
'పాలమూరు నుంచి రాహుల్ పోటీ చేయాలి'
న్యూఢిల్లీ : రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్తో మంత్రి డీకె అరుణ, మల్లు రవి మంగళవారమిక్కడ భేటీ అయ్యారు. భేటీ అనంతరం డీకె అరుణ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో మహబూబ్నగర్ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేయాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. పాలమూరు నుంచి రాహుల్ పోటీ చేసే విషయంపై చర్చించినట్లు వెల్లడించారు. అలాగే గద్వాల్లో నిర్వహించనున్న జైత్రయాత్ర సభకు దిగ్విజయ్ని ఆహ్వానించినట్లు ఆమె చెప్పారు. తెలంగాణ ఏర్పాటు, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సాయం చేయాలని ఈ సందర్భంగా కోరినట్లు డీకె అరుణ తెలిపారు.
నెల 29వ తేదీన గద్వాలలో తెలంగాణ జైత్రయాత్ర సభ నిర్వహిస్తున్నట్లు మంత్రి డీకే అరుణ వెల్లడించారు. కార్యక్రమానికి తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ పీసీసీ అధ్యక్షులు రానున్నారని వివరించారు.తెలంగాణపై నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపేందుకు గాను జైత్రయాత్ర సభలను నిర్వహిస్తున్నామని తెలిపారు.
సభలు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో నిర్వహిస్తామని, అందులో భాగంగా గద్వాల లోని తేరుమైదానంలో నిర్వహించతలపెట్టినట్లు వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వం జీఓఎంను ఏర్పాటు చేసిందన్నారు. తెలంగాణకు అన్నిరంగాల్లో న్యాయమైన వాటా ఇవ్వాలని జీఓఎంకు నివేదిక ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.