స్వరాజ్య పోరులో గర్జించిన మన్యం | Tribal Freedom Fighters Museum in Chintapalli | Sakshi
Sakshi News home page

స్వరాజ్య పోరులో గర్జించిన మన్యం

Published Mon, Aug 14 2023 3:16 AM | Last Updated on Mon, Aug 14 2023 10:12 AM

Tribal Freedom Fighters Museum in Chintapalli - Sakshi

యిర్రింకి ఉమామహేశ్వరరావు, సాక్షి ప్రతినిధి :  అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం తాజంగిలో గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూ­జియం (టీఎఫ్‌ఎఫ్‌ఎం) నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. స్వరాజ్య పోరాటంలో గర్జించిన మన్యం మొనగాళ్ల చరిత్రను ఈ మ్యూజియం భావితరాల కళ్ల ముందు ఉంచనుంది. గిరిజన పోరాట యోధుల చరిత్రతోపాటు గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు తెలియజేసి స్ఫూర్తి నింపే సంకల్పంతో దీనిని నిర్మిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి నిర్మాణం పూర్తి చేసేలా లక్ష్యం నిర్దేశించుకున్నారు.

రూ.35 కోట్ల వ్యయంతో ఈ మ్యూజియంను నాలుగు జోన్లు(భాగాలు)గా నిర్మిస్తున్నారు. బ్రిటిష్‌ పూర్వ యుగం, బ్రిటిష్‌ పాలన, స్వాతంత్య్ర పోరాటం(తిరుగుబాటు), బ్రిటిష్‌ వాళ్లు పలాయనం (స్వాతంత్య్రం తర్వాత) అనే నాలుగు ప్రధాన విభాగాలుగా గిరిసీమ చరిత్రను భావితరాలకు అందించే గొప్ప ప్రయత్నానికి ఈ మ్యూజియం వారధిగా నిలవనుంది.

మన్య సీమతో పెనవేసుకున్న ఖోండ్‌ తిరుగుబాటు (1835–37), సవరా తిరుగుబాటు (1853), లాగరాయ్‌ పితూరి (1914–16), మన్యం (రంప) తిరుగుబాటు(1922–24), మూకదొర తిరుగుబా­టు (1924–26), చెంచు తిరుగుబాటు(1938)తోపాటు తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లకు చెందిన గిరిజన తిరుగుబాట్లకు సంబంధించిన ఘట్టాలకు ఈ మ్యూజియం నెలవు కానుంది. 

గాండ్రించిన మన్యసీమ 
స్వాతంత్య్ర పోరాటంలో మన్యసీమ కేంద్రంగా గాండ్రించిన మొనగాళ్ల చరిత్రతోపాటు అనేక వీరోచిత ఘట్టాలు ఈ మ్యూజియంలో కొలువుదీరనున్నాయి. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుతోపాటు గిరిజన యోధులు మల్లు దొర, గంటం దొర విగ్రహాలను మ్యూజియంలో నెలకొల్పనున్నారు. బ్రిటిష్‌ పాలకులను గడగడలాడించిన గిరిజన పోరాట ఘట్టాలకు సంబంధించిన పూర్తి వివరాలను అందుబాటులోకి తెస్తారు.

గిరిజనుల జీవన విధానం, గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన అంశాలను కళాఖండాలుగా ఏర్పాటు చేస్తారు. మ్యూజియం గోడలు, పైకప్పుపై గిరిజన కళాకృతులను ఏర్పాటు చేస్తారు. నాటి గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల చరిత్రను సందర్శకుల కళ్లకు కట్టినట్టు వివరించడానికి 300 మంది కూర్చోని వీక్షించేలా డిజిటల్‌ థియేటర్‌ నిర్మిస్తున్నారు. ట్రైబల్‌ థీమ్‌ హట్‌తో కూడిన రెస్టారెంట్, ఓపెన్‌ థియేటర్, స్వాగత ప్లాజా నిర్మిస్తున్నారు. 

చరిత్రను పదిలం చేసే పనులు షురూ.. 
మ్యూజియం నిర్మాణం పనులు వేగవంతం చేయడంతోపాటు గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన చరిత్రను పదిలం చేసే పనులు ఊపందుకున్నాయి. ఇందుకు సంబంధించి గత నెల 18న అల్లూరి జిల్లా సీతంపేట ఐటీడీఏలో ఒకరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ప్రతి ఐటీడీఏ పరిధిలోని అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ (ఏపీఓ), వ్యవసాయ అధికారి, ఉద్యాన అధికారులు, పశు సంవర్ధక శాఖ, జిల్లా పర్యాటక అధికారి, ఉప విద్యా అధికారి, గిరిజన ఉపాధ్యాయులు, వెలుగు సొసైటీ సభ్యులు, గిరిజన తెగల గ్రామ స్థాయి కమిటీల సమన్వయంతో చారిత్రక ఆధారాలను సేకరించేలా సమాయత్తం చేశారు. మన్యం కేంద్రంగా సాగిన స్వాతంత్య్ర సమరానికి సంబంధించిన ఆధారాలు, గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన సామగ్రిని సేకరించేలా దిశానిర్ధేశం చేశారు.  

గిరిజన జీవన విధానానికి అద్దం పట్టేలా.. 
గిరిజన కళాఖండాలు, వస్తువులు, నమూనాలు రెండేసి చొప్పున సేకరించి ఒకటి మ్యూజియంకు, మరొకటి స్థానికంగా ఐటీడీఏలలో భద్రపరిచేలా నిర్ణయం తీసుకున్నారు. ప్రతి గిరిజన తెగకు సంబంధించిన వస్తువుల (కళాఖండాలు) జాబితాను సిద్ధం చేయనున్నారు. వాటిని వీలైనంత పెద్ద సైజులో ఫొటోలు తీయిస్తారు. వస్తువులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరిస్తారు.

గిరిజనులు ఉపయోగించిన నీటి కుండలు, సీసా పొట్ల కాయలు, సంగీత పరికరాలు, చేపలు పట్టే సామగ్రి, వేటకు వాడిన ఉచ్చులు, నూనె వెలికితీత యంత్రాలు, చెక్క ఇల్లు, గుళిక విల్లు, విల్లు, బాణాలు, వ్రస్తాలు, ఆభరణాలు (పూసల తదితర లోహాలతో కూడిన నగలు), వ్యవసాయ పనిముట్లు, పరికరాలు సేకరిస్తారు. గిరిజన జాతరలు, పండుగలు, మౌఖిక సంప్రదాయాలు, పాటలు, దేవుళ్లు, దేవతలు, సంప్రదాయ నిపుణులు, వివాహ తంతు, స్మారక స్తంభాలు, చెక్క క్రాఫ్ట్, కుండలు, ఇనుప వస్తువులు, ముసుగులకు సంబంధించిన అనేక వస్తువులు, సవివరమైన చరిత్రను అందుబాటులోకి తెస్తారు.  

గత ప్రభుత్వం పట్టించుకోలేదు 
ఆంధ్రప్రదేశ్‌కు మంజూరైన గిరిజన మ్యూజియం నిర్మాణాన్ని గత ప్రభుత్వం పట్టించుకోలేదు. 2017 నుంచి కనీసం భూమిని కూడా కేటాయించకపోడంతో దీని నిర్మాణం చేపట్టలేదు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం వైఎస్‌ జగన్‌ మ్యూజియం నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.

ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ శాఖల సమన్వయంతో భూ కేటాయింపు సమస్యను సీఎం వైఎస్‌ జగన్‌ కొలిక్కి తెచ్చారు. 2021లో చింతపల్లి మండలం తాజంగిలో 21.67 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడంతో నిర్మాణ పనులకు లైన్‌ క్లియర్‌ అయ్యింది. రాష్ట్రం గర్వించే స్థాయిలో గిరిజన స్వాతంత్య్ర పోరాట యోధుల మ్యూజియం తాజంగిలో రూపుదిద్దుకుంటోంది.   – పీడిక రాజన్నదొర, ఉప ముఖ్యమంత్రి 

శరవేగంగా నిర్మిస్తున్నాం 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశాలతో యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తోంది. నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలనే తపనతో ఉన్నాం. కేంద్ర గిరిజన సంక్షేమ మంత్రిత్వ శాఖ దేశంలోని 10 రాష్ట్రాలకు గిరిజన స్వాతంత్ర పోరాట యోధుల మ్యూజియాలను మంజూరు చేసింది.

జార్ఖండ్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, మిజోరాం, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మణిపూర్, గోవాలకు మొత్తం రూ.120 కోట్లు కేటాయించింది. వాటిలో మన రాష్ట్రానికి రూ.15 కోట్లు మంజూరు చేయగా.. రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లతోపాటు  21.67 ఎకరాల భూమిని కేటాయించింది.  – కాంతిలాల్‌ దండే, కార్యదర్శి, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement