Independence Day Special
-
TSRTC: ప్రయాణీకులకు బంపరాఫర్..
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ప్రయాణీకులకు టీఎస్ఆర్టీసీ బంపరాఫర్ ఇచ్చింది. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని బస్సు ప్రయాణికులకు ఆర్టీసీ ప్రత్యేక రాయితీలు ప్రకటించింది. ఈ క్రమంలో పలు ఆఫర్లను ఇచ్చింది. ఇవి ఈనెల 15వ తేదీన మాత్రమే అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. వివరాల ప్రకారం.. టీఎస్ఆర్టీసీ పల్లె వెలుగు బస్సుల్లో 60 ఏళ్లు దాటిన స్త్రీ, పురుషులకు బస్సు టికెట్లో 50 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ఆర్టీసీ వెల్లడించింది. దీని కోసం వయసు ధ్రువీకరణకు ఆధార్‌కార్డు చూపాలని స్పష్టం చేసింది. అదే విధంగా హైదరాబాద్‌లో 24 గంటల అపరిమిత ప్రయాణానికి సంబంధించి టీ-24 టికెట్‌ను రూ.75కే ఇవ్వనున్నట్లు తెలిపింది. పిల్లలకు టీ-24 టికెట్ ధర రూ.50గా నిర్ణయించింది. ఇక, టీఎస్ఆర్టీసీ అందిస్తున్న రాయితీలను ఉపయోగించుకుని స్వాతంత్య్ర దినోత్సవాల్లో పాల్గొనాలని ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాలకు ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033లను సంప్రదించాలని సూచించారు. ఇది కూడా చదవండి: తెలంగాణలో భారీగా విద్యుత్ డిమాండ్ -
నీలిమందు విప్లవం.. ఘట్టాలు-చట్టాలు
సామ్రాజ్య భారతి 1859/1947లో ఇండిగో తిరుగుబాటు.. నీలిమందు విప్లవం (1859–60) మొదలైంది. ఈ విప్లవానికి మరో పేరు ఇండిగో తిరుగుబాటు. పశ్చిమ బెంగాల్‌లోని గోవిందాపూర్ గ్రామం, బీహార్‌లోని దర్భంగాలలో విష్ణుచరణ్ బిస్వాస్, దిగంబర విశ్వాస్ ఈ ఉద్యమానికి ఊపిరిలూదారు. ఘట్టాలు బెంగాల్ ఇండిగో రైతులు : బెంగాల్ భూస్వాముల నుంచి భూములు కౌలుకు తీసుకున్న యూరోపియన్లు ఆ భూముల్లో నీలిమందు పంటను పండించాలని రైతుల్ని నిర్బంధించారు. నీలి మందు పంటవల్ల ప్రతిఫలం సరిగా లభించకపోయినా దాన్నే పండించాల్సి రావడంతో రైతులు తీవ్ర అసంతృప్తికి గురై తిరుగుబాటు చేశారు. అప్పటి పద్ధతి ప్రకారం రైతు తన భూమిలోని 1/3వ వంతు భూమిలో నీలిమందు పంటనే పండించాలి. చట్టాలు సివిల్ ప్రొసీజర్ కోడ్, లిమిటేషన్ యాక్ట్, ఈస్టిండియా లోన్ యాక్ట్, ఎవిడెన్స్ బై కమిషన్ యాక్ట్, రాయల్ నేవల్ రిజర్వ్ (వలంటీర్) యాక్ట్, బ్రిటిష్ లా అసెర్టెయిన్మెంట్ యాక్ట్‌ల.. రూపకల్పన. జననాలు దొరాబ్జీ టాటా (బాంబే) : భారతీయ పారిశ్రామికవేత్త. ‘టాటా’ గ్రూపు. కస్తూరి రంగ అయ్యంగార్(మద్రాసు): భారత స్వాతంత్య్ర సమర కార్యకర్త.‘ది హిందు’ ఆంగ్ల వార్తాపత్రికకు 1905 ఏప్రిల్ 1 నుంచి 1923 వరకు మేనేజింగ్ ఎడిటర్‌గా ఉన్నారు. ఎర్నెస్ట్ కేబుల్ : భారత సంతతి బ్రిటన్ వ్యాపారి, ఫైనాన్సియర్ (కలకత్తా) -
మగువా మగువా.. ఉందా నీకు విలువా?
75వ స్వాతంత్య్ర వేడుకల్ని ఘనంగా చేసుకుంటున్నాం. తొంభై ఏళ్ల పోరాటాలు, యోధుల త్యాగాల దగ్గరి నుంచి ఇన్నేళ్లలో దేశం సాధించిన అభివృద్ధి దాకా అన్నింటి గురించి చర్చించుకుంటున్నాం. బాగానే ఉంది.. మరి అప్పటి పోరాటంలో, ఇప్పటిదాకా సాధించిన ప్రగతిలో పాలుపంచుకున్న మహిళల మాటేంటి? వాళ్లకు సరైన ప్రాధాన్యం దక్కుతోందా? మగవాళ్లతో అన్నింటా పోటీ పడుతూ తానై నిలుస్తున్నా.. నిజమైన స్వేచ్ఛకు మహిళ ఎందుకు దూరంగా ఉంటోంది! ఇంతకీ అఖండ భారతావనిలో మగువకు స్థానం ఎక్కడుందసలు? -
WETA ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
కాలిఫోర్నియాలోని "విమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ స్వాతంత్ర దిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా సంస్థ ప్రెసిడెంట్ ,ఫౌండర్ హనుమండ్ల ఝాన్సీ రెడ్డి మట్లాడుతూ దేశం అన్నింటా అభివృద్ధి చెందుతున్న సమయం లో ఒక వైరస్ అస్థిత్వానికి సవాల్ విసిరింది .కోవిడ్ సెకండ్ వేవ్ లో WETA ఎన్నో గ్రామాలలో సేవాకార్యక్రమాలని చేయగలిగిందని,సహాయం చేసిన దాతలకు ఈ సమయంలో ముందు ఉండి పని చేసిన కోవిడ్ వారియర్స్ కి ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి , WETA వాలంటీర్స్ కి కృతజ్ఞత తెలిపారు. కోవిడ్ కష్ట కాలంలో చురుకు గా పని చేసిన కొంత మంది వాలంటీర్స్ ని అవార్డ్స్ తో సత్కరించామని తెలిపారు.స్వాతంత్ర దినోత్సవంలో ఝాన్సీ రెడ్డి పాల్గొని జాతీయ పథకాన్ని ఎగరవేశారు. ఈ వేడుకలలో పలువురు ఎగ్జిక్యూటివ్ టీం సభ్యులు, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శైలజ కల్లూరి పాల్గొని ..శుభాకాంక్షలు తెలిపారు. -
ఈ దేశభక్తి స్టిక్కర్లతో స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పేయండి
Independence Day 2021: 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని స్నేహితులు, కుటుంబ సభ్యులకు పంపడం కోసం ఇమేజ్‌లు, వాట్సాప్ స్టిక్కర్లు కోసం చూస్తున్నారా? ఈ ప్రాసెస్‌తో మీరు వాట్సాప్ ద్వారా స్వాతంత్య్ర దినోత్సవానికి సంబంధించిన స్టిక్కర్స్ సులభంగా పంపించుకోవచ్చు. దీని కోసం, మీరు ప్లే స్టోర్ నుండి థర్డ్ పార్టీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. వాట్సాప్ లో కేవలం కొన్ని ప్రాథమిక స్టిక్కర్ ప్యాక్‌లు మాత్రమే లభిస్తాయి. ఇండిపెండెన్స్ డే స్టిక్కర్ల కోసం మీరు థర్డ్ పార్టీ యాప్ లపై ఆధారపడాలి. ఇప్పుడు 75వ స్వాతంత్య్ర దినోత్సవానికి సంబందించిన కొన్ని థర్డ్ పార్టీ యాప్స్ కొన్ని అందుబాటులో ఉన్నాయి. వీటిని డౌన్లోడ్ చేసుకున్నాక ఏ విధంగా ఉపయోగించాలో తెలుసుకుందాం. స్టెప్1: గూగుల్ ప్లేస్టోర్‌లోకి వెళ్లి ఇండిపెండెన్స్ డే స్టిక్కర్స్ అని సెర్చ్ చేయాలి. మీకు కావాల్సిన స్కిక్కర్స్ కోసం “Independence Day – August 15 Stickers WA & Frames” అనే యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోండి. స్టెప్ 2: మీకు కావాల్సిన యాప్‌ను డౌన్ లోడ్ చేసుకొని ఓపెన్ స్టిక్కర్స్ ప్యాక్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. స్టెప్ 3: స్టిక్కర్స్ ప్యాక్ మీద ట్యాప్ చేస్తే మీకు కావాల్సిన స్కిక్కర్స్ డిస్ ప్లే అవుతాయి. స్టెప్ 4: ఆ తర్వాత డిస్ ప్లే అయిన స్కిక్కర్స్ పై ప్లస్ సింబల్ పై ట్యాప్ చేస్తే మీకు కావాల్సిన విజిబిలిటీని సరిచేసుకోవచ్చు. స్టెప్ 5: విజబులిట్ ఆప్షన్ వెరిఫై చేసుకున్న తరువాత వాట్సాప్ లేదా సిగ్నల్ యాప్ ద్వారా మీ స్నేహితులకు సెండ్ చేసే సదుపాయం ఉంటుంది. ఇండిపెండెన్సె డే ఫ్రేమ్స్ మనం పైన చెప్పుకున్న యాప్‌ను డౌన్ లోడ్ చేసిన తర్వాత.. యాప్ లో స్టార్ట్ ఫ్రేమ్ క్రియేషన్ అనే సెక్షన్ కనిపిస్తుంది. ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇండిపెండెన్స్ డే ఫ్రేమ్స్ డిస్ ప్లే అవుతాయి. ఆ ఫ్రేమ్ ఆప్షన్ క్లిక్ చేసి మీ వ్యక్తిగత ఫోటోలు లేదంటే మీ కుటుంబసభ్యుల ఫోటోల్ని అప్లోడ్ చేసి.. ఆ ఫోటోలపై ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు చెప్పవచ్చు. ఇండిపెండెన్స్‌డే జిఫ్ ఇమేజెస్ వాట్సాప్ ద్వారా జిఫ్ ఇమేజెస్ ను సులభంగా పంపించుకోవచ్చు. ఎమోజీ ఆప్షన్ పై క్లిక్ చేస్తే మనకు జిఫ్ ఇమేజ్‌లు డిస్ ప్లే అవుతాయి. మీకు కావాల్సిన జిఫ్ ఇమేజెస్ ను సెలక్ట్ చేసుకొని మీకు కావాల్సిన వారికి సెండ్ చేసుకోవచ్చు. ఆ జిఫ్ ఇమేజెస్ నచ్చకపోతే జిప్ఫర్.కామ్ సైట్ ను విజిట్ చేసి.. ఆ సైట్ ద్వారా మీకు కావాల్సిన ఫోటోల్ని సెలక్ట్ చేసుకోవచ్చు. -
రిలయన్స్ డిజిటల్ ఇండియా సేల్ ఆఫర్లు..
హైదరాబాద్: పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ గ్రూప్‌లో భాగమైన రిలయన్స్ డిజిటల్ సంస్థ తాజాగా స్వాతంత్య్ర దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని ’డిజిటల్ ఇండియా సేల్’ నిర్వహిస్తోంది. రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్స్, రిలయన్స్డిజిటల్డాట్ఇన్ పోర్టల్‌లో షాపింగ్ చేసేవారికి దీని కింద పలు ఉత్పత్తులపై ఆఫర్లు, డిస్కౌంట్లు అందిస్తోంది. ఆగస్టు 16 దాకా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డులపై 10 శాతం డిస్కౌంటు (రూ.3,000 వరకూ), పేటీఎం ద్వారా రూ. 9,999 కనీస చెల్లింపుపై ఆగస్టు 31 దాకా రూ. 500 వాలెట్ క్యాష్‌బ్యాక్ అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది. అలాగే, జెస్ట్‌మనీ ద్వారా రూ. 10,000కు పైబడి చేసే కొనుగోళ్లపై నో కాస్ట్ ఈఎంఐ, 10 శాతం క్యాష్‌బ్యాక్ (రూ. 5,000 దాకా) పొందవచ్చని పేర్కొంది. టీవీలు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, గృహోపకరణాలు మొదలైన వాటిపై ఈ ఆఫర్లు లభిస్తాయని వివరించింది. -
చిన్నారి స్వాతంత్య్ర యోధులు
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధుల గెటప్స్‌లోకి మారిపోయారు అల్లు అర్జున్ కుమారుడు అయాన్ , కుమార్తె అర్హా. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి గెటప్ లో అయాన్ కనిపించాడు. ‘సైరా: నరసింహా రెడ్డి’ సినిమాలో చిరంజీవి పలికిన ‘గెటౌట్ ఆఫ్ మై కంట్రీ’ డైలాగ్ కూడా చెప్పారు. అలానే అర్హా ‘మదన్ మోహన్ మాలవ్యా’ గెటప్ వేసుకుంది. ఈ ఫోటోలను, వీడియోను అల్లు అర్జున్ తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేశారు. -
సన్ ఆఫ్ ఇండియా
మంచు మోహన్ బాబు కథానాయకునిగా తెరకెక్కనున్న చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’. ఈ చిత్రానికి పాపులర్ స్క్రిప్ట్, డైలాగ్ రైటర్ డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించనున్నారు. శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థలు ఈ సినిమా నిర్మించనున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం ‘సన్ ఆఫ్ ఇండియా’ టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్లో తీక్షణంగా చూస్తున్న మోహన్ బాబు కనిపిస్తున్నారు. ‘‘ఇంతవరకు తెలుగుతెరపై కనిపించని కథ, జానర్‌ని ఈ సినిమాలో చూడబోతున్నాం. ఇదివరకెన్నడూ మనం చూడని పవర్ఫుల్ పాత్రను మోహన్ బాబు పోషిస్తున్నారు. ఈ సినిమాకు పని చేసే సాంకేతిక నిపుణులు, నటీనటుల వివరాలను త్వరలోనే చెబుతాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. కాగా కొత్త సినిమాలు ఒప్పుకొనే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు మోహన్‌బాబు. నటునిగా తనను ఉత్తేజపరిచే సినిమాలే చేయాలని నిర్ణయించుకున్నారు. 560కి పైగా చిత్రాల్లో నటించిన ఆయన ‘ఆకాశమే నీ హద్దురా’ కథ నచ్చి, ఈ చిత్రంలో కీలక పాత్ర చేశారు. సూర్య హీరోగా రూపొందిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. -
స్త్రీ స్వాతంత్య్రానికి మగాళ్లు ఓకే అనాలా?
దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. స్త్రీకి స్వాతంత్య్రం వచ్చిందా? కలలు కనడానికి. కెరీర్‌ను నిర్మించుకోవడానికి. పంజరాలను బద్దలు కొట్టడానికి. స్వేచ్ఛాభావనలు వికసించడానికి. నిరోధాల బెదురు లేకుండా జీవించడానికి. వీటన్నింటి కోసం మగాళ్ల అనుమతికి ఎదురుచూస్తూ ఉండాలా? మగాళ్ల పర్మిషన్ కావాలా? అక్కర్లేదు అని చెప్పే స్ఫూర్తిదాతలు చాలామంది ఉన్నారు. గుంజన్ సక్సెనా అలాంటి స్ఫూర్తిదాత. ఆమెపై వచ్చిన సినిమా ఈ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్త్రీలకు అందిన కానుక. ‘అన్నయ్యా... పెద్దయ్యాక నేను పైలెట్ అవుతా’ ‘పైలెట్ అవుతావా? ఇదిగో ఈ గిన్నె పట్టుకో. నువ్వు చేయాల్సిన పని కూర వడ్డించమంటారా? పప్పు వడ్డించమంటారా అని అడగడమే. ముందు అది నేర్చుకో’ చిన్నప్పటి నుంచి తెలుసో తెలియకో మగపిల్లల బుర్రల్లో ఎక్కించే భావజాలం ఇది. పెద్దయ్యాక ఇది మగభావజాలం అవుతుంది. సమాజ భావజాలం అవుతుంది. చివరకు దేశభావజాలంగా మారి స్త్రీలపై పెత్తనం చలాయిస్తుంది. ఆడపిల్లలు విమానం ఎగరేయకూడదా? రైట్‌బ్రదర్స్ విమానాన్ని పూర్తిస్థాయిలో కనిపెట్టినప్పుడు దాని యోక్ (కంట్రోల్ వీల్) కేవలం పురుషులను ఉద్దేశించే తయారు చేసి ఉంటారా? పదేళ్ల బాలికగా గుంజన్ సక్సెనా పెద్దయ్యి పైలెట్ అవ్వాలి అనుకున్నప్పుడు సోదరుడు ప్రదర్శించిన హేళనను తండ్రి ఖండిస్తాడు. ‘విమానాన్ని స్త్రీ ఎగరేసినా పురుషుడు ఎగరేసినా ఎగరేసేవారిని పైలెట్ అనే అంటారు. విమానానికి ఈ వ్యత్యాసం లేనప్పుడు మనమెందుకు వ్యత్యాసం పాటించడం?’ అంటాడు. నిజజీవితంలో గుంజన్ సక్సెనా కథకు, సినిమాలో గుంజన్ సక్సెనా కథకు ఇక్కడి నుంచే మొదలు. నిజం కథ గుంజన్ సక్సెనా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఫ్లయిట్ లెఫ్టినెంట్‌గా విశేష సేవలందించిన తొలి మహిళా పైలెట్లలో ఒకరు. లక్నోకు చెందిన గుంజన్ ఢిల్లీలో చదువుకుంది. 1994లో తొలిసారి మహిళా ట్రైనీస్‌కు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ప్రవేశం కల్పించినప్పుడు 25 మంది బ్యాచ్‌లో ఒకరిగా ఎంపికైంది. ట్రయినింగ్ పూర్తయ్యాక ఉధమ్‌పూర్ (జమ్ము–కాశ్మీర్) ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు తదుపరి శిక్షణకు వస్తుంది. అక్కడ ఆమెకు అంతవరకూ అలవాటై ఉన్న పురుషావరణ ధోరణిలో అడ్జెస్ట్ అవడానికి టైమ్ పడుతుంది. నిజం చెప్పాలంటే అంతవరకూ అక్కడకు రాని మహిళలను ఎలా అర్థం చేసుకోవాలో వారితో ఎలా వ్యవహరించాలో పురుష ఆఫీసర్లకు తెలియదు. చివరకు గుంజన్ సక్సెనా విశేష ప్రతిభ కనబరిచి ఫ్లయింగ్ ఆఫీసర్ అవుతుంది. 1999లో వచ్చిన కార్గిల్ వార్ ఆమె సామర్థ్యానికి ఒక సవాల్. యుద్ధంలో గాయపడిన, మృతి చెందిన సైనికులను హెలికాప్టర్ ద్వారా తెచ్చే బాధ్యత గుంజన్ది. ఇది ప్రమాదకరం. ముష్కరులు హెలికాప్టర్‌ను పేల్చేయొచ్చు కూడా. కాని కార్గిల్‌వార్ జరిగిన 2 నెలల 3 వారాల్లో గుంజన్ లెక్కకు మించిన ఆపరేషన్స్‌లో పాల్గొని దాదాపు 900 మందికి పైగా సైనికులను తిరిగి బేస్‌కు చేర్చింది. అందుకే ఆమె ‘కార్గిల్ గర్ల్’ అయ్యింది. కార్గిల్ వార్‌లో పని చేసిన ఏకైక మహిళ ఆమె. 2004లో పదవీవిరమణ చేసింది. సినిమా కథ గుంజన్ సక్సెనా జీవితం ఆధారంగా తీసిన సినిమా కొత్త ఆలోచనలు చేసే స్త్రీలకు పురుష కేంద్రక సమాజంలో ఎదురయ్యే అవరోధాలను గాఢంగా చర్చించింది. స్త్రీలను పురుష సమాజం రెండు విధాలుగా అడ్డుకుంటుంది. ఒకటి ప్రొటెక్టివ్ కన్సర్న్తో. రెండు చులకనభావంతో. ఈ సినిమాలో గుంజన్ సోదరుడు ‘నీకేమైనా అయితే? నీకెందుకు ఇదంతా? నువ్వు డేంజర్లో పడతావ్?’ లాంటి ‘ప్రేమకట్టడి’తో నిరోధించడానికి చూస్తాడు. ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో ‘నువ్వు బలహీనురాలివి. ఇక్కడ దుర్బలులకు చోటు లేదు. అసలిది స్త్రీలు చేయాల్సిన పని కాదు’ అని చులకన భావంతో నిరోధిస్తారు. అయితే మగవాళ్లలో కూడా మంచి మగవాళ్లు ఉంటారు. గుంజన్ సక్సెనాకు తండ్రి మద్దతు చాలా ఉంటుంది. ఆమెకు అతడు ప్రతిక్షణం సపోర్ట్ చేస్తాడు. ‘కష్టాన్ని నమ్ముకున్నవారికి విజయం ద్రోహం చేయదు’ అంటాడతను. ఎయిర్‌ఫోర్స్‌ను అర్ధంతరంగా వదిలిపెట్టి ‘పెళ్లి చేసుకొని సెటిలవుతాను’ అని గుంజన్ అన్నప్పుడు ‘సమాజమంతా స్త్రీని వంటగదికి సెటిల్ చేయాలని చూస్తోంది. నువ్వు కూడా వారిలో చేరతావా?’ అని కర్తవ్యాన్ని ప్రేరేపిస్తాడు. ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో కూడా ఒక సీనియర్ ఆఫీసర్ ఆమెకు మద్దతుగా నిలుస్తాడు. ఆమెకు తర్ఫీదు ఇస్తాడు. ఎగిరే చిరుతలా తీర్చిదిద్దుతాడు. నకిలీ మగతనం స్త్రీని గౌరవించడం, స్త్రీని పై అధికారిగా స్వీకరించడం, స్త్రీకి సెల్యూట్ చేయడం వల్ల మగవారి తలపాగలు ఊడి కిందపడవు... దాని వల్ల వారి మగతనానికి ఏమీ ఢోకా రాదు అని ఈ సినిమా స్టేట్మెంట్ ఇస్తుంది. ‘నన్ను మీరంతా ఎందుకు నిరోధిస్తున్నారో నాకు తెలుసు. నేను ఆఫీసర్ అయితే సెల్యూట్ చేయాల్సి వస్తుందని మీ భయం. చేస్తే ఏమవుతుంది? అలా చేస్తే పోయే మగతనం నకిలీ మగతనం’ అని గుంజన్ ఒకచోట అంటుంది. బండి మీద ఒంటరిగా వెళ్లే యువతులను చున్నీ లాగి కిందపడేసే ఈ రోజుల్లో కూడా స్త్రీలను గౌరవించడం, స్త్రీ ఆకాంక్షలకు విలువ ఇవ్వాలని చెప్పడం పదే పదే చేయాల్సి వస్తుంది. అందుకు గుంజన్ సక్సెనా కూడా ఒక సమర్థమైన సినిమా రూపం. గుంజన్‌గా జాన్హీ్వ కపూర్ ప్రశంసాత్మకంగా చేసింది. స్త్రీలకు ఎవరూ స్వాతంత్య్రం ఇవ్వాల్సిన పని లేరు. అది వారి హక్కు. అందరిలాగే వారు తమ స్వేచ్ఛా స్వాంతత్య్రాలను పొందగలరు. నిభాయించుకోగలరు. పురుషులు చేయాల్సింది అందుకు నిరోధంగా నిలబడకపోవడం. జెండా వందనానికి అందరం తల ఎత్తుతాం. స్త్రీలు కూడా స్వేచ్ఛగా తల ఎత్తే సకల సాంఘిక, సామాజిక, కౌటుంబిక ఆవరణాలలోకి ఈ దేశం పయనించాలని ఈ స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఆశిద్దాం. ‘గుంజన్ సక్సెనా’ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో లభ్యం. – సాక్షి ఫ్యామిలీ -
గాంధీ పటానికి మాలలు వేసి పూజలు చేశారు
మహాఘటనలకు సాక్షీభూతాలుగా నిలిచివారి నుంచి ఆ జ్ఞాపకాన్ని వినడం కూడా ఉత్తేజభరితమే. 1947... ఆగస్టు 14 అర్ధరాత్రి. ఆ దేశం ఒక మహా ఘటనను వీక్షించింది. స్వేచ్ఛావాయువులు వీచబోయే ప్రభాతకిరణాలకు చేతులు సాచింది. నాటి జ్ఞాపకాలను నిక్షిప్తం చేసుకున్నవారు అన్నవరపు రామస్వామి (95). శివరాజు సుబ్బలక్ష్మి (95). మళ్లీ ఆ ఉద్విగ్న క్షణాలను మన ముందుకు తెస్తున్నారు. 1947, ఆగస్టు 15.. భారతజాతి దాస్య శృంఖలాలు తెంచుకున్న రోజు. అందరికీ పెద్దపండుగ. ఈ పండుగకు ప్రధాన కారకులు గాంధీగారేనని అందరికీ తెలిసిందే. అప్పుడుS నా వయసు 22 సంవత్సరాలు. ఆ పండుగలో నేనూ భాగమయ్యాను. ఒక పేటలో ఉన్నవారంతా ఒకచోట చేరి సంబరంగా వేడుకలు చేసుకున్నారు. బుడబుక్కలవాళ్లు ఎంతో ఉత్సాహంగా ఇల్లిల్లూ తిరుగుతూ స్వాతంత్య్రం గురించి అందంగా మాటలు చెప్పారు. పిల్లలంతా ఒకచోట చేరి పద్యాలు, పాటలు పాడారు. పనిపాటలు చేసేవారంతా ఒక మాస్టారుని నియోగించుకుని ముందురోజు రాత్రి సాధన చేసి, స్వాతంత్య్రం వచ్చిందని ప్రకటన తెలిసిన వెంటనే డప్పులు వాయించారు, నాటకాలు వేశారు. ఎవరికి వారే ‘హమ్మయ్య స్వతంత్రం వచ్చింది’ అంటూ గుండె నిండా ఊపిరి పీల్చుకున్నారు. ఇంటింటా గాంధీగారి చిత్రపటానికి పూలమాలలు వేశారు. కవులంతా కవిత్వం రాసి, గేయంలా పాడారు. ఆ రోజు గుంటూరులో మహావిద్వాంసులైన మహాద్రి వెంకటప్పయ్య శాస్త్రి (మా ముందు తరం) గారి కచేరీ ఏర్పాటు చేశారు. మేమంతా ఆ కచేరీకి హాజరయ్యాం. ఆ రోజు అక్కడకు వచ్చిన వారిలో ఎవరి ముఖాలలో చూసినా ఆనందమే వెల్లివిరిసింది. అప్పట్లో విజయవాడలో ఆకాశవాణి కేంద్రం ఇంకా రాలేదు. మద్రాసు నుంచి ఆంధ్రపత్రిక మాత్రమే వచ్చేది. ఆ పత్రిక వచ్చిన తరవాతే సమాచారం తెలిసేది. అవి అతి విలువైన రోజులు. ప్రతి విషయానికీ విలువ ఇచ్చేవారు. అప్పటి మాటల్లో ఒక జీవం, పవిత్రత ఉండేవి. ప్రతివారి మాటలకు విలువ ఉండేది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఉండేది. వారే మన దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చారు. నేను ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రారంభించిన నాటి నుంచి అంటే 1948 డిసెంబరు 1వ తేదీ నుంచి పదవీ విరమణ వరకు పనిచేశాను. ఆనాటి జ్ఞాపకాలు ఇప్పటికీ ఎంతో సంతోషాన్నిస్తుంటాయి. – అన్నవరపు రామస్వామి (95), ప్రముఖ వయొలిన్ విద్వాంసుడు, విజయవాడ -
ఆ రోజును చూసినవారు
దసరా, దీపావళి పండుగలు జరుపుకున్నట్లుగా స్వాతంత్య్ర దినోత్సవ పండుగ జరుపుకున్నాం. అప్పుడు నాకు 22 సంవత్సరాల వయసు. ఇంటిల్లిపాదీ ఉదయాన్నే తలంట్లు పోసుకుని, కొత్తబట్టలు కట్టుకున్నాం. గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాం. గడపలకు పసుపు రాసి, కుంకుమ పెట్టాం. ఇల్లంతా కళకళలాడింది. రోజూ ఉండే ఇల్లే అయినా ఆ రోజు ఎంతో కొత్తగా అనిపించింది. రకరకాల మిఠాయిలు తయారు చేశాం. ఇంటికి వచ్చినవారందరికీ నిండుగా భోజనం పెట్టాం. అప్పుడు మేం హైదరాబాద్‌లో ఉంటున్నాం. జెండా ఎగురవేయటానికి హైదరాబాద్ ఆకాశవాణి కార్యాలయానికి వెళ్లాం. అప్పటికి ఇంకా డక్కన్ రేడియోగా వ్యవహరించేవారు. ఆ రోజు నేను ఎరుపు అంచు ఉన్న నీలం రంగు పట్టు చీర కట్టుకున్నాను. ఆ చీరంటే నాకు చాలా ఇష్టం. బుచ్చిబాబుగారు ఖద్దరు పైజమా, లాల్చీ కట్టుకున్నారు. పైన వేసుకోవటానికి ముందుగానే జోద్పూర్ కోటు కుట్టించుకున్నారు. ఆ రోజు మద్రాసు నుంచి సినీ నటులు పుష్పవల్లి, భానుమతి గారలు వచ్చారు. జైలు నుంచి విడుదలైన వారిలో కొందరు ఆకాశవాణి ద్వారా ప్రత్యక్షంగా తమ అనుభవాలు పంచుకున్నారు. ఎస్.ఎన్ మూర్తి గారు స్టేషన్ డైరెక్టర్. ఉమామహేశ్వరరావు అనే అనౌన్సర్ ‘భారత దేశం నేటి నుంచి స్వతంత్ర దేశం’ అని అనౌన్స్మెంట్ ఇచ్చారు. వింజమూరి సీత అనసూయలు, టంగుటూరి సూర్యకుమారి దేశభక్తి గీతాలు ఆలపించారు. కవి సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఆ రోజు ఎక్కడ చూసినా, ‘మా ఇంట్లో వాళ్లు ఇన్నిరోజులు జైలుకి వెళ్లొచ్చారు. ఇంత శిక్ష పడింది’ అంటూ అదొక వేడుకగా, కథలుకథలుగా చెప్పుకున్నారు. పిల్లలంతా ఇళ్ల ముందు ముగ్గులు వేశారు. ఎల్బి స్టేడియాన్ని అందంగా అలంకరించారు. జెండాలు ఎగురవేశారు. ఎంతోమంది పిల్లలు, కుటుంబాలను వదులుకుని ఉద్యమంలో పాల్గొని జైలుపాలయ్యారు. వారు జైలుకు వెళ్లినప్పుడు వారి కుటుంబాలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో, ఎలా గడిచిందో ఆ భగవంతుడికే తెలియాలి. ఉద్యమంలో పాల్గొన్న వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయటానికి పార్టీ వారికి ఫండ్స్ ఉండేవి కాదు. జైళ్ల నుండి విడుదలైనవారంతా ఇళ్లకు నడిచి వెళ్లవలసి వచ్చేది. ఇన్నాళ్లు పడిన శ్రమకు ఫలితం లభించిందనే ఆనందమే వారి ముఖాలలో కనిపించింది. ఒకసారి గాంధీగారు హైదరాబాద్ వచ్చినప్పుడు సత్యనారాయణ అనే ఆయన వేసిన పెయింటింగ్ గాంధీగారికి నా చేత ఇప్పించారు. గాంధీగారు స్టేజీ మీద నుంచి కిందకు దిగటానికి, నా భుజాల మీద చేయి వేసుకున్నారు. చాలాకాలం ఆ భుజాన్ని ఎంతో పవిత్రంగా తడుముకునేదాన్ని. స్వాతంత్య్రం వచ్చిన రోజున నాకు ఆ సంఘటన ఒక్కసారి మనసులో స్ఫురించింది. అలాగే ప్రకాశం పంతులు గారు మా ఇంటికి వస్తుండేవారు. మా వారిని ‘ఏరా! బుచ్చీ!’ అంటూ ఆప్యాయంగా పలకరించేవారు. ఆరోజులు ఎంతో గొప్పవి. స్ఫూర్తిదాయకమైనవి. – శివరాజు సుబ్బలక్ష్మి (95), రచయిత్రి (ప్రముఖ రచయిత బుచ్చిబాబు సతీమణి) బెంగళూరు -
జెండా ఎగరేసిన తొలి వనిత భికాజి కామా
దేశం కోసం ఆమె భర్తతోనే విభేదించింది. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా లండన్‌లో ఉండే పోరాడింది. అంతర్జాతీయ వేదికపై తొలిసారి ‘భారత స్వాతంత్య్ర పతాకా’న్ని ఎగురవేసి చరిత్ర సృష్టించింది. దేశానికి స్వాతంత్య్రం వస్తే స్త్రీకి కూడా వస్తుంది అని గట్టిగా విశ్వసించింది. ‘మేడమ్ కామా’గా నాటి యోధులు పిలుచుకున్న ఆమె పరిచయం రేపు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా... ‘చూడండి... భారత స్వాతంత్య్ర పతాక ఆవిర్భావం జరిగింది. దేశం కోసం ప్రాణాలర్పించిన యువ యోధుల రుధిరంతో ఇది పవిత్రమై ఉంది. స్వేచ్ఛను గౌరవించే ప్రపంచవ్యాప్త పౌరులందరూ మా దేశ స్వాతంత్య్ర పోరాటాన్ని సమర్థించాలని ఈ పతాకం సాక్షిగా నేను కోరుతున్నాను’.... 1907 ఆగస్టు 21. అంతర్జాతీయ సోషలిస్ట్ల సమావేశం. స్టట్గార్ట్. జర్మనీ. వేదిక మీద పతాకాన్ని పట్టుకుని, భారతీయ కట్టుబొట్టుతో, ఉద్వేగంతో మాట్లాడుతున్న ఆ ధీరోదాత్తను ఆ సమావేశంలో ఉన్న సుమారు వేయిమంది క్రాంతికారులు ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు. వారికి ఎలా స్పందించాలో తెలియ లేదు. అప్పుడు ఆమె మళ్లీ అంది– ‘జెంటిల్మన్... కమాన్... స్టాండప్ అండ్ సెల్యూట్’. అంతే. అందరూ అప్రయత్నంగా లేచి ఆమె చేతిలో ఉన్న తొలి రూప స్వాతంత్య్ర పతాకానికి సెల్యూట్ చేశారు. అంతర్జాతీయ వేదికపై తొలిసారి భారత స్వాతంత్య్ర పోరాట పతాకాన్ని ఎగురవేసిన ఆమె పేరు భికాజి రుస్తుం కామా. నాటి స్వాతంత్య్ర సంగ్రామ యోధులందరూ ఆమెను ‘మేడమ్ కామా’ అని పిలుచుకునేవారు. బ్రిటిష్ వారు ‘డేంజరస్ అనార్కిస్ట్’, ‘నొటోరియస్ పార్శీ లేడీ’ అని రుసరుసలాడేవారు. ఆమె వారిని అలా గడగడలాడించింది. బాంబే యువతి భికాజి కామా సంపన్న పార్శీ కుటుంబంలో 1861లో పుట్టింది. తండ్రి పెద్ద లాయర్. వ్యాపారవేత్త. కాని భికాజి బాల్యం నుంచే పేదవారి పట్ల ఈ దేశపు సామాన్య ప్రజల పట్ల సానుభూతితో ఉండేది. ఆమె మంచి వక్త. దేశాన్ని, ప్రపంచాన్ని చుట్టి రావాలంటే నాలుగు భాషలు వచ్చి ఉండాలని ఆ రోజుల్లేనే గ్రహించి వీలైనన్ని భాషలు నేర్చుకుంది. 24 ఏళ్ల వయసులో ఆమెకు మరో సంపన్న లాయర్ అయిన రుస్తుం కామాతో వివాహం జరిగింది. ఆమె తలుచుకుంటే ఆ సంపన్న జీవితంతో కోరిన పదవులు పొంది ఉండేది. ఎందుకంటే భర్త బ్రిటిష్‌వారికి సన్నిహితుడు. కాని ఆమె భర్త ధోరణిని అంగీకరించలేదు. బ్రిటిష్ వారిని ఈ దేశం నుంచి వెళ్లగొట్టాలనేది ఆమె ప్రగాఢ వాంఛ. భర్తతో విడాకులకు ఈ ఆలోచనే కారణం. మలుపుతిప్పిన ప్లేగు 1886లో దేశాన్ని ప్లేగు ముంచెత్తింది. ఒక్క ముంబైలోనే 22 వేల మంది మరణించారు. భికాజి కామా తనే ఒక కార్యకర్తగా మారి ప్లేగు బాధితుల వైద్యం కోసం, సహాయం కోసం విస్తృతంగా పని చేసింది. ఆ పనిలో ఆమె కూడా ప్లేగు బారిన పడింది. అయితే దాని నుంచి కోలుకున్నా పూర్తి స్వస్థత పొందలేదు. విదేశాలకు వెళ్లి విశ్రాంతి తీసుకుంటే ఫలితం ఉంటుందని వైద్యులు సలహా ఇవ్వడంతో 1902లో లండన్ వెళ్లింది. ఆ ప్రయాణమే జీవితాన్ని మలుపుతిప్పింది. ఆ తర్వాత దాదాపు 35 ఏళ్ల కాలం విదేశీ నేల మీద ఉంటూనే దేశ స్వాతంత్య్ర కోసం పోరాడాల్సి వచ్చింది. లండన్ నాయకురాలు భికాజి కామా లండన్‌కు చేరుకున్నాక అప్పటికే అక్కడ స్వాతంత్య్ర పోరాటంలో నిమగ్నమై ఉన్న దాదాభాయ్ నౌరోజి, లాలా హర్దయాళ్, శ్యాంజీ కృష్ణవర్మ వంటి ప్రముఖులతో చేతులు కలిపింది. లండన్ హైడ్ పార్క్‌లో భారతదేశంలో బ్రిటిష్ వారి పాలన ఎంత దాష్టికమైనదో ఆమె ఉపన్యాసాలు ఇస్తూంటే గొప్ప ఉద్వేగం కలిగేది. లండన్‌కు చదువుకోవడానికి వచ్చిన వీర్ సావర్కార్ వంటి విద్యార్థులు ఆమెను తమ మార్గదర్శిగా చూసేవారు. అంతేకాదు ఆమె దేశభక్తిని ప్రేరేపించే నిషిద్ధ పత్రికలు నడిపి పాండిచ్చేరి మీదుగా దేశంలోకి స్మగుల్ చేసేది. ఇవన్నీ భారత దేశంలో ఉన్న బ్రిటిష్ వారికి తెలిశాయి. ‘నువ్వు దేశంలోకి తిరిగి రావాలంటే బ్రిటిష్ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించనని హామీ ఇవ్వాలి’ అని కోరారు. మేడమ్ కామా అందుకు నిరాకరించింది. జర్మనీలో తొలిసారి దేశపతాకం ఎగుర వేశాక భారతదేశ ద్వారాలు ఆమెకు శాశ్వతంగా మూతపడ్డాయి. చరిత్రాత్మక ఘట్టం 1905 నుంచి భారత స్వాతంత్య్ర పతాక రూపకల్పనకు ప్రయత్నాలు మొదలయ్యాయి. వివిధ బృందాలు ఈ పనిలో నిమగ్నమయ్యాయి. భికాజి కామా, శ్యాంజీ కృష్ణవర్మ మరికొందరు కలిసి ఒక పతాకాన్ని తయారు చేశారు. దీనికి అంతకుముందే తయారైన కలకత్తా పతాకం స్ఫూర్తి. ఈ పతాకంలో కూడా మూడు రంగులు ఉన్నాయి. ఆకుపచ్చ ఇస్లాంకు, పసుపు హిందూ ధర్మానికి, ఎరుపు బుద్ధిజానికి ప్రతీకలు. తొమ్మిది కమలాలు తొమ్మిది భౌగోళిక ప్రాంతాలకు ప్రతినిధులు. పతాకం మధ్యలో ‘వందే మాతరం’ అని ఉంటుంది. పతాకంలో ఇస్లాం సంకేతం నెలవంక, హిందూ సంకేతం సూర్యుడు ఉంటాయి. ఈ పతాకాన్ని భికాజీ జర్మనీలో తొలిసారి ఎగురు వేసి ప్రపంచానికి భారతదేశంలో జరుగుతున్న స్వాతంత్య్ర పోరాటాన్ని తెలియపరిచింది. ఇది జరిగాక ఆమె బ్రిటిష్ వారికి ప్రధాన శతృవుగా మారింది. ఆమెను బంధించి అండమాన్‌కు పంపాలని అనుకున్నారు. పారిస్‌లో ఉంటూ... భికాజి కార్యకలాపాలను బ్రిటిష్‌వారు సహించలేకపోయారు. దాంతో ఆమె లండన్ నుంచి పారిస్ చేరుకుంది. అక్కడ ‘పారిస్ ఇండియన్ సొసైటీ’ని ప్రారంభించింది. ఫ్రెంచ్ సోషలిస్ట్ పార్టీ సభ్యురాలైంది. ఆమెకు లెనిన్తో, గోర్కితో స్నేహం ఉండేది. లెనిన్ ఆమెను రష్యా వచ్చేయన్నాడని అంటారు. కాని ఆమె పారిస్‌లోనే ఉంటూ దేశ విదేశాల్లో భారత స్వాతంత్య్ర సంగ్రామానికి మద్దతు కూడగట్టింది. ‘రక్తపాత రహిత పోరాటం మా లక్ష్యం. కుదరకపోతే రక్తం పారించైనా స్వాతంత్య్రం పొందుతాం’ అని అమెరికాలో ఆమె చేసిన ప్రసంగం ప్రసిద్ధం. కైరోలో ఒక సభలో ‘ఇక్కడంతా ఈజిప్టు పుత్రులే ఉన్నారు. పుత్రికలు ఎక్కడ. స్త్రీలు లేకుండా ఏ ప్రగతైనా ఎలా సాధ్యం’ అని ప్రశ్నించింది. చివరి రోజులు మొదటి ప్రపంచ యుద్ధంలో ఫ్రాన్స్, ఇంగ్లాండ్ జట్టు కట్టాయి. అంతవరకూ భికాజీని కాపాడుకుంటూ వచ్చిన ఫ్రాన్స్ ఇప్పుడు ఇంగ్లాండ్‌ను సంతృప్తి పరచడానికి ఆమె పట్ల కఠినంగా వ్యవహరించాల్సి వచ్చింది. భికాజి పారిస్ వదిలి రెండు మూడు చోట్ల తల దాచుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆమెకు పక్షవాతం వచ్చింది. భారతదేశాన్ని చూడాలని, ఆ నేల మీదే మరణించాలని ప్రగాఢంగా కోరుకుంది. 1935 నవంబర్‌లో 74 ఏళ్ల వయసులో అనారోగ్యంతో అడుగుపెట్టింది. ఆ తర్వాత 9 నెలలకు ఆగస్టు 13న 1936లో మరణించింది. ఆమె యావదాస్తి ప్రజాహిత కార్యకలాపాల కోసం దానం చేసేసింది. భికాజీని తక్కువగా గుర్తు చేసుకుంటారు. కాని ఆ యోధురాలి స్మృతి మరల మరల దుమ్ము తెరలను తొలగించుకుని నవతరాలకు స్ఫూర్తిని ఇస్తూనే ఉంటుంది. – సాక్షి ఫ్యామిలీ -
నాటి సమరంలో మనవారు సైతం...
సాక్షి, విజయనగరం : భారత దేశ స్వాతంత్య్ర సమరంలో విజయనగరానికి చెందిన యోధులు ఉన్నారు. ఆ ఉద్యమంలో జిల్లా పాత్రను ప్రస్ఫుటింపజేసిన గొప్ప వ్యక్తిగా కె.ఎస్.తిలక్ నిలుస్తారు. విజయనగరంలో పుట్టి పెరిగిన తిలక్ దేశంలో పలు ప్రాంతాల్లో జరిగిన పోరాటాల్లో చురుగ్గా పాల్గొన్నారు. యువతలో స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిల్చారు. క్విట్ ఇండియా ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. బ్రిటిష్ వారి ఆగ్రహానికి గురై జైలు శిక్ష అనుభవించారు. పార్లమెంట్‌కు ఎన్నికైన తిలక్ బెస్ట్ పార్లమెంటేరియన్‌గా గుర్తింపు దక్కించుకున్నారు. కాంగ్రెస్‌తో పాటు అనేక పార్టీలు రాజకీయాల్లోకి ఆహ్వానించినా పదవుల కోసం పార్టీలు మారకుండా అదే పార్టీలో కొనసాగి, తర్వాత రాజకీయాలకు దూరమైన నైతిక విలువలు కలిగిన నాయకుడాయన. చురుకైన నాయకుడు ఆదిరాజు జగన్నాథశర్మ స్వాతంత్య్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న మరో నాయకుడు ఆదిరాజు జగన్నాథశర్మ. కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన అనేక పోరాటాల్లో ఆయన పాల్గొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. చివరికి జైలు శిక్ష అనుభవించారు. విజయనగరం మహారాణిపేటలో నివసించిన శర్మ స్వాతంత్య్రం తర్వాత తెలుగు పండిట్‌గా వృత్తిని కొనసాగించారు. ఎటువంటి ప్రయోజనాలు ఆశించకుండా పోరాటంలో పాల్గొన్న నాయకుడు ఆయన. జొన్నవలసలో ఉద్యమ తేజం విజయనగరం మండలంలోని జొన్నవలసకు చెందిన మరో ఉద్యమ తేజం పూసపాటి బుచ్చిసీతారామ చంద్రరాజు. 1888లో జన్మించిన ఈయన సత్యాగ్రహ ఉద్యమ జిల్లా నాయకునిగా నామినేట్ అయి ఉద్యమాన్ని నడిపారు. 1930లో జైలుకు వెళ్లి కఠిన కారాగారశిక్ష అనుభవించారు. గాంధీ, ఇర్విన్ ఒడంబడిక ఫలితంగా 1931 మార్చి11న విడుదలయ్యారు. కాంగ్రెస్ పార్టీ కీలక పదవులు అధిరోహించిన ఆయన 1973లో కన్నుమూశారు. స్వతహాగా ఆస్తిపరులైనా, అన్నింటినీ విడిచిపెట్టి తెల్లదొరలను ఎదిరించిన నాయకునిగా గుర్తింపు పొందారు. స్వాతంత్య్రపోరులో చీపురుపల్లి యోధుడు స్వాతంత్య్ర సమరయోధుడు మొదలవలస అబ్బాయినాయుడు చీపురుపల్లి : దేశంలో ఎంతో మంది సమరయోధుల త్యాగఫలంలో స్వాతంత్య్రాన్ని సాధించుకుంటే అందులో చీపురుపల్లికి చెందిన వ్యక్తుల పాత్ర కూడా కాస్త ఉండడంతో ఎంతో గొప్ప విషయం. అందులో మొదలవలస అబ్బాయినాయుడును స్థానికంగా గుర్తు చేసుకుంటారు. 1914లో శ్రీకాకుళం జిల్లాలో ని షేర్‌మహమ్మద్‌పురంలో జన్మించిన అబ్బాయినాయుడు చీపురుపల్లిలో స్థిరపడ్డారు. ఆయన యవ్వనంలోనే స్వాతంత్య్ర సాధన కోసం జరుగుతున్న ఉద్యమానికి ఆకర్షితులయ్యారు. అందులో భాగంగానే అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ సమయంలోనే బ్రిటిష్ ప్రభుత్వాన్ని స్తంభింపజేయడానికి దేశ వ్యాప్తంగా రైళ్లను నిలిపివేయడం, పోలీస్ స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలు ధ్వంసం చేయడం వంటి కార్యక్రమాలు జరుగుతుండగా అబ్బాయినా యుడు చౌదరి సత్యనారా యణ, గౌతు లచ్చన్నలను ఆదర్శంగా తీసుకుని చీపురుపల్లి నుంచి జి.సిగడాం, పొందూరు రైల్వేస్టేషన్ల మధ్య పట్టాలు తప్పించి, రైల్వే టెలిఫోన్ తీగెలను తెంచేశారు. దీంతో ఆయన్ను పదిహేను రోజులు చీపురుపల్లి సబ్జైల్లో ఉంచారు. టంగుటూరి ప్రకాశం పం తులు, తెన్నేటి విశ్వనాథం, వి.వి.గిరి వంటి వారితో తనకు ఉన్న ఆత్మీయ సంబంధాన్ని అబ్బాయినాయుడు తన డైరీలో కూడా రాసుకున్నారు. 1981 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వాతంత్య్ర సమరయోధునిగా గుర్తించి గౌర వ వేతనం మంజూరు చేసింది. 1991లో చీపురుపల్లిలో కన్నుమూశారు. -
పోరాట ధీరులు బొబ్బిలి వీరులు
సాక్షి, బొబ్బిలి : స్వాతంత్య్ర పోరాటంలో బొబ్బిలి వాసులు అనేక మంది పాల్గొన్నా చరిత్ర, రికార్డుల ఆధారంగా కొంతమంది పేర్లే ప్రముఖంగా వినిపించాయి. వీరిలో బొబ్బిలికి చెందిన అయ్యగారి అప్పలనరసయ్య ఒకరు. శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొన్నందున ఆయనకు 1932లో రెండేళ్లు కఠిన కారాగార శిక్ష విధించారు. మద్రాసు, వెల్లూరు జైలులో శిక్ష అనుభవించి బొబ్బిలి వచ్చారు. అలాగే బొబ్బిలికి చెందిన అయ్యగారి సత్యనారాయణ, లక్ష్మీదేవి దంపతులు, అయ్యగారి రామపాపారావు స్వాతంత్య్ర పోరాటంలో చురుకైన పాత్ర పోషించారు. అప్పట్లో వీరికి బ్రిటిష్ వారు కొరడాదెబ్బల శిక్ష విధించేవారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ముల పిల్లలు కాగా వీరంతా ప్రస్తుతం కాలం చేశారు. బొబ్బిలిలో చర్చివీధిలో వీరికి ఇళ్లు ఉండేవి. వీరి కుటుంబసభ్యులు ఈ ప్రాంతంనుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయి ఆస్తులు అమ్ముకున్నారు. గాంధీజీకి ఆశ్రయమిచ్చిన సావిత్రమ్మ పట్టణానికి చెందిన పుల్లెల సావిత్రమ్మ గాంధీకి భోజన ఏర్పాట్లు చేశారు. మూడేళ్లక్రితమే కాలం చేసిన సావిత్రమ్మ 1923వ సంవత్సరంలో ఆమె తన మేనత్త, మేనమా మ ఇంట్లో ఇచ్చాపురంలో ఉండేవారు. పుల్లెల సన్యాసిరావుతో ఆమెకు వివాహం కాగా, ఆమె బావ పుల్లెల శ్యామసుందరరావు జమీందారు. గౌతులచ్చన్న గురువు అయిన శ్యామసుందరరావు అప్పట్లో స్వాతంత్య్ర సమరంలో చురుకైన పాత్రపోషించారు. 1923లో గాంధీ రాజకీయసభ కోసం బరంపురం వెళ్తూ శ్యామసుందరరావు ఇంట్లో బసచేశారు. ఆ సమయంలో గాంధీకి సావిత్రమ్మ అన్ని రకాల వంటకాలు సిద్ధం చేశారు. అయితే అవేవీ గాంధీ తీసుకోకుండా కేవలం మేకపాలు, వేరుశనగలు అడిగి తిన్నారు. అప్పుడే ఆయనతో మాట్లాడినట్టు సావిత్రమ్మ చెప్పేవారు. -
గాంధీ అడుగుపెట్టిన గడ్డ
సాక్షి, ఆముదాలవలస : అహింసా మార్గం లో ఉద్యమాలు చేసి తెల్లదొరలను ఎదురించి దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానుభావుడు గాంధీ. అంతటి గొప్ప వ్యక్తి ఆమదాలవలస మండలం దూసి గ్రామం సమీపంలో గల దూసి రైల్వేస్టేషన్లో అడుగుపెట్టి ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తి నింపారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా ప్రజలను ఉద్యమాల్లో భాగస్వామ్యం చేసి రైలులో ప్రయాణించారు. దీనిలో భాగంగా దూసి రైల్వేస్టేషన్లో దిగి సుమారు 15 నిమిషాల పాటు ప్రసంగించారు. అలనాటి గుర్తులు ఇంకనూ ఆ స్టేషన్లో ఉన్నాయి. బ్రిటీష్ పరిపాలను ఏ విధంగా తిప్పికొట్టాలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఉద్యమం తీరును వివరించారు. అనంతరం రైల్వేస్టేషన్ ఆవరణలోనే గాంధీజీ మర్రి మొక్కను నాటారు. అప్పుడు నాటిన మొక్క వృక్షమై రెండు ఎకరాల స్థలంలో ఆవరించి ఉంది. 77 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ వృక్షం గాంధీజీ నాటినట్లు స్థానికులు చెబుతున్నారు. దూసి రైల్వేస్టేషన్లో గాంధీజీ అడుగుపెట్టినందున అప్పట్లో గాంధీ రైల్వేస్టేషన్‌గా పేరు పెట్టాలని అనుకున్నారు. ఏళ్లు గడిచినా ఆ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. -
ఓ లుక్ వేయండి
స్వాతంత్య్ర దినోత్సవం రోజున సినిమా ఫ్యాన్స్ అందరికీ ఫుల్ ట్రీట్. ఎన్టీఆర్ ‘అరవింద సమేత’తో మాస్ టీజర్ అందిస్తే, వరుణ్ తేజ్ ‘అంతరిక్షం’ ఎలా ఉండబోతుందో అని చిన్న శాంపిల్ చూపించారు. ‘కేరాఫ్ కంచర పాలెం’లో ఉన్న మనుషులు ఎలా ఉంటారో, రాజుగాడికి 50 ఏళ్లు వచ్చినా పెళ్లి అవుతుందో లేదో అనే టెన్షన్ పెట్టారు. బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ ‘భారత్’ అంటూ బలమైన డైలాగ్ వినిపిస్తే, ‘మణికర్ణిక’గా కంగనా వీరనారి ప్రతాపం చూపించారు. తమిళంలో జ్యోతిక ‘మహిళలూ వినండి... మీకు కొన్ని సూచనలు ఉన్నాయి’ అన్నారు. ఏది ఏమైనా అన్ని ఇండస్ట్రీల మూవీ లవర్స్‌కు ఐ–ఫీస్ట్. ఓ లుక్ వేద్దాం. ఎంటబడ్డానా నరికేస్తా... ‘ఆది, సాంబ’ వంటి ఫ్యాక్షన్ సినిమాలతో మాస్ హీరోగా పాపులారిటీ సంపాదించారు ఎన్టీఆర్. మళ్లీ ఆ జానర్‌ని చాలా కాలంగా పూర్తి స్థాయిలో టచ్ చేయలేదు. కానీ త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రంతో మళ్లీ ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌ను టచ్ చేసినట్టు కనిపిస్తుంది. సీమలో వీర రాఘవ రెడ్డి వీర విహారం ఎలా ఉంటుందో టీజర్ ద్వారా చిన్న శాంపిల్‌ని కూడా చూపించారు త్రివిక్రమ్. ‘మండు వేసంగి గొంతులో దిగితే ఎట్టుంటదో తెలుసా? మచ్చల పులి మొహం మీద గాండ్రిస్తే ఎలా ఉంటుందో తెలుసా? మట్టి తుపాను చెవిలో మోగితే ఎట్టుంటాదో తెలుసా?’ అంటూ మూడు వాక్యాల్లో హీరో పవర్ఫుల్ క్యారెక్టరైజేషన్‌ని జగపతిబాబు వాయిస్ ద్వారా మనకు పరిచయం చేశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. యస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే కథానాయిక. బుధవారం ఈ చిత్రం టీజర్‌ను రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ పట్టుకున్న కత్తికి తన కలంతో పదును పెట్టారు త్రివిక్రమ్. ‘కంటబడ్డావా కనికరిస్తానేమో.. ఎంటబడ్డానా నరికేస్తా ఓబా..’ అంటూ సీమ యాసలో ఎన్టీఆర్ పలికిన సంభాషణలు టీజర్‌కి హైలైట్ అని చెప్పొచ్చు. జగపతిబాబు, నాగబాబు, ఈషా రెబ్బా ముఖ్య పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రానికి యస్.యస్. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. అక్టోబర్ 10న ఈ చిత్రం విడుదల కానుంది. కంచరపాలెం ప్రేమ ఫస్ట్ లుక్, ట్రైలర్స్ లాంటివి ఏమీ రిలీజ్ కాకముందే న్యూయార్క్ ఇండియన్æ ఫిల్మ్ ఫెస్టివల్‌కి అఫీషియల్ ఎంట్రీ అందుకొని అందరి దృష్టినీ ఆకట్టుకున్న ఇండిపెండెంట్ సినిమా ‘కేరాఫ్ కంచరపాలెం’. మొత్తం నూతన నటీనటులతోనే దర్శకుడు వెంకటేశ్ మహా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని పరుచూరి విజయ ప్రవీణ నిర్మించారు. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రానా దగ్గుబాటి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. కంచరపాలెం అనే ఊరిలోని ప్రజలనే పాత్రలుగా.. వాళ్లందరికీ నటనలో వర్క్‌షాప్ చేసి కంచరపాలెం ఊళ్లోనే మొత్తం చిత్రాన్ని షూటింగ్ చేశారు దర్శకుడు వెంకటేశ్. సెప్టెంబర్ 7న రిలీజ్ కానున్న ఈ చిత్రం ట్రైలర్‌ను బుధవారం రిలీజ్ చేశారు. ఒక ఊరిలోనే నాలుగు భిన్న వయసుల వారి మధ్య ప్రేమకథగా తెరకెక్కిందీ చిత్రం. మా సూచనలు వినండి స్వాతంత్య్ర దినోత్సవం నాడు కొన్ని సూచనలు ఇస్తున్నారు జ్యోతిక. ఇదంతా తన లేటెస్ట్ సినిమా ‘కాట్రిన్ మొళి’ ఫస్ట్ లుక్‌లో భాగమే. రాధామోహన్ దర్శకత్వంలో జ్యోతిక ముఖ్య పాత్రలో రూపొందిన చిత్రం ‘కాట్రిన్ మొళి’. హిందీ హిట్ చిత్రం ‘తుమ్హారీ సులూ’కు రీమేక్ ఇది. ఇందులో జ్యోతిక రేడియో జాకీగా కనిపిస్తారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను బుధవారం హీరో సూర్య రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్‌లో ‘‘మనసుకి నచ్చిన బట్టలు వేసుకోవచ్చు. ఆకలేస్తే భర్త కంటే ముందే తినొచ్చు. భర్త ఒక చెంప మీద కొట్టాడని మరో చెంప చూపించాల్సిన అవసరం లేదు. మనకి నచ్చినది మనం చేయొచ్చు. కావాలనుకుంటే బొద్దుగా ఉండొచ్చు. ఇంట్లో రోజువారి పనులను షేర్ చేసుకొమ్మని భర్తను అడగొచ్చు. సంపాదించొచ్చు, ఇంట్లో కూడా ఇవ్వాలి, నచ్చినంత ఖర్చు పెట్టుకోవచ్చు, మనసులో కాదు.. అనుకున్నదాన్ని బయటకు అవును అని అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఉంది. స్త్రీ, పురుషుడు ఒకటే అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి’’ అంటూ పది రూల్స్ ఉన్న బోర్డ్‌ని పట్టుకున్న జ్యోతిక ఫొటోను ఫస్ట్ లుక్‌గా రిలీజ్ చేశారు ‘కాట్రిన్ మొళి’ చిత్రబృందం. ఇందులో మంచు లక్ష్మీ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. అక్టోబర్ 18న రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని జి. ధనుంజయ్ నిర్మించారు. నాకు రెండూ ఉన్నాయి సుల్తాన్, టైగర్ జిందా హై తర్వాత సల్మాన్ ఖాన్ – అలీ అబ్బాస్ జాఫర్ కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం ‘భారత్’. దేశభక్తి చిత్రంగా వస్తున్న ఈ చిత్రం డైలాగ్ టీజర్‌ను బుధవారం రిలీజ్ చేశారు. ‘‘కొన్ని బంధాలు రక్తం వల్ల ఏర్పడతాయి.. మరికొన్ని మట్టి వల్ల ఏర్పడతాయి. నా దగ్గర అవి రెండూ ఉన్నాయి’’ అంటూ సల్మాన్ ఖాన్ డైలాగ్స్ పలికారు. పీరియాడికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ సర్కస్ ఆర్టిస్ట్‌గా కనిపించనున్నారు. పర్సనల్ కారణాలతో ప్రియాంకా చోప్రా ఈ సినిమాలో నుంచి హీరోయిన్గా తప్పుకున్న తర్వాత కత్రినా కైఫ్ ఆ స్థానంలోకి వచ్చారు. మరో బ్యూటీ దిశా పాట్నీ కూడా ఇందులో స్పెషల్ రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం మాల్టాలో షూటింగ్ జరుగుతున్న ఈ చిత్రంలో నోరా ఫతేహి ఐటమ్ సాంగ్‌ను షూట్ చేయనున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది రంజాన్‌కి రిలీజ్ కానుంది. వీరనారి ఝాన్సీ రణభూమిలో మణికర్ణిక ఎంత రౌద్రంగా, ఆవేశంగా ఉంటారో చిన్నప్పుడు ఎన్నో కథలు విన్నాం, చదువుకున్నాం. వెండి తెరపై చూపించదలిచారు దర్శకుడు క్రిష్, కంగనా రనౌత్. ఝాన్సీ పోరాట పటిమ ఏ విధంగా ఉంటుందో మనకు సరిగ్గా అంచనా లేదు. ఆ ఆవేశాన్ని ఫస్ట్ లుక్ ద్వారా కొంచెంగా చూపించారు ‘మణికర్ణిక’ చిత్రబృందం. కంగనా రనౌత్ ముఖ్య పాత్రలో వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవితం ఆధారంగా రూపొందుతున్న పీరియాడికల్ మూవీ ‘మణికర్ణిక’. క్రిష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్, కమల్ జైన్ సంయుక్తంగా నిర్మించిన చిత్రమిది. భుజాన బిడ్డ, మొహంలో మొండి ధైర్యంతో యుద్ధ భూమిలో కత్తి పట్టుకున్న కంగనా రనౌత్ ఫొటోను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఫస్ట్ లుక్లా రిలీజ్ చేశారు. ‘బాహుబలి’ వంటి బ్లాక్బాస్టర్ చిత్రాన్ని రచించిన విజయేంద్రప్రసాద్ ఈ చిత్రానికి కథ–స్క్రీన్ ప్లే అందించారు. వచ్చే ఏడాది జనవరి 25 ఈ చిత్రం విడుదల కానుంది. అలాగే రవితేజ– శ్రీను వైట్ల కాంబినేషన్లో రూపొందుతున్న ‘అమర్ అక్బర్ ఆంటొని’ చిత్రం కాన్సెప్ట్ పోస్టర్, తమిళంలో ‘జయం’ రవి ‘అడంగమారు’ ట్రైలర్స్ కూడా రిలీజ్ చేశాయి. మరో ప్రపంచంలోకి... వరుణ్ తేజ్ ఆకాశానికి నిచ్చెన వేశారు. అంతరిక్ష వీధిలో తన విధి నిర్వహించడానికి ఎన్నో సాహసాలు చే శారట. మరి ఆ విశేషాలన్నీ చూడాలంటే డిసెంబర్ 21 వరకూ వేచి చూడాల్సిందే. వరుణ్ తేజ్ హీరోగా ‘ఘాజీ’ ఫేమ్ సంకల్ప్ రెడ్డి రూపొందిస్తున్న స్పేస్ మూవీ ‘అంతరిక్షం 9000కేయంపిహెచ్’. ఫస్ట్ తెలుగు స్పేస్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని సాయిబాబు, జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇందులో అదితీ రావ్ హైదరీ, లావణ్య త్రిపాఠి కథానాయికలుగా నటిస్తున్నారు. ఇండిపెండెన్స్ డే స్పెషల్‌గా ఏదో మిషన్‌లో నిమగ్నమై ఉన్న వరుణ్ తేజ్ లుక్‌ను ఫస్ట్ లుక్‌గా చిత్రబృందం రిలీజ్ చేశారు. ఈ సినిమా కోసం జీరో గ్రావిటీ సెట్‌ని డిజైన్ చేశారు. హాలీవుడ్ స్టైల్ యాక్షన్ సీక్వెన్స్ డిజైన్ చేస్తున్నారు. దాని కోసం యూనిట్ అంతా జీరో గ్రావిటీలో శిక్షణ కూడా తీసుకున్నారు. ‘అంతరిక్షం 9000 కీమీ’ చిత్రాన్ని డిసెంబర్ 21న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘‘మీ అందరి కోసం అవుట్ ఆఫ్ ది వరల్డ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నాం’’ అని వరుణ్ తేజ్ అన్నారు.. ఈ చిత్రానికి సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి. కెమెరా: జ్ఞానశేఖర్. -
సివిక్ సెంటర్లో లేజర్ షో
న్యూఢిల్లీ: నగరం నడిబొడ్డున ఉన్న పురపాలక సంస్థల పరిపాలనా కేంద్రం సివిక్ సెంటర్లో స్వాతంత్య్ర దినోత్సవం రోజున మువ్వన్నెల రంగులతో లేజర్ షో ఏర్పాటు చేయనున్నారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌కు ఎదురుగా ఉన్న ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్డీఎంసీ) తన ప్రధాన కార్యాలయంలో లేజర్ షోకు ఏర్పాట్లు చేసింది. ఇంకా ఆ రోజున వీధి ప్రదర్శనలు, ఇతర కార్యక్రమాలకు కూడా రూపకల్పన చేసింది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా మొదటిసారిగా తాము లేజర్ షోను ఏర్పాటు చేస్తున్నామని ఎన్డీఎంసీ పౌర సంబంధాల అధికారి యోగేంద్ర సింగ్ మాన్ చెప్పారు. ఆ రోజు సాయంత్రం తమ ప్రధాన కార్యాలయం రంగుల హరివిల్లుగా మారిపోతుందన్నారు. ఈ కార్యక్రమాలకు సూత్రప్రాయంగా అనుమతి లభించిందని చెప్పారు. చీకటి పడిన వెంటనే దాదాపు నాలుగు గంటల పాటు ఈ షో కొనసాగుతుందన్నారు. కరోల్‌బాగ్‌లోని అజ్మల్ ఖాన్ పార్కులో 12, 13 తేదీల్లో మేళా నిర్వహిస్తామని, ఇటీవల జాతీయ ప్రాదేశిక ప్రాంతంలో ప్రాచుర్యం పొందిన వీధి ప్రదర్శన ‘రహగిరి’ని సాయంత్రం 4.00 నుంచి 7.00 గంటల మధ్య ప్రదర్శిస్తామని మాన్ చెప్పారు. నిత్యం రద్దీగా ఉండే చాందినీ చౌక్ ప్రాంతంలో కొన్ని గంటల పాటు వాహనాలు కనిపించకపోవడం ప్రజలకు ఆసక్తిగా మారగలదని ఆయన పేర్కొన్నారు. దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్డీఎంసీ) కూడా 68వ స్వాతంత్య్ర దినోత్సవాలను ప్రత్యేకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఎస్డీఎంసీ ఇంటింటి పారిశుధ్య కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రజలు పౌర స్పృహను ప్రదర్శించాలని కోరే లక్ష కరపత్రాలను ముద్రించామని వాటిని స్కూలు పిల్లలు పంచి పెడతారని ఎస్డీఎంసీ పీఆర్ఓ ముఖేశ్ యాదవ్ చెప్పారు. -
ఇండిపెండెన్స్ డే స్పెషల్ నాలుగు గంటలు ఉచితం
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినాన నగరవాసులకు నాలుగు గంటల ఉచిత ప్రయాణం కల్పించేందుకు ఢిల్లీ రవాణా సంస్థ (డీటీసీ) ముందుకు వచ్చింది. ఉదయం 6.00 గంటల నుంచి 10. గంటల వరకు నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా ఉచితంగా ప్రయాణించవచ్చని డీటీసీ తెలిపింది. అలాగే 15వ తేదీన ఎర్రకోట వద్ద సాధారణ ప్రజానీకానికి 10వేల సీట్లు కేటాయించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొదటిసారిగా ఎర్రకోట నుంచి ఉపన్యసించనున్న సందర్భంగా తొలిసారిగా సాధారణ ప్రజలను ఈ వేడుకలకు అనుమతించనున్నారు. ఎర్రకోటకు కుడివైపున ఈ సీట్లు ఏర్పాటు చేయనున్నారు. ఆ వైపునే మరో 10వేల మంది స్కూలు పిల్లలు మూడు రంగుల దుస్తుల్లో ఆసీనులవుతారు. ఈ పదివేల మంది కోసం ట్రాఫిక్ నిర్వహణ, భద్రతాపరమైన తనిఖీల కోసం ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు చెప్పారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తాము కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని డీటీసీ ప్రతినిధి ఆర్ఎస్ మిన్హాస్ చెప్పారు. ఆ రోజున ఎర్రకోట వైపు వెళ్లే బస్సుల సంఖ్యను పెంచుతామని తెలిపారు. వేడుకలకు హాజరయ్యే ప్రజలు తమతో పాటు సెల్ఫోన్లు, కెమెరాలు, బైనాక్యులర్స్, హ్యాండ్‌బ్యాగులు, బ్రీఫ్‌కేసులు, సిగరెట్ లైటర్లు, రేడియోలు, టిఫిన్ బాక్సులు, నీళ్ల సీసాలు తీసుకుని రాకూడదని అధికారులు స్పష్టం చేశారు.వివిధ ఉగ్రవాద సంస్థల నుంచి ప్రధాని మోడీకి భద్రతాపరమైన ముప్పు ఉందంటూ హెచ్చరికలు జారీ అయిన నేపథ్యంలో భద్రతను మరింత పెంచనున్నామని పేర్కొన్నారు. ఎటువంటి ఉగ్ర దాడులనైనా తిప్పికొట్టేందుకు నగరంలో బహుళ అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. వేల సంఖ్యలో సాయుధ సిబ్బంది నగరంపై డేగకన్ను వేసి ఉంచుతారని చెప్పారు. నగరమంతటా ముఖ్యంగా ఎర్రకోట వద్ద ఉపరితలం నుంచి గగనతలం వరకు భద్రతా ఏర్పాట్లు చేశామని తెలిపారు. రాజ్‌ఘాట్‌తో పాటు, ప్రధాన మంత్రి ఎర్రకోటకు ప్రయాణించే మార్గంలో కూడా భద్రతను మరింత పటిష్టం చేశామని చెప్పారు. మార్కెట్లు, విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, అంతర్రాష్ట్ర బస్సు టెర్మినల్స్, మెట్రోస్టేషన్లు, వ్యూహాత్మకంగా ప్రాధాన్యతగల ప్రాంతాల్లో వేల సంఖ్యలో ఢిల్లీ పోలీసులు, పారా మిలటరీ దళాలను మోహరించనున్నారు. గగనతలంలో హెలికాప్టర్ల ద్వార గస్తీ నిర్వహించడంతో పాటు ఎర్రకోట చుట్టూ గగనతల రక్షణ యంత్రాంగాన్ని కూడా సిద్ధంగా ఉంచుతామని అధికారులు పేర్కొన్నారు. ఎర్రకోట వద్ద ట్రాఫిక్ నిర్వహణకు, భద్రతకు, తనిఖీలకు ఐదువేల మంది ఢిల్లీ పోలీసులను మోహరిస్తామని తెలిపారు. ఎర్రకోటకు సమీపంలో ఉన్న ఎత్తయిన భవనాలపై జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్జీ)కి చెందిన షార్ప్షీటర్లను మోహరించనున్నారు. ఎర్రకోట వద్ద ఏర్పాట్లపై భద్రతా సంస్థలు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నాయని చెప్పారు. ఏదైనా ఉగ్రవాద దాడి జరిగితే వెంటనే ప్రధానితో పాటు ఇతర నాయకులకు రక్షణ కల్పించేందుకు ‘సురక్షిత గృహాల’ను గుర్తించామని కూడా అధికారులు చెప్పారు.