భోపాల్‌లో ఇంట్లో ఐటీ సోదాలపుడు అధికారులకు భద్రతగా సీఆర్‌పీఎఫ్ దళం
భోపాల్/న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ సంబంధీకుల ఇళ్లు, ఆఫీస్‌లపై ఆదాయ పన్ను శాఖ దాడుల చేసింది. ఐటీ ఎగవేత, నగదు అక్రమ చలామణి ఆరోపణలపై 200 మంది ఐటీ అధికారులు, పోలీసులు ఢిల్లీ, మధ్యప్రదేశ్‌లో 50 చోట్ల సోదాలు చేశారు. దాడుల్లో లెక్కల్లో చూపని రూ. 14 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఐటీ అధికారులకు భద్రతగా సీఆర్‌పీఎఫ్ బలగాల్ని మోహరించారు. ఇండోర్, భోపాల్, ఢిల్లీలో సోదాల్లో కమల్‌నాథ్ మాజీ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(ఓఎస్డీ) ప్రవీణ్ కక్కడ్, మాజీ సలహాదారు రాజేంద్ర మిగ్లానీ ఇళ్లలో సోదాలు చేశారు.
సీఎం బావమరిది సంస్థ మోసర్ బేయర్, మేనల్లుడు రతుల్ పూరి సంస్థల ఎగ్జిక్యూటివ్‌ల ఇళ్లలో సోదాలు చేశారు. మాజీ కేంద్ర మంత్రి కాంతిలాల్ భూరియాకూ ఓఎస్డీగా ఉన్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో భూరియా రాట్లాం–జాబువా నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు. అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో గత వారం ఈడీ ఢిల్లీలో రతుల్ పూరిని విచారించింది. కోల్‌కతాకు చెందిన వ్యాపారి పరాస్ మల్ లోధా కార్యాలయంలో కూడా దాడులు జరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఐటీ దాడులపై కమల్‌నాథ్ స్పందిస్తూ రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతోనే బీజేపీ రాజకీయంగా ప్రయోజనం పొందేందుకే ఇలాంటి చర్యలకు దిగుతోందని ఆరోపించారు.
భోపాల్‌లో ‘కోల్‌కతా’ డ్రామా
ఐటీ దాడుల సందర్భంగా భోపాల్‌లో కోల్‌కతా తరహా ఘటన చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం ప్రవీణ్ కక్కడ్ సన్నిహితుడు ప్రవీణ్ ఇంటికి పోలీసులొచ్చాక సీన్ సీరియస్‌గా మారింది. పోలీసులను చూడగానే ఐటీ అధికారులు సీఆర్‌పీఎఫ్ సాయంతో ఇంటి తలుపులు మూసేశారు. దీంతో కొద్ది సేపు ఇరు వర్గాలు వాగ్వాదానికి దిగాయి. లోపల సోదాలు కొనసాగుతున్నందునే బయటి వారికి అనుమతించలేదని అన్నారు. తమ చర్యను భోపాల్ పోలీసులు సమర్థించుకున్నారు. ఐటీ దాడులతో తమకేం సంబంధం లేదని, ప్రవీణ్ కుమార్ నివాసంలో ఒకరికి అత్యవసరంగా వైద్యం అందించాలని సమాచారం అందిందని, అందుకే అక్కడికి తమ సిబ్బంది వెళ్లారని భోపాల్ పోలీస్ కమిషనర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment