
ఎంపీలకు ఓకే!
మహబూబ్‌నగర్ జిల్లాలో అసెంబ్లీ టికెట్ల పంచాయతీ ఢిల్లీని తాకింది. తెలంగాణలో అసెంబ్లీ అభ్యర్థుల జాబితా ఖరారైనా జిల్లా నేతల కొట్లాటతో చివరి నిముషంలో వాయిదా పడింది.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ జిల్లాలో అసెంబ్లీ టికెట్ల పంచాయతీ ఢిల్లీని తాకింది. తెలంగాణలో అసెంబ్లీ అభ్యర్థుల జాబితా ఖరారైనా జిల్లా నేతల కొట్లాటతో చివరి నిముషంలో వాయిదా పడింది.
కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణ తమ మద్దతుదారులకు టికెట్లు ఇప్పించుకునేందుకు చివరి నిముషం వరకు ప్రయత్నించారు. తుది జాబితాలో తమ మద్దతుదారులకు టికెట్లు దక్కక పోవడంతో అధిష్టానంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం.
దీంతో అభ్యర్థుల జాబితా ప్రకటన చివరి ని ముషంలో వాయిదా పడింది. కాగా జిల్లాలోని రెండు లోక్‌సభ స్థానాల నుంచి పోటీ చేసే అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి, నాగర్‌కర్నూలు ఎంపీగా రాజ్యసభ సభ్యుడు నంది ఎల్లయ్య పేర్లు ఖరారు చేశారు. జైపాల్‌రెడ్డి 1980లో మెదక్ నుంచి, 1984లో మహబూబ్‌నగర్ నుంచి జనతా పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
తిరిగి 1989లో జనతాదళ్ నుంచి ఇదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోగా, 1990లో మాత్రం విజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి 1999, 2004లో నల్గొండ జిల్లా మిర్యాలగూడ, 2009లో రంగారెడ్డి చేవెళ్ల స్థానం నుంచి గెలుపొందారు. 1990-96 మధ్య కాలంలో రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు.
అనూహ్యంగా తెరపైకి ...
నాగర్‌కర్నూలు లోక్‌సభ స్థానం నుంచి రాజ్యసభ సభ్యుడు నంది ఎల్లయ్య పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. మాజీ మంత్రి చంద్రశేఖర్ పేరు ఖాయమైందంటూ ప్రచారం జరిగిన నేపథ్యంలో నంది ఎల్లయ్య పేరును ప్రకటించడం చర్చనీయాంశమైంది. ఆలంపూర్ టికెట్ ఆశిస్తున్న రజనీరెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చినా చివరి నిముషంలో నంది ఎల్లయ్య వైపు అధిష్టానం మొగ్గు చూపింది.
1979 నుంచి 1999 మధ్యకాలంలో సిద్దిపేట ఎంపీగా నంది ఎల్లయ్య పనిచేశారు. 1979, 1980, 1989, 1991, 1996లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించగా, 1984, 1998, 1999లో ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా పోటీ చేసిన నంది ఎల్లయ్య పదవీ కాలం ఈ నెల 14తో ముగియనుంది. గవర్నర్ కోటాలో ఇప్పటికే నంది ఎల్లయ్యను శాసన మండలికి నామినేట్ చేయడం గమనార్హం.