కారు వర్సెస్ ఫ్యాన్..
నాగర్ కర్నూలు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: నాగర్‌కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రత్యర్థులు బలహీనంగా ఉండడంతో.. ఇప్పటికే హ్యాట్రిక్ విజయం సాధించిన మందా జగన్నాథం మరోసారి విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఐదేళ్లలో మూడు పార్టీలు మారిన మందా జగన్నాథానికి అదృష్టం కలిసి వస్తోంది. ఆయనకు మూడు పార్టీలలో ఉన్న సంబంధాలతోపాటు, నియోజకవర్గ ప్రజలతో ఉన్న సత్సంబంధాలు ఆయన విజయానికి దోహదపడే అవకాశం ఉంది. ఈ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు బలంగా లేకపోయినా.. క్రాస్ ఓటింగ్‌తో మందా జగన్నాథం కు కలిసొచ్చే అవకాశం ఉంది.
ఆయన స్వంత అసెంబ్లీ నియోజకవర్గం ఆలంపూర్‌లో తన కుమారుడుని శ్రీనాథ్‌ను రంగంలోకి దింపినా.. అక్కడ మాత్రం కొడుకు గెలిచే అవకాశాలు కనపడడం లేదు. అసెంబ్లీ స్థానాల్లో ఇతర పార్టీల అభ్యర్థులకు ఓట్లు వేసే ఓటర్లు ఎంపీ స్థానానికి వచ్చేసరికి మాత్రం మందా జగన్నాథం వైపు మొగ్గుచూపుతున్నారు. నాగర్‌కర్నూలు లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేయడానికి అభ్యర్థులెవరూ లేకపోవడంతో...చివరి నిమిషంలో ఎమ్మెల్సీ నంది ఎల్లయ్యను రంగంలోకి దించారు. టీడీపీ నుంచి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బక్కాని నర్సింలు రంగంలో ఉన్నారు. ఈ ఇద్దరు అభ్యర్థులు పార్లమెంట్ నియోజకవర్గంపై ఏమాత్రం ప్రభావం చూపించలేకపోతున్నారు. వైఎస్సార్‌సీపీ నుంచి మారెడు గోపాల్ రంగం లో ఉన్నారు. ఆయన కొన్ని నియోజకవర్గాల్లో విస్తృత ప్రచా రం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థుల కంటే మెరుగైన ప్రచారం సాగిస్తున్నారు. గ్రామాలు, తండాల్లోకి వెళ్తున్నారు. కేవలం అసెంబ్లీ అభ్యర్థులు చేసే ప్రచారంపైనే కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులు ఆధారపడుతున్నారు.
నాగర్ కర్నూలు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మల్లు రవిని రంగంలోకి దించి ఉంటే.. పరిస్థితి మరోలా ఉండేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ నియోజకవర్గంపై అవగాహన ఉన్న నాయకునిగా..ఈసారి ఆయనకు గెలిచే అవకాశం ఉండేదన్న ప్రచారం సాగుతోంది. మూడుసార్లు ఎంపీగా ఉన్న మందా జగన్నాథంపై కొంత వ్యతిరేకత ఉన్నా.. ఆ ఇద్దరు అభ్యర్థుల కంటే ఈయనే మెరుగు అనే భావన వ్యక్తం అవుతోంది.
- ఈ పార్లమెంట్ నియోజకవర్గంలోని అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పరిశీలిస్తే.. కల్వకుర్తిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఎడ్మ కిష్టారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి మధ్యనే పోటీ ఉన్నా.. ఎడ్మ కిష్టారెడ్డి వైపు ఓటర్లు మొగ్గు చూపుతున్నారు. టీడీపీ నుంచి టీ ఆర్‌ఎస్‌లో చేరిన జైపాల్‌యాదవ్ మూడోస్థానానికి పడిపోయారు
- ఇక అచ్చంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్, టీడీపీ మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. ఇక్కడ డాక్టర్ వంశీకష్ణ పట్ల సానుకూలత వ్యక్తం అవుతున్నా.. ఒకసారి కొత్త వ్యక్తికి అవకాశం ఇవ్వాలన్న అభిప్రాయం కూడా కొంత కనిపిస్తోంది. అది బలంగా వేళ్లూనుకుంటే మాత్రం బాల్‌రాజ్ కు అనుకూలంగా మారే అవకాశం లేకపోలేదు.
- నాగర్‌కర్నూలులో కాంగ్రెస్, బీజేపీ,వైఎస్సార్‌సీపీ, టీఆర్‌ఎస్ మధ్యనే పోటీ ఉంది. ప్రస్తుతం ఈ నియోజవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నాగం జనార్దన్‌రెడ్డి లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. ఆయన కుమారుడు శశిధర్‌రెడ్డి రంగంలో ఉన్నా..ప్రభావం అంతంత మాత్రమే. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గట్టి పోటీ ఇస్తున్నా గెలుపువాటికి వరకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. కాంగ్రెస్ నుంచి దామోదర్‌రెడ్డి, టీఆర్ ఎస్ నుంచి జనార్దన్‌రెడ్డిల మధ్య పోటీ రసవత్తరంగా ఉంది.
- వనపర్తి నియోజకవర్గంలో మూడు ప్రధాన పార్టీల మధ్య పోటీ ఉంది. టీడీపీ నుంచి రావుల చంద్రశేఖరరెడ్డి, కాంగ్రెస్ నుంచి చిన్నారెడ్డి, టీ ఆర్ ఎస్ నుంచి నిరంజన్‌రెడ్డి పోటీ పడుతున్నారు. ముగ్గురికి మంచిపేరు ఉన్నా.. ఎవరు గెలుపొందినా చాలా తక్కువ ఓట్లతో బయటపడడానికి అవకాశం ఉంది.
- ఆలంపూర్ ఎస్సీ నియోజకవర్గంలో చతుర్ముఖ పోటీ ఉంది. ఎంపీ మందా జగన్నాథం కుమారుడు బరిలో ఉన్నా.. గెలిచే అవకాశాలు ఏమాత్రం లేవన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కాంగ్రెస్ నుం చి టీడీపీలో చేరిన అబ్రహం, కాంగ్రెస్ నుంచి సంపత్‌కుమార్, వైఎస్సార్‌సీపీ నుంచి బంగి లక్ష్మన్న బరిలో ఉన్నారు. చల్లా కుటుం బ ప్రభావం ఈ నియోజకవర్గంపై అధికంగా ఉన్నట్లు సమాచారం. వారి మద్దతు ఉన్న వారే గెలుపునకు అవకాశం ఉంది.
- కొల్లాపూర్‌లో మరోసారి మాజీ మంత్రి జూపల్లి కష్ణారావు విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్‌లో బలమైన వ్యక్తిగా ఉన్న విష్ణువర్దన్‌ను కాదని హర్షవర్దన్‌కు బరిలోకి దించడంతో కాంగ్రెస్ మైనస్ అయింది. ఇక్కడ బీజేపీ నుంచి మధుసూధన్‌రావు రంగంలోకి దిగారు. కాంగ్రెస్‌లో చీలిక జూపల్లి లాభించనుంది.
- ఇక గద్వాలలో ఎదురులేదని భావించిన మాజీ మంత్రి డీకె ఆరుణ టీ ఆర్ ఎస్ నుంచి గట్టి పోటీ ఎదుర్కోంటున్నారు. ఆమె విజయం కోసం శ్రమించాల్సిన పరిస్థితి. జిల్లా నాయకురాలిగా పేరు తెచ్చుకున్నా.. ఆమె బయటకు వెళ్లి ప్రచారం చేసే అవకాశం లేకుండా పోయింది. టీ ఆర్ ఎస్ నుంచి బరిలో ఉన్న కష్ణమోహన్‌రెడ్డి ఆమెకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. కాంగ్రెస్‌లో ఆమె అనుయాయులైన ద్వితీయ శ్రేణి నాయకులు, ఆమె భర్త భరత్‌సింహారెడ్డి కారణంగా పార్టీ పలుచనైంది. గతంలో మాదిరిగా గెలుపుపై ధీమా వ్యక్తం చేయలేని పరిస్థితి ఆమెది. ఈస్థానంలో బీజేపీ నుంచి రంగంలో ఉన్న కేశవరెడ్డి మొదటిసారిగా రాజకీయాల్లోకి వచ్చారు. ఇక్కడ టీ ఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యనే ప్రధాన పోటీ ఉంది. ఎవరు గెలిచినా అతి తక్కువ మెజారిటీతో గెలిచే పరిస్థితి ఉంది.
ఇవీ అసెంబ్లీ సెగ్మెంట్లు..
నాగర్‌కర్నూలు పార్లమెంట్ పరిధిలో కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్‌కర్నూలు, ఆలంపూర్, వనపర్తి, కొల్లాపూర్, గద్వాల నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో దాదాపు 14 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గాల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్, టీఆర్‌ఎస్, వైఎస్సార్‌సీపీ, టీడీపీ మధ్యనే నెలకొంది. ఈ నియోజకవర్గంలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, రాజోలిబండ , చేనేత కార్మికుల సమస్యలు, కొన్ని నియోజకవర్గాల్లోని తాగునీటి సమస్య, జూరాల నీటి విడుదలకు సంబంధించిన అంశా లు ప్రస్తావనకు రావడం లేదు. దళితులకు ఇంకా భూ పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్ల వంటి సమస్యలు ఉన్నాయి.