడిపోయారు. తిరిగి 1989లో విజయరామమారావును ఓడించి మూడవ సారి విజయం సాధించారు. ఎన్టీఆర్ ఛైర్మన్‌గా వ్యవహరించిన నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం కూలిపోవడంతో 1991లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో నంది ఎల్లయ్య సిద్దిపేట నుంచి నాలుగో సారి గెలిచారు. 1996లో మెజారిటీ లేక పోవడంతో అప్పటి ప్రధాని వాజ్ పాయ్ తన ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశారు. అప్పుడు జరిగిన ఎన్నికల్లో నంది ఎల్లయ్య ఐదో సారి సిద్దిపేట నుంచి గెలిచారు. 1998లో వాజ్‌పేయి ప్రభుత్వం మళ్లీ పడిపోవడంతో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మల్యాల రాజయ్య చేతిలో ఓటమి పాలయ్యారు. 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానం నుంచి పోటిచేసిన నంది ఎల్లయ్య మందా జగన్నాథాన్ని ఓడించి 16వ లోక్‌సభకు ఎన్నికయ్యారు. మొదటి నుంచి దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ముఖ్య అనుచరుడిగా నంది ఎల్లయ్య కొనసాగారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేశారు. (కరోనాతో మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతి) -
కరోనాతో మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతి
-
కరోనాతో మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతి
సాక్షి, హైదరాబాద్: మాజీ ఎంపీ నంది ఎల్లయ్య(78) కన్నుమూశారు. జులై 29న కరోనా బారినపడి అనారోగ్యంతో నిమ్స్‌లో చేరిన నంది ఎల్లయ్య శనివారం ఉదయం 10.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈయన కాంగ్రెస్ పార్టీ తరపున నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. నంది ఎల్లయ్య ఐదుసార్లు లోక్‌సభ సభ్యుడిగా, రెండుసార్లు రాజ్యసభ సభ్యడిగా పనిచేశారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటిచేసి మంద జగన్నాథంను ఓడించి 16వ లోక్‌సభకు ఎన్నికయ్యారు. (ఎల్బీనగర్ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్) కాంగ్రెస్ సీనియర్ నేత నంది ఎల్లయ్య అకాల మరణం పట్ల టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జి ఆర్.సి కుంతియా, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, మాజీ మంత్రి డీకే సమరసింహరెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 'కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, నిబద్దతతో క్రమశిక్షణతో పనిచేశారు. ఆయన క్రమశిక్షణ నేటి తరానికి ఆదర్శం. ఓటమి ఎరగని నేత, దళిత బాంధవుడు నంది ఎల్లయ్య. గాంధీ ఆశయాలను తుచ తప్పకుండా పాటించిన ఆదర్శ నాయకులు. ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటు. నంది ఎల్లయ్య ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాం' అని పేర్కొన్నారు. -
సీట్ల లొల్లి!
సాక్షి, నాగర్‌కర్నూల్: పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే నేతల మధ్య వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకోవాలన్న ముందస్తు వ్యూహంతో వ్యవహరిస్తున్నప్పటికీ నేతల మధ్య సమన్వయం కుదరకపోవడంతో అభ్యర్థుల ఎంపికపై ఎటూ తేలడం లేదు. గాంధీభవన్‌లో మంగళవారం జరిగిన సమావేశంలో ప్రదేశ్ ఎన్నికల కమిటీ ఒక్కో పార్లమెంట్ స్థానానికి నాలుగు నుంచి, ఐదుగురి ఆశావహులతో కూడిన జాబితాను ప్యానెల్ ఖరారు చేసింది. ఈ జాబితాలో తమకు అనుకూలమైన వారి పేర్లు లేకపోవడంపై వాడీవేడి చర్చ జరిగింది. ఈ సమావేశంలోనే మరోసారి సీనియర్ నేతల మధ్య ఉన్న వర్గ విభేదాలు బహిర్గతమయ్యాయి. అయితే పూర్తిస్థాయిలో చర్చించిన అనంతరం అభ్యర్థుల జాబితాను అధిష్టానానికి పంపినట్లు సమాచారం. మహబూబ్‌నగర్‌లో పోటీకి జైపాల్ అనాసక్తి మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ ఎంíపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో సీనియారిటీ, సామాజిక సమీకరణలు, పార్టీపట్ల విధేయత లాంటి అంశాలను పరిగణలోకి తీసుకుని దరఖాస్తు చేసుకున్న వారిలో పీఏసీ జాబితా తయారు చేసి పంపినట్లు సమాచారం. ఈ జాబితాలో జైపాల్‌రెడ్డి పేరు లేకపోవడంపై మాజీ మంత్రి డీకే అరుణ ప్రశ్నించడంతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరిగినట్లు తెలుస్తోంది. గాంధీభవన్ వేదికగా నేతల మధ్య ఉన్న విభేదాలు మరోసారి బయపడ్డాయి. జైపాల్‌రెడ్డి మహబూబ్‌నగర్ ఎంపీ బరిలో ఉండేందుకు ఆసక్తి చూపకపోగా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డిని తెరపైకి తీసుకొస్తున్నట్లు సమాచారం. గత లోక్‌సభ ఎన్నికల్లో జైపాల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి మహబూబ్‌నగర్ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేశారు. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు నుంచి కూడా మరోసారి మహబూబ్‌నగర్ ఎంపీ బరిలో ఆయనే ఉంటారని చర్చ జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ మక్తల్, మహబూబ్‌నగర్ అసెంబ్లీ టికెట్ కేటాయించడంలోనూ, నారాయణపేట నుంచి శివకుమార్‌రెడ్డికి కాంగ్రెస్ తరఫున టికెట్ రాకుండా చూడడం, దేవరకద్ర నియోజకవర్గం ఆలస్యంగా పవన్‌కుమార్‌కు కేటాయించడం వంటి అంశాల్లో జైపాల్‌రెడ్డి కీలకంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన ఎందుకు పోటీచేయకుండా తప్పుకుంటున్నారని డీకే అరుణ వంటి సీనియర్ నేతలు ప్రశ్నించినట్లు సమాచారం. జైపాల్‌రెడ్డి లేదా రేవంత్‌రెడ్డి వారు ఇరువురు కాకుంటే మహబూబ్‌నగర్ లోక్‌సభ పరిధిలోని షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి, అనిరుధ్రెడ్డిలను పోటీలో ఉంచాలని ఆమె ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. మరోసారి నంది ఎల్లయ్య? తెలంగాణలోనే ఏకైక కాంగ్రెస్ ఎంపీగా ఉన్న నంది ఎల్లయ్య మరోసారి కాంగ్రెస్ పార్టీ నుంచి నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానానికి పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ నంది ఎల్లయ్య పోటీ చేయాలని భావిస్తే సిట్టింగ్ ఎంపీ కాబట్టి ఆయనకే మరోసారి అవకాశం ఇస్తారనే చర్చ జరుగుతోంది. అయితే ఆయన పోటీ చేయకపోతే దరఖాస్తు చేసుకున్న వారిలోనే అన్ని కోణాల్లో ఆలోచించి అభ్యర్థిని ఎంపిక చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్ టికెట్ ఆశించినప్పటికీ అవకాశ రాలేదని ఈ సారైన అవకాశం ఇవ్వాలని కోరుతున్న వికారాబాద్ కాంగ్రెస్ నాయకుడు చంద్రశేఖర్ పాటు సతీష్ మాదిగ పేర్లను డీకే అరుణ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అయితే మాజీ ఎంపీ మల్లురవి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. వీరితో పాటు నాగర్‌కర్నూల్ డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణకూడా పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్నట్లు చెప్పారు. వీరందరితో పాటు డీసీసీ సెక్రెటరీ బాలకిషన్ పేర్లను అధిష్టానానికి ప్రతిపాదించినట్లు సమాచారం. వీరిలో ఎవరు ఫైనల్ అవుతారనేది వేచి చూడాలి. మొత్తంగా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ఎంపికలో మరోసారి కాంగ్రెస్ నేతల మధ్య వర్గ విభేదాలు బయటపడినట్లు తెలుస్తోంది. -
కేసీఆర్ ఒక మాయల మరాఠీ...
సాక్షి, మల్దకల్ (గద్వాల): తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిని దళితుడిని చేస్తానని, నిరుపేద దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని చెప్పి మోసం చేసిన కేసీఆర్ మాయమాటలను తెలంగాణ ప్రజలు మరోసారి నమ్మే స్థితిలో లేరని కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్, నాగర్‌కర్నూల్ ఎంపీ నంది ఎల్లయ్య, ఎమ్మెల్యే అభ్యర్థి డీకే అరుణ అన్నారు. గురువారం మండలంలోని మేకలసోంపల్లి, బిజ్వారం, దాసర్పల్లి, ఉలిగేపల్లి, నేతువానిపల్లి, అడివిరావుల్చెర్వు, మంగంపేట, సద్దలోనిపల్లి, పెద్దొడ్డి, మద్దలబండ, మద్దలబండ పెద్దతండా, మద్దలబండ చిన్నతండా, మల్దకల్ గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వారు పాల్గొని మాట్లాడారు. నాలుగున్నరేళ్లలో కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు హామీలు గుప్పిస్తున్నారని, ప్రజలు ఆయన మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మెనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు విక్రమసింహారెడ్డి, డాక్టర్ రఘనాథ్‌రెడ్డి జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు అరుణ, నాయకులు నారాయణరెడ్డి, సత్యారెడ్డి, రాముడు, మురళీధర్‌రెడ్డి, సూర్యగౌడ్, చంద్రశేఖర్‌రెడ్డి, రమేష్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, నరేందర్, గోపాల్, తిమ్మప్ప, రాజశేఖర్‌రెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
గద్వాల–మాచర్ల లైను నిర్మాణం చేపట్టండి
సాక్షి, న్యూఢిల్లీ: గద్వాల– మాచర్ల రైల్వే లైనును ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌కు కాంగ్రెస్ ఎంపీ నంది ఎల్లయ్య విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన ఇక్కడ రైల్వే మంత్రిని కలసి ఈ లైన్ నిర్మాణంపై వినతిపత్రం సమర్పించారు. ఈ లైన్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్ వెంచర్‌గా నిర్మించాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు దీని నిర్మాణానికి చర్యలు తీసుకోవడం లేదని ఫిర్యాదు చేశారు. తదుపరి చర్యల కోసం దక్షిణ మధ్య రైల్వే అధికారులు సీఎం అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించినా ఇవ్వడం లేదని రైల్వే మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ దిశగా తాను ముఖ్యమంత్రికి పలు లేఖలు కూడా రాశానని వివరించారు. -
గద్వాల–మాచర్ల రైల్వేలైనుపై సీఎం నిర్లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: గద్వాల–మాచర్ల రైల్వేలైనుపై ముఖ్య మంత్రి కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తున్నారని నాగర్‌కర్నూలు ఎంపీ నంది ఎల్లయ్య ఆరోపించారు. మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో రైల్వే ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేశానని చెప్పారు. గద్వాల–మాచర్ల లైన్‌కోసం 290 కోట్లు కేటాయించేలా అప్పటి రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభును ఒప్పించామన్నారు. సీఎం కు ఎన్నిసార్లు లేఖలు రాసినా పట్టించుకోవడంలేదని, కలిసి మాట్లాడటానికి సమ యం కూడా ఇవ్వడంలేదని ఆరోపించారు. కేంద్రం సానుకూలంగా ఉన్నా రాష్ట్రం భాగస్వామ్యం లేకపోవడంతో వాయిదా పడుతోందని ఎల్లయ్య విమర్శించారు. -
ఎంపీ కనబడుట లేదు
– పోలీస్‌స్టేషన్‌లో వైఎస్సార్సీపీ ఫిర్యాదు వనపర్తిరూరల్ : నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు నంది ఎల్లయ్య కనబడుట లేదని ఆరోపిస్తూ శనివారం వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి మద్దిరాల విష్ణువర్ధన్‌రెడ్డి పోలీస్‌స్టేషన్‌లో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీగా ఎన్నికయినప్పటి నుంచి క్షేత్రస్థాయిలో పర్యటించకపోవడం వల్ల ప్రజలు వివిధ సమస్యలతో అల్లాడిపోతున్నారని అన్నారు. జిల్లాల ఏర్పాటు ముసాయిదా విడుదలైనా ఇప్పటికీ ఎంపీగారు స్పందించకపోవడం దారుణమని చెప్పారు. అనంతరం ఎస్ఐ గాంధీ నాయక్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటేశ్, రాజశేఖర్, భాస్కర్, బుడ్డన్న, రాజు, యూసూప్, జుబేర్, మహేష్, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
'పీసీసీ అధ్యక్ష పదవి నాకు ఇవ్వండి'
-
'పీసీసీ అధ్యక్ష పదవి నాకు ఇవ్వండి'
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ తో ఎమ్మెల్యే డీకే అరుణ, ఎంపీ నంది ఎల్లయ్య సమావేశమయ్యారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిని మారుస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. పీసీసీ అధ్యక్ష పదవి, లేదంటే పీఏసీ ఛైర్ పర్సన్‌గా అవకాశం ఇవ్వాలని దిగ్విజయ్ సింగ్ ను డీకే అరుణ కోరినట్టు తెలిసింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను తప్పించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్న నేపథ్యంలో... ఆయన స్థానంలో టీపీసీసీ సారథిగా ఎవరిని నియమిస్తే బాగుంటుందనే అంశంపై దిగ్విజయ్‌సింగ్ అభిప్రాయ సేకరణ జరుపుతున్నారు. పొన్నాల నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న పలువురు సీనియర్ నేతలు ఆయనను తప్పించాలని కోరుతూ గత కొంత కాలంగా హైకమాండ్‌పై ఒత్తిడి తెస్తున్నారు. -
'ఎమ్మెల్సీలు... ఇది సరైన పద్దతి కాదు'
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు టీఆర్ఎస్ పార్టీలో చేరడం పట్ల నాగర్ కర్నూలు ఎంపీ నంది ఎల్లయ్య ఆగ్రహాం వ్యక్తం చేశారు. పార్టీ అధికారంలో ఉన్న లేకున్నా ఒకే పార్టీలో కొనసాగలని ఆయన టి.కాంగ్రెస్ ఎమ్మెల్సీలకు హితవు పలికారు. బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లో నంది ఎల్లయ్య మాట్లాడుతూ... ఇది సరైన పద్దతి కాదంటూ పార్టీ ఎమ్మెల్సీలకు సూచించారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీలు టీఆర్ఎస్ తీర్థంపుచ్చుకోవడాన్ని నంది ఎల్లయ్య తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబును అనుసరిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 9 మంది ఎమ్మెల్సీలతోపాటు ఇద్దరు బీఎస్పీ ఎమ్మెల్సీలు ఈ రోజు టీఆర్ఎస్ పార్టీలో చేరునున్నారు. ఈ నేపథ్యంలో విలేకర్లు అడిగిన ప్రశ్నకు నంది ఎల్లయ్య పై విధంగా స్పందించారు. తెలంగాణ శాసన మండలిలో చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు టీఆర్ఎస్ ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు ఆమోస్, జగదీశ్వర్‌రెడ్డి, భానుప్రసాద్, రాజలింగం, భూపాల్‌రెడ్డితోపాటు మరికొందరు, వీరితోపాటు బీఎస్పీకి చెందిన ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యే ఇంద్రకరణ్‌రెడ్డి, సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పలు టీఆర్ఎస్ లో చేరేందుకు నిర్ణయించుకున్నట్టు తెలిసింది. అలాగే టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు, పీఆర్టీయూకు చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా అదే దారిలో ఉన్నట్టు తెలుస్తోంది. -
ఎంపీలకు ఓకే!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ జిల్లాలో అసెంబ్లీ టికెట్ల పంచాయతీ ఢిల్లీని తాకింది. తెలంగాణలో అసెంబ్లీ అభ్యర్థుల జాబితా ఖరారైనా జిల్లా నేతల కొట్లాటతో చివరి నిముషంలో వాయిదా పడింది. కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణ తమ మద్దతుదారులకు టికెట్లు ఇప్పించుకునేందుకు చివరి నిముషం వరకు ప్రయత్నించారు. తుది జాబితాలో తమ మద్దతుదారులకు టికెట్లు దక్కక పోవడంతో అధిష్టానంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. దీంతో అభ్యర్థుల జాబితా ప్రకటన చివరి ని ముషంలో వాయిదా పడింది. కాగా జిల్లాలోని రెండు లోక్‌సభ స్థానాల నుంచి పోటీ చేసే అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి, నాగర్‌కర్నూలు ఎంపీగా రాజ్యసభ సభ్యుడు నంది ఎల్లయ్య పేర్లు ఖరారు చేశారు. జైపాల్‌రెడ్డి 1980లో మెదక్ నుంచి, 1984లో మహబూబ్‌నగర్ నుంచి జనతా పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తిరిగి 1989లో జనతాదళ్ నుంచి ఇదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోగా, 1990లో మాత్రం విజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి 1999, 2004లో నల్గొండ జిల్లా మిర్యాలగూడ, 2009లో రంగారెడ్డి చేవెళ్ల స్థానం నుంచి గెలుపొందారు. 1990-96 మధ్య కాలంలో రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. అనూహ్యంగా తెరపైకి ... నాగర్‌కర్నూలు లోక్‌సభ స్థానం నుంచి రాజ్యసభ సభ్యుడు నంది ఎల్లయ్య పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. మాజీ మంత్రి చంద్రశేఖర్ పేరు ఖాయమైందంటూ ప్రచారం జరిగిన నేపథ్యంలో నంది ఎల్లయ్య పేరును ప్రకటించడం చర్చనీయాంశమైంది. ఆలంపూర్ టికెట్ ఆశిస్తున్న రజనీరెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చినా చివరి నిముషంలో నంది ఎల్లయ్య వైపు అధిష్టానం మొగ్గు చూపింది. 1979 నుంచి 1999 మధ్యకాలంలో సిద్దిపేట ఎంపీగా నంది ఎల్లయ్య పనిచేశారు. 1979, 1980, 1989, 1991, 1996లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించగా, 1984, 1998, 1999లో ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా పోటీ చేసిన నంది ఎల్లయ్య పదవీ కాలం ఈ నెల 14తో ముగియనుంది. గవర్నర్ కోటాలో ఇప్పటికే నంది ఎల్లయ్యను శాసన మండలికి నామినేట్ చేయడం గమనార్హం. -
కంతేటి, ఎల్లయ్య, రత్నాబాయి పేర్లు ఖరారు
న్యూఢిల్లీ: గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న నాలుగు నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాలకు ముగ్గురు పేర్లను కాంగ్రెస్ ఖరారు చేసింది. కంతేటి సత్యనారాయణరాజు, నంది ఎల్లయ్య, రత్నాబాయి పేర్లను ప్రభుత్వం ఖరారు చేసింది. నామినేటెడ్ ఎమ్మెల్సీల రేసులో పలువురు నేతలు నిలిచినప్పటికీ పీసీసీ క్రమశిక్షణ సంఘం కమిటీ ఛైర్మన్ కంతేటి సత్యనారాయణరాజు, పదవీకాలం పూర్తి కానున్న ఎంపీలు నంది ఎల్లయ్య, రత్నాబాయిలకు కాంగ్రెస్ అవకాశం కల్పించింది. దివంగత ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె వాణి పేరు కూడా వినిపించినప్పటికీ ఆమెకు అవకాశం దక్కలేదు. అయితే నాలుగో స్థానంపై ఉత్కంఠ కొనసాగుతోంది. దీన్ని ఎవరికి కట్టబెడతారనే దానిపై కాంగ్రెస్ పార్టీలో చర్చలు జరుగుతున్నాయి. ఆశావహలు నాలుగో సీటుపై ఆశలు పెట్టుకున్నారు. -
3 సీట్లు కష్టమే!
* కాంగ్రెస్: రాజ్యసభాపర్వం * వలసల దారిలో 30 మంది ఎమ్మెల్యేలని అధిష్టానానికి సమాచారం * అదే జరిగితే రాజ్యసభకు ముగ్గురిని గెలిపించుకోవడం అసాధ్యం * బుజ్జగింపులు తప్పదని హైకమాండ్‌కు రాష్ట్ర నేతల సూచన * కొప్పుల రాజును తెరపైకి తెస్తున్న డిప్యూటీ సీఎం, బొత్స సాక్షి, న్యూఢిల్లీ: అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని అన్నట్లుగా తయారైంది కాంగ్రెస్ పరిస్థితి. రాజ్యసభ ఎన్నికల్లో మూడు స్థానాలు గెలుచుకునేందుకు అవసరమైన సంఖ్యాబలం అసెంబ్లీలో ఉన్నా, పార్టీలు మారేందుకు సిధ్దమైన ఎమ్మెల్యేలతో వారికి ముప్పు పొంచి ఉంది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై శాసనసభ అభిప్రాయం తెలిపేందుకు రాష్ట్రపతి విధించిన గడువు ముగిసిన అనంతరం పెద్ద సంఖ్యలో పార్టీ ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లోకి వెళ్లడం ఖాయమన్న పక్కా సమాచారం అధిష్టాన పెద్దలను కలవరానికి గురిచేస్తోంది. ఇప్పటికే పార్టీ పెద్దలకు అందిన జాబితా ప్రకారం.. 30 మంది ఎమ్మెల్యేలు పార్టీలు మారడానికి సిద్ధంగా ఉన్నారు. అదే జరిగితే మూడు రాజ్యసభ స్థానాలను గెలుచుకోవడం కూడా కష్టమేనని పార్టీ నేతలే ఒప్పుకుంటున్నారు. దాంతో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్‌సింగ్ బుధవారం రాష్ట్ర కాంగ్రెస్ పెద్దల నుంచి సంబంధిత సమాచారం తెప్పించుకున్నట్లుగా తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపిక సహా పార్టీ బలాబలాలపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఆనం రాంనారాయణరెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ తదితరులతో ఆయన మాట్లాడినట్లు సమాచారం. రాష్ట్ర శాసనసభలో సాంకేతికంగా కాంగ్రెస్‌కు 146మంది సభ్యులున్నా, ఇదివరకే పార్టీలు మారిన వారితో ఆ సంఖ్య 142కి పడిపోయింది. ప్రస్తుతం పార్టీలు మారేందుకు సిధ్దంగా ఉన్న ఎమ్మెల్యేలు 30 మంది వరకు ఉన్నారు. అదే జరిగితే ఆ సంఖ్య 112కి పడిపోవడం ఖాయం. పార్టీ తరఫున రాజ్యసభకు ముగ్గురిని పంపించాలంటే.. ఒక్కొక్కరికి 41మంది సభ్యుల చొప్పున మొత్తం 123 మంది ఎమ్మెల్యేలు అవసరం. ఈ లెక్కన మూడో సభ్యుడి ఎన్నిక జరగాలంటే కాంగ్రెస్‌కు కనీసం 11మంది ఎమ్మెల్యేల బలం తక్కువగా ఉంటుందన్నది రాష్ట్ర పెద్దలు చెప్పిన లెక్కలుగా తెలుస్తోంది. రెండో అభ్యర్థిని నిలిపేందుకు తగిన బలం లేని టీడీపీ సహా, వైఎస్సార్ కాంగ్రెస్, టీఆర్ఎస్లు తమ అభ్యర్థులను బరిలో దింపేందుకు ప్రయత్నా లు చేస్తున్నాయని, తగిన సంఖ్యాబలం కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఆ పార్టీలు మంతనాలు చేస్తున్నాయని వారు వివరించారు. అందువల్ల మూడో సభ్యుడి ఎంపిక సజావుగా జరగాలంటే పార్టీని వీడే ఎమ్మెల్యేలను బుజ్జగించాల్సి ఉంటుందని బొత్స సహా ఇతర ముఖ్యులు దిగ్విజయ్‌కు సూచించినట్లుగా తెలుస్తోంది. ఖాన్‌ను ఎంపిక చేస్తే ఎంఐఎం మద్దతు ఇవ్వొచ్చు! ఇక తెలంగాణ ప్రాంతం నుంచి పదవీకాలం ముగించుకుంటున్న నంది ఎల్లయ్యకు ఇప్పటికే రెండుమార్లు అవకాశం ఇచ్చినందున, ఈ మారు మైనారిటీ అయిన ఎంఏ ఖాన్‌ను పరిగణనలోకి తీసుకోవాలని బొత్స సూచించినట్లుగా తెలుస్తోంది. ఖాన్‌ను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంటే ఎంఐఎం సైతం వారికున్న ఏడుగురి సభ్యుల మద్దతు ఇస్తుందనే ఆశాభావం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇక సీమాంధ్ర ప్రాంతం నుంచి లోక్‌సభకు పోటీచేసే ఆలోచనలో ఉన్న సుబ్బిరామిరెడ్డిని మినహాయిస్తే, కేవీపీ రామచంద్రరావు, రత్నాభాయిలలో కేవీపీని కొనసాగించి, రత్నాభాయి స్థానంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కొప్పుల రాజును ఎంపిక చేయాలని బొత్స సిఫారసు చేసినట్లుగా తెలుస్తోంది. డిప్యూటీ సీఎం సైతం కొప్పుల రాజుకు అనుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే రాజ్యసభ సభ్యులు ఎంపికపై అందరినుంచి సమాచారం తీసుకుంటామని, తుది నిర్ణయం మాత్రం అధిష్టానానిదే అని దిగ్విజయ్ వారికి స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది.