భీమవరంలో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, ప్రముఖులు
భీమవరం(ప్రకాశం చౌక్)/కొమ్మాది: ‘అల్లూరి సీతారామరాజు ఒక మహోన్నత శక్తి. ఆయన పోరాటం ఆదర్శనీయం. ఆయన తెలుగువారు, మన ప్రాంతంవారు కావడం మన అదృష్టం. మనందరికీ గర్వకారణం’ అని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు, ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు 126వ జయంతి వేడుకలను పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని అల్లూరి స్మృతివనంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు.
రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి శ్రీనివాçసరాజు (వాసు) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశానికి బానిస సంకెళ్ల నుంచి విముక్తి కల్పించి స్వేచ్ఛను ప్రసాదించడం కోసం, గిరిజనుల హక్కుల కోసం అల్లూరి చేసిన పోరాటాలు బ్రిటీష్ పాలకుల గుండెల్లో దడ పుట్టించాయని కొనియాడారు.
క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి శ్రీనివాసరాజు మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేకంగా అల్లూరి స్మృతివనం, కాంస్య విగ్రహం ఏర్పాటుపై చొరవ చూపారని, రూ.20 కోట్ల విలువైన భూమిని కేటాయించడంతోపాటు 125వ జయంతి వేడుకలకు రూ.10 కోట్ల నిధులు కూడా అందించారని చెప్పారు. ఎమ్మెల్సీలు వంక రవీంద్రనాథ్, జయమంగళ వెంకటరమణ, కవురు శ్రీనివాస్, ఎమ్మెల్యే మంతెన రామరాజు, జెడ్పీ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ,, డీసీసీబీ చైర్మన్ పీవీఎల్ నరసింహరాజు, సీనియర్ నాయకులు గోకరాజు గంగరాజు, గూడూరి ఉమాబాల పాల్గొన్నారు.
అల్లూరి లేకపోతే మన్యం లేదు : రాజన్నదొర
మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు లేకపోతే నేడు మన్యం ప్రాంతం ఉండేది కాదని, ఆయన పోరాటం వల్లే గిరిజనుల జీవన విధానం దెబ్బతినకుండా నేటికీ కొనసాగుతోందని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. అల్లూరి 126వ జయంతి వేడుకలను రుషికొండలోని గిరిజన సాంస్కృతిక పరిశోధన శిక్షణ భవన్‌లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. అల్లూరి ప్రధాన అనుచరులు గాం గంటందొర, గాం మల్లుదొర విగ్రహాలను అరకు ఎంపీ మాధవి, విశాఖ మేయర్ జి.హరివెంకటకుమారితో కలసి రాజన్నదొర ఆవిష్కరించారు.
ఆయన మాట్లాడుతూ దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో గిరిజన విద్యాభివృద్ధికి సీఎం జగన్ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోందని చెప్పారు. ఎంపీ మాధవి మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం అల్లూరి పోరాటం చిరస్మరణీయమన్నారు. జెడ్పీ చైర్‌పర్సన్ సుభద్ర, గిరిజన కో–ఆపరేషన్ చైర్‌పర్సన్ శోభా స్వాతిరాణి, డైరెక్టర్ రవీంద్రబాబు, ఈడీ చిన్నబాబు, నాగరాజు పాల్గొన్నారు.
అల్లూరి స్మృతివనం ప్రారంభించిన రాష్ట్రపతి
అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల ముగింపు కార్యక్రమం హైదరాబాద్‌లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అక్కడి నుంచే ఆమె భీమవరంలో అల్లూరి స్మృతివనాన్ని వర్చువల్ విధానంలో ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment