స్వాతంత్య్ర సమరయోధుడి పేరిట నిరుపేద నివాసం ఉంటున్న భూమిని కొట్టేసేందుకు యత్నాలు
అనుమతులిచ్చేందుకు ఆగమేఘాలపై కదిలిన యంత్రాంగం
విలువైన భూమిని కట్టబెట్టేందుకు పంచాయతీ పాలకవర్గం ససేమిరా అంటున్నా పట్టించుకోని అధికారులు
పాలకొల్లు అర్బన్ : ‘నాకు కళ్లు కనిపించడం లేదు. షుగర్, బీపీ ఎక్కువగా ఉన్నాయట. అవి తగ్గితేగాని కంటికి ఆపరేషన్ చేయనంటున్నారు. చాలా కాలం నుంచి ఈ భూమిని సాగు చేసుకుని బతి కేవాళ్లం. ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రభుత్వ సహాయంతో ఈ స్థలంలో ఇల్లు కట్టుకుని ఉంటున్నాం. ఈ నీడ కూడా లేకుండా చేయాలని చూస్తున్నారు’ దళిత కుటుంబానికి చెందిన రైతు నిడుమోలు సుబ్బారావు (సుబ్బన్న) భార్య పార్వతి ఆవేదన ఇది. పాలకొల్లు రూరల్ పంచాయతీ పందిగుంట వెళ్లే రోడ్డులో ఆ దంపతులు నివాసం ఉంటున్నారు. ఆర్‌ఎస్ నంబర్ 445/2లో ఉన్న ఈ భూమిలో 30 సెంట్లను దివంగతుడైన స్వాతంత్య్ర సమరయోధుడి పేరిట పెద్దలకు కట్టబెట్టేం దుకు ఉన్నతస్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఈ స్థలం విలువ మార్కెట్‌లో రూ.3 కోట్ల పైమాటే. స్వాతంత్య్ర సమరయోధులకు 5 ఎకరాల మాగాణి భూమి లేదా 500 గజాల ఇంటిస్థలం కేటాయించవచ్చని జీవో చెబుతోంది. అయితే, ఇక్కడ సాగుకు పనికిరాని, చుట్టూ అధికారిక లేఅవుట్‌లు వేసిన ఈ స్థలాన్ని కాజేయడానికి రాజకీయ పెద్దలు పన్నాగం పన్నినట్టు తెలుస్తోంది. ఈ భూమిని సుమారు 50 ఏళ్ల నుంచి నిడుమోలు సుబ్బారావు (సుబ్బన్న) సాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవారు. రెవెన్యూ శాఖకు 1402, 1403 ఫసలీ వరకు పన్నులు చెల్లించారు. పాలకొల్లు నుంచి పూలపల్లి వరకు బైపాస్‌రోడ్డు వేయడంతో నీరు రావడం లేదని, దీంతో భూమి సాగుకు పనికిరాకుండా పోయిందని నిడుమోలు సుబ్బారావు చెప్పారు.
ప్రభుత్వ సాయంతో ఇక్కడే ఇల్లు కట్టుకుని జీవిస్తున్నానని, వయో భారంతో ఏ పనీ చేసుకోలేకపోతున్నాని సుబ్బారావు వాపోయాడు. ఇల్లు కూడా శిథిలమైపోయిందని వాపోయాడు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని ఆయన కోరుతున్నాడు. నిబంధలన మేరకే భూమి కేటాయింపు : నిరుపేద కుటుంబం నివాసం ఉంటున్న భూమిని స్వాత్రంత్య సమరయోధుడి పేరిట పెద్దలకు కట్టబెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై తహసిల్దార్ దాసి రాజును వివరణ కోరగా.. నిబంధనల మేరకు భూమి కేటాయింపు జరుగుతుందన్నారు. రెవెన్యూ అధికారులకు భారీగా ముడుపులు ముట్టినట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.
పేదోడి పొట్టకొట్టి.. పెద్దోళ్లకు కట్టబెడతారట!
Published Fri, Jan 22 2016 12:20 AM | Last Updated on Sun, Sep 3 2017 4:03 PM
Advertisement
Advertisement