ఆ రోజును చూసినవారు | Author Sivaraju Subbalakshmi Speaks About Independence Day Moments | Sakshi
Sakshi News home page

ఆ రోజును చూసినవారు

Published Sat, Aug 15 2020 1:16 AM | Last Updated on Sat, Aug 15 2020 1:18 AM

Author Sivaraju Subbalakshmi Speaks About Independence Day Moments - Sakshi

దసరా, దీపావళి పండుగలు జరుపుకున్నట్లుగా స్వాతంత్య్ర దినోత్సవ పండుగ జరుపుకున్నాం. అప్పుడు నాకు 22 సంవత్సరాల వయసు. ఇంటిల్లిపాదీ ఉదయాన్నే తలంట్లు పోసుకుని, కొత్తబట్టలు కట్టుకున్నాం. గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాం. గడపలకు పసుపు రాసి, కుంకుమ పెట్టాం. ఇల్లంతా కళకళలాడింది. రోజూ ఉండే ఇల్లే అయినా ఆ రోజు ఎంతో కొత్తగా అనిపించింది. రకరకాల మిఠాయిలు తయారు చేశాం. ఇంటికి వచ్చినవారందరికీ నిండుగా భోజనం పెట్టాం. అప్పుడు మేం హైదరాబాద్‌లో ఉంటున్నాం. జెండా ఎగురవేయటానికి హైదరాబాద్‌ ఆకాశవాణి కార్యాలయానికి వెళ్లాం. అప్పటికి ఇంకా డక్కన్‌ రేడియోగా వ్యవహరించేవారు.

ఆ రోజు నేను ఎరుపు అంచు ఉన్న నీలం రంగు పట్టు చీర కట్టుకున్నాను. ఆ చీరంటే నాకు చాలా ఇష్టం. బుచ్చిబాబుగారు ఖద్దరు పైజమా, లాల్చీ కట్టుకున్నారు. పైన వేసుకోవటానికి ముందుగానే జోద్‌పూర్‌ కోటు కుట్టించుకున్నారు. ఆ రోజు మద్రాసు నుంచి సినీ నటులు పుష్పవల్లి, భానుమతి గారలు వచ్చారు. జైలు నుంచి విడుదలైన వారిలో కొందరు ఆకాశవాణి ద్వారా ప్రత్యక్షంగా తమ అనుభవాలు పంచుకున్నారు. ఎస్‌.ఎన్‌ మూర్తి గారు స్టేషన్‌ డైరెక్టర్‌. ఉమామహేశ్వరరావు అనే అనౌన్సర్‌ ‘భారత దేశం నేటి నుంచి స్వతంత్ర దేశం’ అని అనౌన్స్‌మెంట్‌ ఇచ్చారు. వింజమూరి సీత అనసూయలు, టంగుటూరి సూర్యకుమారి దేశభక్తి గీతాలు ఆలపించారు. కవి సమ్మేళనం ఏర్పాటు చేశారు.

ఆ రోజు ఎక్కడ చూసినా, ‘మా ఇంట్లో వాళ్లు ఇన్నిరోజులు జైలుకి వెళ్లొచ్చారు. ఇంత శిక్ష పడింది’ అంటూ అదొక వేడుకగా, కథలుకథలుగా చెప్పుకున్నారు. పిల్లలంతా ఇళ్ల ముందు ముగ్గులు వేశారు. ఎల్‌బి స్టేడియాన్ని అందంగా అలంకరించారు. జెండాలు ఎగురవేశారు. ఎంతోమంది పిల్లలు, కుటుంబాలను వదులుకుని ఉద్యమంలో పాల్గొని జైలుపాలయ్యారు. వారు జైలుకు వెళ్లినప్పుడు వారి కుటుంబాలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో, ఎలా గడిచిందో ఆ భగవంతుడికే తెలియాలి. ఉద్యమంలో పాల్గొన్న వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయటానికి పార్టీ వారికి ఫండ్స్‌ ఉండేవి కాదు. జైళ్ల నుండి విడుదలైనవారంతా ఇళ్లకు నడిచి వెళ్లవలసి వచ్చేది. ఇన్నాళ్లు పడిన శ్రమకు ఫలితం లభించిందనే ఆనందమే వారి ముఖాలలో కనిపించింది.

ఒకసారి గాంధీగారు హైదరాబాద్‌ వచ్చినప్పుడు సత్యనారాయణ అనే ఆయన వేసిన పెయింటింగ్‌ గాంధీగారికి నా చేత ఇప్పించారు. గాంధీగారు స్టేజీ మీద నుంచి కిందకు దిగటానికి, నా భుజాల మీద చేయి వేసుకున్నారు. చాలాకాలం ఆ భుజాన్ని ఎంతో పవిత్రంగా తడుముకునేదాన్ని. స్వాతంత్య్రం వచ్చిన రోజున నాకు ఆ సంఘటన ఒక్కసారి మనసులో స్ఫురించింది. అలాగే ప్రకాశం పంతులు గారు మా ఇంటికి వస్తుండేవారు. మా వారిని ‘ఏరా! బుచ్చీ!’ అంటూ ఆప్యాయంగా పలకరించేవారు. ఆరోజులు ఎంతో గొప్పవి. స్ఫూర్తిదాయకమైనవి. – శివరాజు సుబ్బలక్ష్మి (95), రచయిత్రి (ప్రముఖ రచయిత బుచ్చిబాబు సతీమణి) బెంగళూరు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement