Jallianwala Bagh Blood Story
-
ఆ మారణకాండను ప్రత్యక్షంగా చూసింది అతడే!!
ప్రపంచ నాగరికత మీద తడి ఆరని నెత్తుటి సంతకం జలియన్‌వాలాబాగ్ దురంతం. దీనిని సమకాలీన ప్రపంచం నిర్ద్వంద్వంగా నిరసించలేదు. చిత్రంగా శ్వేత జాత్యహంకారానికి నిలువెత్తురూపం వంటి విన్స్టన్ చర్చిల్ వంటివారు ఈ ఘాతుకాన్ని నిరసించారు. దర్యాప్తు జరిపించాలని ప్రపంచ పత్రికారంగం అభిప్రాయపడింది. కానీ, నోబెల్ సాహిత్య పురస్కారం (1906) స్వీకరించిన రడ్యార్డ్ కిప్లింగ్ ఆ దురంతానికి పాల్పడిన జనరల్ డయ్యర్‌ను ‘భారతదేశ పరిరక్షకుడు’ అని శ్లాఘించాడు. రడ్యార్డ్ కిప్లింగ్ బొంబాయిలోనే పుట్టాడు. కవి, నవలాకారుడు. తండ్రి అక్కడే జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో శిక్షకుడు. ఈనాటికీ భారతీయ బాలలు చదువుకునే జంగిల్ బుక్ కథలు కిప్లింగ్ రాసినవే. భారతదేశంలోని అడవులలో నివసించే జంతువుల లక్షణాలను భారతీయులకంటే ఎక్కువగా కిప్లింగ్ ఆకళింపు చేసుకున్నాడని పేరు. కానీ బ్రిటిష్ జాతిలో మనిషి రూపంలో పుట్టిన జనరల్ రెజినాల్డ్ డయ్యర్లోని క్రూర జంతువు లక్షణాన్ని గుర్తించడానికి నిరాకరించాడు. అందుకు ఆ నోబెల్ గ్రహీతకి జాత్యహంకారం అడ్డొచ్చింది. వైట్‌మ్యాన్స్ బర్డెన్ సిద్ధాంతకర్తలలో ఆయనా ఒకడు కదా! చదవండి: ఈ వాటర్ బాటిల్ ధర సీఈవోల జీతం కంటే ఎక్కువే!.. రూ.45 లక్షలు.. బాగ్ దురంతం తరువాత జనరల్ డయ్యర్, లెఫ్టినెంట్ గవర్నర్ ఓడ్వయ్యర్ ఇద్దరినీ ఉద్యోగాల నుంచి తొలగించారు. వీరిలో ‘భారత పరిరక్షకుడు’ జనరల్ డయ్యర్‌ను నిధితో సత్కరించాలని ‘మార్నింగ్ పోస్ట్’ అనే ఇంగ్లండ్ పత్రిక నడుం కట్టింది. అంతటి చర్య దిగకపోతే 1857 నాటి పరిస్థితులు తలెత్తేవనీ, తమ జాతీయులు ఎందరో బలైపోయేవారనీ వారి అంచనా. జనరల్ డయ్యర్ చర్యతో విప్లవం వస్తుందని చెబుతున్నవారు ఒక వాస్తవం గుర్తించాలనీ, అసలు విప్లవమే రాకుండా ఆ చర్య తోడ్పడిందనీ చెప్పినవారు ఉన్నారు. 1920 జూలై 17న డయ్యర్ సహాయ నిధికి కిప్లింగ్ పది పౌండ్లు అందించాడు. మరొక నోబెల్ సాహిత్య బహుమతి గ్రహీత (1913) రవీంద్రనాథ్ టాగోర్ , బాగ్ నెత్తుటికాండ, ‘బ్రిటిష్ పాలితులుగా భారతీయుల నిస్సహాయ స్థితి ఎలా ఉందో వాళ్ల మెదళ్లకు తెలియచెప్పింది’ అన్నారు. యావద్దేశం వలెనే టాగోర్కూ ఆలస్యంగానే ఆ సమాచారం అందింది. వెంటనే 1919 మే 30న వైస్రాయ్ చెమ్స్‌ఫర్డ్‌కు లేఖ రాశారు. అందులో మొదటి వాక్యం అదే. చరిత్రలో కనీవినీ ఎరుగని ఇలాంటి రక్తపాతానికి పాల్పడిన ప్రభుత్వం ఇచ్చిన బిరుదును అలంకరించుకోలేను అంటూ ‘సర్’ పురస్కారాన్ని (1915) వెనక్కి తిరిగి ఇస్తున్నట్టు ప్రకటించారాయన. చదవండి: పెట్రోల్ రేట్లు ఎంత పెరిగినా నో ప్రాబ్లం.. వాటే ఐడియా గురూ..!! ఇంతటి దురాగతం పట్ల పాలకులు ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యం ఇంకా పెద్ద నేరమని టాగోర్ వాపోయారు. వంగి వంగి దండాలు పెట్టించుకోవడానికి బ్రిటిష్ జాతి భారతీయులకు నేర్పిన ‘పాఠం’ ఎలాంటిదో, దాని వెనుక అమానుషత్వం ఎంతటిదో ఆ పరిణామంతో సంబంధం ఉన్న అధికారులనైనా అడిగి తెలుసుకోకుండా మీ జాతీయులు పరస్పరం అభినందించుకుంటూ ఉండి ఉంటారని ఆవేదనతో రాశారు టాగోర్. బాగ్ ఘటన నూరేళ్ల సందర్భంగా కలకత్తాలో ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలలో ఈ లేఖను కూడా ఉంచారు. ఆ అక్షరాలన్నీ కన్నీటి జడులలో తడిసినవే. గాంధీజీ కూడా బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన ‘కైజర్ ఏ హింద్’ బిరుదును వదిలిపెట్టారు. కానీ జనరల్ డయ్యర్‌ను క్షమించదలచారు. బాగ్ నెత్తుటికాండకు ఆనాడు రక్తకన్నీరు కార్చినవారే ఎక్కువ. గుండెలో అగ్నిపర్వతాలు పగిలినవారూ ఉన్నారు. అలాంటివారిలో చరిత్ర విస్మరించలేని వ్యక్తి ఉద్దమ్ సింగ్. 1919 ఏప్రిల్ 13న జలియన్‌వాలాబాగ్ దురంతం జరిగింది. ఆ తరువాత ఒక ఆశయం ఊపిరిగా ప్రపంచమంతా తిరిగాడాయన. ఉద్దమ్ సింగ్ అసలు పేరు షేర్సింగ్. తండ్రి తహల్సింగ్.. ఉపల్ అనే చోట రైల్వే క్రాసింగ్ కాపలాదారు. చిన్నతనంలోనే తల్లి చనిపోయింది. తరువాత అమృత్‌సర్‌కు కాపురం మార్చిన తండ్రి కూడా 1907లో మరణించారు. దీనితో ఉద్దమ్‌ను, ఆయన అన్నగారు ముక్తాసింగ్‌ను ఎవరో సెంట్రల్ ఖాల్సా అనాథ శరణాలయంలో చేర్పించారు. అక్కడే ఆ సోదరులకి సిక్కు దీక్ష ఇచ్చారు. షేర్సింగ్ ఉద్దమ్ సింగ్ అయ్యారు. ముక్తాసింగ్ పేరు సాధుసింగ్ అయింది. 1917లో సాధుసింగ్ కూడా మరణించారు. 1918లో మెట్రిక్యులేషన్ చదివిన తరువాత ఉద్దమ్ అనాథాశ్రమం వీడారు. జలియన్‌వాలా బాగ్ కాల్పులను చూసిన వారిలో ఉద్దమ్ ఒకరని చెబుతారు. సంవత్సరాది వైశాఖి సందర్భంగా ఆ రోజు బాగ్‌కు వచ్చిన అందరికీ ఉద్దమ్, ఆయన మిత్రులు స్వచ్ఛంద సేవకులుగా మంచినీళ్లు అందించారని కూడా కొందరు చెబుతారు. చదవండి: ఆ వ్యాధితో గతేడాది కోటిన్నర మంది మృతి.. కరోనా ఎంతపని చేసింది..? ఆ రోజు సాయంత్రం వేళ కాల్పులు జరిగాయి. కాల్పులలో రత్తన్‌దేవి అనే ఆమె భర్త గాయపడగా, ఆయనను మోసుకు వస్తూ ఉద్దమ్ కూడా గాయపడ్డారు. కాల్పుల తరువాత కర్ఫ్యూ విధించారు. చీకటి పడింది. చావుబతుకుల మధ్య ఉన్నవారికి వైద్య సదుపాయం అందలేదు. దిగ్భ్రాంతికి గురైన వారికి కనీసం మంచినీళ్లు కూడా అందలేదు. 1200 మంది క్షతగాత్రులని ప్రభుత్వమే చెప్పింది. ఎంతటి దుర్భరస్థితిని ఆ చీకటిరాత్రి పంజాబీలు చూశారో ఊహించవచ్చు. తరువాతి కాలాలలో సైఫుద్దీన్ కిచ్లూ స్థాపించిన స్వరాజ్ ఆశ్రమంలో ఉద్దమ్ కొద్దికాలం ఉన్నారు. పంజాబ్ మీద గదర్ పార్టీ ప్రభావం ఎక్కువ. ఉద్దమ్‌కు భగత్‌సింగ్ ఆదర్శం. ఆయనను కలుసుకున్నప్పటి నుంచి గురువుగారు అని పిలవడం ప్రారంభించాడు. రామ్‌ప్రసాద్ బిస్మిల్ కవిత్వం అంటే ప్రాణం. ఒక కాంట్రాక్టర్ దగ్గర కూలీగా చేరి, అతడి వెంటే ఆఫ్రికా వెళ్లాడు ఉద్దమ్. అక్కడ నుంచి అమెరికా వెళ్లాడు. అక్కడే గదర్ పార్టీ ఆశయాలకు మరింత చేరువయ్యారు. భగత్‌సింగ్ తదితరులు స్వదేశం వచ్చి పనిచేయమని ఉద్దమ్‌కు సూచించారు. ఒక అమెరికన్ మహిళ సాయంతో ఆయుధాలు సంపాదించి భారత్ చేరుకున్నాడాయన. లాహోర్‌లో ఉంటూ విప్లవ కార్యకలాపాలకు సహకరించేవారు. అక్రమంగా ఆయుధాలు కలిగిన ఉన్నాడన్న ఆరోపణ మీద ఉద్దమ్‌ను 1927 ఆగస్ట్ 30న అరెస్టు చేశారు. ఇదే కాకుండా గదర్ పత్రిక ‘గదర్ ది గూంజ్’ ప్రతులు కూడా పోలీసులకు దొరికాయి. నాలుగేళ్ల జైలు శిక్షను అనుభవించి 1931 అక్టోబర్ 23న జైలు నుంచి విడుదలయ్యారు. 1933లో మారుపేరుతో అతి కష్టం మీద ఇంగ్లండ్ చేరుకున్నాడు. 1940 మార్చి 13న ఈస్టిండియా అసోసియేషన్, రాయల్ సెంట్రల్ ఏసియన్ సొసైటీలు లండన్‌లోని కాక్స్టన్ హాలులో ఒక కార్యక్రమం ఏర్పాటు చేశాయి. ఆ కార్యక్రమానికి అచ్చం ఆంగ్లేయుడి మాదిరిగానే ఉన్న నలభయ్ ఏళ్ల వ్యక్తి చేతిలో పుస్తకంతో వచ్చాడు. అతడే ఉద్దమ్. వేదిక మీద ఓడ్వయ్యర్ ఉన్నాడు. సభ ముగుస్తూ ఉండగా, వేదిక ముందుకు వెళ్లి, పుస్తకంలో లోపల అమర్చిన 45 స్మిత్ అండ్ వీసన్ రివాల్వర్ తీసి ఓడ్వయ్యర్‌కు గురిపెట్టి ఆరుసార్లు కాల్చాడు. 21 సంవత్సరాల నిరీక్షణ గురి తప్పకుండా చేసింది కాబోలు. ఒక తూటా గుండెలలో, మరొకటి మూత్రపిండాలలోకి చొచ్చుకుపోయాయి. అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు ఓడ్వయ్యర్. ఆ సభలోనే పాల్గొన్న భారత స్టేట్ సెక్రటరీ జట్లండ్, పంజాబ్ మరో మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ లూయిస్ డేన్, బొంబాయి ప్రావిన్స్ మాజీ గవర్నర్ ల్యామింగ్టన్ కాల్పులలో గాయపడ్డారు. ఉద్దమ్ పారిపోలేదు. తన పేరును రామ్ మహమ్మద్ సింగ్ ఆజాద్ అని చెప్పుకున్నారాయన. ఉద్దమ్ తరఫున వీకే కృష్ణమీనన్ కేసు వాదించారు. 1940 జూన్ 12న ఇంగ్లండ్‌లోనే పెంటాన్విల్లె కారాగారంలో ఉద్దమ్‌ను ఉరితీశారు. ఆ అమరుడి చితాభస్మాన్ని 1975లో భారత్‌కు తెచ్చారు. చదవండి: ఆ పెట్రోల్ బంక్‌లో మూడు రోజులపాటు పెట్రోల్ ఫ్రీ.. కారణం ఇదేనట!! -
ఆ రోజు పంజాబ్‌లో ఆరోనది పారింది! అసలేం జరిగిందంటే..
ఐదునదుల పంజాబ్‌లో ఆ ఒక్కరోజు ఆరోనది కనిపించింది. అది నెత్తుటినది. 1919 ఏప్రిల్ 13న జరిగిన జలియన్‌వాలాబాగ్ దురంతంతో ఆనాడు అమృత్సర్ రక్తపుటేరునే చూసింది. సంవత్సరాది (వైశాఖి) పండగ జరుపుకోవడానికి వచ్చి, ఆ మైదానంలో కూర్చున్న దాదాపు ఇరవైవేల మంది నిరాయుధుల మీద 1650 తూటాలు పేలాయి. స్వాతంత్య్రోద్యమం మలుపు తిరిగింది. ఆ దురంతంలో జనరల్ రెజినాల్డ్ డయ్యర్ కంటే పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ మైఖేల్ ఫ్రాన్సిస్ ఓడ్వయ్యర్(1912–19) పెద్ద దోషి అని ప్రముఖ చరిత్రకారుడు కేకే ఖుల్లర్ అంటారు. అదో విడి ఘటన కాదు. ముందూ వెనుకా కుట్రలు ఉన్న గొలుసుకట్టు ఘటనలకు పరాకాష్ట. జనరల్ డయ్యర్ ఎక్కుపెట్టించిన ఆ 90 తుపాకులకు అందిన ఆదేశం వెనుక ఓడ్వయ్యర్ జాత్యహంకారం ఉంది. లాలా లాజ్పతిరాయ్ 1920 ఫిబ్రవరిలో అమెరికా నుంచి వచ్చి వాస్తవాలు సేకరించారు. 12 అంశాలతో ఆరోపణల పత్రం తయారు చేశారు. ఓడ్వయ్యర్ ఆత్మకథ ‘ఇండియా యాజ్ ఐ న్యూ ఇట్’ కూడా ఆ క్రమాన్ని వర్ణించింది. నిజానికి పంజాబీలకు ‘గుణపాఠం’ చెప్పాలన్న అతడి ఆలోచన మూడేళ్ల నాటిది. మొదటి ప్రపంచ యుద్ధం కోసం పంజాబ్ నుంచి ఎక్కువమంది యువకులను ఓడ్వయ్యర్ సైన్యంలో చేర్పించాడు. 1914 ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు భారత్‌లో 27,522 మంది సైన్యంలో చేరితే అందులో 13,400 మంది పంజాబీలు. గ్రేట్‌వార్‌లో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆ కాలమే ఇంగ్లండ్‌ను చావుదెబ్బ కొట్టడానికి అనువైనదని శాన్ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేస్తున్న గదర్ పార్టీ భావించింది. ఆ పార్టీలో ఎక్కువ మంది పంజాబీలే. అప్పుడే ఇండోజర్మన్ ప్రణాళిక బయటపడింది. అంటే ఇంగ్లండ్‌ను భారత్ నుంచి తరిమి వేయడానికి ప్రయత్నిస్తున్న భారతీయ తీవ్ర జాతీయవాదులకు జర్మన్ అండగా ఉండాలన్న యోజన. గదర్ వీరులకు ఐరిష్ ఉగ్రవాదులు అండగా ఉన్నారన్న వార్తలూ వచ్చాయి. అందుకే తీవ్ర జాతీయవాదాన్నీ, స్వాతంత్యోద్య్రమాలనూ ఎంత క్రూరంగా అణచివేసినది దాదాపు 485 పేజీల ఆత్మకథలో ఓడ్వయ్యర్ చాలా రాశాడు. సిక్కులు–గదర్ పార్టీ మధ్య బంధాన్ని చెప్పడానికి అధ్యాయమే (17) కేటాయించాడు (ఈ పుస్తకంలో మనకి ఆసక్తి కలిగించేది 8వ అధ్యాయం ‘హైదరాబాద్ డెక్కన్ 1907 – 09’. ఆ కాలంలో ఓడ్వయ్యర్ నిజాం సంస్థానంలో బ్రిటిష్ రెసిడెంట్). హోంరూల్ ఉద్యమం తీవ్రరూపం దాలుస్తున్న సమయంలో 1916 ఏప్రిల్‌లో పంజాబ్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌ను ఓడ్వయ్యర్, ‘అనీబిసెంట్, తిలక్, బిపిన్‌చంద్ర పాల్ పంజాబ్‌లో ప్రవేశిస్తే చల్లారిపోతున్న తీవ్ర జాతీయవాదోద్యమ జ్వాల మళ్లీ ఎగసిపడుతుంద’ని హెచ్చరించాడు. వారు పంజాబ్‌లోకి రాకుండా బహిష్కరించాడు. పంజాబ్‌లోనే కాదు, భారత్ అంతటా ఉద్రిక్త వాతావరణమే. దీనికి భయపడిన ఫలితమే రౌలట్ బిల్లు. భాతీయుల నిరసనల మధ్య 1919 మార్చి 18న చట్టమైంది. మొదటి ప్రపంచయుద్ధంలో టర్కీ పతనంతో ముస్లింలు ఆగ్రహంగా ఉన్నారనీ, ‘హిందూ తీవ్రవాదులు’ ఈజిప్ట్, సిరియా, ఇరాక్ బాటలో ‘స్వయం నిర్ణయాధికారం’ కోరుతున్నారనీ ఓడ్వయ్యర్ అంటాడు. ఈ రెండు కారణాలు ఆ రెండు మతాలవాళ్లని ఇంగ్లిష్ పాలనకి వ్యతిరేకంగా ఐక్యం చేశాయనీ తేల్చాడు. ఈ ‘అపవిత్ర’ బంధం అమృత్‌సర్‌లో బాగా కనిపించిందని కూడా విశ్లేషించాడు. ఇందుకు ప్రతినిధులుగా జర్మనీలో చదువుకుని వచ్చిన ‘కశ్మీరీ ముస్లిం’ న్యాయవాది సైఫుద్దీన్ కిచ్లూ, ‘హిందూ సర్జన్’ డాక్టర్ సత్యపాల్లను చూపాడు. వీళ్లిద్దరూ హింసామార్గంలో ఆందోళన ఆరంభించారని అరోపించాడు. రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా మార్చి 30న హర్తాల్ పాటించవలసిందిగా గాంధీజీ పిలుపునిచ్చారు. ఉత్తర భారతం, పంజాబ్ ప్రాంతంలో లాహోర్, గుజ్రన్‌వాలా, షేక్‌పురా, ముల్తాన్, జలంధర్, కాసూర్, అమృత్సర్లు భగ్గుమన్నాయి. ఉత్తర భారతంలో కొన్ని రైల్వే స్టేషన్లు దగ్ధమైనాయి. ఇంగ్లిష్ వాళ్ల మీద దాడులు జరిగాయి. ఉత్తర భారత తీవ్ర జాతీయవాదులంతా పంజాబ్ మీద దృష్టి సారించారంటాడు ఓడ్వయ్యర్. ‘ఏప్రిల్ 6న లాహోర్‌లో పెద్ద విప్లవం (గదర్) వస్తుంది. అదే మా జాతీయ దినోత్సవం. ఇంగ్లిష్ వాళ్ల అధికారం పతనమయ్యే రోజు అదే’ అంటూ పత్రికలలో రాశారని కూడా అంటాడు. మళ్లీ ఏప్రిల్ 6న మరొక హర్తాల్‌కు గాంధీజీ పిలుపునిచ్చారు. ఇదే జలియన్‌వాలా బాగ్ దురంతానికి నాంది. ఏప్రిల్ 6,7 తేదీలలో గాంధీజీ ఢిల్లీ నుంచి పంజాబ్ వస్తున్నట్టు సమాచారం వచ్చింది. ఓడ్వయ్యర్ నిషేధాజ్ఞలు విధించాడు. భారత ప్రభుత్వం కూడా గాంధీజీ కదలికల మీద ఆంక్షలు పెట్టింది. 9వ తేదీన పంజాబ్ ప్రావిన్స్ సరిహద్దులలో పల్వాల్ దగ్గర అరెస్టు చేసి, నిషేధాజ్ఞల ఆదేశాలు అందించారు. గాంధీజీ అక్కడ నుంచే బొంబాయి వెళ్లిపోవడానికి అంగీకరించారు. బర్మా పంపేయాలని సూచించాడు ఓడ్వయ్యర్. ఏప్రిల్ 9న శ్రీరామనవమి. పైకి ప్రశాంతంగా ఉన్నా, కిచ్లూ, సత్యపాల్లను వెంటనే అరెస్టు చేయమని ఆరోజే అమృత్సర్ డిప్యూటీ కమిషనర్ మైల్స్ ఇర్వింగ్‌ను ఓడ్వయ్యర్ ఆదేశించాడు. 10వ తేదీన ఆ ఇద్దరినీ ఇంటికి పిలిచి అరెస్టు చేసి, ధర్మశాల అనే చోటకు చేర్చాడతడు (ఈ సంగతిని హంటర్ కమిషన్ ఎదుట చెప్పాడు). వీరిని విడుదల చేయాలని డిప్యూటీ కమిషనర్ ఇంటి ముందు జనం ఆందోళనకు దిగారు. కాల్పులు జరిగాయి. కొంతమంది చనిపోయారు. ఆవేశంతో జనం రాళ్లు విసిరారు. రోడ్డు మీద ఏ యూరోపియన్ కనిపించినా చావగొట్టారు. ఆ మరునాడే మార్సెల్లా షేర్వుడ్ అనే ఆంగ్ల మహిళ మీద దాడి జరిగింది (19న ఆమెను కలుసుకున్న తరువాత ఆ దాడి జరిగిన వీధి కూచా కురిచాహన్ గుండా వెళ్లే ప్రతి భారతీయుడిని నేలమీద పాములా పాకించారు సైనికులు. ఒక పెళ్లి బృందం, ఒక అంధుడు, గర్భవతి కూడా ఆ ‘శిక్ష’ అనుభవించారు. డయ్యర్ పంజాబ్ రక్షకుడని షేర్వుడ్ కీర్తించారు). ఒక బ్యాంక్ మీద ఆందోళనకారులు దాడి చేసి ఐదుగురు యూరోపియన్లను చంపారు. 9వ తేదీన అమృత్సర్ రైల్వేస్టేషన్ రక్షణ కోసం జలంధర్ నుంచి బ్రిగేడియర్ జనరల్ డయ్యర్ తన దళాలతో వచ్చాడు. ఇతడికి అన్ని బాధ్యతలు అప్పగించి ఓడ్వయ్యర్ లాహోర్ వెళ్లిపోయాడు. 13వ తేదీ సూర్యాస్తమయం నాటి ఆ దుర్ఘటనలో 379 మంది మరణించారనీ, 1,137 మంది గాయపడ్డారనీ ప్రభుత్వం ప్రకటించింది. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ సభ్యుడు విఎన్ తైవ్రాజ్ ఆ సంఖ్యను 530 అని చెప్పాడు. ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఈ విషయం లేవనెత్తిన మాలవీయ మృతులు 1000 మంది అని చెప్పాడు. ఆర్య సమాజ్ ప్రముఖుడు స్వామి శ్రద్ధానంద 1500 మంది అని చెప్పాడు. కాల్పుల తరువాత కర్ఫ్యూ విధించారు. అందుకే చాలామంది వైద్యం అందక చనిపోయారు. ఆ మరునాడు కూడా గుజ్రన్‌వాలా, ఇంకొన్ని పట్టణాల మీద ఏరోప్లేన్‌ల ద్వారా బాంబులు కురిపించాడు ఓడ్వయ్యర్. 14వ తేదీ తెల్లవారుజామున కాల్పుల వార్త ఓడ్వయ్యర్‌కు లాహోర్‌లోనే అందింది. దేశ ప్రజలకు నెలా పదిహేను రోజుల తరువాత తెలిసింది. ఆంధ్రపత్రిక జూలై 12 డేట్‌లైన్‌తో ప్రచురించింది. అట్లాంటి ఓడ్వయ్యర్ మీద కాల్పులు జరపడానికి 21 ఏళ్లు ఎదురుచూశాడు ఒక యువకుడు. పేరు ఉద్దమ్‌సింగ్. - డా. గోపరాజు నారాయణరావు -
ప్రతి బుల్లెట్ మీదా ఒక పేరు
కవర్ స్టోరీ జలియన్‌వాలా బాగ్ బ్లడ్ స్టోరీ ఏప్రిల్ 13 - జలియన్‌వాలా బాగ్ మారణకాండ జరిగిన దినం పసిపిల్లలు, పాలు మరువని శిశువులు, బాలింతలు, వృద్ధులు, వికలాంగులు అనే విచక్షణ లేకుండా, అసలు కారణమే లేకుండా కేవలం అధికార దురహంకారంతో డయ్యర్ జరిపించిన కాల్పులకు అమృత్‌సర్‌లోని జలియన్‌వాలా బాగ్ ప్రత్యక్ష సాక్షి. వందలాది మంది భారతీయుల ఉసురు తీసిన డయ్యర్ కూడా చివరిదశలో ఆ బుల్లెట్ దెబ్బకే కుప్పకూలిపోయాడు. అయితే అది తుపాకీ బుల్లెట్ కాదు. అంతరాత్మ అనే బుల్లెట్! జలియన్‌వాలా బాగ్‌లో తను చేసింది కరెక్టా కాదా అనే అంతర్మథనంతో సతమతమై, అనారోగ్యాల బారిన పడి, 62 ఏళ్ల వయసులో 1927లో అతడు మరణించాడు. అనేకసార్లు అతడికి స్ట్రోక్ వచ్చింది. కాళ్లూ చేతులూ చచ్చు పడిపోయాయి. మాట పడిపోయింది. మెదడులో రక్తనాళాలు చిట్లిపోయాయి. చివరికి గుండెపోటుతో చనిపోయాడు. ‘‘ఆ రోజు అమృత్‌సర్‌లో నేను చేసింది ‘సరైన పనే’ అనేవారు ఉన్నారు. ‘కాదు. తప్పు పని చేశాడు’ అనేవారూ ఉన్నారు. నేను చేసింది కరెక్టా కాదా అని ఆ దేవుడిని అడిగేందుకు నేను నా మరణం కోసం నిరీక్షిస్తున్నాను’ అని డయ్యర్ అన్నట్లు ‘ది బుచర్ ఆఫ్ అమృత్సర్ : జనరల్ రెజినాల్డ్ డయ్యర్’ గ్రంథంలో నిగెల్ కొలెట్ రాశారు. అసలు ఆ రోజు ఏం జరిగింది? ‘కాలం’ అనే సాక్షిని అడుగుదాం. 1919 ఏప్రిల్ 13... ఆదివారం. బైశాఖీ పర్వదినం. పంజాబీలకు సంవత్సర ఆరంభం. తూర్పు, పడమర.. ఉత్తరం, దక్షిణం... దేశంలోని నాలుగు దిశలూ అప్పుడప్పుడే చిగురిస్తున్నాయి. ఏ వైపు చూసినా పచ్చని కచేరీలు. ఏ రాగాన్నీ మెచ్చని గడుసు కోయిలలు. అవి పాడిందే పాట. అవి తీసిందే రాగం మరి! నింగి తేటగా ఉండే కాలం కదా.. హరివిల్లులకు ఆ సమయంలో పెద్దగా పని ఉండదు. అన్నీ కిందికి వచ్చేస్తాయి. చిన్నారుల లేత పెదవులపై విరబూస్తాయి. దివిలోని పూలతోట ఎలా ఉంటుందో... భువిని చూస్తూ వైశాఖంలో ఊహించుకోవచ్చు. పంట చేతికి వచ్చి ఉంటుంది. పాట గొంతులో ఆడుతుంటుంది. పెద్దవాళ్లు పిల్లల్లో కలిసిపోతారు. అంతా ప్రకృతి బిడ్డల్లా పరవశించి ఆడిపాడుతారు. ఆ రోజు కూడా చిన్నా పెద్దా అందరూ ఇళ్లల్లోంచి వచ్చారు. కొత్త బట్టలు వేసుకుని వచ్చారు. కొత్త ఆశలతో కళకళలాడుతూ బంధుమిత్రులతో కలిసి వచ్చారు. ఒక్కొక్కరూ అమృత్‌సర్‌లోని ‘జలియన్‌వాలా బాగ్’కి చేరుకుంటున్నారు. బాగ్ అంటే తోట. అందులోనే ఆటలు, పాటలు. అందులోనే వన భోజనాలు. సూర్యుడు అలసిపోవాల్సిందే కానీ పంజాబ్ ప్రజల ఉల్లాసం చీకటి పడినా సరే.. ‘బల్లే బల్లే’మని సాగుతూనే ఉంటుంది. సిక్కులు, హిందువులు, ముస్లింలు.. ఆ రోజు అందరి మతమూ, అభిమతమూ ఒక్కటే. ఉల్లాసం... ఉత్సాహం. ఉదయం 9 గంటలు : నాలుగు భాషల్లో చాటింపు అమృత్సర్ లేవడమే పండగ కళతో లేచింది. కానీ ఆ కళలో ఏదో ఆందోళన. ఓ వ్యక్తి హడావుడి చేస్తున్నాడు. ఆ వ్యక్తి కల్నల్ రెజినాల్డ్ డయ్యర్. బ్రిటిష్ ఆర్మీ అధికారి. అమృత్‌సర్‌కు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు మిలిటరీ కమాండర్. ముందురోజు రాత్రి నుంచే అతడు.. ‘అనుమతి లేకుండా ఎవరూ ఊళ్లోకి రావడానికి లేదు. ఎవరూ ఊళ్లోంచి పోవడానికి లేదు’ అని ఆజ్ఞలు జారీ చేయించాడు. ‘పండగ చేస్కోండి. కానీ ఎవరికి వారే చేస్కోండి. బయట తిరక్కండి. బంధువులతో కలవకండి. ఊరేగింపులు జరపకండి. ముచ్చట్లు పెట్టకండి. చెట్ల కిందికి, రచ్చబండల కిందికి చేరకండి’ అని చాటింపు వేయించాడు. ఇంగ్లిష్‌లో, ఉర్దూలో, హిందీలో, పంజాబీలో.. వీధివీధికీ చెప్పించాడు. అయినా ప్రతి వీధిలోనూ ఇళ్లలోంచి బయటికి వస్తున్న మహిళలే, చిన్న పిల్లలే. డయ్యర్ డప్పు ఎంత మంది విన్నారో, ఎంతమందికి అర్థమయిందో! మధ్యాహ్నం 12 గంటలు : బాగ్‌లోకి డయ్యర్ మనుషులు అమృత్సర్ వీధుల్లో ఎవ్వరూ ఒకరుగా కనిపించడం లేదు! ఎక్కడ చూసినా గుంపులే. ఎటు చూసినా కోలాహలమే. డయ్యర్ గుండె దడదడమంది. ఒక శక్తిమంతమైన మిలిటరీ ఆఫీసర్.. సామాన్య జనాన్ని చూసి భయపడుతున్నాడంటే చేయకూడనిదేదో అతడు చేయబోతున్నాడనే! ఆ గుంపుల్లోకి మెల్లిగా తన మనుషుల్ని వదిలిపెట్టాడు డయ్యర్. వాళ్లంతా తెల్లచొక్కాల్లో ఉన్నారు. జనం ఏం మాట్లాడుకుంటున్నారో విని డయ్యర్‌కు చేరవేయడం వాళ్ల పని. కానీ వాళ్లు డయ్యర్ మెప్పు కోసం తప్పుడు సమాచారం అందించారు. జలియన్‌వాలా తోటలో ప్రభుత్వాన్ని కూల్చివేయబోయే కుట్ర జరగబోతోందని లేనిది కల్పించి చెప్పారు! మధ్యాహ్నం 2 గంటలు : తెరిచి ఉన్నది ఒకటే దారి వేలాదిమంది స్థానికులు హర్మందిర్ సాహిబ్ (ఇప్పటి స్వర్ణాలయం) దగ్గర్లో ఉన్న జలియన్‌వాలా బాగ్ చేరుకున్నారు. వాళ్లలో చాలామంది స్వర్ణాలయంలో ప్రార్థనలు ముగించుకుని వచ్చినవారు. అంతా నిరాయుధులు. అమాయకులు. భక్తులు. సామాన్య ప్రజలు. యువతీ యువకులు, స్త్రీలు, పిల్లలు. బాగ్‌లో వేడుకలయ్యాక ఎవరిళ్లకు వారు చేరుకోవలసినవారు. బాగ్ సువిశాల ప్రదేశం. ఆరేడు ఎకరాల స్థలం. చతురస్రాకారంలో 200 గజాల విస్తీర్ణం. బాగ్ బయట చుట్టూ ఇళ్లు, భవనాలు. బాగ్ చుట్టూ 10 మీటర్ల ఎత్తున ప్రహారీ గోడలు. ఐదు చోట్ల ఇరుకైన ద్వారాలు. ఆ రోజు మాత్రం ఒక ద్వారం తెరిచి ఉంది. మధ్యాహ్నం 2.30 గంటలు : వేడుకలు ముగించాలని ఆదేశం బాగ్‌లో నిత్యం ఆధ్యాత్మిక ప్రసంగాలు. ప్రవచనాలు. కష్టసుఖాల కలబోతలు. బాగ్ మధ్యలో సమాధులు. వాటి మధ్యలో 20 మీటర్ల వ్యాసంలో నీళ్లు ఉండీ లేనట్లుండే బావి. అప్పుడప్పుడూ బాగ్‌లో సంత కూడా జరుగుతుంది. రైతులు, వ్యాపారులు వస్తారు. పశువుల అమ్మకాలు, కొనుగోళ్లు జరుగుతాయి. అలా బాగ్ ఏళ్లుగా అమృత్సర్ సాంస్కృతిక కూడలి అయింది. మామూలు రోజుల్లోనే నిండుగా ఉండే బాగ్... పండగ రోజు నిండు పున్నమిలా ఉంటుంది. ఆరోజూ అలాగే ఉండాల్సింది కానీ.. అక్కడేదో జరగబోతోందని సిటీ పోలీసులకు అనుమానం రాగానే మధ్యాహ్నం రెండు కల్లా అందర్నీ బయటికి వచ్చేయమన్నారు. వచ్చినవారు వచ్చారు. మిగిలినవారు మిగిలారు. పండగ ఇంకా మొదలే కాలేదు.. మధ్యలో ముగుస్తుందని ఎవరనుకుంటారు? సాయంత్రం 4.30 గంటలు : బాగ్పైన విమానం చక్కర్లు డయ్యర్ పంపిన విమానం బాగ్ పైన ఒక రౌండ్ వేసి లోపల ఎంతమంది ఉన్నారో ఒక అంచనాకు వచ్చింది. ఇరవై ఇరవై ఐదు వేలు. పెద్ద మొత్తమే. ఆ సంగతి కల్నల్ డయ్యర్‌కి, అమృత్సర్ డిప్యూటీ కమిషనర్ ఇర్విన్‌కి చేరింది. అంతమంది అక్కడ గుమిగూడతారని వారికి ముందే తెలుసు. అయితే అంతమంది గుమికూడకుండా ముందుగా వారేం చర్యలు తీసుకోలేదు. ఎంతమంది చేరతారు చేరనిద్దాం అన్నట్లు ఉండిపోయారు. బాగ్ లోపల సమావేశం నాలుగున్నరకు మొదలైంది. గంట తర్వాత గుట్టు చప్పుడు కాకుండా బాగ్ దగ్గరికి వచ్చాడు డయ్యర్. అతడితో పాటు తొంభై మంది సైనికులు ఉన్నారు. వాళ్లలో యాభై మంది దగ్గర రైఫిల్స్ ఉన్నాయి. నలభై మంది దగ్గర పిడిబాకులు ఉన్నాయి. వాళ్లంతా బ్రిటిష్ ప్రభుత్వానికి విధేయులైన భారతీయ సైనికులు. సిక్కులు ఎక్కువగా ఉండే దళాల నుంచి కాకుండా వేరే రెజిమెంట్ల నుంచి రప్పించిన వాళ్లు. వాళ్ల వెనుక రెండు వాహనాల నిండా ఆయుధాలు. మెషీన్ గన్లు. బాగ్‌లోకి వాహనాలు పట్టేంత దారులు లేకపోవడంతో వాటిని బాగ్ బయటే నిలిపివేసి, సైనికులు ముందుకు కదిలారు. బాగ్ ద్వారాలన్నీ ఎప్పటిలా మూసే ఉన్నాయి. ప్రధాన ద్వారం ఒక్కటే తెరిచి ఉంది. మిగతావాటితో పోలిస్తే అది కొంచెం వెడల్పుగా ఉంటుంది. డయ్యర్‌తో పాటు వచ్చిన సాయుధ దళాలు, వాహనాలు ఆ ద్వారం బయట ఆగాయి. సాయంత్రం 4.30 - 5-30 మధ్య : ఆకస్మాత్తుగా కాల్పులకు ఆదేశం నిజానికైతే డయ్యర్ చేయవలసిన పని... లోపల ఉన్నవాళ్లందరినీ బయటికి వచ్చేయమని హెచ్చరించడం. కానీ అతడు ఆ పని చేయలేదు! పైగా లోపల ఉన్నవారు బయటికి వచ్చే ప్రధాన ద్వారపు తలుపులను మూసేయించాడు! ఆ తర్వాత కాల్పులు జరపమని సైనిక దళాలను ఆదేశించాడు. పది నిమిషాల పాటు ఆపకుండా కాల్పులు జరుపుతూనే ఉన్నాయి దళాలు. మొత్తం 1650 రౌండ్ల కాల్పులు జరిపినట్లు ఆ తర్వాత లెక్క తేలింది. కానీ కాల్పులలో మరణించివారి లెక్కే తేలలేదు. కాల్పులలో కొంతమంది, ఇరుకు సందులలో జరిగిన తొక్కిసలాటలో కొంతమంది, కాల్పుల నుంచి తప్పించుకో డానికి బావిలో దూకి కొంతమంది చనిపోయారు. బావిలోంచి 120 మృతదేహాలను బయటికి తీసినట్లు స్వాతంత్య్రం వచ్చాక ఇక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకంలో రాశారు. అప్పటివరకు కచ్చితమైన లెక్క ఎవరికీ తెలీదు. తీవ్రంగా గాయపడిన వారిని ఆ రాత్రి కర్ఫ్యూలో బయటికి తీసుకెళ్లే పరిస్థితి లేకపోవంతో వారిలో కొంతమంది చనిపోయారు. అయితే నిజానికి కాల్పుల్లో ఎంతమంది చనిపోయారన్న లెక్క ఇన్నేళ్లు గడిచినా ఇప్పటికీ తేల్లేదు! బ్రిటిష్ ప్రభుత్వం 379 మంది అంటోంది. ఆ లెక్కను కూడా చాలా అన్యాయంగా రాబట్టింది. మారణకాండ జరిగిన మూడు నెలల తర్వాత ఇంటింటికీ వెళ్లింది. మీ వాళ్లెవరైనా ఆనాటి దుర్ఘటనలో చనిపోయారా అని వివరాలు రాసుకుంది. చాలామంది నిజం చెప్పలేదు. చెబితే తమ మీద నిఘా ఉంటుందన్న భయంతో ఇంట్లో వ్యక్తి చనిపోయిన విషయాన్ని వారు దాచిపెట్టారు. చిత్రం ఏమిటంటే ఈ కాల్పుల సంగతి బ్రిటిష్ ప్రభుత్వానికి ఎనిమిది నెలల తర్వాత గానీ తెలియలేదు. దేశంలోనే ఉన్న రవీంద్రనాథ్ టాగూర్‌కి ఈ సంగతి మే 22 వరకు తెలియదు. గాంధీకీ వెంటనే తెలియలేదు. తెలిసిన వెంటనే ఆయన సహాయ నిరాకరణ ఉద్యమం మొదలు పెట్టారు. ఆ ఉద్యమంతోనే స్వతంత్ర భారత సమరానికి బీజాలు పడ్డాయి. అవి తెల్ల దొరల గుండెల్లో బుల్లెట్లై పేలాయి.