cash recovered
-
ఫ్రీజ్ చేసిన అకౌంట్లలో రూ.100 కోట్లు
గచ్చిబౌలి : రాష్ట్రవాప్తంగా సైబర్ క్రైం పై వచ్చిన ఫిర్యాదులతో ఫ్రీజ్ చేసిన బ్యాంక్ అకౌంట్లలో రూ.100 కోట్లు ఉన్నాయని, వాటిని త్వరలోనే బాధితులకు అందజేస్తామని సైబర్ క్రైం బ్యూరో ఎస్పీ విశ్వజిత్ కంభంపాటి తెలిపారు. శుక్రవారం సైబరాబాద్ కమిషనరేట్‌లో సైబర్‌క్రైం బాధితులకు రికవరీ నగదును సీపీ స్టీఫెన్ రవీంద్ర చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ విశ్వజిత్ మాట్లాడుతూ సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. త్వరగా ఫిర్యాదు చేస్తే ఆ నగదు వెళ్లిన అకౌంట్‌ను బ్లాక్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామన్నారు. ఆలస్యమైతే నగదు చేతులు మారే అవకాశం ఉందన్నారు. దీంతో బాధితులు నష్టపోయే అవకాశం ఉందని తెలిపారు. సైబర్ నేరగాళ్లు భారీ మొత్తంలో నగదును తీసుకున్నప్పుడు ఆలస్యం అయితే క్రిప్టో కరెన్సీకి మళ్లించే అవకాశం ఉందన్నారు. అలా చేసిన తరువాత రికవరీ చేసే వీలుండదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ క్రైం ఫిర్యాదులతో ఫ్రీజ్ చేసిన బ్యాంక్ అకౌంట్లలో రూ.100 కోట్ల నగదు ఉందని, అన్ని జిల్లాల పోలీసు అధికారులకు సమాచారం అందించామని, త్వరలోనే బాధితులకు అందజేయనున్నట్లు తెలిపారు. డబ్బులు ఇస్తామని ఎరవేసి పాస్ బుక్, డెబిట్ కార్డు, లింక్ చేసిన ఫోన్ నెంబర్ తీసుకుని వేరే అకౌంట్లు తెరచి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని, అలా సహకరించిన వారిపై కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. సైబరాబాద్ డీసీపీ క్రైమ్స్ కల్మేశ్వర్ సింగన్వార్ మాట్లాడుతూ పెట్టుబడి పేరిట మోసాలకు పాల్పడిన కేసులే ఎక్కువగా ఉన్నాయన్నారు. ఆన్లైన్ వెబ్‌సైట్స్, మెసెంజర్, సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలను నమ్మవద్దని సూచించారు. ఇన్వెస్ట్మెంట్ పేరిట మొదట అదనంగా కొంత కలిపి ఇచ్చి నమ్మకం కలిగిస్తారని తెలిపారు. ఎక్కువ మొత్తంలో డబ్బు ట్రాన్స్ఫర్ చేయగానే కంటాక్ట్‌లో లేకుండా పోతారని వివరించారు. సైబర్ నేరాలపై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మూడు, నాలుగు నెలలు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించినట్లు తెలిపారు. 44 కేసుల్లో రూ.2,23,89,575 రికవరీ చేసి బాధితులకు అందజేశామన్నారు. 1930 కాల్ సెంటర్ కేవలం ఫిర్యాదును మాత్రమే స్వీకరిస్తారని ఆ తర్వా కేసు ఏ పోలీస్ స్టేషన్‌కు కేటాయిస్తారో మెసేజ్ వస్తుందన్నారు. కేసు స్టేటస్‌ను ఆయా పోలీస్ స్టేషన్లలోనే అడగాలని సూచించారు. కార్యక్రమంలో సైబర్ క్రైం డీసీపీ రితిరాజ్, ఏసీపీ, సీఐలు పాల్గొన్నారు. డ్రగ్స్ పేరిట బ్లాక్ మెయిల్ మీరు తైవాన్‌కు పంపుతున్న ఫెడెక్స్ ఫార్సిల్లో డ్రగ్స్ ఉన్నాయి. ఫోన్ నెంబర్, ఆధార్‌కార్డు వివరాలతో మీ కు ఫోన్ చేశాం. మేము సీబీఐ అధికారులం మీ పై కేసు నమోదవుతుందని ఓ మహిళను బెదిరించి రూ.10.96 లక్షలు కాజేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సదరు అకౌంట్‌ను ఫ్రీజ్ చేసిన పోలీసులు మొత్తం నగదును రికవరీ చేసి బాధితురాలికి అందజేశారు. పెట్టుబడి పేరిట మోసం గాజుల రామారం ప్రాంతానికి చెందిన యువకుడు మొబైల్ షాపు నిర్వహిస్తున్నాడు. మెసేంజర్‌లో ఇన్వెస్ట్మెంట్ ప్రకటనలు చూసిన అతను మొదట రూ.1000 పంపిస్తే వెంటనే రూ.1200 వచ్చాయి. రెండో సారి రూ.9,900 పంపిస్తే రూ.12600 పంపారు. అనుమానం వచ్చి యువకుడు స్పందించకుంటే వీడియో కాల్స్ చేసి మరింత ఆశ చూపడంతో అప్పు చేసి రూ.2.92,600 పంపాడు. వెంటనే అటువైపు నుంచి ఎలాంటి స్పందనలేకపోవడం మోసపోయినట్లు గుర్తించి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు రూ.1,50,000 రికవరీ చేసి అతడికి అందజేశారు. -
రెజిమెంటల్ బజార్ అగ్నిప్రమాదంలో కొత్త ట్విస్ట్.. రూ.1.65 కోట్ల నగదు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఓ వ్యక్తి ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంతో రూ.1.65 కోట్ల నగదు బయటపడిన ఘటన గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి జరిగింది. ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. రెజిమెంటల్ బజార్లో నివసించే భైరి శ్రీనివాస్ అభిజిత్ ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్లు ఉత్పత్తి చేసే కంపెనీలో డీజీఎంగా పని చేస్తున్నారు. శనివారం రాత్రి 8 గంటల సమయంలో ఆయన ఇంట్లోని గ్రౌండ్ ఫ్లోర్లో అగ్ని ప్రమాదం జరిగింది. అదే సమయంలో శ్రీనివాస్‌తో పాటు కుటుంబ సభ్యులు విశాఖపట్టణంలో ఉన్నారు. స్థానికులు వెంటనే గోపాలపురం పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో వారు వచ్చి మంటలను ఆరి్పవేశారు. గ్రౌండ్ ప్లోర్లోని గదిలో ఉండే పనికిరాని వస్తువులు, కొంత చెక్క సామగ్రి మంటల్లో కాలిపోయాయి. మంటలు పూర్తిగా ఆరిపోయిన తర్వాత రాత్రి 12 గంటల సమయంలో గోపాలపురం పోలీసులకు ఇదే ఇంట్లో కోట్ల రూపాయల నగదు ఉందనే సమాచారం అందింది. ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్‌గౌడ్ ఉన్నతాధికారులకు సమాచారం అందించి ఇంటిని స్థానికులు, పోలీసులతో పాటు బంధువుల సమక్షంలో తెరిచారు. మొదటి అంతస్తులోని బెడ్రూంలో గాలించారు. మంచం కింద, అల్మారా తదితర ప్రాంతాల్లో గాలించగా రూ.1.65 కోట్ల నగదు లభించింది. ఇందులో 50 మాత్రమే రూ.2 వేల కరెన్సీ నోట్లు ఉండగా.. మిగతావి రూ.500, రూ.200 నోట్లు ఉన్నాయి. పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలు, వెండి సామగ్రిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాత్రి 2 గంటల సమయంలో నగదును, ఆభరణాలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. హవాలా నగదేనా? పోలీసులు స్వా«దీనం చేసుకున్న నగదు హవాలా మార్గంలో తరలించేందుకు ఉన్నదేననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఓ కంపెనీలో డీజీఎంగా పనిచేసే వ్యక్తి ఇలా ఇంట్లో ఇంత పెద్ద మొత్తంలో నగదు ఇలా ఉంచుకుంటారా? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. సాధారణంగా డబ్బు ఇంట్లో ఉండే చాలా భద్రంగా దాచుకుంటారు కానీ.. కేవలం బ్యాగుల్లో, అల్మారాలో నిర్లక్ష్యంగా దాచి ఉంచడంతో ఇవి ఎక్కడికైనా తరలించేందుకు దాచిపెట్టి ఉంటారని, తరచుగా ఇలా డబ్బు తరలించే వాళ్లే ఇలా ఉంచుతారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు భైరి శ్రీనివాస్‌కు ఫోన్ చేస్తే దీనికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు తన వద్ద ఉన్నాయని వచి్చన తర్వాత అన్నీ చూపిస్తానని ముక్తసరిగా జవాబిచ్చారు. నగదును ఆదాయ పన్ను శాఖ అధికారులకు స్వా«దీనం చేస్తామని, అన్ని రకాల పత్రాలు పరిశీలించిన తర్వాత సక్రమంగా సంపాదించినది అని తేలితే వారికి అప్పగిస్తారని ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్‌గౌడ్ తెలిపారు. ఆది నుంచీ అనుమానాలే.. భైరి శ్రీనివాస్ 10 ఏళ్లుగా ఇదే ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. గత 6 ఏళ్ల క్రితం తాను ఉండే ఇంటితో పాటు పక్కనే ఉండే మరో ఇల్లు కొనుగోలు చేశారు. ఈ రెండు ఇళ్లు సుమారు రూ.3 కోట్ల విలువ చేస్తాయి. శ్రీనివాస్ స్వస్థలం అయిన వైజాగ్‌లో కూడా గత కొద్ది రోజుల క్రితమే విలువైన ఇల్లు నిర్మించినట్లు స్థానికులు చెబుతున్నారు. అనతికాలంలోనే కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు ఎలా సంపాదించారని స్థానికులు సందేహాలు వెలిబుచ్చుతున్నారు. హవాలా వ్యాపారం చేస్తున్నారా? అనే అనుమానాలు పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. చదవండి: సెల్ నెంబరే కీలకం! -
మధ్యప్రదేశ్‌లో 281 కోట్ల అక్రమ నిల్వలు
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ సంబంధీకుల ఇళ్లు, కార్యాలయాలపై నిర్వహించిన సోదాల్లో రూ.281 కోట్ల విలువైన నగదును అక్రమంగా నిల్వ చేసినట్లు గుర్తించామని ఐటీ అధికారులు చెప్పారు. ఈ నిధుల్ని సేకరించేందుకు విస్తృతంగా వ్యవస్థీకృత రాకెట్ ఒకటి నడుస్తోందని తెలిపారు. ఆదివారం నాటి దాడుల్లో లెక్కల్లో చూపని రూ.14.6 కోట్ల నగదు, మధ్యప్రదేశ్–ఢిల్లీ మధ్య జరిగిన అనుమానిత లావాదేవీలకు సంబంధించిన కంప్యూటర్ ఫైల్స్‌ను జప్తు చేసినట్లు వెల్లడించారు. ఢిల్లీలో తుగ్లక్ రోడ్డులో నివాసముంటున్న ఓ నాయకుడి ఇంటి నుంచి నుంచి ప్రముఖ రాజకీయ పార్టీ ప్రధాన కార్యాలయానికి రూ.20 కోట్లు తరలించినట్లు గుర్తించామని ప్రత్యక్ష పన్నుల కేంద్రీయ బోర్డు(సీబీడీటీ) తెలిపింది. నకిలీ బిల్లుల ద్వారా రూ.242 కోట్లను దోచుకున్నట్లు కనిపెట్టామని పేర్కొంది. -
కమల్‌నాథ్ సంబంధీకులపై ఐటీ దాడులు
భోపాల్/న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ సంబంధీకుల ఇళ్లు, ఆఫీస్లపై ఆదాయ పన్ను శాఖ దాడుల చేసింది. ఐటీ ఎగవేత, నగదు అక్రమ చలామణి ఆరోపణలపై 200 మంది ఐటీ అధికారులు, పోలీసులు ఢిల్లీ, మధ్యప్రదేశ్‌లో 50 చోట్ల సోదాలు చేశారు. దాడుల్లో లెక్కల్లో చూపని రూ. 14 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఐటీ అధికారులకు భద్రతగా సీఆర్పీఎఫ్ బలగాల్ని మోహరించారు. ఇండోర్, భోపాల్, ఢిల్లీలో సోదాల్లో కమల్‌నాథ్ మాజీ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(ఓఎస్డీ) ప్రవీణ్ కక్కడ్, మాజీ సలహాదారు రాజేంద్ర మిగ్లానీ ఇళ్లలో సోదాలు చేశారు. సీఎం బావమరిది సంస్థ మోసర్ బేయర్, మేనల్లుడు రతుల్ పూరి సంస్థల ఎగ్జిక్యూటివ్‌ల ఇళ్లలో సోదాలు చేశారు. మాజీ కేంద్ర మంత్రి కాంతిలాల్ భూరియాకూ ఓఎస్డీగా ఉన్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో భూరియా రాట్లాం–జాబువా నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు. అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో గత వారం ఈడీ ఢిల్లీలో రతుల్ పూరిని విచారించింది. కోల్‌కతాకు చెందిన వ్యాపారి పరాస్ మల్ లోధా కార్యాలయంలో కూడా దాడులు జరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఐటీ దాడులపై కమల్‌నాథ్ స్పందిస్తూ రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతోనే బీజేపీ రాజకీయంగా ప్రయోజనం పొందేందుకే ఇలాంటి చర్యలకు దిగుతోందని ఆరోపించారు. భోపాల్‌లో ‘కోల్‌కతా’ డ్రామా ఐటీ దాడుల సందర్భంగా భోపాల్‌లో కోల్‌కతా తరహా ఘటన చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం ప్రవీణ్ కక్కడ్ సన్నిహితుడు ప్రవీణ్ ఇంటికి పోలీసులొచ్చాక సీన్ సీరియస్‌గా మారింది. పోలీసులను చూడగానే ఐటీ అధికారులు సీఆర్పీఎఫ్ సాయంతో ఇంటి తలుపులు మూసేశారు. దీంతో కొద్ది సేపు ఇరు వర్గాలు వాగ్వాదానికి దిగాయి. లోపల సోదాలు కొనసాగుతున్నందునే బయటి వారికి అనుమతించలేదని అన్నారు. తమ చర్యను భోపాల్ పోలీసులు సమర్థించుకున్నారు. ఐటీ దాడులతో తమకేం సంబంధం లేదని, ప్రవీణ్ కుమార్ నివాసంలో ఒకరికి అత్యవసరంగా వైద్యం అందించాలని సమాచారం అందిందని, అందుకే అక్కడికి తమ సిబ్బంది వెళ్లారని భోపాల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. -
లూటీ సొమ్మును రాబట్టారు..
సాక్షి, రాంచీ : పలము జిల్లాలోని ఓ ప్రైవేట్ బ్యాంక్‌లో సిబ్బందిని బెదిరించి చోరీకి పాల్పడిన దుండగుల నుంచి జార్ఖండ్ పోలీసులు చోరీ సొత్తును రాబట్టారు. పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయిగురి జిల్లాలోని ఓ ఇంటిపై దాడి చేసిన జార్ఖండ్ పోలీసులు బ్యాంకులో లూటీ చేసిన సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ఈనెల 15న పలము జిల్లాలోని ఓ ఏటీఎంలో డిపాజిట్ చేసేందుకు ప్రైవేట్ బ్యాంక్ సిబ్బంది వెళుతుండగా దుండగులు దాడి చేసి రూ 54 లక్షలు దోచుకెళ్లారు. జల్పాయిగురి పోలీసుల సహకారంతో ఫతపుకూర్ ప్రాంతంలోని ఓ గృహంపై జార్ఖండ్ పోలీసులు దాడి చేసి రూ 35 లక్షలను రాబట్టారు. పోలీసులు దాడి చేసే ముందు గృహంలో ఉంటున్న ఇద్దరు వ్యక్తులు పరారయ్యారని పోలీసులు తెలిపారు. -
శుక్రవారం ఒక్కరోజే 3.24 కోట్లు స్వాధీనం
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో పోలింగ్‌కు కొన్ని గంటల ముందు కూడా రాష్ట్రంలో అక్రమంగా తరలిస్తున్న నగదు భారీగా పట్టుబడింది. శుక్రవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా తనిఖీల్లో రూ.3.24 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొళకాల్మూరు వద్ద ఓ స్కార్పియో వాహనంలో రూ.2.17 కోట్లను గుర్తించారు. కోలారు సమీపంలో లారీలో సిమెంట్ సంచుల్లో తరలిస్తున్న రూ.70 లక్షల నగదును జప్తు చేశారు. బాగల్కోట్లో రూ.20 లక్షలు, బెంగళూరు శివారు ప్రాంతంలో రూ.17 లక్షల నగదు పట్టుబడింది. దీంతో ఇప్పటి వరకు పోలీసులు, ఎన్నికల ప్రత్యేక బృందాలు రూ.55 కోట్ల నగదు, సుమారు 8 వేల లీటర్ల మద్యం, సుమారు 100 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నాయి. -
నగదుతో ఏటీఎం వ్యాన్ డ్రైవర్ పరారీ!
బెంగళూరు: పెద్ద నోట్ల రద్దు తర్వాత ఏటీఎంలో డబ్బు పెట్టాల్సిన వ్యాన్ డ్రైవర్లు డబ్బులతో పరారవుతున్నారు. వారం గడవకముందే కర్ణాటకలో మరో వ్యాన్ డ్రైవర్ శనివారం రూ.20 లక్షలతో ఉడాయించాడు. బెంగళూరు పోలీసులు ఆదివారం ఉదయం రెండు వేర్వేరు ప్రాంతాల్లో నగదును స్వాధీనం చేసుకుని, వ్యాన్ ను సీజ్ చేశారు. పోలీసు బృందాలు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసుల కథనం ప్రకారం.. అసోంకు చెందిన సిబ్బిన్ హుసేన్(26) బెంగళూరులో సెక్యూర్ వాల్యూ ఇండియా అనే కంపెనీకి డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఆ కంపెనీ ఏటీఎంలకు డబ్బు తరలించే వ్యాన్లను ప్రొవైడ్ చేస్తుంది. ఈ క్రమంలో శనివారం బెంగళూరు శివారులోని మదివాలా ప్రాంతం నుంచి మధ్యాహ్నం రెండు గంటలకు ఏటీఎం వ్యాన్ లో 52 లక్షలు పెట్టి పంపారు. కొరమంగళ లోని ఏటీఎంలో రూ.2లక్షలు నింపారు. ఆ తర్వాత విండ్ టన్నెల్ రోడ్డులో మరికొన్ని ఏటీఎంలలో 30 లక్షల నగదు పెట్టారు. ఉద్యోగులు నగదు నింపి వచ్చి చూసేసరికి డ్రైవర్ సిబ్బిన్ రూ.20 లక్షల నగదు ఉన్న వ్యాన్ తో పరారయ్యాడు. శనివారం రాత్రి కేసు నమోదు చేసిన పోలీసులు ఆదివారం ఉదయం బెల్లాందుర్ జంక్షన్లో ట్రక్కును గుర్తించామని, రెండు ప్రాంతాల్లో కొంతమేర నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. డ్రైవర్ సిబ్బిన్ హుసేన్ కోసం గాలిస్తున్నట్లు ఓ పోలీస్ అధికారి వివరించారు. -
టీవీ ప్రొడక్షన్ అసిస్టెంట్స్ కార్యాలయంలో చోరీ
బంజారాహిల్స్ (హైదరాబాద్): బంజారాహిల్స్ పరిధిలోని ఇందిరానగర్‌లో తెలుగు సినీ, టీవీ ప్రొడక్షన్ అసిస్టెంట్స్ యూనియన్ కార్యాలయంలో శనివారం చోరీ జరిగింది. యూనియన్ కోశాధికారి బీరువా తాళం టేబుల్‌పైన మరిచి వెళ్లిపోవడంతో... ఓ సభ్యుడు దాంతో బీరువా తాళాలు తెరిచి రూ. 50 వేలు తీసుకొని ఉడాయించాడు. దీనిపై కోశాధికారి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీకి పాల్పడిన సభ్యుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా తానే డబ్బులు తీసుకున్నట్లు ఒప్పుకున్నాడు. రూ.10 వేలు ఖర్చయ్యాయని పేర్కొంటూ మిగతా రూ. 40 వేలను అప్పగించాడు.