Nagarkurnool Lok Sabha constituency
-
పార్టీల దోబూచులాట..!
సాక్షి, మహబూబ్‌నగర్ : ఓ వైపు నామినేషన్ల ఘట్టం కొనసాగుతుండడంతో.. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీపై ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. పోలింగ్‌కు కేవలం 23 రోజులే మిగిలి ఉన్నా ఇప్పటి వరకు ఏ పార్టీ తన అభ్యర్థులను ప్రకటించకపోవడంతో ఉమ్మడి పాలమూరు జిల్లా రాజకీయాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అభ్యర్థుల ప్రకటనకు ఇంకా జాప్యం చేస్తే.. మిగిలిన కొన్ని రోజుల్లోనే పార్లమెంట్ నియోజకవర్గమంతా చుట్టి రావడం అభ్యర్థులకూ సవాల్‌గా మారనుంది. దీంతో ఆశావహులు తమ అధిష్టానాలు చేయనున్న అభ్యర్థుల ప్రకటన కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. మరోపక్క ఏ పార్టీ తన అభ్యర్థులను ముందుగా ప్రకటిస్తుందా అని సామాన్య ప్రజలూ చర్చించుకుంటున్నారు. అయితే నామినేషన్ల దరఖాస్తుకు మరో మూడు రోజుల వరకు మంచి ముహూర్తాలు లేకపోవడంతోనే పార్టీలు సైతం అభ్యర్థుల ప్రకటించేందుకు జాప్యం చేస్తున్నాయనే చర్చ జరుగుతోంది. ఉత్కంఠకు తెర పడేదెన్నడో ? రాష్ట్రంలోని 17 లోకసభ స్థానాలకు కేం ద్ర ఎన్నికల సంఘం ఈ నెల 10న ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో ఎన్నికల్లో పోటీ కోసం ఏడాది నుంచి ఎదురుచూస్తోన్న అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ఆశావహులు అప్పుడే తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలోని మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానాల నుంచి చాలా మంది దరఖాస్తులు చేసుకున్నారు. షెడ్యూల్ వెలువడిన నాలుగైదు రోజుల్లోనే అన్ని పార్టీలు తమ ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తారని అందరూ భావించారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ అధిష్టానం ఈ నెల 15న తొమ్మిది మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. మరుసటి రోజే మిగిలిన తొమ్మిది స్థానాలకూ అభ్యర్థులను ఖరారు చేస్తుందనే ప్రచారం జరిగింది. దీంతో కనీసం రెండో జాబితాలోనైనా ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులు ఉంటా రని అందరూ భావించారు. అయినా ఇంత వరకు అభ్యర్థులను ప్రకటించలేదు. అయితే టీఆర్ఎస్కు చెందిన మహబూబ్‌నగర్ సిట్టింగ్ ఎంపీ జితేందర్‌రెడ్డికి ఈ సారి ఆ పార్టీ నుంచి టికెట్ రాదనే ప్రచారం జరిగింది. ఒకవేళ జితేందర్‌రెడ్డికి అధికారి పార్టీ నిరాకరిస్తే ఆయన్ను కాంగ్రెస్ అభ్యర్థి బరిలో దింపాలనే యోచనలో ఉందనే రాజకీయ చర్చ మొదలైంది. బీజేపీ సైతం జితేందర్‌రెడ్డి వైపే మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. నాగర్‌కర్నూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా మల్లురవి? ఎంపీ అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘ కసరత్తు చేసిన కాంగ్రెస్ అధిష్టానం నాగర్‌కర్నూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎంపీ మల్లురవిని ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇటు మహబూబ్‌నగర్ నుంచి బలమైన అభ్యర్థులను బరిలో దింపాలనే యోచనలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి డీకే అరుణ, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే వంశీచందర్‌రెడ్డి పేర్లను పరిశీలిస్తోంది. ఈ క్రమంలో అరుణను పోటీ ఉండేందుకు అధిష్టానం ఒత్తిడి తెస్తున్నా.. ఆమె ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరిలో ఎవరికో ఒకరికి టికెట్ ఖరారవుతుందని కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. ఈ మేరకు సోమవారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (సీఈసీ) సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. ‘పోతుగంటి’కే నాగర్‌కర్నూల్? ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సారి నాగర్‌కర్నూల్‌పై గులాబీ జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో ఉన్న అధికార టీఆర్ఎస్ ఆ స్థానం నుంచి సౌమ్యుడు, మాజీ మంత్రి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోతుగంటి రాములు పేరును అధినేత కేసీఆర్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పోతుగంటికి అంతర్గత సమాచారం అందినట్లు ఆయన ముఖ్య అనుచరులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఓ అడుగు ముందుకేసిన పోతుగంటి నామినేషన్ వేసేందుకు ఈ నెల 22న ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నట్లు సమాచారం. మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థి విషయం లో సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. ఆశావహుల్లో ఒకరు కేసీఆర్‌ను కలిసి టికెట్‌పై హామీ పొందినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే జితేందర్‌రెడ్డి మళ్లీ తనకే టికెట్ వస్తుందనే ధీమాతో ఉన్నారు. కమలంలోనూ అంతర్మథనం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సైతం జిల్లాలో ఎంపీ అభ్యర్థుల విషయంలో స్పష్టతకు రాలేదు. మహబూబ్‌నగర్ అభ్యర్థిగా పార్టీ రాష్ట్ర కోశాధికారి శాంతకుమార్, నాగర్‌కర్నూల్ అభ్యర్థిగా బంగారు శ్రుతి పేరు దాదాపు అయినట్లు ప్రచారం జరుగుతున్నా.. అధికారికంగా మాత్రం ఎలాంటి ప్రకటన రాకపోవడంతో అభ్యర్థులతో పాటు పార్టీ శ్రేణుల్లోనూ ఉత్కంఠ నెలకొంది. -
‘టికెట్ల’ సందడి షురూ..
సాక్షి, నాగర్‌కర్నూల్: లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్ రావడంతో రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు వేగవంతం చేశాయి. ప్రధాన పార్టీలకు చెందిన ఆశావహులు తమ యత్నాలను ముమ్మరం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకుని సత్తా చాటిన టీఆర్ఎస్ నాగర్‌కర్నూల్ ఎంపీ స్థానాన్ని సైతం తన ఖాతాలో వేసుకోవాలన్న లక్ష్యంతో ముందుకెళుతోంది. అభ్యర్థి ఎంపిక విషయంలోనూ ఆచితూచి అడుగులు వేస్తోంది. అలాగే మూడు పర్యాయాలు వరుసగా విజయఢంకా మోగిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈసారీ తన ఖాతాలోనే జమ చేసుకోవాలని చూస్తోంది. అభ్యర్థిగా పోటీ చేయాలనుకునే ఆశావహులు అధికంగా ఉండటంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. రెండు, మూడు రోజులుగా సంపత్‌కుమార్, మల్లు రవి, సతీష్మాదిగల పేర్లు వినపడగా తాజాగా తెరపైకి మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ వచ్చారు. అభ్యర్థుల ఎంపికకు కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఈ నియోజకవర్గానికి 14సార్లు ఎన్నికలు జరిగితే కేవలం రెండుసార్లు మాత్రమే స్థానికులకు అవకాశం వచ్చింది. మిగతా 12సార్లు స్థానికేతరులకే పార్టీలు అవకాశం కల్పించాయి. ఈసారి స్థానికులకే టికెట్లు కేటాయించాలనే డిమాండ్లు పెరిగాయి. ప్రధాన పార్టీలు ఎవరిని అభ్యర్థులుగా నిలుపుతారనేది ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపిక విషయంలో కసరత్తు చేస్తుండగా బీజేపీ, ఇతర పార్టీలకు సంబంధించి ఎలాంటి హడావుడి కనిపించడం లేదు. సత్తా చాటేందుకు టీఆర్ఎస్ సిద్ధం ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్ ఎంపీ పరిధిలోని ఏడింటికిగాను ఆరు నియోజకవర్గాల్లో గులాబీ జెండాను ఎగురవేసి టీఆర్ఎస్ మంచి జోష్‌లో ఉంది. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లోనూ తన సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. అందులో భాగంగానే ఈనెల 9న నాయకులు, కార్యకర్తలతో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సారథ్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఇప్పటికే అభ్యర్థుల ఎంపికకు కసరత్తు ప్రారంభించారు. వివిధ సర్వేలు చేయించి అభ్యర్థి విషయంలో స్పష్టతకు వచ్చినట్టు సమాచారం. మాజీ మంత్రి పోతుగంటి రాములు లేదా ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మందా జగన్నాథం లేదా గాయకుడు సాయిచంద్‌ను బరిలో నిలపాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అయితే మూడు పర్యాయాలుగా ఇక్కడ టీఆర్ఎస్ విజయం సాధించలేకపోయింది. ఈసారి ఎలాగైనా పాగా వేయాలనే దిశగా ప్రణాళికలు రచిస్తున్నారు. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లోనూ విజయం సాధిం చాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. 36మంది దరఖాస్తులు చేసుకోగా ఐదుగురి పేర్లను మాత్రం ఏఐసీసీకి పంపినట్టు సమాచా రం. ముఖ్యంగా సతీష్‌మాదిగ, మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ పేర్లు వినిపిం చాయి. తాజాగా మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నర్సింహ పేరు తెరమీదికి వచ్చింది. వీరిలో ఎవరు బరిలో ఉంటారనేది త్వరలో తేలనుంది. నాగర్‌కర్నూల్ ఎంపీ పరిధిలోని ఏడు అ సెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం కొల్లాపూర్‌లో మాత్రమే ఇటీవల కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం గమనార్హం. స్థానికేతరులే అత్యధికం 1962 నుంచి 2014 వరకు 14సార్లు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీలుగా గెలిచిన వారిలో పార్టీలకతీతంగా స్థానికేతరులే ఎక్కువగా ఉన్నారు. వీరిలో రాజారామేశ్వర్‌రావు (వనపర్తి), ముత్యాలరావు (తిరుమలగిరి), భీమ్షాదేవ్ (హైదరాబాద్), మల్లు అనంతరాములు (వైరా మండలం–ఖమ్మం), మల్లు రవి (వైరా మండలం–ఖమ్మం), మందా జగన్నాథం (ఇటిక్యాల మండలం–అలంపూర్), నంది ఎల్లయ్య (మెదక్ జిల్లా) ఉన్నారు. కేవలం మందా జగన్నాథం మాత్రమే స్థానికుడు. మిగతావారంతా స్థానికేతరులే. కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు తొమ్మిది పర్యాయాలు విజయం సాధించగా టీపీఎస్ ఒకసారి, నాలుగు పర్యాయాలు టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. -
కారు వర్సెస్ ఫ్యాన్..
నాగర్ కర్నూలు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: నాగర్‌కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రత్యర్థులు బలహీనంగా ఉండడంతో.. ఇప్పటికే హ్యాట్రిక్ విజయం సాధించిన మందా జగన్నాథం మరోసారి విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఐదేళ్లలో మూడు పార్టీలు మారిన మందా జగన్నాథానికి అదృష్టం కలిసి వస్తోంది. ఆయనకు మూడు పార్టీలలో ఉన్న సంబంధాలతోపాటు, నియోజకవర్గ ప్రజలతో ఉన్న సత్సంబంధాలు ఆయన విజయానికి దోహదపడే అవకాశం ఉంది. ఈ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు బలంగా లేకపోయినా.. క్రాస్ ఓటింగ్‌తో మందా జగన్నాథం కు కలిసొచ్చే అవకాశం ఉంది. ఆయన స్వంత అసెంబ్లీ నియోజకవర్గం ఆలంపూర్లో తన కుమారుడుని శ్రీనాథ్‌ను రంగంలోకి దింపినా.. అక్కడ మాత్రం కొడుకు గెలిచే అవకాశాలు కనపడడం లేదు. అసెంబ్లీ స్థానాల్లో ఇతర పార్టీల అభ్యర్థులకు ఓట్లు వేసే ఓటర్లు ఎంపీ స్థానానికి వచ్చేసరికి మాత్రం మందా జగన్నాథం వైపు మొగ్గుచూపుతున్నారు. నాగర్‌కర్నూలు లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేయడానికి అభ్యర్థులెవరూ లేకపోవడంతో...చివరి నిమిషంలో ఎమ్మెల్సీ నంది ఎల్లయ్యను రంగంలోకి దించారు. టీడీపీ నుంచి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బక్కాని నర్సింలు రంగంలో ఉన్నారు. ఈ ఇద్దరు అభ్యర్థులు పార్లమెంట్ నియోజకవర్గంపై ఏమాత్రం ప్రభావం చూపించలేకపోతున్నారు. వైఎస్సార్సీపీ నుంచి మారెడు గోపాల్ రంగం లో ఉన్నారు. ఆయన కొన్ని నియోజకవర్గాల్లో విస్తృత ప్రచా రం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థుల కంటే మెరుగైన ప్రచారం సాగిస్తున్నారు. గ్రామాలు, తండాల్లోకి వెళ్తున్నారు. కేవలం అసెంబ్లీ అభ్యర్థులు చేసే ప్రచారంపైనే కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులు ఆధారపడుతున్నారు. నాగర్ కర్నూలు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మల్లు రవిని రంగంలోకి దించి ఉంటే.. పరిస్థితి మరోలా ఉండేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ నియోజకవర్గంపై అవగాహన ఉన్న నాయకునిగా..ఈసారి ఆయనకు గెలిచే అవకాశం ఉండేదన్న ప్రచారం సాగుతోంది. మూడుసార్లు ఎంపీగా ఉన్న మందా జగన్నాథంపై కొంత వ్యతిరేకత ఉన్నా.. ఆ ఇద్దరు అభ్యర్థుల కంటే ఈయనే మెరుగు అనే భావన వ్యక్తం అవుతోంది. - ఈ పార్లమెంట్ నియోజకవర్గంలోని అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పరిశీలిస్తే.. కల్వకుర్తిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎడ్మ కిష్టారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి మధ్యనే పోటీ ఉన్నా.. ఎడ్మ కిష్టారెడ్డి వైపు ఓటర్లు మొగ్గు చూపుతున్నారు. టీడీపీ నుంచి టీ ఆర్ఎస్లో చేరిన జైపాల్‌యాదవ్ మూడోస్థానానికి పడిపోయారు - ఇక అచ్చంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. ఇక్కడ డాక్టర్ వంశీకష్ణ పట్ల సానుకూలత వ్యక్తం అవుతున్నా.. ఒకసారి కొత్త వ్యక్తికి అవకాశం ఇవ్వాలన్న అభిప్రాయం కూడా కొంత కనిపిస్తోంది. అది బలంగా వేళ్లూనుకుంటే మాత్రం బాల్‌రాజ్ కు అనుకూలంగా మారే అవకాశం లేకపోలేదు. - నాగర్‌కర్నూలులో కాంగ్రెస్, బీజేపీ,వైఎస్సార్సీపీ, టీఆర్ఎస్ మధ్యనే పోటీ ఉంది. ప్రస్తుతం ఈ నియోజవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నాగం జనార్దన్‌రెడ్డి లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. ఆయన కుమారుడు శశిధర్‌రెడ్డి రంగంలో ఉన్నా..ప్రభావం అంతంత మాత్రమే. వైఎస్సార్సీపీ అభ్యర్థి గట్టి పోటీ ఇస్తున్నా గెలుపువాటికి వరకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. కాంగ్రెస్ నుంచి దామోదర్‌రెడ్డి, టీఆర్ ఎస్ నుంచి జనార్దన్‌రెడ్డిల మధ్య పోటీ రసవత్తరంగా ఉంది. - వనపర్తి నియోజకవర్గంలో మూడు ప్రధాన పార్టీల మధ్య పోటీ ఉంది. టీడీపీ నుంచి రావుల చంద్రశేఖరరెడ్డి, కాంగ్రెస్ నుంచి చిన్నారెడ్డి, టీ ఆర్ ఎస్ నుంచి నిరంజన్‌రెడ్డి పోటీ పడుతున్నారు. ముగ్గురికి మంచిపేరు ఉన్నా.. ఎవరు గెలుపొందినా చాలా తక్కువ ఓట్లతో బయటపడడానికి అవకాశం ఉంది. - ఆలంపూర్ ఎస్సీ నియోజకవర్గంలో చతుర్ముఖ పోటీ ఉంది. ఎంపీ మందా జగన్నాథం కుమారుడు బరిలో ఉన్నా.. గెలిచే అవకాశాలు ఏమాత్రం లేవన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కాంగ్రెస్ నుం చి టీడీపీలో చేరిన అబ్రహం, కాంగ్రెస్ నుంచి సంపత్‌కుమార్, వైఎస్సార్సీపీ నుంచి బంగి లక్ష్మన్న బరిలో ఉన్నారు. చల్లా కుటుం బ ప్రభావం ఈ నియోజకవర్గంపై అధికంగా ఉన్నట్లు సమాచారం. వారి మద్దతు ఉన్న వారే గెలుపునకు అవకాశం ఉంది. - కొల్లాపూర్‌లో మరోసారి మాజీ మంత్రి జూపల్లి కష్ణారావు విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్‌లో బలమైన వ్యక్తిగా ఉన్న విష్ణువర్దన్‌ను కాదని హర్షవర్దన్‌కు బరిలోకి దించడంతో కాంగ్రెస్ మైనస్ అయింది. ఇక్కడ బీజేపీ నుంచి మధుసూధన్‌రావు రంగంలోకి దిగారు. కాంగ్రెస్‌లో చీలిక జూపల్లి లాభించనుంది. - ఇక గద్వాలలో ఎదురులేదని భావించిన మాజీ మంత్రి డీకె ఆరుణ టీ ఆర్ ఎస్ నుంచి గట్టి పోటీ ఎదుర్కోంటున్నారు. ఆమె విజయం కోసం శ్రమించాల్సిన పరిస్థితి. జిల్లా నాయకురాలిగా పేరు తెచ్చుకున్నా.. ఆమె బయటకు వెళ్లి ప్రచారం చేసే అవకాశం లేకుండా పోయింది. టీ ఆర్ ఎస్ నుంచి బరిలో ఉన్న కష్ణమోహన్‌రెడ్డి ఆమెకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. కాంగ్రెస్‌లో ఆమె అనుయాయులైన ద్వితీయ శ్రేణి నాయకులు, ఆమె భర్త భరత్‌సింహారెడ్డి కారణంగా పార్టీ పలుచనైంది. గతంలో మాదిరిగా గెలుపుపై ధీమా వ్యక్తం చేయలేని పరిస్థితి ఆమెది. ఈస్థానంలో బీజేపీ నుంచి రంగంలో ఉన్న కేశవరెడ్డి మొదటిసారిగా రాజకీయాల్లోకి వచ్చారు. ఇక్కడ టీ ఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే ప్రధాన పోటీ ఉంది. ఎవరు గెలిచినా అతి తక్కువ మెజారిటీతో గెలిచే పరిస్థితి ఉంది. ఇవీ అసెంబ్లీ సెగ్మెంట్లు.. నాగర్‌కర్నూలు పార్లమెంట్ పరిధిలో కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్‌కర్నూలు, ఆలంపూర్, వనపర్తి, కొల్లాపూర్, గద్వాల నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో దాదాపు 14 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గాల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్, టీఆర్ఎస్, వైఎస్సార్సీపీ, టీడీపీ మధ్యనే నెలకొంది. ఈ నియోజకవర్గంలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, రాజోలిబండ , చేనేత కార్మికుల సమస్యలు, కొన్ని నియోజకవర్గాల్లోని తాగునీటి సమస్య, జూరాల నీటి విడుదలకు సంబంధించిన అంశా లు ప్రస్తావనకు రావడం లేదు. దళితులకు ఇంకా భూ పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్ల వంటి సమస్యలు ఉన్నాయి.