స్వాతంత్య్రోద్యమంలో శ్రీకాళహస్తికి చెందిన ఉద్యమకారులు చురుగ్గా పాల్గొన్నారు. మహాత్ముడి పిలుపుతో యువకులు ఉద్యోగాలు, వ్యాపారాలు విడిచి కదంతొక్కారు. బ్రిటీష్ దురాగతాలను ఓర్పుతో సహించారు. లాఠీ దెబ్బలు తిన్నారు. కఠిన శిక్షలు ఎదుర్కొన్నారు. ఎన్ని ఇబ్బందులొచ్చినా భావితరాలకు స్వేచ్ఛావాయువులందించాలనే సంకల్పంతో ముందుకు ఉరిమారు. జాతీయనాయకుల అడుగుజాడల్లో నడుస్తూ.. శ్రీకాళహస్తి కీర్తి కిరీటాన్ని ఆసేతు హిమాచలం వరకు వ్యాపింపజేశారు. హర్ ఘర్ తిరంగా.. ఆజాదీకా అమృత్ మహోత్సవాల వేళ నాటి పోరాట పటిమ, త్యాగాలను స్థానికులు స్మరించుకుంటున్నారు. ఉద్యమ స్ఫూర్తిని కొనియాడుతున్నారు.
శ్రీకాళహస్తి: ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి పట్టణం ఎన్నో చారిత్రక ఘట్టాలకు సాక్ష్యం. అఖిల భారత కాంగ్రెస్ ఆవిర్భావం నుంచి భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చే వరకు అనేక ఉద్యమాల పురిటిగడ్డ. స్వాతంత్య్రోద్యమంలో స్థానిక నాయ కులు పసుపులేటి సుబ్బరామదాసు, కలిశెట్టి వెంకటాచలపతి, పసుపులేటి వెంకటప్పయ్య, సుబ్రహ్మణ్యంరెడ్డి, పసుపులేటి సుబ్బమ్మ, పిండి వీరాస్వామి, పవన్ వేణుగోపాల్, పాపాచారి, సామను సుబ్రహణ్యంరెడ్డి, వెంకటేశన్ బాసటగా నిలి చారు. వీరంతా జాతీయ నాయకులు టంగుటూరి ప్రకాశం పంతులు, అనంతశనయం అయ్యంగారి అడుగుజాడల్లో నడిచినట్టు ఉద్యమ నాయకుల వారసులు చెబుతున్నారు.
దళితుల ఆలయ ప్రవేశానికి కృషి
అప్పట్లో మూఢాచారాలు ఎక్కువ. దళితులు, గిరిజనులకు ఆలయ ప్రవేశం నిషిద్ధం. శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన సర్దార్ సుబ్బరామదాసు శిష్యుడు తాళిశెట్టి వెంకటాచలపతి బహదూర్‌పేటలో నివాసముండేవారు. 1944లో టంగుటూరి ప్రకాశం పంతులు, అనంతశయనం అయ్యంగారు శ్రీకాళహస్తికి విచ్చేసి, హరిజన సేవాసంఘాన్ని స్థాపించారు. తాళిశెట్టి వెంకటాచలపతి శ్రీకాళహస్తీశ్వర ఎస్టేట్ కమిటీ సభ్యుని హోదాలో స్వాతంత్య్రోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. విద్యతోనే భవిష్యత్ అనే నినాదంతో అప్పట్లోనే ఎయిడెడ్ పాఠశాలల స్థాపనకు కృషి చేశారు. మహాత్మాగాంధీ పిలుపు మేరకు 1947లో అంబర్ చరకా శిక్షణ కేంద్రాన్ని బహదూర్‌పేటలో ఏర్పాటు చేశారు. ఈయన సేవలకు ప్రకాశం పంతులు చరకా ఉన్న జాతీయ జెండాను బహూకరించారు. ఇది ఇప్పటికీ తాళిశెట్టి వెంకటాచలపతి కుమారుడు రామ్మూర్తి వద్ద ఉంది.
ఉద్యమానికి ఊపిరి పోసిన సుబ్బరామదాసు
శ్రీకాళహస్తికి చెందిన సుబ్బరామదాసు స్థానికంగా జాతీయోద్యమానికి ఊపిరి పోశారు. 1930లో జాతీయ కాంగ్రెస్ వీరాభిమానిగా అస్సాంలోని గౌహతిలో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశానికి శ్రీకాళహస్తి నుంచి కాలినడకన వెళ్లారు. ఈ నేపథ్యంలో అప్పటి జాతీయ కాంగ్రెస్ నాయకులు సుబ్బరామదాసుకు సర్దార్ అనే బిరుదునిచ్చి సత్కరించినట్టు ఆయన కుమారుడు విశ్వనాథం చెబుతున్నారు.
1931లో కల్లు, సారాయి అంగళ్ల వద్ద పికిటింగ్ చేసి అమ్మకూడదని ఉద్యమం చేసినందుకు తన తండ్రికి అప్పట్లో తెల్లదొరలు రూ.24 అపరాధ రుసుం వేసినట్టు తెలిపారు. 1932లో కాంగ్రెస్ ఆదేశానుసారం మద్రాసు బందరువీధిలో విదేశీ వస్త్రాల బహిష్కరణ పికిటింగ్‌లో పాల్గొన్నట్టు చెబుతున్నారు.
1929లో శ్రీకాళహస్తికి మహాత్ముడి రాక
స్వాతంత్య్ర ఉద్యమం ప్రారంభమైన సమయంలో ప్రతి ఒక్కర్నీ ఉద్యమంలోకి ఆహ్వానించేందుకు దేశం మొత్తం గాంధీజీ పర్యటించారు. ఇందులో భాగంగా 1929లో శ్రీకాళహస్తికి విచ్చేశారు. ఆయనకు స్థానిక నాయకులు అడుగడుగునా నీరాజనాలు పలికారు. సమవేశం నిర్వహించేందుకు స్థలం లేకపోవడంతో స్వర్ణముఖి నదిలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. అప్పట్లో స్వర్ణముఖి నదీ తీరం కిక్కిరిసిపోయినట్లు తన తండ్రి చెప్పారని స్థానిక స్వాతంత్య్రోద్యమ నాయకుడు వెంకటాచలపతి కుమారుడు రామ్మూర్తి తెలిపారు.
1957 సంవత్సరంలో శ్రీకాళహస్తి గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు ఇక్కడున్న వీధులకు ఎలాంటి పేర్లు ఉండేవి కావు. ఆపై స్వాతంత్య్రోద్యమంలో భాగంగా నెహ్రూ, గాంధీ, పసుపులేటి సుబ్బరామదాసు తదితరులు వచ్చి సమావేశాలు ఏర్పాటు చేశారు. స్వాతంత్య్ర సమరయోధులు నడయాడిన ఆయా ప్రాంతాలకు వారి పేర్లు పెట్టి స్థానికులు మురిసిపోతున్నారు.
నాయకుల పేర్లతో వీధులు
∙స్వర్ణముఖి నది ఒడ్డున సమావేశాన్ని నిర్వహించడం వల్ల మహాత్మాగాంధీ ఘాట్ అని
∙పసుపులేటి సుబ్బరామదాసు ఉన్న వీధిని సర్దార్ వీధి అని
∙గాంధీ నడయాడిన వీధిని గాంధీ వీధి అని
∙బహుదూర్ పేటలో తాళిశెట్టి వెంకటాచలపతి నివసించే వీధిని తాళిశెట్టి వీధిగా నామకరణం చేశారు. అయితే ఆ తర్వాత ఈ వీధిని కంఠా వీధిగా మార్చేశారు. మళ్లీ తాళిశెట్టి వీధిగా మార్చా లని వెంకటాచలపతి కుమారుడు రామ్మూర్తి అభ్యర్థిస్తున్నారు.
∙1936లో పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ అఖిలభారత కాంగ్రెస్ అధ్యక్షుడి హోదాలో శ్రీకాళహస్తికి వచ్చారు. ఆయన నడయాడిన ప్రదేశాన్ని నెహ్రూవీధిగా, ఆయన శంకుస్థాపన చేసిన భవనానికి గాంధీ భవన్‌గా పిలుస్తున్నారు.
చాలా గర్వంగా ఉంది
మా తండ్రి సుబ్బరామదాసుకు ఐదుగురు పిల్లలు. ఇందులో నలుగురు వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. నేను శ్రీకాళహస్తి పట్టణంలోని ముత్యాలమ్మగుడి వీధిలో నివాసముంటున్నా. స్వాతంత్య్ర సమరయోధు డైన మా తండ్రికి ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఉన్న బీసీ హాస్టల్ ఆవరణలో విగ్రహాన్ని ఏర్పా టు చేశారు. స్వాతంత్య్ర పర్వదినాలప్పుడు ఆ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించడం చాలా గర్వంగా ఉంటుంది.
– విశ్వనాథ్, స్వాతంత్య్రోద్యమ నేత వారసుడు
ఆ జెండాను చూస్తే సెల్యూట్ చేస్తా
మా తండ్రి తాళిశెట్టి వెంకటాచలపతి. మేము శ్రీకాళహస్తి పట్టణం, బహుదూర్‌పేటలో నివాసముండేవాళ్లం. ప్రకాశం పంతులు ఇక్కడకు వచ్చినప్పుడు చరఖాతో ఒడికిన జాతీయ జెండాను మా తండ్రికి బహూకరించారు. ఇది నేటికీ నా వద్దే భద్రంగా ఉంది. స్వాతంత్య్రసమరయోధుని కడుపున పుట్టినందుకు గర్వంగా ఉంది. జెండా చూసినప్పుడు సెల్యూట్ చేయాలని పిస్తుంది.
– రామ్మూర్తి, స్వాతంత్య్రోద్యమ నేత వారసుడు
ఉద్యమాల గడ్డ శ్రీకాళహస్తి
శ్రీకాళహస్తిలోని 29 మంది స్వాతంత్య్ర సమ రయోధుల్లో సర్దార్ రామదాసు, వెంకటప్ప య్య, వెంకటాచలపతి ముఖ్యులు. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన మరో 26 మంది ఉన్నారని సమాచారం. వారిపై పరిశోధనలు చేస్తున్నా.
– దీనదయాళ్, అసిస్టెంట్ ప్రొఫెసర్
అక్కుర్తి.. క్విట్ ఇండియా కీర్తి
1942లో దేశవ్యాప్తంగా క్విట్ ఇండియా ఉద్యమం ఉప్పెనలా సాగుతున్న రోజులవి. అదే ఏడాది ఆగస్టులో బ్రిటీష్ సేనలు ఢిల్లీ నుంచి శ్రీకాళహస్తి మండలంలోని అక్కుర్తి మీదుగా కేరళకు వెళ్తున్నారని తెలుసుకుని వారిని తుదముట్టించాలని నిర్ణయించుకున్నారు. శ్రీకాళహస్తి ప్రాంత ఉద్యమనేతలు పసుపులేటి సుబ్బరామదాసు, కలిశెట్టి వెంకటాచలపతి, వెంకటప్పయ్య తమ అనుచరులతో ప్రత్యేక ప్రణాళికలు రచించారు. తొట్టంబేడు మండలంలోని చోడవరం, శ్రీకాళహస్తి పట్టణంలోని ఎండీ పుత్తూరు, అక్కుర్తి ప్రాంతాలకు చెందిన 32 మందితో కలిసి అర్ధరాత్రి సమయంలో అక్కుర్తి వద్ద రైలు పట్టాలు తెగ్గొట్టారు.
ఆ తర్వాత బ్రిటీష్ సేనలు ప్రయాణిస్తున్న రైలు పట్టాలు తప్పింది. వందలాది మంది సేనలు ప్రాణాలొదిలారు. ఈ ఘటనను బ్రిటీష్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన ఉద్యమకారులు 29 మందిపై కేసులు బనాయించినట్టు స్వాతంత్య్ర సమరయోధుడు సుబ్బరామదాసు కుమారుడు విశ్వనాథందాస్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి చిత్తూరు కోర్టులో విచారణ జరగగా అప్పట్లో సర్దార్ సుబ్బరామదాసు, కృష్ణమ్మకు రెండేళ్లు, పాపాచారి, వెంకటేశన్‌కు ఆరు నెలల జైలు శిక్ష పడినట్టు చెప్పారు. చిత్తూరు జైలు నుంచి తమిళనాడులోని రాయవేలూరు జైలుకు తరలించారు. స్వాతంత్య్రానంతరం సుబ్బరామదాసుకు భారత ప్రభుత్వం 1972లో తామ్ర పత్రం ఇచ్చి సత్కరించింది. ఇది నేటికీ విశ్వనాథం దాస్ ఇంట్లో చూడవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment