Manda Jagannadham
-
మాజీ ఎంపీ మంద జగన్నాథం కన్నుమూత
సాక్షి, హైదరాబాద్/అలంపూర్: నాగర్‌కర్నూల్ మాజీ ఎంపీ డాక్టర్ మందా జగన్నాథం (74) అనా రోగ్యంతో కన్నుమూశారు. కొన్ని రోజులుగా హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. నాగర్‌కర్నూల్ జిల్లా ఇటిక్యాలలో 1951 మే 22న జన్మించిన మందా జగన్నాథం.. నాలుగు పర్యాయాలు ఎంపీగా గెలిచారు.1996, 1999, 2004 పార్లమెంటు ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి 2009లో కాంగ్రెస్ నుంచి గెలిచారు. 2014 తరువాత బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా సేవలందించారు. గత లోక్‌సభ ఎన్నికల ముందు బీఎస్పీలో చేరారు. సీఎం రేవంత్‌రెడ్డి సంతాపంమందా జగన్నాథం మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. ఎంపీగా, సామాజిక తెలంగాణ ఉద్యమకారునిగా రాష్ట్రంలో మందా జగన్నాథం పోషించిన పాత్ర మరువరానిదని అన్నారు. జగన్నాథం మరణం తెలంగాణకు తీరని లోటు అని అన్నారు. మందా జగన్నాథం మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. తెలంగాణ ఉద్యమానికి, బీఆర్ఎస్ పార్టీకి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు.జగన్నాథం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సుదీర్ఘకాలం ఎంపీగా ప్రజలకు సేవలందించిన జగన్నాథం మృతి బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. జగన్నాథం రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని ఎమ్మెల్యే హరీశ్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. -
తుమ్మిళ్లకు ముఖ్యమంత్రి రాక
అలంపూర్ రూరల్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన తేదీ ఖరారైందని, ఈనెల 24వ తేదీన సీఎం జిల్లాలో పర్యటిస్తున్నారని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అధికార ప్రతినిధి డాక్టర్ మందా జగన్నాథం అన్నారు. బుధవారం ఆయన అలంపూర్‌లోని టూరిజం అతిథి గృహంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పలు విషయాలు వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన అలంపూర్ ప్రాంతాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత పెద్దపీట వేసేందుకు కేసీఆర్ సుముఖంగా ఉన్నారని, అందుకు అలంపూర్‌ను ఢిల్లీ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు తనకు కేంద్ర కేబినేట్ హోదాలో స్థానం కల్పించారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రైతుబంధు పథకంపై అతస్య ప్రచారం చేస్తోందని, అనవసర రాజకీయాలు పక్కనపెట్టి రైతు సంక్షేమం కోసం ఆలోచించాలని హితవు పలికారు. ప్రభుత్వం ఆర్టీఎస్ ను స సప్లిమెంటరీ చేయాలని రూ.800కోట్లను తుమ్మిళ్ల ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేసి పనులను వేగవంతం చేస్తుందని, అదేవిధంగా రూ.500కోట్లతో చేపట్టనున్న గట్టు ఎత్తిపోతల పథకానికి ఈనెల 24వ తేదీన సీఎం కేసీఆర్ పునాదిరాయి వేయనున్నారని తెలిపారు. ఈ ప్రాంతం నుంచి ఎందరో వైద్యులు, మేధావులు వెలుగులోకి వచ్చినా ఈ ప్రాంతాన్ని ఆశించినంత అభివృద్ధి చేయలేకపోయారని, సకాలంలో తుమ్మిళ్ల నీరు వచ్చేలా దగ్గరుండి పనులు చేయిస్తానన్నారు. అలాగే అలంపూర్‌లో ఆర్టీసీ డిపోలేక ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను సీఎం దష్టికి తీసుకెళ్లగా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని గుర్తుచేశారు. -
గ్రూపు రాజకీయాలకు జూపల్లి ఆజ్యం
మాజీ ఎంపీ మందా జగన్నాథం ధ్వజం ఇటిక్యాల: అలంపూర్ నియోజకవర్గంలో మంత్రి జూపల్లి కృష్ణారావు గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని నాగర్‌కర్నూ ల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం ఆరోపించారు. మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఇటిక్యాల మండలం కొండేరులో ఆదివారం తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. అలంపూర్‌లో గ్రూపులను ఏర్పాటు చేసి పార్టీకి నష్టం కలిగిస్తున్నారని, ఇక్కడ దళితులు పార్టీ ఇన్చార్జిలుగా ఉండటం ఆయనకు ఇష్టంలేదన్నారు. పార్టీకి చెందని నాయకులకు ప్రభుత్వ నామినేటెడ్ పదవులను అప్పజెప్పేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆ ప్రక్రియను టీఆర్ఎస్ కార్యకర్తలు, ఉద్యమకారులు అడ్డుకోవడంతో జీర్ణించుకోలేక రాజీనామాల పేరిట తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు. అలంపూర్ ప్రాంతంపై చిత్తశుద్ధి ఉంటే తమ రాజీనామాలను ఆమోదింపచేసుకోవాలని డిమాండ్ చేశారు. -
మందా జగన్నాధానికి రాజ్యసభ సీటు కేటాయించాలి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడిన మాజీ పార్లమెంట్ సభ్యులు, టీఆర్ఎస్ నేత మంద జగన్నాధంకు రాజ్యసభ సీటు కేటాయించాలని ఓబీసీ ఉద్యోగుల సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వి.దానకర్ణాచారి సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. ఆదివారం మందా జగన్నాధం జన్మదినం సందర్భంగా ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కేక్ కట్‌చేసి, ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నేతలు ఎస్.రవికుమార్ ముదిరాజ్, అంబరీశ్, శ్రీధర్, అఖిల భారత ఓబీసీ మహిళ సమాఖ్య జాతీయ అధ్యక్షురాలు ఎం.భాగ్యలక్ష్మీ, తెలంగాణ రాష్ట్ర ప్రధానకార్యదర్శి దశరథలక్ష్మీ, ఎం.తిరుమల, కె.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
మాజీ ఎంపీ పాస్‌పోర్టు కొట్టేసిన కేటుగాళ్లు
హైదరాబాద్: టీఆర్ఎస్ మాజీ ఎంపీ మందా జగన్నాథం పాస్‌పోర్టు చోరీకి గురైంది. కారులో వుంచిన ఆయన సూట్‌కేసును దొంగలు ఎత్తుకెళ్లారు. అందులో ఉన్న పాస్‌పోర్టు, రూ. 90వేల నగదు, కొన్ని ఫైళ్లు ఉన్నాయి. మందా జగన్నాథం కారు డ్రైవర్ దృష్టి మళ్లించి సోమవారం ఆబిడ్స్ లో ఈ చోరీకి పాల్పడ్డారు. రోడ్డుపై పది రూపాయల నోటు పడిపోయిందని ఇద్దరు వ్యక్తులు చెప్పడంతో కారులో కూర్చునివున్న డైవర్ శ్రీనివాస్ రెడ్డి కిందకు దిగాడు. దుండగుల్లో ఒకడు కారు వెనుక డోర్ తెరిచి సీట్లో ఉన్న సూట్ కేసు తీసుకుని పారిపోయాడు. వీరిని పట్టుకునేందుకు డ్రైవర్ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో అతడు ఆబిడ్స్ పోలీసులను ఆశ్రయించాడు. ఇది స్థానిక దొంగల గ్యాంగ్ పని అయివుంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. దొంగలను పట్టుకునేందుకు సీసీ టీవీ పుటేజ్ పరిశీలిస్తున్నారు. -
కారు వర్సెస్ ఫ్యాన్..
నాగర్ కర్నూలు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: నాగర్‌కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రత్యర్థులు బలహీనంగా ఉండడంతో.. ఇప్పటికే హ్యాట్రిక్ విజయం సాధించిన మందా జగన్నాథం మరోసారి విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఐదేళ్లలో మూడు పార్టీలు మారిన మందా జగన్నాథానికి అదృష్టం కలిసి వస్తోంది. ఆయనకు మూడు పార్టీలలో ఉన్న సంబంధాలతోపాటు, నియోజకవర్గ ప్రజలతో ఉన్న సత్సంబంధాలు ఆయన విజయానికి దోహదపడే అవకాశం ఉంది. ఈ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు బలంగా లేకపోయినా.. క్రాస్ ఓటింగ్‌తో మందా జగన్నాథం కు కలిసొచ్చే అవకాశం ఉంది. ఆయన స్వంత అసెంబ్లీ నియోజకవర్గం ఆలంపూర్లో తన కుమారుడుని శ్రీనాథ్‌ను రంగంలోకి దింపినా.. అక్కడ మాత్రం కొడుకు గెలిచే అవకాశాలు కనపడడం లేదు. అసెంబ్లీ స్థానాల్లో ఇతర పార్టీల అభ్యర్థులకు ఓట్లు వేసే ఓటర్లు ఎంపీ స్థానానికి వచ్చేసరికి మాత్రం మందా జగన్నాథం వైపు మొగ్గుచూపుతున్నారు. నాగర్‌కర్నూలు లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేయడానికి అభ్యర్థులెవరూ లేకపోవడంతో...చివరి నిమిషంలో ఎమ్మెల్సీ నంది ఎల్లయ్యను రంగంలోకి దించారు. టీడీపీ నుంచి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బక్కాని నర్సింలు రంగంలో ఉన్నారు. ఈ ఇద్దరు అభ్యర్థులు పార్లమెంట్ నియోజకవర్గంపై ఏమాత్రం ప్రభావం చూపించలేకపోతున్నారు. వైఎస్సార్సీపీ నుంచి మారెడు గోపాల్ రంగం లో ఉన్నారు. ఆయన కొన్ని నియోజకవర్గాల్లో విస్తృత ప్రచా రం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థుల కంటే మెరుగైన ప్రచారం సాగిస్తున్నారు. గ్రామాలు, తండాల్లోకి వెళ్తున్నారు. కేవలం అసెంబ్లీ అభ్యర్థులు చేసే ప్రచారంపైనే కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులు ఆధారపడుతున్నారు. నాగర్ కర్నూలు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మల్లు రవిని రంగంలోకి దించి ఉంటే.. పరిస్థితి మరోలా ఉండేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ నియోజకవర్గంపై అవగాహన ఉన్న నాయకునిగా..ఈసారి ఆయనకు గెలిచే అవకాశం ఉండేదన్న ప్రచారం సాగుతోంది. మూడుసార్లు ఎంపీగా ఉన్న మందా జగన్నాథంపై కొంత వ్యతిరేకత ఉన్నా.. ఆ ఇద్దరు అభ్యర్థుల కంటే ఈయనే మెరుగు అనే భావన వ్యక్తం అవుతోంది. - ఈ పార్లమెంట్ నియోజకవర్గంలోని అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పరిశీలిస్తే.. కల్వకుర్తిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎడ్మ కిష్టారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి మధ్యనే పోటీ ఉన్నా.. ఎడ్మ కిష్టారెడ్డి వైపు ఓటర్లు మొగ్గు చూపుతున్నారు. టీడీపీ నుంచి టీ ఆర్ఎస్లో చేరిన జైపాల్‌యాదవ్ మూడోస్థానానికి పడిపోయారు - ఇక అచ్చంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. ఇక్కడ డాక్టర్ వంశీకష్ణ పట్ల సానుకూలత వ్యక్తం అవుతున్నా.. ఒకసారి కొత్త వ్యక్తికి అవకాశం ఇవ్వాలన్న అభిప్రాయం కూడా కొంత కనిపిస్తోంది. అది బలంగా వేళ్లూనుకుంటే మాత్రం బాల్‌రాజ్ కు అనుకూలంగా మారే అవకాశం లేకపోలేదు. - నాగర్‌కర్నూలులో కాంగ్రెస్, బీజేపీ,వైఎస్సార్సీపీ, టీఆర్ఎస్ మధ్యనే పోటీ ఉంది. ప్రస్తుతం ఈ నియోజవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నాగం జనార్దన్‌రెడ్డి లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. ఆయన కుమారుడు శశిధర్‌రెడ్డి రంగంలో ఉన్నా..ప్రభావం అంతంత మాత్రమే. వైఎస్సార్సీపీ అభ్యర్థి గట్టి పోటీ ఇస్తున్నా గెలుపువాటికి వరకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. కాంగ్రెస్ నుంచి దామోదర్‌రెడ్డి, టీఆర్ ఎస్ నుంచి జనార్దన్‌రెడ్డిల మధ్య పోటీ రసవత్తరంగా ఉంది. - వనపర్తి నియోజకవర్గంలో మూడు ప్రధాన పార్టీల మధ్య పోటీ ఉంది. టీడీపీ నుంచి రావుల చంద్రశేఖరరెడ్డి, కాంగ్రెస్ నుంచి చిన్నారెడ్డి, టీ ఆర్ ఎస్ నుంచి నిరంజన్‌రెడ్డి పోటీ పడుతున్నారు. ముగ్గురికి మంచిపేరు ఉన్నా.. ఎవరు గెలుపొందినా చాలా తక్కువ ఓట్లతో బయటపడడానికి అవకాశం ఉంది. - ఆలంపూర్ ఎస్సీ నియోజకవర్గంలో చతుర్ముఖ పోటీ ఉంది. ఎంపీ మందా జగన్నాథం కుమారుడు బరిలో ఉన్నా.. గెలిచే అవకాశాలు ఏమాత్రం లేవన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కాంగ్రెస్ నుం చి టీడీపీలో చేరిన అబ్రహం, కాంగ్రెస్ నుంచి సంపత్‌కుమార్, వైఎస్సార్సీపీ నుంచి బంగి లక్ష్మన్న బరిలో ఉన్నారు. చల్లా కుటుం బ ప్రభావం ఈ నియోజకవర్గంపై అధికంగా ఉన్నట్లు సమాచారం. వారి మద్దతు ఉన్న వారే గెలుపునకు అవకాశం ఉంది. - కొల్లాపూర్‌లో మరోసారి మాజీ మంత్రి జూపల్లి కష్ణారావు విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్‌లో బలమైన వ్యక్తిగా ఉన్న విష్ణువర్దన్‌ను కాదని హర్షవర్దన్‌కు బరిలోకి దించడంతో కాంగ్రెస్ మైనస్ అయింది. ఇక్కడ బీజేపీ నుంచి మధుసూధన్‌రావు రంగంలోకి దిగారు. కాంగ్రెస్‌లో చీలిక జూపల్లి లాభించనుంది. - ఇక గద్వాలలో ఎదురులేదని భావించిన మాజీ మంత్రి డీకె ఆరుణ టీ ఆర్ ఎస్ నుంచి గట్టి పోటీ ఎదుర్కోంటున్నారు. ఆమె విజయం కోసం శ్రమించాల్సిన పరిస్థితి. జిల్లా నాయకురాలిగా పేరు తెచ్చుకున్నా.. ఆమె బయటకు వెళ్లి ప్రచారం చేసే అవకాశం లేకుండా పోయింది. టీ ఆర్ ఎస్ నుంచి బరిలో ఉన్న కష్ణమోహన్‌రెడ్డి ఆమెకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. కాంగ్రెస్‌లో ఆమె అనుయాయులైన ద్వితీయ శ్రేణి నాయకులు, ఆమె భర్త భరత్‌సింహారెడ్డి కారణంగా పార్టీ పలుచనైంది. గతంలో మాదిరిగా గెలుపుపై ధీమా వ్యక్తం చేయలేని పరిస్థితి ఆమెది. ఈస్థానంలో బీజేపీ నుంచి రంగంలో ఉన్న కేశవరెడ్డి మొదటిసారిగా రాజకీయాల్లోకి వచ్చారు. ఇక్కడ టీ ఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే ప్రధాన పోటీ ఉంది. ఎవరు గెలిచినా అతి తక్కువ మెజారిటీతో గెలిచే పరిస్థితి ఉంది. ఇవీ అసెంబ్లీ సెగ్మెంట్లు.. నాగర్‌కర్నూలు పార్లమెంట్ పరిధిలో కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్‌కర్నూలు, ఆలంపూర్, వనపర్తి, కొల్లాపూర్, గద్వాల నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో దాదాపు 14 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గాల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్, టీఆర్ఎస్, వైఎస్సార్సీపీ, టీడీపీ మధ్యనే నెలకొంది. ఈ నియోజకవర్గంలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, రాజోలిబండ , చేనేత కార్మికుల సమస్యలు, కొన్ని నియోజకవర్గాల్లోని తాగునీటి సమస్య, జూరాల నీటి విడుదలకు సంబంధించిన అంశా లు ప్రస్తావనకు రావడం లేదు. దళితులకు ఇంకా భూ పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్ల వంటి సమస్యలు ఉన్నాయి. -
రెండో లిస్ట్‌లో ముగ్గురు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : జిల్లాలోని 11 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన టీఆర్ఎస్ తాజాగా మరొకరి అభ్యర్థిత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించింది. నారాయణపేట, కొడంగల్ అసెంబ్లీ స్థానాలకు మాత్రం ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ మంద జగన్నాథం టీఆర్ఎస్ అభ్యర్థులుగా పోటీ చేయనున్నారు. షాద్‌నగర్ అసెంబ్లీ స్థానం నుంచి 2009 ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన అంజయ్య యాదవ్‌కే మరోసారి అవకాశం దక్కింది. నారాయణపేట అసెంబ్లీ స్థానం నుంచి టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విఠల్‌రావు, ఇటీవల పార్టీలో చేరిన శివకుమార్‌రెడ్డి టిక్కెట్ ఆశిస్తున్నారు. అభ్యర్థిత్వంపై స్పష్టత రాక మునుపే విఠల్‌రావు ఆర్య శనివారం నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు టిక్కెట్‌పై హామీతో పార్టీలో చేరిన శివకుమార్‌రెడ్డి టిఆర్ఎస్ తొలి జాబితాలో తన పేరు లేకపోవడంతో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. టిఆర్ఎస్ ముఖ్య నేత హరీష్‌రావును శివకుమార్‌రెడ్డి శనివారం కలిశారు. ఆయన పేరును ఆది, లేదా సోమవారం ప్రకటించే అవకాశముందని విశ్వసనీయ సమాచారం. కాగా కొడంగల్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక కొలిక్కి వచ్చిన తర్వాతే టిఆర్ఎస్ అభ్యర్థి పేరును వెల్లడించాలని పార్టీ భావిస్తోంది. త్వరలో కేసిఆర్ సభ జిల్లాలో పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొలిక్కి రావడతో నేతలందరూ నామినేషన్ల దాఖలుపై దష్టి సారించారు. బుధవారం నామినేషన్ దాఖలు చేసేందుకే నేతలు మొగ్గు చూపుతున్నారు. అభ్యర్థుల ఎంపికతో దూకుడు మీదున్న టీఆర్ఎస్ ప్రచార పర్వంలోనూ ఇదే వైఖరి అవలంభించాలని భావిస్తోంది. పార్టీ అధ్యక్షుడు కేసిఆర్‌తో కనీసం రెండు చోట్ల బహిరంగ సభ నిర్వహించేలా ప్రణాళిక సిద్దం చేస్తున్నారు. పార్టీ ముఖ్య నేతలు హరీష్‌రావు, కేటిఆర్, కేశవరావు వంటి నేతలతో రోడ్‌షోలు నిర్వహించేలా అభ్యర్థులు ప్రచార ప్రణాళిక రూపొందించుకుంటున్నారు. -
టీఆర్ఎస్ పై వివేక్ ప్రభావం ఉండదు: ఈటెల
హైదరాబాద్: ఎన్నికల ముందు వలసలు సాధారణమేనని టీఆర్ఎస్ పార్టీ నేత ఈటెల రాజేందర్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీని ఎంపీ వివేక్ వీడి కాంగ్రెస్ లో చేరడంపై ఈటెల స్పందిస్తూ..వివేక్ కాంగ్రెస్‌లోకి వెళ్లినా టీఆర్ఎస్ పై ప్రభావం ఉండదు అని వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ, సీపీఐ, జేఏసీ వాదులతో కలిసి వెళ్లాలని అనుకుంటున్నామని ఈటెల ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. వివేక్ తోపాటు మరికొంత మంది ఎంపీలు, నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన మరో ఎంపీ మందా జగన్నాథం తాను పార్టీ వీడే ప్రస్తక్తి లేదన్నారు. తాను టీఆర్ఎస్ పార్టీలోనే దళితులకు న్యాయం జరుగుతుందని.. ఆ పార్టీలోనే కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. తాను ఎన్ని త్యాగాలు చేసినా కాంగ్రెస్ పార్టీ గుర్తించలేదని ఆయన విమర్శించారు. -
'టీఆర్ఎస్లోనే కొనసాగుతా'
తాను టీఆర్ఎస్లోనే కొనసాగుతానని ఎంపీ మందా జగన్నాథం సోమవారం న్యూఢిల్లీలో స్పష్టం చేశారు. ఆ పార్టీ తరఫున ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించానని తెలిపారు. టీఆర్ఎస్తోనే దళితులకు న్యాయం జరుగుందని తాను ముమ్మాటికి నమ్ముతున్నానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఎన్ని త్యాగాలు చేసిన ఆ పార్టీ అధిష్టానం గుర్తించలేదన్నారు. టీఆర్ఎస్ నుంచి ఎంపీ వివేక్ ఈ రోజు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో వివేక్ పార్టీ మారినట్లు మీరు ఏమైనా కాంగ్రెస్‌లో చేరుతారా అన్న విలేకర్ల ప్రశ్నకు మందా జగన్నాథంపై విధంగా సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ నుంచి పెద్దపల్లి ఎంపీ వివేక్ కొద్ది కాలం క్రితం టీఆర్ఎస్లో చేరారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఇటీవల తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. దాంతో వివేక్ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి... ఈ రోజు న్యూఢిల్లీలో కాంగ్రెస్ పెద్దల సమక్షంలో ఆయన ఆ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. -
సీమాంధ్రలో బీసీ సీఎంను ప్రకటించలేదేం?
బాబుకు మందా జగన్నాథం సూటిప్రశ్న న్యూఢిల్లీ: తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రిని చేస్తానని చెబుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, సీమాంధ్రలో ఎందుకు బీసీ అభ్యర్థిని సీఎంను చేస్తానని చెప్పడం లేదని టీఆర్ఎస్ నేత, ఎంపీ మందా జగన్నాథం సూటిగా ప్రశ్నించారు. తెలంగాణలో అధికారంలోకి ఎలాగూ రాలేమని తెలిసే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని కట్టుకథలు చెబుతూ చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. జగన్నాథం బుధవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. బీసీలకు తగిన ప్రాధాన్యమిచ్చిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తమ పార్టీ శాసనసభాపక్ష నేతగా ఈటెల రాజేందర్‌ను నియమించారని తెలిపారు. తెలంగాణకు దళితుడిని సీఎంని చేస్తానని చెప్పిన కేసీఆర్ ఆమాటను వెనక్కి తీసుకోలేదన్నారు. వివేక్, కె.కేశవరావు టీఆర్ఎస్ను వీడతారన్న ప్రచారంలో నిజం లేదన్నారు. -
మేమంతా టిఆర్ఎస్లోనే ఉంటాం: ఎంపి మందా
ఢిల్లీ: తామందరం టీఆర్ఎస్లోనే ఉంటామని, పార్టీ మారేది లేదని ఎంపి మందా జగన్నాథం స్పష్టం చేశారు. కెసిఆర్ పోరాటంతోనే తెలంగాణ వచ్చిందని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమంలో మంత్రులు ఎప్పుడైనా పాల్గొన్నారా? అని ప్రశ్నించారు. డీకే అరుణ దళిత వ్యతిరేకి అన్నారు. టిడిపి అధ్యక్షుడు చంద్రాబాబు నాయుడు సీమాంధ్రలో బీసీని ముఖ్యమంత్రిగా ప్రకటించగలడా? అని అడిగారు. తాము టీఆర్ఎస్ఎల్పీ నేతగా ఈటెల రాజేందర్‌ను ఎన్నుకున్నాట్లు తెలిపారు. -
కేసీఆర్‌ను అంటే ఊరుకోం: మందా జగన్నాథం
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నేతలపై నాగర్ కర్నూలు ఎంపీ మందా జగన్నాథం మండిపడ్డారు. ఏనాడూ ఉద్యమాలు చేయనివాళ్లు ఇప్పుడు కేసీఆర్‌ని విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్‌పై పొన్నాల లక్ష్మయ్య చేసిన ఆరోపణలు పసలేనివని కొట్టిపారేశారు. కేసీఆర్‌ను అవమానపరిచే విధంగా మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. ముమ్మాటికి తెలంగాణ పట్ల కాంగ్రెస్ వంచనకు పాల్పడిందన్నారు. కాంగ్రెస్ జాప్యం వల్లనే వందలాది మంది తెలంగాణ విద్యార్ధులు ఆత్మహత్యచేసుకున్నారని విమర్శించారు. దళిత సీఎంపై అధికారంలోకి వచ్చాక టీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంటుందని మందా జగన్నాథం చెప్పారు. -
టీడీపీ శకం ముగిసింది
నాగర్‌కర్నూల్, ప్రజల పోరాట ఫలితంగా వచ్చిన తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం టీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందని, సీమాంధ్రుల కల్లబొల్లి మాటలు, అవకాశవాదంతో బిల్లుకు సహకరించిన పార్టీలకు ఈ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని నాగర్‌కర్నూల్ ఎంపీ డాక్టర్ మందా జగన్నాథం పిలుపునిచ్చారు. గురువారం స్థానిక టీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కృష్ణ, తుంగభద్ర నీటి లభ్యతను బట్టి జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరందిస్తామన్నారు. తెలంగాణలో టీడీపీ శ కం ముగిసిందని, కేసీఆర్‌ను విమర్శిస్తూ తెలంగాణ ప్రజలను రెచ్చగొడితే తగిన ఫలితం అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించారు. తెలంగాణ కోసం ఒక్కరోజు కూడా జెండా పట్టనివారు, సమైక్యాంధ్ర ఫ్లెక్సీలు పట్టుకున్నవారు సంబరాలు చేసుకోవడంలో అర్థం లేదన్నారు. నాగర్‌కర్నూల్ పట్టణంలో ఎంపీగా తాను ఎ న్నో అభివృద్ధి పనులు చేశానని, ఇంటింటి నల్లా పథకానికి నిధులు తెస్తే వాటిని వినియోగించుకోలేకపోయారన్నారు. తొలుత డిజైన్ చేసిన రామన్‌పాడు పథకాన్ని పొడిగించడం వల్లే ఆ పథకం విఫలమైందన్నారు. సమావేశంలో టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి మర్రి జనార్దన్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు శరత్‌బాబు, సంధ్యారాణి, జిల్లా అధికార ప్రతినిధులు కుర్మయ్య, తిర్పతయ్య, ఖాజా, తదితరులు పాల్గొన్నారు. కిరణ్ చేయని దుర్మార్గాలు లేవు అచ్చంపేట: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పూర్తయి కొత్త రాష్ట్రం అవతరించబోతుంటే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ మూర్ఖ శికామణిలా ఇప్పటికీ తెలంగాణ ఆపుతానంటూ మాట్లాడటం సిగ్గుచేటని మందా మండిపడ్డారు. అచ్చంపేటలోని చందాపూర్‌లో ఆయన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ కిరణ్ చేయని దుర్మార్గమంటూ లేద ని ఆరోపించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్-3ప్రకారం అసెంబ్లీ తీర్మానం లేకుండా పార్లమెంటులో బిల్లు అమోదం చెల్లుతుందని సీఎం అయిన వ్యక్తి కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. అసెంబ్లీ తిప్పి పంపిన బిల్లు పార్లమెంటులో చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు ఇస్తుందని ఆయన అనడం అవివేకమన్నారు. కేంద్ర మంత్రి జైరాం రమేష్ తికతికగా మాట్లాడినా స్మశానం నుంచి వచ్చిన పార్టీలు స్మశానంలోనే కలిసిపోతాయని చెప్పడంలో వాస్తవం ఉందన్నారు. ఒకరోజు కూడా ఉద్యమంలో పాల్గొనని పార్టీలు ఇప్పుడు తెలంగాణ ఇచ్చిందీ, తెచ్చింది మేమంటూ సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి గువ్వల బాలరాజు, నాయకులు జి.సుదర్శన్, వంగా గిరివర్ధన్‌గౌడ్, నర్సింహ్మగౌడ్, చీమర్ల మధుసూదన్‌రెడ్డి, పుల్జాల చంద్రమోహన్, కటకం భాస్కర్, తదితరులు పాల్గొన్నారు. -
సోనియా దయ్యమో దేవతో ప్రజలే నిర్ణయిస్తారు: మందా
సాక్షి, న్యూఢిల్లీ: సోనియాగాంధీ దయ్యమో, దేవతో వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలే నిర్ణయిస్తారని టీఆర్ఎస్ నేత, ఎంపీ మందా జగన్నాథం వ్యాఖ్యానించారు. మంగళవారం ఢిల్లీలోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలో టీఆర్ఎస్ సోనియాను దేవత అని స్తుతించిందని, మరిప్పుడు దేవతా? దయ్యమా? అని విలేకరి ప్రశ్నించగా... మందా పైవిధంగా బదులిచ్చారు. అనేక పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ విలీనం కాదని కేసీఆర్ ప్రకటించారని, అసలు విషయాలు తెలియకుండా కాంగ్రెస్ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ‘‘స్నేహపూర్వక హస్తం అంటూనే రెచ్చగొట్టేలా మాట్లాడారు. సోనియా ఎప్పుడూ విలీనం, పొత్తులపై మాట్లాడలేదు. కానీ, దిగ్విజయ్‌సింగ్ మాత్రం విలీనం ఖరారైందని, కేవలం విధివిధానాలే మాట్లాడుకోవాల్సి ఉందని ఎలా అంటారు. ఇద్దరు సభ్యులతో బిల్లు ఎలా పాస్ చేయిస్తారంటూ టీఆర్ఎస్పై ఎలా వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తారు? దిగ్విజయ్ వ్యాఖ్యలు మొత్తం తెలంగాణ ప్రజలను అవమానించే రీతిలో ఉన్నాయి.’’ అని ఆరోపించారు. -
సీమాంధ్ర ప్రజలను రెచ్చగొడుతున్న సీఎం
సాక్షి, న్యూఢిల్లీ : సీమాంధ్ర ఉద్యమానికి బాధ్యుడైన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేయాల ని ఎంపీలు మందా జగన్నాధం, వివేక్ డిమాండ్ చేశారు. తప్పుడు నివేదికలు ఇచ్చి సీమాంధ్ర ప్రజలను రెచ్చగొట్టారని, కిరణ్ ప్రాంతీయవాదిగా వ్యవహరిస్తున్నారని ధ్వజ మెత్తారు. గురువారం మీడియాతో మాట్లాడా రు. జగన్నాథం మాట్లాడుతూ తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని కిరణ్‌పై మండిపడ్డారు.. అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పిన ఆయన తర్వాత ప్రాంతీయవాదిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఉపఎన్నికలు చూస్తే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా వచ్చాయి. ఒక్క సీటూ గెలవలేని సీఎం కిరణ్ రాబోయే సాధారణ ఎన్నికల్లో ఎలా ముందుకు వెళతారని ప్రశ్నించా రు. విభజనకు సానుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు ఎవరిని అడిగి నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించడం అర్దరహితమన్నారు. ఎంపీ వివేక్ మాట్లాడుతూ బీజేపీ, టీడీపీ కుమ్మకై తెలంగాణ అంశాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. -
రాష్ట్రపతి ముద్రపడే వరకు పోరాటం
గద్వాల న్యూటౌన్, న్యూస్‌లైన్: పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొంది, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసే వరకు పోరాటం చేయాలని నాగర్‌కర్నూల్ ఎం పీ మందా జగన్నాథం పిలుపునిచ్చారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెట్టాలని, రాష్ట్ర విభజనకు సీమాంధ్రులు సహకరించాలని కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో శనివారం గద్వాలలో భారీ శాంతి ర్యాలీ నిర్వహించా రు. వేలాది మంది విద్యార్థులు, ఉద్యోగు లు, కార్మికులు, జేఏసీ నాయకులు ర్యాలీ లో పాల్గొన్నారు. తెలంగాణ నినాదాలతో గద్వాల పట్టణం దద్దరిల్లింది. స్థానిక టీఎన్జీఓ భవనం నుంచి ప్రారంభమైన ర్యాలీ అంబేద్కర్‌చౌక్, రాజీవ్‌మార్గ్, గాంధీచౌక్, వైఎస్సార్ చౌరస్తా వరకు సాగింది. ఈ సందర్భంగా ఎంపీ మందా మాట్లాడుతూ తెలంగాణ పై ప్రకటన చేసి చేతులు దులుపుకుంటే సరిపోదని, వెంటనే పార్లమెంట్ లో బిల్లుపెట్టి త్వరగా రాష్ట్రప్రతి ఆమోదం ముద్ర వేయించాలని కోరారు. ప్రపంచం లో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ ఉద్యమం 60 ఏళ్ల పాటు సాగిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో సీమాంధ్రులపై ఎలాంటి దాడులు జరగలేదని, కానీ సీమాంధ్రులు తెలంగాణ ఉద్యోగులపై దా డులకు పాల్పడటం సరికాదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు రాష్ట్రపతి ఆమోదముద్ర పడకుండానే సంబరాలు చేసుకోవ డం కాంగ్రెస్‌పార్టీకే చెల్లిందన్నారు. సీమాం ధ్ర ఉద్యోగులు తమకు భద్రత లేదని అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్నారు. టీజేఏసీ జిల్లా చైర్మన్ రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ సీమాంధ్రలో జరుగుతున్నది డూ బ్లికేట్ ఉద్యమంగా అభివర్ణించారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా హైదరాబాద్ తెలంగాణదేనన్నారు. సీమాంధ్ర ఉద్యోగులపై ఎలాంటి కోపాలు లేవని, 610 జీఓ, ఇతర నిబంధనల ప్రకారమే ఉద్యోగుల పంపకాలు ఉంటాయన్నారు. ఇష్టమొచ్చి న వారు తెలంగాణలో ఉండొచ్చునన్నా రు. మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు మా ట్లాడుతూ సమైక్యాంధ్రలో తెలంగాణ ప్రాంతం అడుగడుగునా దోపిడీకి గురైం దన్నారు. ప్రజలంతా కలిసికట్టుగా ఉద్యమించడం వల్లే కేంద్రం ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జేఏసీ, విద్యార్థి నాయకులు వీరభద్రప్ప, మధుసూదన్‌బాబు, గట్టు తిమ్మప్ప, రాజశేఖర్‌రెడ్డి, పురుషోత్తం రెడ్డి, మోనేష్, కృష్ణ, విష్ణువర్ధన్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, నందు, జగన్నాథం, తదితరులు పాల్గొన్నారు.