ప్రపంచ నాగరికత మీద తడి ఆరని నెత్తుటి సంతకం జలియన్‌వాలాబాగ్ దురంతం. దీనిని సమకాలీన ప్రపంచం నిర్ద్వంద్వంగా నిరసించలేదు. చిత్రంగా శ్వేత జాత్యహంకారానికి నిలువెత్తురూపం వంటి విన్‌స్టన్ చర్చిల్ వంటివారు ఈ ఘాతుకాన్ని నిరసించారు. దర్యాప్తు జరిపించాలని ప్రపంచ పత్రికారంగం అభిప్రాయపడింది. కానీ, నోబెల్ సాహిత్య పురస్కారం (1906) స్వీకరించిన రడ్యార్డ్ కిప్లింగ్ ఆ దురంతానికి పాల్పడిన జనరల్ డయ్యర్‌ను ‘భారతదేశ పరిరక్షకుడు’ అని శ్లాఘించాడు.
రడ్యార్డ్ కిప్లింగ్ బొంబాయిలోనే పుట్టాడు. కవి, నవలాకారుడు. తండ్రి అక్కడే జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో శిక్షకుడు. ఈనాటికీ భారతీయ బాలలు చదువుకునే జంగిల్ బుక్ కథలు కిప్లింగ్ రాసినవే. భారతదేశంలోని అడవులలో నివసించే జంతువుల లక్షణాలను భారతీయులకంటే ఎక్కువగా కిప్లింగ్ ఆకళింపు చేసుకున్నాడని పేరు. కానీ బ్రిటిష్ జాతిలో మనిషి రూపంలో పుట్టిన జనరల్ రెజినాల్డ్ డయ్యర్‌లోని క్రూర జంతువు లక్షణాన్ని గుర్తించడానికి నిరాకరించాడు. అందుకు ఆ నోబెల్ గ్రహీతకి జాత్యహంకారం అడ్డొచ్చింది. వైట్‌మ్యాన్స్ బర్డెన్ సిద్ధాంతకర్తలలో ఆయనా ఒకడు కదా!
చదవండి: ఈ వాటర్ బాటిల్ ధర సీఈవోల జీతం కంటే ఎక్కువే!.. రూ.45 లక్షలు..
బాగ్ దురంతం తరువాత జనరల్ డయ్యర్, లెఫ్టినెంట్ గవర్నర్ ఓడ్వయ్యర్ ఇద్దరినీ ఉద్యోగాల నుంచి తొలగించారు. వీరిలో ‘భారత పరిరక్షకుడు’ జనరల్ డయ్యర్‌ను నిధితో సత్కరించాలని ‘మార్నింగ్ పోస్ట్’ అనే ఇంగ్లండ్ పత్రిక నడుం కట్టింది. అంతటి చర్య దిగకపోతే 1857 నాటి పరిస్థితులు తలెత్తేవనీ, తమ జాతీయులు ఎందరో బలైపోయేవారనీ వారి అంచనా. జనరల్ డయ్యర్ చర్యతో విప్లవం వస్తుందని చెబుతున్నవారు ఒక వాస్తవం గుర్తించాలనీ, అసలు విప్లవమే రాకుండా ఆ చర్య తోడ్పడిందనీ చెప్పినవారు ఉన్నారు. 1920 జూలై 17న డయ్యర్ సహాయ నిధికి కిప్లింగ్ పది పౌండ్లు అందించాడు.
మరొక నోబెల్ సాహిత్య బహుమతి గ్రహీత (1913) రవీంద్రనాథ్ టాగోర్ , బాగ్ నెత్తుటికాండ, ‘బ్రిటిష్ పాలితులుగా భారతీయుల నిస్సహాయ స్థితి ఎలా ఉందో వాళ్ల మెదళ్లకు తెలియచెప్పింది’ అన్నారు. యావద్దేశం వలెనే టాగోర్‌కూ ఆలస్యంగానే ఆ సమాచారం అందింది. వెంటనే 1919 మే 30న వైస్రాయ్ చెమ్స్‌ఫర్డ్‌కు లేఖ రాశారు. అందులో మొదటి వాక్యం అదే. చరిత్రలో కనీవినీ ఎరుగని ఇలాంటి రక్తపాతానికి పాల్పడిన ప్రభుత్వం ఇచ్చిన బిరుదును అలంకరించుకోలేను అంటూ ‘సర్’ పురస్కారాన్ని (1915) వెనక్కి తిరిగి ఇస్తున్నట్టు ప్రకటించారాయన.
చదవండి: పెట్రోల్ రేట్లు ఎంత పెరిగినా నో ప్రాబ్లం.. వాటే ఐడియా గురూ..!!
ఇంతటి దురాగతం పట్ల పాలకులు ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యం ఇంకా పెద్ద నేరమని టాగోర్ వాపోయారు. వంగి వంగి దండాలు పెట్టించుకోవడానికి బ్రిటిష్ జాతి భారతీయులకు నేర్పిన ‘పాఠం’ ఎలాంటిదో, దాని వెనుక అమానుషత్వం ఎంతటిదో ఆ పరిణామంతో సంబంధం ఉన్న అధికారులనైనా అడిగి తెలుసుకోకుండా మీ జాతీయులు పరస్పరం అభినందించుకుంటూ ఉండి ఉంటారని ఆవేదనతో రాశారు టాగోర్. బాగ్ ఘటన నూరేళ్ల సందర్భంగా కలకత్తాలో ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలలో ఈ లేఖను కూడా ఉంచారు. ఆ అక్షరాలన్నీ కన్నీటి జడులలో తడిసినవే. గాంధీజీ కూడా బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన ‘కైజర్ ఏ హింద్’ బిరుదును వదిలిపెట్టారు. కానీ జనరల్ డయ్యర్‌ను క్షమించదలచారు.
బాగ్ నెత్తుటికాండకు ఆనాడు రక్తకన్నీరు కార్చినవారే ఎక్కువ. గుండెలో అగ్నిపర్వతాలు పగిలినవారూ ఉన్నారు. అలాంటివారిలో చరిత్ర విస్మరించలేని వ్యక్తి ఉద్దమ్ సింగ్. 1919 ఏప్రిల్ 13న జలియన్‌వాలాబాగ్ దురంతం జరిగింది. ఆ తరువాత ఒక ఆశయం ఊపిరిగా ప్రపంచమంతా తిరిగాడాయన.
ఉద్దమ్ సింగ్ అసలు పేరు షేర్‌సింగ్. తండ్రి తహల్‌సింగ్.. ఉపల్ అనే చోట రైల్వే క్రాసింగ్ కాపలాదారు. చిన్నతనంలోనే తల్లి చనిపోయింది. తరువాత అమృత్‌సర్‌కు కాపురం మార్చిన తండ్రి కూడా 1907లో మరణించారు. దీనితో ఉద్దమ్‌ను, ఆయన అన్నగారు ముక్తాసింగ్‌ను ఎవరో సెంట్రల్ ఖాల్సా అనాథ శరణాలయంలో చేర్పించారు. అక్కడే ఆ సోదరులకి సిక్కు దీక్ష ఇచ్చారు. షేర్‌సింగ్ ఉద్దమ్ సింగ్ అయ్యారు. ముక్తాసింగ్ పేరు సాధుసింగ్ అయింది. 1917లో సాధుసింగ్ కూడా మరణించారు. 1918లో మెట్రిక్యులేషన్ చదివిన తరువాత ఉద్దమ్ అనాథాశ్రమం వీడారు. జలియన్‌వాలా బాగ్ కాల్పులను చూసిన వారిలో ఉద్దమ్ ఒకరని చెబుతారు. సంవత్సరాది వైశాఖి సందర్భంగా ఆ రోజు బాగ్‌కు వచ్చిన అందరికీ ఉద్దమ్, ఆయన మిత్రులు స్వచ్ఛంద సేవకులుగా మంచినీళ్లు అందించారని కూడా కొందరు చెబుతారు.
చదవండి: ఆ వ్యాధితో గతేడాది కోటిన్నర మంది మృతి.. కరోనా ఎంతపని చేసింది..?
ఆ రోజు సాయంత్రం వేళ కాల్పులు జరిగాయి. కాల్పులలో రత్తన్‌దేవి అనే ఆమె భర్త గాయపడగా, ఆయనను మోసుకు వస్తూ ఉద్దమ్ కూడా గాయపడ్డారు. కాల్పుల తరువాత కర్ఫ్యూ విధించారు. చీకటి పడింది. చావుబతుకుల మధ్య ఉన్నవారికి వైద్య సదుపాయం అందలేదు. దిగ్భ్రాంతికి గురైన వారికి కనీసం మంచినీళ్లు కూడా అందలేదు. 1200 మంది క్షతగాత్రులని ప్రభుత్వమే చెప్పింది. ఎంతటి దుర్భరస్థితిని ఆ చీకటిరాత్రి పంజాబీలు చూశారో ఊహించవచ్చు.
తరువాతి కాలాలలో సైఫుద్దీన్ కిచ్లూ స్థాపించిన స్వరాజ్ ఆశ్రమంలో ఉద్దమ్ కొద్దికాలం ఉన్నారు. పంజాబ్ మీద గదర్ పార్టీ ప్రభావం ఎక్కువ. ఉద్దమ్‌కు భగత్‌సింగ్ ఆదర్శం. ఆయనను కలుసుకున్నప్పటి నుంచి గురువుగారు అని పిలవడం ప్రారంభించాడు. రామ్‌ప్రసాద్ బిస్మిల్ కవిత్వం అంటే ప్రాణం. ఒక కాంట్రాక్టర్ దగ్గర కూలీగా చేరి, అతడి వెంటే ఆఫ్రికా వెళ్లాడు ఉద్దమ్. అక్కడ నుంచి అమెరికా వెళ్లాడు. అక్కడే గదర్ పార్టీ ఆశయాలకు మరింత చేరువయ్యారు. భగత్‌సింగ్ తదితరులు స్వదేశం వచ్చి పనిచేయమని ఉద్దమ్‌కు సూచించారు.
ఒక అమెరికన్ మహిళ సాయంతో ఆయుధాలు సంపాదించి భారత్ చేరుకున్నాడాయన. లాహోర్‌లో ఉంటూ విప్లవ కార్యకలాపాలకు సహకరించేవారు. అక్రమంగా ఆయుధాలు కలిగిన ఉన్నాడన్న ఆరోపణ మీద ఉద్దమ్‌ను 1927 ఆగస్ట్ 30న అరెస్టు చేశారు. ఇదే కాకుండా గదర్ పత్రిక ‘గదర్ ది గూంజ్’ ప్రతులు కూడా పోలీసులకు దొరికాయి. నాలుగేళ్ల జైలు శిక్షను అనుభవించి 1931 అక్టోబర్ 23న జైలు నుంచి విడుదలయ్యారు. 1933లో మారుపేరుతో అతి కష్టం మీద ఇంగ్లండ్ చేరుకున్నాడు.
1940 మార్చి 13న ఈస్టిండియా అసోసియేషన్, రాయల్ సెంట్రల్ ఏసియన్ సొసైటీలు లండన్‌లోని కాక్స్‌టన్ హాలులో ఒక కార్యక్రమం ఏర్పాటు చేశాయి. ఆ కార్యక్రమానికి అచ్చం ఆంగ్లేయుడి మాదిరిగానే ఉన్న నలభయ్ ఏళ్ల వ్యక్తి చేతిలో పుస్తకంతో వచ్చాడు. అతడే ఉద్దమ్. వేదిక మీద ఓడ్వయ్యర్ ఉన్నాడు. సభ ముగుస్తూ ఉండగా, వేదిక ముందుకు వెళ్లి, పుస్తకంలో లోపల అమర్చిన 45 స్మిత్ అండ్ వీసన్ రివాల్వర్ తీసి ఓడ్వయ్యర్‌కు గురిపెట్టి ఆరుసార్లు కాల్చాడు.
21 సంవత్సరాల నిరీక్షణ గురి తప్పకుండా చేసింది కాబోలు. ఒక తూటా గుండెలలో, మరొకటి మూత్రపిండాలలోకి చొచ్చుకుపోయాయి. అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు ఓడ్వయ్యర్. ఆ సభలోనే పాల్గొన్న భారత స్టేట్ సెక్రటరీ జట్లండ్, పంజాబ్ మరో మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ లూయిస్ డేన్, బొంబాయి ప్రావిన్స్ మాజీ గవర్నర్ ల్యామింగ్టన్ కాల్పులలో గాయపడ్డారు.
ఉద్దమ్ పారిపోలేదు. తన పేరును రామ్ మహమ్మద్ సింగ్ ఆజాద్ అని చెప్పుకున్నారాయన. ఉద్దమ్ తరఫున వీకే కృష్ణమీనన్ కేసు వాదించారు. 1940 జూన్ 12న ఇంగ్లండ్‌లోనే పెంటాన్‌విల్లె కారాగారంలో ఉద్దమ్‌ను ఉరితీశారు. ఆ అమరుడి చితాభస్మాన్ని 1975లో భారత్‌కు తెచ్చారు.
చదవండి: ఆ పెట్రోల్ బంక్‌లో మూడు రోజులపాటు పెట్రోల్ ఫ్రీ.. కారణం ఇదేనట!!
Comments
Please login to add a commentAdd a comment