సాక్షి, మహబూబ్‌నగర్ : ఓ వైపు నామినేషన్ల ఘట్టం కొనసాగుతుండడంతో.. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీపై ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. పోలింగ్‌కు కేవలం 23 రోజులే మిగిలి ఉన్నా ఇప్పటి వరకు ఏ పార్టీ తన అభ్యర్థులను ప్రకటించకపోవడంతో ఉమ్మడి పాలమూరు జిల్లా రాజకీయాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అభ్యర్థుల ప్రకటనకు ఇంకా జాప్యం చేస్తే.. మిగిలిన కొన్ని రోజుల్లోనే పార్లమెంట్ నియోజకవర్గమంతా చుట్టి రావడం అభ్యర్థులకూ సవాల్‌గా మారనుంది.
దీంతో ఆశావహులు తమ అధిష్టానాలు చేయనున్న అభ్యర్థుల ప్రకటన కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. మరోపక్క ఏ పార్టీ తన అభ్యర్థులను ముందుగా ప్రకటిస్తుందా అని సామాన్య ప్రజలూ చర్చించుకుంటున్నారు. అయితే నామినేషన్ల దరఖాస్తుకు మరో మూడు రోజుల వరకు మంచి ముహూర్తాలు లేకపోవడంతోనే పార్టీలు సైతం అభ్యర్థుల ప్రకటించేందుకు జాప్యం చేస్తున్నాయనే చర్చ జరుగుతోంది.
ఉత్కంఠకు తెర పడేదెన్నడో ?
రాష్ట్రంలోని 17 లోకసభ స్థానాలకు కేం ద్ర ఎన్నికల సంఘం ఈ నెల 10న ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో ఎన్నికల్లో పోటీ కోసం ఏడాది నుంచి ఎదురుచూస్తోన్న అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ఆశావహులు అప్పుడే తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలోని మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానాల నుంచి చాలా మంది దరఖాస్తులు చేసుకున్నారు. షెడ్యూల్ వెలువడిన నాలుగైదు రోజుల్లోనే అన్ని పార్టీలు తమ ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తారని అందరూ భావించారు.
ఇదే క్రమంలో కాంగ్రెస్ అధిష్టానం ఈ నెల 15న తొమ్మిది మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. మరుసటి రోజే మిగిలిన తొమ్మిది స్థానాలకూ అభ్యర్థులను ఖరారు చేస్తుందనే ప్రచారం జరిగింది. దీంతో కనీసం రెండో జాబితాలోనైనా ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులు ఉంటా రని అందరూ భావించారు. అయినా ఇంత వరకు అభ్యర్థులను ప్రకటించలేదు.
అయితే టీఆర్‌ఎస్‌కు చెందిన మహబూబ్‌నగర్ సిట్టింగ్ ఎంపీ జితేందర్‌రెడ్డికి ఈ సారి ఆ పార్టీ నుంచి టికెట్ రాదనే ప్రచారం జరిగింది. ఒకవేళ జితేందర్‌రెడ్డికి అధికారి పార్టీ నిరాకరిస్తే ఆయన్ను కాంగ్రెస్ అభ్యర్థి బరిలో దింపాలనే యోచనలో ఉందనే రాజకీయ చర్చ మొదలైంది. బీజేపీ సైతం జితేందర్‌రెడ్డి వైపే మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
నాగర్‌కర్నూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా మల్లురవి?
ఎంపీ అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘ కసరత్తు చేసిన కాంగ్రెస్ అధిష్టానం నాగర్‌కర్నూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎంపీ మల్లురవిని ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇటు మహబూబ్‌నగర్ నుంచి బలమైన అభ్యర్థులను బరిలో దింపాలనే యోచనలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి డీకే అరుణ, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే వంశీచందర్‌రెడ్డి పేర్లను పరిశీలిస్తోంది.
ఈ క్రమంలో అరుణను పోటీ ఉండేందుకు అధిష్టానం ఒత్తిడి తెస్తున్నా.. ఆమె ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరిలో ఎవరికో ఒకరికి టికెట్ ఖరారవుతుందని కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. ఈ మేరకు సోమవారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (సీఈసీ) సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.
‘పోతుగంటి’కే నాగర్‌కర్నూల్?
ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సారి నాగర్‌కర్నూల్‌పై గులాబీ జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో ఉన్న అధికార టీఆర్‌ఎస్ ఆ స్థానం నుంచి సౌమ్యుడు, మాజీ మంత్రి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోతుగంటి రాములు పేరును అధినేత కేసీఆర్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పోతుగంటికి అంతర్గత సమాచారం అందినట్లు ఆయన ముఖ్య అనుచరులు చెబుతున్నారు.
ఈ క్రమంలో ఓ అడుగు ముందుకేసిన పోతుగంటి నామినేషన్ వేసేందుకు ఈ నెల 22న ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నట్లు సమాచారం. మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థి విషయం లో సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. ఆశావహుల్లో ఒకరు కేసీఆర్‌ను కలిసి టికెట్‌పై హామీ పొందినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే జితేందర్‌రెడ్డి మళ్లీ తనకే టికెట్ వస్తుందనే ధీమాతో ఉన్నారు.
కమలంలోనూ అంతర్మథనం
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సైతం జిల్లాలో ఎంపీ అభ్యర్థుల విషయంలో స్పష్టతకు రాలేదు. మహబూబ్‌నగర్ అభ్యర్థిగా పార్టీ రాష్ట్ర కోశాధికారి శాంతకుమార్, నాగర్‌కర్నూల్ అభ్యర్థిగా బంగారు శ్రుతి పేరు దాదాపు అయినట్లు ప్రచారం జరుగుతున్నా.. అధికారికంగా మాత్రం ఎలాంటి ప్రకటన రాకపోవడంతో అభ్యర్థులతో పాటు పార్టీ శ్రేణుల్లోనూ ఉత్కంఠ నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment