* కాంగ్రెస్: రాజ్యసభాపర్వం
* వలసల దారిలో 30 మంది ఎమ్మెల్యేలని అధిష్టానానికి సమాచారం
* అదే జరిగితే రాజ్యసభకు ముగ్గురిని గెలిపించుకోవడం అసాధ్యం
* బుజ్జగింపులు తప్పదని హైకమాండ్‌కు రాష్ట్ర నేతల సూచన
* కొప్పుల రాజును తెరపైకి తెస్తున్న డిప్యూటీ సీఎం, బొత్స
సాక్షి, న్యూఢిల్లీ: అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని అన్నట్లుగా తయారైంది కాంగ్రెస్ పరిస్థితి. రాజ్యసభ ఎన్నికల్లో మూడు స్థానాలు గెలుచుకునేందుకు అవసరమైన సంఖ్యాబలం అసెంబ్లీలో ఉన్నా, పార్టీలు మారేందుకు సిధ్దమైన ఎమ్మెల్యేలతో వారికి ముప్పు పొంచి ఉంది. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లుపై శాసనసభ అభిప్రాయం తెలిపేందుకు రాష్ట్రపతి విధించిన గడువు ముగిసిన అనంతరం పెద్ద సంఖ్యలో పార్టీ ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లోకి వెళ్లడం ఖాయమన్న పక్కా సమాచారం అధిష్టాన పెద్దలను కలవరానికి గురిచేస్తోంది.
ఇప్పటికే పార్టీ పెద్దలకు అందిన జాబితా ప్రకారం.. 30 మంది ఎమ్మెల్యేలు పార్టీలు మారడానికి సిద్ధంగా ఉన్నారు. అదే జరిగితే మూడు రాజ్యసభ స్థానాలను గెలుచుకోవడం కూడా కష్టమేనని పార్టీ నేతలే ఒప్పుకుంటున్నారు. దాంతో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్ బుధవారం రాష్ట్ర కాంగ్రెస్ పెద్దల నుంచి సంబంధిత సమాచారం తెప్పించుకున్నట్లుగా తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపిక సహా పార్టీ బలాబలాలపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఆనం రాంనారాయణరెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ తదితరులతో ఆయన మాట్లాడినట్లు సమాచారం.
రాష్ట్ర శాసనసభలో సాంకేతికంగా కాంగ్రెస్‌కు 146మంది సభ్యులున్నా, ఇదివరకే పార్టీలు మారిన వారితో ఆ సంఖ్య 142కి పడిపోయింది. ప్రస్తుతం పార్టీలు మారేందుకు సిధ్దంగా ఉన్న ఎమ్మెల్యేలు 30 మంది వరకు ఉన్నారు. అదే జరిగితే ఆ సంఖ్య 112కి పడిపోవడం ఖాయం. పార్టీ తరఫున రాజ్యసభకు ముగ్గురిని పంపించాలంటే.. ఒక్కొక్కరికి 41మంది సభ్యుల చొప్పున మొత్తం 123 మంది ఎమ్మెల్యేలు అవసరం. ఈ లెక్కన మూడో సభ్యుడి ఎన్నిక జరగాలంటే కాంగ్రెస్‌కు కనీసం 11మంది ఎమ్మెల్యేల బలం తక్కువగా ఉంటుందన్నది రాష్ట్ర పెద్దలు చెప్పిన లెక్కలుగా తెలుస్తోంది.
రెండో అభ్యర్థిని నిలిపేందుకు తగిన బలం లేని టీడీపీ సహా, వైఎస్సార్ కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు తమ అభ్యర్థులను బరిలో దింపేందుకు ప్రయత్నా లు చేస్తున్నాయని, తగిన సంఖ్యాబలం కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఆ పార్టీలు మంతనాలు చేస్తున్నాయని వారు వివరించారు. అందువల్ల మూడో సభ్యుడి ఎంపిక సజావుగా జరగాలంటే పార్టీని వీడే ఎమ్మెల్యేలను బుజ్జగించాల్సి ఉంటుందని బొత్స సహా ఇతర ముఖ్యులు దిగ్విజయ్‌కు సూచించినట్లుగా తెలుస్తోంది.
ఖాన్‌ను ఎంపిక చేస్తే ఎంఐఎం మద్దతు ఇవ్వొచ్చు!
ఇక తెలంగాణ ప్రాంతం నుంచి పదవీకాలం ముగించుకుంటున్న నంది ఎల్లయ్యకు ఇప్పటికే రెండుమార్లు అవకాశం ఇచ్చినందున, ఈ మారు మైనారిటీ అయిన ఎంఏ ఖాన్‌ను పరిగణనలోకి తీసుకోవాలని బొత్స సూచించినట్లుగా తెలుస్తోంది. ఖాన్‌ను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంటే ఎంఐఎం సైతం వారికున్న ఏడుగురి సభ్యుల మద్దతు ఇస్తుందనే ఆశాభావం వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఇక సీమాంధ్ర ప్రాంతం నుంచి లోక్‌సభకు పోటీచేసే ఆలోచనలో ఉన్న సుబ్బిరామిరెడ్డిని మినహాయిస్తే, కేవీపీ రామచంద్రరావు, రత్నాభాయిలలో కేవీపీని కొనసాగించి, రత్నాభాయి స్థానంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కొప్పుల రాజును ఎంపిక చేయాలని బొత్స సిఫారసు చేసినట్లుగా తెలుస్తోంది. డిప్యూటీ సీఎం సైతం కొప్పుల రాజుకు అనుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే రాజ్యసభ సభ్యులు ఎంపికపై అందరినుంచి సమాచారం తీసుకుంటామని, తుది నిర్ణయం మాత్రం అధిష్టానానిదే అని దిగ్విజయ్ వారికి స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది.
3 సీట్లు కష్టమే!
Published Thu, Jan 16 2014 2:28 AM | Last Updated on Sat, Jun 2 2018 3:39 PM
Advertisement