
'పీసీసీ అధ్యక్ష పదవి నాకు ఇవ్వండి'
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ తో ఎమ్మెల్యే డీకే అరుణ, ఎంపీ నంది ఎల్లయ్య సమావేశమయ్యారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిని మారుస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. పీసీసీ అధ్యక్ష పదవి, లేదంటే పీఏసీ ఛైర్ పర్సన్‌గా అవకాశం ఇవ్వాలని దిగ్విజయ్ సింగ్ ను డీకే అరుణ కోరినట్టు తెలిసింది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను తప్పించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్న నేపథ్యంలో... ఆయన స్థానంలో టీపీసీసీ సారథిగా ఎవరిని నియమిస్తే బాగుంటుందనే అంశంపై దిగ్విజయ్‌సింగ్ అభిప్రాయ సేకరణ జరుపుతున్నారు. పొన్నాల నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న పలువురు సీనియర్ నేతలు ఆయనను తప్పించాలని కోరుతూ గత కొంత కాలంగా హైకమాండ్‌పై ఒత్తిడి తెస్తున్నారు.