
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్.. బీజేపీకి దగ్గరవుతున్నట్టు కనబడుతోంది. తాజాగా ‘ఎక్స్’లో ఆయన పోస్ట్ చేసిన ఫొటో ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేరళ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించి హైకమాండ్ ఆగ్రహానికి గురైన ఆయన పరిస్థితి కాంగ్రెస్‌లో అగమ్యగోచరంగా తయారైంది. దీంతో థరూర్ తన దారి తాను చూసుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. పార్టీకి తన అవసరం లేకపోతే స్పష్టం చెప్పాలని సూటిగా అధినాయకత్వాన్నే ఆయన అడిగినా ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలో థరూర్.. కాషాయపార్టీవైపు అడుగులు వేస్తున్నట్టు కనబడుతోందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
సెల్ఫీ పాలిటిక్స్
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ (Piyush Goyal).. బ్రిటన్ వాణిజ్య, వ్యాపార శాఖ మంత్రి జొనాథన్ రెనాల్డ్స్‌తో కలిసి దిగిన సెల్ఫీని మంగళవారం శశిథరూర్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. వారిద్దరితో మాట్లాడటం బాగుందని, చాలా కాలంగా నిలిచిపోయిన విదేశీ వర్తక ఒప్పందం చర్చలు పునఃప్రారంభం కావడాన్ని స్వాగతిస్తున్నట్టు రాసుకొచ్చారు. గతంలో తనపై వ్యంగ్య వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకుడు పియూష్ గోయల్‌తో థరూర్ సెల్ఫీ దిగడం చర్చనీయాంశంగా మారింది. థరూర్ ‘విదేశీ యాస’ తనకు అర్థం కావడం లేదంటూ చాన్నాళ్ల క్రితం గోయల్ వ్యంగ్యంగా మాట్లాడారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వీరిద్దరి ‘సెల్ఫీ’ ప్రాధాన్యం సంతరించుకుంది.
థరూర్‌పై హైకమాండ్ కన్నెర్ర
దౌత్యవేత్త నుంచి రాజకీయ నాయకుడిగా మారిన శశిథరూర్ (Shashi Tharoor) తాజాగా కాంగ్రెస్ ప్రత్యర్థులను ప్రశంసించి కష్టాలు కొనితెచ్చుకున్నారు. ఈ నెలారంభంలో కేరళలో పినరయి విజయన్ (Pinarayi Vijayan) నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని మెచ్చుకున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో కేరళ అమలు చేస్తున్న విధానాలు బాగున్నాయని పొగిడారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన, డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ ఫలితాన్ని స్వాగతిస్తూ థరూర్ చేసిన ప్రకటనలు కాంగ్రెస్ అధినాయకత్వానికి ఆగ్రహం తెప్పించాయి. కేరళ కాంగ్రెస్‌లో నాయకత్వ లోటు ఉందని చేసిన వ్యాఖ్యలు హస్తం పార్టీ పెద్దలకు ఏమాత్రం రుచించలేదు. మరో ఏడాదిలో కేరళలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీని ఇరుకున పెట్టేలా వ్యవహరించిన థరూర్‌పై హైకమాండ్ కన్నెర్ర చేసింది.
నా అవసరం లేదంటే చెప్పండి..
ఈ పరిణామాల నేపథ్యంలో శశిథరూర్‌ను కాంగ్రెస్ పార్టీ దూరం పెట్టింది. దీంతో అసంతృప్తిగా ఉన్న ఆయన పార్టీ మారతారన్న ప్రచారం తెరపైకి వచ్చింది. మరోవైపు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో గతవారం ఢిల్లీలో ఆయన నాలుగుసార్లు వ్యక్తిగతంగా భేటీ అయ్యారు. ఎటువంటి సానుకూల సంకేతాలు రాకపోవడంతో తన పట్ల పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై అసంతృప్తిని బహిరంగంగానే వెల్లడించారు థరూర్. ‘పార్టీకి నా అవసరం ఉందని భావిస్తే.. అక్కడే ఉంటాను. పార్టీకి నా సేవలు అవసరం లేదనుకుంటే.. నా పనులు నాకున్నాయి. నాకు ప్రత్యామ్నాయాలు లేవని అనుకోకండి’ అంటూ మీడియా ముఖంగా కుండబద్దలు కొట్టారు. ఈ వ్యాఖ్యలు చేసి 24 గంటలు గడకముందే పియూష్ గోయల్‌తో కలిసి దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి చర్చకు తెరలేపారు థరూర్.
చదవండి: బంగ్లాదేశ్‌కు జైశంకర్ వార్నింగ్
‘ఆప్షన్’ బీజేపీయేనా?
శశిథరూర్ చెప్పినట్టుగా ఆయనకు ఉన్న ‘ఆప్షన్’ బీజేపీయేనా అనే చర్చ మొదలైంది. పార్టీలో తన పాత్ర గురించి కాంగ్రెస్ నుంచి క్లారిటీ రాకపోతే ఆయన కాషాయ కండువా కప్పుకోవడం ఖాయమన్న ఊహాగానాలు విన్పిస్తున్నాయి. అటు వామపక్షాలు కూడా థరూర్‌కు ఆహ్వానం పలుకుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వస్తే ఆయనను అక్కున చేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్న సంకేతాలిచ్చాయి. థరూర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలిగినా ‘కేరళ రాజకీయాల్లో అనాథ కాబోర’ని సీపీఎం సీనియర్ నాయకుడు థామస్ ఐజాక్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో శశిథరూర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని ఆసక్తికరంగా మారింది.
Good to exchange words with Jonathan Reynolds, Britain’s Secretary of State for Business and Trade, in the company of his Indian counterpart, Commerce & Industry Minister @PiyushGoyal. The long-stalled FTA negotiations have been revived, which is most welcome pic.twitter.com/VmCxEOkzc2
— Shashi Tharoor (@ShashiTharoor) February 25, 2025
Comments
Please login to add a commentAdd a comment