సాక్షి, హైదరాబాద్/ముషీరాబాద్ : మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ కురువృద్ధుడు, టీపీసీసీ ఉపాధ్యక్షుడు నంది ఎల్లయ్య(78) శనివారం కరోనాతో కన్నుమూశారు. గత నెల 29న అనారోగ్యంతో నిమ్స్ ఆసుపత్రిలో చేరిన ఎల్లయ్యకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. చికిత్స పొందుతూ శనివారం ఉదయం 11 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. ఆయన భౌతికకాయాన్ని జీహెచ్‌ఎంసీ అధికారులు నిమ్స్ ఆసుపత్రి నుంచి బన్సీలాల్‌పేట శ్మశానవాటికకు తీసుకువెళ్లి కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు.
1964లో రాజకీయ ప్రస్థానం షురూ..
1942 జూలై 1న హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో నాగయ్య, నరసమ్మ దంపతులకు నంది ఎల్లయ్య జన్మించారు. ఆయన అప్పట్లో పీయూసీ వరకు చదువుకున్నారు. 22 ఏళ్ల వయసులోనే 1964లో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఎల్లయ్య ఐదుసార్లు సిద్దిపేట నుంచి, ఒకసారి నాగర్‌కర్నూల్ నుంచి ఎంపీగా విజయం సాధించారు. రెండుసార్లు రాజ్యసభ సభ్యునిగా, ఒకసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని జమిస్తాన్‌పూర్ కౌన్సిలర్‌గా 1964లో ఎన్నికై తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. 1977లో జరిగిన ఎన్నికల్లో సిద్దిపేట ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానం నుంచి మొదటిసారి ఎంపీగా విజయం సాధించారు. 1980, 1989, 1991, 1996 ఎన్నికల్లోనూ సిద్దిపేట ఎంపీగా ఎన్నికయ్యారు. 2014లో నాగర్‌కర్నూల్ ఎంపీగా గెలుపొందారు. రెండుసార్లు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.
ఇందిర, పలువురు సీఎంలతో సన్నిహిత సంబంధాలు
నిరుపేద దళిత కుటుంబంలో పుట్టిన నంది ఎల్లయ్య సుమారు 40 ఏళ్లపాటు పార్లమెంటేరియన్‌గా పనిచేసిన ఘనతను సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలో అప్పటి ముఖ్యమంత్రులు టి. అంజయ్య, మర్రి చెన్నారెడ్డి, వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డితో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. 1969లో మర్రి చెన్నారెడ్డితో కలిసి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొని 22 రోజులపాటు జైలు జీవితం గడిపారు. ప్రధాని ఇందిరాగాంధీ పోటీచేసిన మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం పక్కనే ఎల్లయ్య పోటీ చేసిన సిద్దిపేట నియోజకవర్గం ఉండడంతో ఇందిరతో కూడా మంచి సంబంధాలను కొనసాగించారు. ఆ తరువాత సోనియాగాంధీతో కూడా మంచి సంబంధాలు ఉండడంతో రెండుసార్లు రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఏఐసీసీ, టీపీసీసీ ఉపాధ్యక్షుడితోపాటు పార్టీ, ప్రభుత్వానికి చెందిన పలు కమిటీల్లో సభ్యులుగా పనిచేశారు.
సాదాసీదా ఒంటరి జీవితం
8 సార్లు ఎంపీగా పనిచేసినప్పటికీ ఎల్లయ్య సాదాసీదా రాజకీయ జీవితాన్ని గడిపారు. వివాహం జరిగిన కొద్దిరోజులకే భార్య నుంచి విడిపోవడంతో మళ్లీ పెళ్లి చేసుకోలేదు. ఇండియన్ ఎయిర్‌లైన్స్‌లో పనిచేసి పదవీ విరమణ పొందిన అతని సోదరుడు నంది కృష్ణతో కలిసి రాంనగర్‌లోనే ఉమ్మడిగా కలిసి జీవించేవారు. ఎల్లయ్య నిరాడంబరుడు, మితభాషిగా పేరొందారు.
సీఎం కేసీఆర్ సంతాపం
నంది ఎల్లయ్య మృతిపట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఎల్లయ్య కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. ఎల్లయ్య మృతిపట్ల హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్, మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, సత్యవతి రాథోడ్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్, టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత డాక్టర్ కే.కేశవరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పతాకం అవనతం..
నంది ఎల్లయ్య మృతికి సంతాప సూచకంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయమైన గాంధీభవన్‌లో పార్టీ పతాకాన్ని శనివారం అవనతం చేశారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ ఇన్‌చార్జి ఆర్.సి కుంతియా, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలు సంతాపం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి నిబద్ధతతో, క్రమశిక్షణతో ఎల్లయ్య పనిచేశారని కొనియాడారు. ఎల్లయ్య మరణం కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. సంతాపం తెలిపినవారిలో ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్ రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శులు సంపత్ కుమార్, వంశీచంద్‌రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, పార్టీ ముఖ్య నేతలు వీహెచ్, గీతారెడ్డి, షబ్బీర్ అలీ, అంజన్ కుమార్ యాదవ్, మల్లు రవి తదితరులున్నారు.
సోనియా ఫోన్ పరామర్శ(బాక్సు)
నంది ఎల్లయ్య మృతి చెందిన సమాచారం తెలుసుకున్న ఏఐసీసీ చీఫ్ సోనియాగాంధీ ఫోన్ ద్వారా ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. సోదరుడు నంది కృష్ణకు ఫోన్ చేసిన ఆమె విషయం అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, పార్టీ ఎల్లయ్య కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎల్లయ్య సోదరుడు చక్రధర్‌కు పార్టీ ముఖ్య నేత గులాంనబీ ఆజాద్ ఫోన్ చేసి పరామర్శించినట్టు గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి.
మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలకు పాజిటివ్
హైదరాబాద్ : రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డితోపాటు తాండూరు, ఎల్బీనగర్ ఎమ్మెల్యేలు పంజుగుల రోహిత్‌రెడ్డి, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డిలకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గత ఆదివారం (ఈ నెల 2న) కోవిడ్–19 టెస్టు చేయించుకోగా పాజిటివ్ వచ్చిందని, అప్పటి నుంచి హోం ఐసోలేషన్‌లో ఉన్నానని, ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నానని మంత్రి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రెండు, మూడు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రోహిత్‌రెడ్డి శనివారం జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో కోవిడ్ పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. వెంటనే అపోలోలో అడ్మిట్ అయ్యారు. ఎమ్మెల్యే గన్‌మెన్‌లు, పీఏ, వ్యక్తిగత సిబ్బందికి కరోనా పరీక్షలు చేయించగా నెగెటివ్ వచ్చినట్లు తెలిసింది. అదేవిధంగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డితోపాటు కుటుంబసభ్యులకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కుటుంబసభ్యులందరం హోం ఐసోలేషన్‌లో ఉన్నామని, త్వరగా కోలుకొని ప్లాస్మా దానం చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment