2024 లోక్‌సభ ఎన్నికలకు మొదటి దశ ఓటింగ్ రేపు అంటే శుక్రవారం (ఏప్రిల్ 19) జరగనుంది. దీనికి సంబంధించిన ఎన్నికల ప్రచారం బుధవారం (ఏప్రిల్ 17)తో ముగిసింది. మొదటి దశలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మొత్తం 102 లోక్‌సభ స్థానాలకు ఓటింగ్ జరగనుంది. ఓటర్లు ఈవీఎం యంత్రాలలో అభ్యర్థుల భవితవ్యాన్ని నిక్షిప్తం చేయనున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెల్లడికానున్నాయి.
ఏప్రిల్ 19 న జరగనున్న లోక్‌సభ ఎన్నికల మొదటి దశ ఎన్నికల బరిలోకి దిగిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ), ఎన్‌డిఏ అభ్యర్థులకు ప్రధాని నరేంద్ర మోదీ లేఖలు రాశారు. మొదటి దశ ఓటింగ్‌కు ముందు ప్రధాని ఎన్‌డీఏ అభ్యర్థులను వ్యక్తిగతంగా సంప్రదించారు.
లోక్‌సభ మొదటి దశ పోలింగ్‌లో తమిళనాడులోని మొత్తం 39 స్థానాలు, ఉత్తరాఖండ్‌లోని ఐదు, అరుణాచల్‌ప్రదేశ్‌లోని రెండు, మేఘాలయలో రెండు, అండమాన్ నికోబార్‌లో ఒకటి, మిజోరంలో ఒకటి, పుదుచ్చేరిలో ఒకటి, సిక్కింలోని ఒక స్థానానికి మొదటి దశలో ఎన్నికలు జరగనున్నాయి. తాజాగా లక్షద్వీప్‌లోని ఒక సీటు జత చేరింది. వీటితో పాటు రాజస్థాన్‌లో 12, ఉత్తరప్రదేశ్‌లో ఎనిమిది, మధ్యప్రదేశ్‌లో ఆరు, అసోం, మహారాష్ట్రల్లో ఐదు, బీహార్‌లో నాలుగు, పశ్చిమ బెంగాల్‌లో మూడు, మణిపూర్‌లో మూడు, జమ్మూకశ్మీర్, ఛత్తీస్‌గఢ్, త్రిపురలో ఒక సీటుకు ఎన్నికలు జరగనున్నాయి.
2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈ 102 స్థానాల్లో యూపీఏ 45, ఎన్‌డీఏ 41 స్థానాలు గెలుచుకున్నాయి. నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ 65 స్థానాల్లో, బీజేపీ 60 స్థానాల్లో పోటీ చేయగా, డీఎంకే 24 స్థానాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. రేపు జరగనున్న మొదటి దశ ఎన్నికల్లో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, కిరణ్ రిజిజు, సర్బానంద సోనోవాల్, అర్జున్ రామ్ మేఘ్వాల్, జితేంద్ర సింగ్, బిప్లబ్ దేబ్, నబమ్ టుకీ, సంజీవ్ బల్యాన్, ఎ రాజా, ఎల్ మురుగన్, కార్తీ చిదంబరం, టి దేవనాథ్ తదితరులు పోటీలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment