నన్నూ సోదా చేయండి | PM Modi slams opposition for alleging I-T, ED raids | Sakshi
Sakshi News home page

నన్నూ సోదా చేయండి

Published Sat, Apr 27 2019 3:16 AM | Last Updated on Sat, Apr 27 2019 3:16 AM

PM Modi slams opposition for alleging I-T, ED raids - Sakshi

సిద్ధి /జబల్‌పూర్‌ / వారణాసి/ ముంబై: చట్టం అందరికీ సమానమేనని, తానేమైనా తప్పు చేసి ఉంటే తన ఇంటిని కూడా సోదా చేయవచ్చని మోదీ అన్నారు. ఇటీవలి ఐటీ దాడులు రాజకీయ ప్రేరేపితమంటూ వస్తున్న ఆరోపణలను దృష్టిలో ఉంచుకుని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మధ్యప్రదేశ్‌లోని సిద్ధిలో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో, జబల్‌పూర్‌లో నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. ‘తుగ్లక్‌ రోడ్‌ ఎన్నికల కుంభకోణం’ డబ్బును ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఎన్నికల ప్రచారానికి వినియోగిస్తున్నారని ఆరోపించారు.

మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ సీఎం కమల్‌నాథ్‌ అనుచరుల ఇళ్లపై ఇటీవల జరిగిన ఐటీ దాడులను మోదీ ప్రస్తావించారు.  తప్పుడు పనుల్లో పాలు పంచుకున్నందుకే ఆ దాడులు జరిగాయని పేర్కొన్నారు. ఒకవేళ మోదీ అలాంటి పనులు చేసినట్టు తెలిస్తే ఆయన్నూ వదిలిపెట్టకూడదన్నారు. తుగ్గక్‌ రోడ్డులో ఉండే ఓ కీలక వ్యక్తి నివాసం నుంచి రూ.20 కోట్ల డబ్బు ఢిల్లీలోని ఓ ప్రముఖ రాజకీయ పార్టీ ప్రధానకార్యాలయానికి చేరడాన్ని గుర్తించినట్టుగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చెప్పిందన్నారు.

ఇలాంటి పనులు ఒకవేళ మోదీ కూడా చేస్తున్నట్టైతే ఆయన ఇంటిపై కూడా దాడులు చేయాల్సిందే.. చట్టం అందరికీ సమానమేనని మోదీ అన్నారు. దొంగిలించిన డబ్బును తుగ్లక్‌ రోడ్డులోని ఓ ప్రముఖ కాంగ్రెస్‌ నేత బంగళాకు తరలించారని ఆరోపించారు. అక్కడి నుంచి ‘నామ్‌దార్‌’ (రాహుల్‌ గాంధీ) వద్దకు ఆయన ఎన్నికల ప్రచార వ్యయం కోసం తరలించారని ఆరోపించారు. అధికారంలో ఉండగా ఉగ్రవాదం విషయంలో కాంగ్రెస్‌ అవలంభించిన వైఖరిని మోదీ తప్పుబట్టారు.

ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం ఏ ఒక్క ఉగ్రవాదినీ విడిచిపెట్టదని, వారి స్థావరంలోకి ప్రవేశించి మరీ దాడి చేస్తుందని అన్నారు. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వంపైనా మోదీ విమర్శలు చేశారు. ఎలక్ట్రిసిటీ బిల్లులు సగానికి తగ్గించే పేరిట కమల్‌నాథ్‌ ప్రభుత్వం విద్యుత్‌ కోతలకు పూనుకుందని విమర్శించారు. వాళ్లెలా పని చేస్తారనేందుకు ఇదో ఉదాహరణ అంటూ.. కాంగ్రెస్‌కు ఓటు వేయొద్దని ప్రజలను హెచ్చరించారు. నోట్ల రద్దుపై కాంగ్రెస్‌ విమర్శలను ప్రస్తావిస్తూ.. కొన్ని సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ మెజారిటీ భారతీయులు నోట్ల రద్దుకు మద్దతు పలికారన్నారు.

దేశంలో ప్రభుత్వ అనుకూల గాలి
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొట్ట మొదటిసారి ప్రభుత్వ అనుకూల గాలి కన్పిస్తోందని మోదీ చెప్పారు. దేశంలో ఎన్నికలు ఈ విధంగా జరగడం ఇదే మొదటిసారని అన్నారు. వారణాసిలో నామినేషన్‌ పత్రాలు దాఖలు చేసిన ఆయన అంతకుముందు బీజేపీ బూత్‌ స్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు పండగ వాతావరణం నెలకొందంటూ పార్టీ కార్యకర్తలే నిజమైన అభ్యర్థులని చెప్పారు. వారణాసిలో ఎన్నిక జరిగిపోయిందన్న సంగతి మీడియాకు తెలుసునని, ఇక అన్ని ఎన్నికల రికార్డులను తిరిగిరాయడమే మిగిలి ఉందని మోదీ అన్నారు.  

కాంగ్రెస్‌కు 50 సీట్లు కూడా రావు
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 50 సీట్లు కూడా రావని ముంబైలో నిర్వహించిన ర్యాలీలో మోదీ ఎద్దేవాచేశారు. తన వాదనకు మద్దతుగా ఓ సర్వేను ఆయన ప్రస్తావించారు. బీజేపీకి 2014లో వచ్చిన సీట్లకన్నా ఎక్కువ సీట్లు వస్తాయా..రావా? అన్నదే ఇప్పుడు ప్రశ్న అన్నారు. కాంగ్రెస్‌ హయాంలో పోలీసు దళాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసి పంచింగ్‌ బ్యాగ్‌ల మాదిరి మార్చేశారని విమర్శించారు. ఉగ్రదాడుల నేపథ్యంలో సీఎంలు, హోంమంత్రులను మార్చడమనేది కాంగ్రెస్‌ విధానమని, ఆ సంస్కృతిని తాము మార్చివేశామని చెప్పారు.   
జబల్పూర్‌ బహిరంగ సభలో మోదీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement