శ్రీబాగ్ స్ఫూర్తిని మళ్లీ మరిచారా?
మద్రాస్ ప్రెసిడెన్సీలోని రాయలసీమ, ఆం ధ్ర ప్రాంతాలలోని తెలుగువారు, నిజాం ఏలుబడిలోని తెలంగాణ ప్రాంత తెలుగు వారు ఐక్యంగా ఉండి సర్వతోముఖాభివృద్ధి చెందాలని నాటి స్వాతంత్య్ర సమరయోధులు ఆకాంక్షించారు. 1956లో ఈ కల నెర వేరడానికి ముందునుంచే గ్రేటర్ రాయల సీమ వాసులను ఒక భయం వెంటాడుతూ ఉండేది. ఆంధ్రప్రాంతంతో కలిస్తే సీమకు న్యాయం జరగదన్నదే ఆ భయం. ఈ భయాలను నివృత్తి చేయడానికి జరిగిన ప్రయత్నాలలో ఒకటే శ్రీబాగ్ ఒడంబడిక. మద్రాస్‌లో దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావుగారింట ఈ ఒప్పందం జరిగి (నవంబర్ 16, 1937) నేటికి 77 ఏళ్లు. మళ్లీ అనేక పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ చీలిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. నవ్యాంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరి చూస్తే శ్రీబాగ్ ఒడంబడిక గురించి పట్టించుకునే దాఖలాలు కనిపించడం లేదు. సీమకు మళ్లీ అన్యాయమే జరు గుతోందన్న భావన బలపడుతోంది.
బ్రిటిష్ కాలం నుంచి రాయలసీమ ప్రాంతం కోసం ప్రతిపాదిం చిన పథకాలేవీ మోక్షం సాధించలేదు. దాని ఫలితమే సీమవాసుల భయాలు. వీటిని నివృత్తి చేస్తే తప్ప తెలుగువారి మధ్య సఖ్యత సాధ్యం కాదని నాటి పెద్దలు గుర్తించారు. అందుకే శ్రీబాగ్ ఒడం బడిక మీద సంతకాలు చేశారు. ఇవీ అందులో ముఖ్యాంశాలు:
ఆంధ్రులలో సంస్కృతి, సాంఘిక ఐకమత్యం పెంపొందించేం దుకు, వైజ్ఞానిక కేంద్రాలను ఆంధ్రదేశానికంతటికీ ఉపయోగిం చడానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం వాల్తేరులో ఒక కేంద్రాన్ని, అనంతపురంలో ఒక కేంద్రాన్ని అభివృద్ధి పరచాలని, ఇతర కళా శాలలను తత్సంబంధమైన విషయపరిజ్ఞానానికి అనువైన చోట్ల నెలకొల్పవలసినదని ఈ కమిటీవారు అభిప్రాయపడుతున్నారు.
రాయలసీమ, నెల్లూరు జిల్లాలలో వ్యవసాయ, ఆర్థికాభివృద్ధి కోస్తా జిల్లాలతో సరిసమానంగా కలిగించేందుకు పదేళ్ల వరకు అవసరమైతే అంతకంటే ఎక్కువకాలం నీటి పారుదల స్కీము లకు ముఖ్యంగా తుంగభద్ర, కృష్ణా, పినాకిని నీటిని గుర్తించడా నికి పైన పేర్కొన్న జిల్లాల మేలు కోసం ప్రాధాన్యమీయవల సిందని, మేజరు ప్రాజెక్టుల విషయమున కూడా పదేళ్లకాలం ఈ జిల్లాల అభివృద్ధి కోసమే ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాలని, ఎప్పుడైనా పై నదులతోటి పంపకం విషయమై సమస్య తలెత్తి నపుడు, పైన పేర్కొన్న ఈ జిల్లాల అవసరాన్నే మొదట తీర్చా లని, నేటి నుంచి ప్రభుత్వం ఈ విధానం అమలుకు ప్రయత్నిం చాలని ఈ కమిటీవారు తీర్మానించుచున్నారు.
జిల్లాకి ఇంతమంది అని సమాన సంఖ్య కల ప్రాతినిధ్యం శాసన సభలో ఉండాలని ఈ కమిటీవారు అంగీకరిస్తున్నారు.విశ్వవిద్యాలయం, హైకోర్టు, ముఖ్యనగరం- ఈ మూడును ఒక చోటనే చేర్చి ఒక ప్రదేశానికే ప్రాముఖ్యం కల్పించడం కంటే, వేరు వేరు ప్రదేశాలలో అవి ఉండడం బాగుంటుందని ఈ కమిటీవారు తలపోస్తున్నారు. కాబట్టి విశ్వవిద్యాలయం ఉన్న చోటనే ఉండవ చ్చుననీ, హైకోర్టు, ముఖ్య నగరం (రాజధాని) కోస్తాజిల్లా లోనూ, రాయలసీమలోనూ ఉచిత ప్రదేశాలలో ఉండాలని, ఇం దులో తమకు ఏది కావాలో రాయలసీమ వారే కోరుకోవాలని ఈ కమిటీ అభిప్రాయం.
నీరు, రాజధాని విషయంలో సీమవాసుల అభిమతం ముఖ్య మని శ్రీబాగ్ ఒడంబడికలో గుర్తించిన మాటవాస్తవం. కానీ గడచిన 63 ఏళ్లుగా సీమ సేద్యపు నీటి హక్కుల సాధనకు ఉద్యమాలు జరు గుతూనే ఉన్నాయి. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నాయకత్వంలో నీటి పథకాల సాధనకు అనేక పోరాటాలు జరిగాయి. ఆయన ముఖ్య మంత్రి అయినాక జలయజ్ఞం ద్వారా ఈ లోటును, అన్యాయాన్ని సవరించాలని శతథా ప్రయత్నించారు. ఆయన అకాల మరణంతో ఇవన్నీ అటకెక్కాయి. ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రం బద్దలైంది కానీ, సీమ నీటి సమస్యలు పరిష్కారం కాలేదు.కృష్ణా జలాలలో రాయలసీ మకు హక్కు ఎక్కడిదని తెలంగాణ నాయకులు అంటున్నారు. శ్రీశై లం ఎడమగట్టున మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో ప్రాజెక్టు లకు, ప్రత్యేకించి పాలమూరు ప్రాజెక్టుకు నీరు తీసుకువెళతామని తెలంగాణ సీఎం దబాయిస్తున్నారు. శ్రీశైలం నీటి సామర్థ్యం 854 అడుగులు ఉండాలని వైఎస్ జీవో విడుదల చేసినపుడు కోస్తాంధ్ర నేతలు, కాంగ్రెస్ వాదులు కృష్ణా బ్యారేజి దగ్గర రైతులతో కలసి ధర్ణా చేశారు. శ్రీశైలం నీటిని ఎగువన రాయలసీమ ప్రాజెక్టుల ద్వారా వినియోగించుకుంటే కృష్ణా డెల్టా ఎడారి అవుతుందని వీరి వాదన. ఇందులో నేటి సీఎం చంద్రబాబు కూడా పాల్గొన్నారు. ఈ మద్దెల దరువును సీమవాసులు భరించలేకుండా ఉన్నారు.
శ్రీబాగ్ ఒడంబడిక మేరకు ఇప్పుడు రాజధానిని సీమలోనే ఏర్పాటు చేయాలి. కృష్ణాజలాలలో సీమకు తగినవాటా ఇవ్వాలి. కానీ జరుగుతున్నదేమిటి? రాజధాని, విద్య, పరిశ్రమలు కోస్తాంధ్ర లోనే కేంద్రీకరిస్తున్నారు. సోనియా శ్రీకృష్ణ కమిషన్‌ను గౌరవించ కుండా ఆంధ్రప్రదేశ్‌ను విడగొట్టారు. చంద్రబాబు శివరామకృష్ణన్ కమిటీ నివేదికను గాలికి వదిలి అభివృద్ధి చెందిన ప్రాంతంలోనే రాజధాని నిర్మాణం చేపట్టేందుకు మంకు పట్టుపట్టారు. ఇప్పటికైనా శ్రీబాగ్ స్ఫూర్తిని గౌరవించకుంటే, కొత్త ఉద్యమాలు తప్పవు.
(వ్యాసకర్త ‘కదలిక’ పత్రిక సంపాదకులు) ఇమామ్