మొగలుల సామ్రాజ్యం పతనమయ్యాక 1707 నుంచి ఆంగ్లేయుల రాక ప్రారంభమైంది. ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారం నెపంతో వచ్చి రాజకీయ పెత్తనం చెలాయించింది. తొలి స్వాతంత్య్ర సమరాన్ని(1857) అణచివేసిన తర్వాత 1858 నుంచి భారత ఉప ఖండం యావత్తూ పూర్తిగా బ్రిటిష్ వలస పాలనలోకి వెళ్లిపోయింది. 1947 వరకు సాగిన ఈ పరాయి దోపిడీ పాలనలో మన దేశ వ్యవసాయ రంగం అస్థవ్యస్థమైంది. బ్రిటీష్ వారు వచ్చే నాటికి భూమి ప్రైవేటు ఆస్తిగా లేదు. జమిందారీ, రైత్వారీ పద్ధతులను ప్రవేశపెట్టి రైతుల నుంచి పన్నులు వసూలు చేశారు.
జనజీవనం కరువు కాటకాలతో చిన్నాభిన్నం అవుతూ ఉండేది. 1800 – 1900 మధ్య కాలంలో 4 దఫాలుగా విరుచుకు పడిన భీకర కరువుల వల్ల 2.14 లక్షల మంది చనిపోయారని గణాంకాలు తెలియజేస్తున్నాయి. వ్యవసాయాన్ని మెరుగుపరచడానికి, గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం ఏమేమి చర్యలు తీసుకోవాలో తెలుసుకోవడం కోసం 1880, 1898, 1901 సంవత్సరాలలో వరుసగా 3 కరువు కమిషన్లను నియమించారు. 1903లో నీటిపారుదల కమిషన్, 1915లో సహకార కమిటీలు చేసిన సిఫార్సులతో ఆయా రంగాల్లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. 1920 నాటికి భూమి వ్యక్తిగత ఆస్తిగా మారింది.
భారతదేశ వ్యవసాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ స్థితిగతుల అధ్యయనానికి 1926లో ‘రాయల్ కమిషన్’ ఏర్పాటైంది. ‘దేశానికి ఆహార విధానం అంటూ ఏదీ లేదు. అంతేకాదు, అలాంటిదొకటి అవసరమనే స్పృహ కూడా అప్పటికి లేద’ని అప్పటి భారత ఉప ఖండం స్థితిగతులపై రాయల్ కమిషన్ వ్యాఖ్యానించింది.
1928లో నివేదిక సమర్పించే నాటికి.. మొత్తం జనాభాలో పట్టణ జనాభా దాదాపు 11 శాతం మాత్రమే. కమ్యూనికేషన్ వ్యవస్థ లేదు. రోడ్లు, రవాణా సదుపాయాలు చాలా తక్కువ. చాలా గ్రామాలు స్వీయ సమృద్ధæయూనిట్లుగా పనిచేస్తూ, తమ అవసరాలన్నిటినీ ఉన్నంతలో తామే తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నాయని కమిషన్ పేర్కొంది. భౌగోళికంగా ఇప్పటి మన దేశంతో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్‌లతో కూడిన మొత్తం ‘బ్రిటిష్ ఇండియా’ ప్రాంతానికి సంబంధించి రాయల్ కమిషన్ నివేదించిన విషయాలివి.
8 కోట్ల ఎకరాలకు పైగా వరి.. 2.4 కోట్ల ఎకరాల్లో గోధుమ.. 3.3 కోట్ల ఎకరాల్లో జొన్న, సజ్జ తదితర చిరుధాన్యాలు.. 1.8 కోట్ల ఎకరాల్లో పత్తి, 1.4 కోట్ల ఎకరాల్లో నూనెగింజలు, 1.4 కోట్ల ఎకరాల్లో పప్పుధాన్యాలు సాగవుతున్నాయని కమిషన్ పేర్కొంది.
‘పశువులకు ప్రపంచంలో ఏ దేశంలో లేనంత ప్రాధాన్యత భారతదేశంలో ఉంది. పశువులు లేకుండా ఇక్కడ వ్యవసాయాన్ని ఊహించలేం. పాడి కోసం, ఎరువు కోసమే కాకుండా.. దుక్కికి, సరుకు రవాణాకు కూడా పశువులే ఆధారంగా నిలుస్తున్నాయి. 1924–25 నాటికి దేశంలో ఆవులు, ఎద్దులు, గేదెలు, దున్నలు 15.1 కోట్లు, మేకలు, గొర్రెలు 6.25 కోట్లు, గుర్రాలు, గాడిదలు 32 లక్షలు, ఒంటెలు 5 లక్షలు ఉన్నాయని రాయల్ కమిషన్ తెలిపింది. భారతీయ వ్యవసాయ రంగం అభివృద్ధికి లార్డ్ కర్జన్ సారధ్యంలోని బ్రిటిష్ ప్రభుత్వం చేసిన కృషి శ్లాఘనీయమని రాయల్ కమిషన్ వ్యాఖ్యానించింది.
1903 జూన్ 4న బీహార్, దర్భాంగా జిల్లాలోని పూసలో జాతీయ వ్యవసాయ విద్య, పరిశోధనా స్థానం ఏర్పాటుకు ఉత్తర్వులిచ్చారు. పూస ఎస్టేట్‌లో దేశీ పశు సంపదపై పరిశోధనా స్థానాన్ని కూడా పెట్టించారు. ఆ క్రమంలోనే భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి ఏర్పాటైంది. దేశవ్యాప్తంగా తొలి దశలో 1924కు ముందే 5 వ్యవసాయ కళాశాలలు ఏర్పాటయ్యాయి. పాడి, పంటలతో గ్రామం స్వయం పోషకత్వం కలిగి వుండేది. వ్యవసాయానికి ఉపాంగాలుగా వృత్తి పరిశ్రమలు వుండేవి. బ్రిటిష్ పారిశ్రామిక విప్లవం మన వృత్తులను దెబ్బతీసింది. బ్రిటన్‌లో పరిశ్రమల అభివృద్ధికి ముడిసరుకు కోసం ఇక్కడ వ్యాపార పంటలను ప్రోత్సహించారు. వ్యవసాయంతో పాటు కుటీర పరిశ్రమలను బ్రిటిష్ పాలకులు చావు దెబ్బతీశారు.
దేశీ పత్తి పంట సాగు, కుటుంబ పరిశ్రమగా చేనేత వస్త్రాల తయారీలో భారతీయ గ్రామాలు స్వయం సమృద్ధి సాధించాయి. మస్లిన్స్, కాలికోస్ వంటి మేలు రకాల వస్త్రాలను ప్రపం^è దేశాలకు ఎగుమతి చేసిన వెయ్యేళ్ల చరిత్ర మనది. అటువంటిది బ్రిటిష్ పాలనలో తల్లకిందులైంది. బ్రిటన్‌లో యంత్రాలకు పొడుగు పింజ అమెరికన్ పత్తి అవసరం. అందుకని, మన దేశంలో దేశీ పత్తికి బదులు అమెరికన్ రకాలను సాగు చేయించి, పత్తిని బ్రిటన్‌కు ఎగుమతి చేయటం.. అక్కడ యంత్రాలపై ఉత్పత్తి చేసిన వస్త్రాలను దిగుమతి చేసి మన దేశంలో అమ్మటం.. ఇదీ బ్రిటిష్ పాలకులు స్వార్థంతో చేసిన ఘనకార్యం. దీని వల్ల మన దేశీ పత్తి వంగడాలు మరుగునపడిపోయాయి. చేనేత పరిశ్రమ చావు దెబ్బ తిన్నది. ఆహార ధాన్యాలు పండించే పొలాలు కూడా అమెరికన్ పత్తి సాగు వైపు మళ్లాయి.
1928 తర్వాతి కాలంలో దేశం రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాలతో పాటు వ్యవసాయం, నీటిపారుదల రంగాలు కూడా విస్తారమైన మార్పులకు గురయ్యాయి. 1757లో 16.5 కోట్లున్న దేశ జనాభా 1947 నాటికి 42 కోట్లకు పెరిగింది. పెరిగిన జనాభాకు తగినట్లుగా ఆహారోత్పత్తిని పెంచడానికి నీటిపారుదల సదుపాయాలను బ్రిటిష్ ప్రభుత్వం 8 రెట్లు పెంచింది. పంజాబ్, సిం«ద్ ప్రాంతాల్లో భారీ ఎత్తున నీటిపారుదల సదుపాయం కల్పించారు. అదేవిధంగా, కృష్ణా, గోదావరి డెల్టాను సస్యశ్యామలం చేసేందుకు సర్ ఆర్థర్ కాటన్ ఆధ్వర్యంలో ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజ్‌లను నిర్మించారు. 1920 తర్వాత పెద్దగా కరువు పరిస్థితుల్లేకపోవటంతో ఆహారోత్పత్తి కుదుటపడింది. అయినా, 1943లో 3 లక్షలకు పైగా బెంగాలీయులు ఆకలి చావులకు బలయ్యారు. ప్రకృతి కరుణించక కాదు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో విన్‌స్టన్ చర్చిల్ తీసుకున్న నిర్ణయాల వల్ల కృత్రిమ ఆహార కొరత ఏర్పడి ప్రజలు పిట్టల్లా రాలిపోయారు. దీనికి మించిన విషాదం ఆధునిక భారతీయ చరిత్రలో మరొకటి లేదు.
Comments
Please login to add a commentAdd a comment