నకుల్‌నాథ్, నాథన్ షా
మధ్యప్రదేశ్‌లో మొదట్నించీ కాంగ్రెస్ కంచుకోట చింద్వారా లోక్‌సభ స్థానం. 1957లో అవతరించిన చింద్వారాలో పోలింగ్ ఈ నెల 29న జరుగుతుంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ 1980 నుంచి 2014 ఎన్నికవరకూ ఇక్కడ తొమ్మిదిసార్లు విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఆయన కొడుకు నకుల్‌నాథ్ పోటీచేస్తున్నారు. 1996లో ఓ కోర్టు కేసు కారణంగా కమల్‌నాథ్ పోటీ చేయలేదు. భార్య అల్కానాథ్ కాంగ్రెస్ టికెట్‌పై పోటీచేసి విజయం సాధించారు.
ఈ కేసులో క్లీన్‌చిట్ రావడంతో 1997లో తన భార్యతో రాజీనామా చేయించగా జరిగిన ఉప ఎన్నికలో ఆయన పోటీచేసి బీజేపీ మాజీ సీఎం సుందర్‌లాల్ పట్వా చేతిలో ఓడిపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి ఇదే మొదటిసారి. మళ్లీ 1998 నుంచీ కమల్‌నాథ్ గెలుస్తూ వచ్చారు. 44 ఏళ్ల నకుల్‌నాథ్ ఎన్నికల్లో పోటీచేయడం ఇదే తొలిసారి. 1996లో తన తల్లి అల్కా గెలుపులో ఆయన కీలక పాత్ర పోషించారు. అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో ఆయన ఎంబీఏ చదివారు.
ఎన్నికల అనుభవం లేకున్నా చింద్వారాలో కమల్‌నాథ్ వేసిన పునాదులు నకుల్‌కు ఉపయోగపడతాయి. కిందటి ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థికి బదులు నాథన్ షా కర్వేటీకి బీజేపీ టికెట్ ఇచ్చారు. ఆరెసెస్ నేపథ్యం ఉన్న యువ ఆదివాసీ నేత నాథన్ షా. తొలి నుంచీ నియోజకవర్గ ప్రజల సమస్యలు తీర్చడం, ఢిల్లీలో వారి కోసం 24 గంటలూ పనిచేసే ఆఫీసు ఏర్పాటు చేయడం ద్వారా చింద్వారా ప్రజల్లో కమల్‌నాథ్ తిరుగులేని ఆదరణ సంపాదించారు.
కాంగ్రెస్ గెలుపు సునాయాసమే! చింద్వారా సీటుకు నకుల్ పేరు ఒక్కటే ప్రతిపాదించడం, తండ్రి ముఖ్యమంత్రి పదవిలో ఉండడం, బలహీనమైన బీజేపీ ప్రత్యర్థి బరిలో ఉండడం వంటి కారణాల వల్ల నకుల్ గెలుపు నల్లేరుపై నడకగా వర్ణిస్తున్నారు. చిన్న వయసు నుంచీ తండ్రితోపాటు చింద్వారాలో జరిగే సమావేశాల్లో పాల్గొనడం, సెలవులు ఇక్కడే గడపడంతో నకుల్‌కు ఈ ప్రాంతం కొత్త కాదు. కిందటి డిసెంబర్‌లో తండ్రి ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పటి నుంచీ నకుల్ చింద్వారా వచ్చి కాంగ్రెస్ నాయకులతో సమావేశం కావడం ఎక్కువైంది. నకుల్‌కే కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలనే డిమాండ్ కార్యకర్తల నుంచి వచ్చింది. తండ్రికి సీఎం పదవి దక్కినప్పుడు కొడుకుకు లోక్‌సభ టికెట్ ఇవ్వడం కాంగ్రెస్‌లో కొత్తేమీ కాదు.
Comments
Please login to add a commentAdd a comment