Regimental Bazar Fire Accident Twist Rs 1-Crore Cash Recovered - Sakshi
Sakshi News home page

రెజిమెంటల్ బజార్ అగ్నిప్రమాద ఘటనలో కొత్త ట్విస్ట్..రూ.1.65 కోట్ల నగదు స్వాధీనం

Published Sun, May 14 2023 12:30 PM | Last Updated on Mon, May 15 2023 9:17 AM

Regimental Bazar Fire Accident Twist Rs 1-Crore Cash Recovered - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని ఓ వ్యక్తి ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంతో రూ.1.65 కోట్ల నగదు బయటపడిన ఘటన గోపాలపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శనివారం రాత్రి జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ సాయి ఈశ్వర్‌గౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. రెజిమెంటల్‌ బజార్‌లో నివసించే భైరి శ్రీనివాస్‌ అభిజిత్‌ ఎలక్ట్రికల్‌ ట్రాన్స్‌ఫార్మర్లు ఉత్పత్తి చేసే కంపెనీలో డీజీఎంగా పని చేస్తున్నారు.

శనివారం రాత్రి 8 గంటల సమయంలో ఆయన ఇంట్లోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. అదే సమయంలో శ్రీనివాస్‌తో పాటు కుటుంబ సభ్యులు విశాఖపట్టణంలో ఉన్నారు. స్థానికులు వెంటనే గోపాలపురం పోలీసులు, ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించడంతో వారు వచ్చి మంటలను ఆరి్పవేశారు. గ్రౌండ్‌ ప్లోర్‌లోని గదిలో ఉండే పనికిరాని వస్తువులు, కొంత చెక్క సామగ్రి మంటల్లో కాలిపోయాయి. మంటలు పూర్తిగా ఆరిపోయిన తర్వాత రాత్రి 12 గంటల సమయంలో గోపాలపురం పోలీసులకు ఇదే ఇంట్లో కోట్ల రూపాయల నగదు ఉందనే సమాచారం అందింది.

ఇన్‌స్పెక్టర్‌ సాయి ఈశ్వర్‌గౌడ్‌ ఉన్నతాధికారులకు సమాచారం అందించి ఇంటిని స్థానికులు, పోలీసులతో పాటు బంధువుల సమక్షంలో తెరిచారు. మొదటి అంతస్తులోని బెడ్రూంలో గాలించారు. మంచం కింద, అల్మారా తదితర ప్రాంతాల్లో గాలించగా రూ.1.65 కోట్ల నగదు లభించింది. ఇందులో 50 మాత్రమే రూ.2 వేల కరెన్సీ నోట్లు ఉండగా.. మిగతావి రూ.500, రూ.200 నోట్లు ఉన్నాయి. పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలు, వెండి సామగ్రిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాత్రి 2 గంటల సమయంలో నగదును, ఆభరణాలను పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.  

హవాలా నగదేనా? 
పోలీసులు స్వా«దీనం చేసుకున్న నగదు హవాలా మార్గంలో తరలించేందుకు ఉన్నదేననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఓ కంపెనీలో డీజీఎంగా పనిచేసే వ్యక్తి ఇలా ఇంట్లో ఇంత పెద్ద మొత్తంలో నగదు ఇలా ఉంచుకుంటారా? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. సాధారణంగా డబ్బు ఇంట్లో ఉండే చాలా భద్రంగా దాచుకుంటారు కానీ.. కేవలం బ్యాగుల్లో, అల్మారాలో నిర్లక్ష్యంగా దాచి ఉంచడంతో ఇవి ఎక్కడికైనా తరలించేందుకు దాచిపెట్టి ఉంటారని, తరచుగా ఇలా డబ్బు తరలించే వాళ్లే ఇలా ఉంచుతారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

పోలీసులు భైరి శ్రీనివాస్‌కు ఫోన్‌ చేస్తే దీనికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు తన వద్ద ఉన్నాయని వచి్చన తర్వాత అన్నీ చూపిస్తానని ముక్తసరిగా జవాబిచ్చారు. నగదును ఆదాయ పన్ను శాఖ అధికారులకు స్వా«దీనం చేస్తామని, అన్ని రకాల పత్రాలు పరిశీలించిన తర్వాత సక్రమంగా సంపాదించినది అని తేలితే వారికి అప్పగిస్తారని ఇన్‌స్పెక్టర్‌ సాయి ఈశ్వర్‌గౌడ్‌ తెలిపారు.  

ఆది నుంచీ అనుమానాలే..  
భైరి శ్రీనివాస్‌ 10 ఏళ్లుగా ఇదే ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. గత 6 ఏళ్ల క్రితం తాను ఉండే ఇంటితో పాటు పక్కనే ఉండే మరో ఇల్లు కొనుగోలు చేశారు. ఈ రెండు ఇళ్లు సుమారు రూ.3 కోట్ల విలువ చేస్తాయి. శ్రీనివాస్‌ స్వస్థలం అయిన వైజాగ్‌లో కూడా గత కొద్ది రోజుల క్రితమే విలువైన ఇల్లు నిర్మించినట్లు స్థానికులు చెబుతున్నారు. అనతికాలంలోనే కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు ఎలా సంపాదించారని స్థానికులు సందేహాలు వెలిబుచ్చుతున్నారు. హవాలా వ్యాపారం చేస్తున్నారా? అనే అనుమానాలు పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: సెల్‌ నెంబరే కీలకం! 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement