నగదుతో ఏటీఎం వ్యాన్ డ్రైవర్ పరారీ!
బెంగళూరు: పెద్ద నోట్ల రద్దు తర్వాత ఏటీఎంలో డబ్బు పెట్టాల్సిన వ్యాన్ డ్రైవర్లు డబ్బులతో పరారవుతున్నారు. వారం గడవకముందే కర్ణాటకలో మరో వ్యాన్ డ్రైవర్ శనివారం రూ.20 లక్షలతో ఉడాయించాడు. బెంగళూరు పోలీసులు ఆదివారం ఉదయం రెండు వేర్వేరు ప్రాంతాల్లో నగదును స్వాధీనం చేసుకుని, వ్యాన్ ను సీజ్ చేశారు. పోలీసు బృందాలు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసుల కథనం ప్రకారం.. అసోంకు చెందిన సిబ్బిన్ హుసేన్(26) బెంగళూరులో సెక్యూర్ వాల్యూ ఇండియా అనే కంపెనీకి డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఆ కంపెనీ ఏటీఎంలకు డబ్బు తరలించే వ్యాన్లను ప్రొవైడ్ చేస్తుంది. ఈ క్రమంలో శనివారం బెంగళూరు శివారులోని మదివాలా ప్రాంతం నుంచి మధ్యాహ్నం రెండు గంటలకు ఏటీఎం వ్యాన్ లో 52 లక్షలు పెట్టి పంపారు.
కొరమంగళ లోని ఏటీఎంలో రూ.2లక్షలు నింపారు. ఆ తర్వాత విండ్ టన్నెల్ రోడ్డులో మరికొన్ని ఏటీఎంలలో 30 లక్షల నగదు పెట్టారు. ఉద్యోగులు నగదు నింపి వచ్చి చూసేసరికి డ్రైవర్ సిబ్బిన్ రూ.20 లక్షల నగదు ఉన్న వ్యాన్ తో పరారయ్యాడు. శనివారం రాత్రి కేసు నమోదు చేసిన పోలీసులు ఆదివారం ఉదయం బెల్లాందుర్ జంక్షన్లో ట్రక్కును గుర్తించామని, రెండు ప్రాంతాల్లో కొంతమేర నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. డ్రైవర్ సిబ్బిన్ హుసేన్ కోసం గాలిస్తున్నట్లు ఓ పోలీస్ అధికారి వివరించారు.