సాక్షి, బొబ్బిలి : స్వాతంత్య్ర పోరాటంలో బొబ్బిలి వాసులు అనేక మంది పాల్గొన్నా చరిత్ర, రికార్డుల ఆధారంగా కొంతమంది పేర్లే ప్రముఖంగా వినిపించాయి. వీరిలో బొబ్బిలికి చెందిన అయ్యగారి అప్పలనరసయ్య ఒకరు. శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొన్నందున ఆయనకు 1932లో రెండేళ్లు కఠిన కారాగార శిక్ష విధించారు. మద్రాసు, వెల్లూరు జైలులో శిక్ష అనుభవించి బొబ్బిలి వచ్చారు. అలాగే బొబ్బిలికి చెందిన అయ్యగారి సత్యనారాయణ, లక్ష్మీదేవి దంపతులు, అయ్యగారి రామపాపారావు స్వాతంత్య్ర పోరాటంలో చురుకైన పాత్ర పోషించారు. అప్పట్లో వీరికి బ్రిటిష్ వారు కొరడాదెబ్బల శిక్ష విధించేవారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ముల పిల్లలు కాగా వీరంతా ప్రస్తుతం కాలం చేశారు. బొబ్బిలిలో చర్చివీధిలో వీరికి ఇళ్లు ఉండేవి. వీరి కుటుంబసభ్యులు ఈ ప్రాంతంనుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయి ఆస్తులు అమ్ముకున్నారు.
గాంధీజీకి ఆశ్రయమిచ్చిన సావిత్రమ్మ
పట్టణానికి చెందిన పుల్లెల సావిత్రమ్మ గాంధీకి భోజన ఏర్పాట్లు చేశారు. మూడేళ్లక్రితమే కాలం చేసిన సావిత్రమ్మ 1923వ సంవత్సరంలో ఆమె తన మేనత్త, మేనమా మ ఇంట్లో ఇచ్చాపురంలో ఉండేవారు. పుల్లెల సన్యాసిరావుతో ఆమెకు వివాహం కాగా, ఆమె బావ పుల్లెల శ్యామసుందరరావు జమీందారు. గౌతులచ్చన్న గురువు అయిన శ్యామసుందరరావు అప్పట్లో స్వాతంత్య్ర సమరంలో చురుకైన పాత్రపోషించారు. 1923లో గాంధీ రాజకీయసభ కోసం బరంపురం వెళ్తూ శ్యామసుందరరావు ఇంట్లో బసచేశారు. ఆ సమయంలో గాంధీకి సావిత్రమ్మ అన్ని రకాల వంటకాలు సిద్ధం చేశారు. అయితే అవేవీ గాంధీ తీసుకోకుండా కేవలం మేకపాలు, వేరుశనగలు అడిగి తిన్నారు. అప్పుడే ఆయనతో మాట్లాడినట్టు సావిత్రమ్మ చెప్పేవారు.
Comments
Please login to add a commentAdd a comment