దేశానికి బ్రిటీష్ పాలన నుంచి విముక్తి లభించిన రోజు.. భారతీయులు బానిస సంకెళ్లను తెంచుకున్న రోజు.. దేశమంతా స్వేచ్ఛావాయువులు పీల్చుకున్న రోజు.. భరత జాతి ప్రతి ఏటా పండగ జరుపుకుంటోంది. మూడు రంగుల జెండా స్వేచ్ఛగా నింగికెగిసి 75 ఏళ్లు పూర్తవుతోందని చాటుతూ భారత దేశమంతా త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. ఓ వైపు తెల్లదొరల పాలనకు నాటి భవనాలు, కట్టడాలు సాక్ష్యంగా నిలుస్తుంటే, మరో వైపు తొలి రోజుల్లో జరుపుకున్న స్వాతంత్య్ర వేడుకలను పూర్వీకులు స్మరించుకుంటున్నారు.
నగరి(చిత్తూరు జిల్లా): భరతమాత దాస్య శృంఖలాలు తెంచుకొని 75 ఏళ్లవుతోంది. దేశమంతటా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు అంబరాన్ని తాకుతున్నాయి. మనం ఎన్ని పండుగలు ఎంత వైభవంగా జరుపుకున్నా వాటికి మూలం స్వాతంత్య్రమే అనేది ప్రతి ఒక్కరూ గుర్తించాలి. స్వాతంత్య్ర దినోత్సవం వారం రోజుల్లో రానుంది. స్వాతంత్య్రం రాకమునుపు ఆంగ్లేయుల పాలనలో జీవించి, నేటి స్వాతంత్య్ర సంబరాల్లో పాల్గొన్న పెద్దల మనసు ఆనందంతో నిండిపోతోంది. అలనాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. ఆంగ్లేయుల పాలనలో నిర్మించిన కట్టడాలు వారి పాలనకు, స్వాతంత్య్ర సమరయోధుల త్యాగానికి గుర్తుగా నిలుస్తున్నాయి.
రైల్ కమ్ రోడ్ వంతెన
ఆంగ్లేయుల స్వార్థ ప్రయోజనాలకు, దేశ సంపదను కొల్లగొట్టడానికి భారతీయులను కూలీలుగా చేసి నిర్మించిన కట్టడాలు నేటీకి చెక్కు చెదరలేదు. వాటిని మనం వాడుకుంటున్నామంటే అది మనకు స్వాతంత్య్ర సమరయోధుల త్యాగఫలమే. ఇలా నగరి కుశస్థలి నదిపై ఆంగ్లేయుల పాలనలో నిర్మించిన ‘రైల్ కమ్ రోడ్’ వంతెన అలనాటి బ్రిటీష్ పాలనకు సాక్ష్యంగా నిలుస్తోంది. 1880వ సంవత్సరం డల్హౌసి వైస్రాయ్‌గా ఉన్న సమయంలో ఈ వంతెనను నిర్మించారు. ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా నదిపై నిర్మించిన రైల్ కం రోడ్ బ్రిడ్జ్‌గా ఇది పేరుపొందింది. నగరి నుంచి రేణిగుంట వరకు రైలుమార్గం వేసే ప్రక్రియలో భాగంగా ఈ వంతెనను నిర్మించారు. తెల్లరాతి బండలతో 15 స్థూపాలు కలిగిన విధంగా 120 మీటర్ల ఈ వంతెనను నిర్మించారు.
బ్రిటీష్ ఇంజినీర్లు మన దేశానికి చెందిన కూలీలతో ఈ వంతెనను నిర్మించారు. రైలు పట్టాలతో పాటు పక్కనే ఒక కారు వెళ్లేలా వంతెన నిర్మాణం జరిగింది. వంతెన నిర్మాణం ఏడాదిపాటు సాగింది. తొలి వంతెన కావడంతో జనం అదేపనిగా వెళ్లి నిర్మాణాలను వింతగా చూసి వచ్చేవారు. ఈ ట్రాక్‌పై తొలి రైలు వచ్చిన రోజు ఈ ప్రాంతంలో ఒక పండగే జరిగింది. నాడు ఆంగ్లేయులు మన సంపదను తరలించడానికి నిర్మించిన వంతెన నేడు వంతెన నిర్మాణంలో భారతీయులు పడ్డ కష్టానికి 142 సంవత్సరాలుగా ప్రతీకగా నిలుస్తోంది. నాటి తరం వారికి అప్పటి స్వాతంత్య్ర వేడుకలను గుర్తుకు తెస్తోంది. నాటి త్యాగమూర్తులను స్మరించుకొని గుండెల్లో దేశభక్తిని పెంపొందించుకుంటూ చైతన్యవంతులు కావడమే స్వాతంత్య్ర దినోత్సవ లక్ష్యం అంటున్నారు.
సమర యోధుల అనుభవాలు చెప్పేవారు
మా పెదనాన్న వెంకటశేషయ్య స్వాతంత్య్ర సమరయోధులు ఆయనతోపాటు కుమారస్వామి శెట్టి, జానకమ్మ పోరాటంలో ఉండేవారు. ఆగస్టు 15న పాఠశాలలో వేడుకలు జరిగేవి. విద్యార్థులతో పాటు గ్రామ ప్రజలందరూ పాఠశాలకు వచ్చేవారు. విద్యార్థులు జాతీయ నాయకులనుద్దేశించి పాటలు పాడుతూ నాట్యం చేసేవారు. ఝాన్సీ లక్ష్మీబాయి దండయాత్రల నుంచి జాతీయ నాయకులు బ్రిటీష్ వారితో పోరాటం చేసిన గాథలు, వారికి జాతీయ నాయకులతో ఉన్న పరిచయాలు, అరెస్టులు, ఉప్పుసత్యాగ్రహపు అనుభవాల గురించి సమరయోధులు మాకు చెప్పేవారు. వీధుల్లో రేడియోలు పెట్టి ఎర్రకోట వద్ద జరిగే కార్యక్రమాలను రోజంతా వింటూ కూర్చునేవాళ్లం. అది ఒక చక్కటి అనుభూతి.
– ఓ.బాలసుబ్రమణ్యం (85), విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యదర్శి, నగరి.
జెండా కింద పడేయరు
అప్పట్లో స్వాతంత్య్ర దినోత్సవం వస్తే అందరూ కలిసి ముందురోజు రాత్రి ఇంటివద్ద పచ్చిబియ్యం నానబెట్టేవాళ్లం. మరుసటి రోజు ఉదయాన్నే బియ్యంలో బెల్లం కలిపి తీసుకెళ్లి అందరికీ పంచేవాళ్లం. జెండా పండగ అని పిలుచుకునే వాళ్లం. ఆ పండుగ జరుపుకునే సమయంలో అందరిలోనూ దేశభక్తి అధికంగా ఉండేది. జెండాను ఎక్కడా కింద పడేసేవారు కాదు. ప్రతి ఇంటి ముందు రంగుల ముగ్గులు వేసేవారు. జాతీయ నాయకుల ఫొటోలతో ఊరేగింపు జరిగేది. జెండాలో కట్టడానికి, నాయకుల ఫొటోలపై వేయడానికి అందరూ పువ్వులు తెచ్చేవారు.అప్పుడు రోజంతా పండగే. ఇప్పుడు మధ్యాహ్నానికే ముగిసిపోయినట్లు భావిస్తున్నారు. అప్పుడు దేశ ప్రజల్లో ఉండే ఉత్సాహం క్రమంగా తగ్గిపోతోంది.
– విజయులు (87), ఆలపాకం, విజయపురం
పెద్ద పండుగలా చేసేవాళ్లం
స్వాతంత్య్ర దినోత్సవాన్ని జెండా పండుగ అని పిలుచుకునేవాళ్లం. ఆరోజున జెండా ఎగురవేయడానికి పాఠశాలకు వెళ్లేవారం. స్థానికులందరూ రావడంతో పెద్ద ఊరేగింపు జరిగేది. స్వాతంత్య్ర సమరయోధులు స్వాతంత్య్ర సమరంలో వారు ఎదుర్కొన్న కష్టాలను కథలు కథలుగా చెప్పేవారు. గ్రామ ప్రజలందరూ ఇళ్లు కడిగి, ఎర్రమట్టి పెట్టి ముగ్గులు వేసి పెద్ద పండుగలా జరుపుకునేవారు. గ్రామదేవతలకు పూజలు చేసేవారు. మహాత్మాగాంధీకీ జై, వల్లభాయ్‌పటేల్‌కీ జై, జవహర్‌లాల్ నెహ్రూకీ జై .. అంటూ జేజేలు పలుకుతూ వీధుల్లో తిరిగాం. జెండా ఎగురవేసిన అనంతరం మాకు బొరుగులు, టెంకాయ, బెల్లం పంచేవారు. అది అందరితో కలిసి తింటూంటే ఆనందంగా ఉండేది.
– కె.రామచంద్రన్ (80), రిటైర్డ్ ఈవో పంచాయత్, నగరి
ఆ రోజు ఇళ్లపై జెండాలు ఎగురవేశాం
స్వాతంత్య్రం వచ్చే సమయంలో నాకు పెళ్లికూడా అయింది. బ్రిటీష్‌వారు మనకు స్వాతంత్య్రం ఇచ్చి వెళ్లిపోయారంటూ వీధుల్లో యువకులతో పాటు పెద్దలు ఎగిరి గంతులు వేశాం. ఆ సమయంలో మా ఆనందం చెప్పడానికి మాటలు చాలవు. మహిళలు తలస్నానం చేసి ఆలయాల వద్ద దేవుళ్లకు పొంగళ్లు పెట్టాం. వీధులన్నింటినీ ముగ్గులతో అలంకరించాము. అందరూ ఇళ్లపై జెండాలు ఎగురవేశాం. జాతీయ నాయకుల ఫొటోలను, జాతీయ జెండాను ఊరేగింపుగా తీసుకెళ్లాం. ఆ తరువాత కూడా స్వాతంత్య్ర దినోత్సవం ఐకమత్యానికి ప్రతీకగా నిలిచేది.
– మునెమ్మ(101), గొల్లపల్లి, పుత్తూరు మండలం
Comments
Please login to add a commentAdd a comment