
సాక్షి, న్యూఢిల్లీ: గద్వాల– మాచర్ల రైల్వే లైనును ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌కు కాంగ్రెస్ ఎంపీ నంది ఎల్లయ్య విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన ఇక్కడ రైల్వే మంత్రిని కలసి ఈ లైన్ నిర్మాణంపై వినతిపత్రం సమర్పించారు. ఈ లైన్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్ వెంచర్‌గా నిర్మించాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు దీని నిర్మాణానికి చర్యలు తీసుకోవడం లేదని ఫిర్యాదు చేశారు. తదుపరి చర్యల కోసం దక్షిణ మధ్య రైల్వే అధికారులు సీఎం అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించినా ఇవ్వడం లేదని రైల్వే మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ దిశగా తాను ముఖ్యమంత్రికి పలు లేఖలు కూడా రాశానని వివరించారు.