హుకుంపేట (అల్లూరి సీతారామరాజు జిల్లా): చంద్రబాబు సభకు ఆటోల్లో ప్రజలను తరలించిన డ్రైవర్లకు కిరాయి డబ్బులు చెల్లించకపోవడంతో వారు ఆందోళనబాట పట్టారు. టీడీపీ నేతల తీరును నిరసిస్తూ అల్లూరి సీతారామరాజు జిల్లా బాకురులో ఆటో యూనియన్ల ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన చేపట్టారు. బాకూరు, ఉప్ప, చీకుమద్దుల, అండిభ, పంచాయతీల పరిధిలోని ఆటో డ్రైవర్లు రోడ్డెక్కారు. గతల నెల 20న అరకులో జరిగిన ‘రా కదలి రా’ సభకు జనాలను తరలించేందుకు ఒక్కొక్క ఆటోకు రూ.2,500 ఇస్తామని నేతలు ఒప్పందం చేసుకున్నారు.
అయితే, ముందుగా కొంతమందికి మాత్రమే రూ.500 అడ్వాన్స్ ఇచ్చారని, మరికొందరికి ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ఒకేసారి ఇస్తామంటూ ఆటోలను సభకు తరలించారని పలువురు ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తంచేశారు. బాకురు, అండిభ యూనియన్ల పరిధిలో సుమారు 60 ఆటోలు, ఉప్ప ప్రాంత యూనియన్ నుంచి సుమారు 50 ఆటోలను మొత్తం 110 ఆటోల్లో ప్రజలను సభకు తీసుకువెళ్లామని వాపోయారు.
సభ జరిగి రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు తమకు కిరాయిలు చెల్లించకుండా టీడీపీ నేతలు తప్పించుకు తిరుగుతున్నారని మండిపడ్డారు. సభ జరిగే రోజు తమ ప్రాంతంలో సంత ఉంటుందని చంద్రబాబు సభకు వెళ్లకుండా అక్కడే టికెట్ సరీ్వసు చేసుకుంటే సుమారు రూ.3వేల వరకు సంపాదించుకుని ఉండేవారమని వారు లబోదిబోమంటున్నారు. కిరాయిలు ఇవ్వకపోతే ఓట్ల కోసం తమ గ్రామాలకు వచ్చే టీడీపీ నాయకులను అడ్డుకుంటామని
హెచ్చరించారు.
ఊరుకునేది లేదు..
రోజు మా కుటుంబ పోషణ నిమిత్తం ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాం. కిరాయి డబ్బులు ఇస్తామని చంద్రబాబు సభకు తీసుకువెళ్లారు. ఇప్పుడు డబ్బులు ఇవ్వకుండా తప్పించుకుతిరుగుతున్నారు. కిరాయి డబ్బులు చెల్లించకపోతే ఊరుకొనేది లేదు.
– దూసురు వెంకట రమణ,ఆటో యూనియన్ అధ్యక్షుడు, అండిభ, హుకుంపేట మండలం
మా పొట్ట కొడితే ఎలా?
నాది పేద కుటుంబం. అమ్మా నాన్న కూలి చేస్తేనే తప్ప కడుపు నిండదు. రోజు ఎంతో కష్టపడితే గాని నాలుగు వేళ్లు నోటికి వెళ్లవు. ఆటో ద్వారా వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తున్నాం. సభలకు జనాలను తరలించేటప్పుడు అడ్వాన్సులు అడిగితే అన్నీ కలిపి ఒకేసారి ఇస్తామంటూ ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.
– సంతోష్, ఆటో డ్రైవర్, చట్రాయిపుట్టు
Comments
Please login to add a commentAdd a comment