మహాఘటనలకు సాక్షీభూతాలుగా నిలిచివారి నుంచి ఆ జ్ఞాపకాన్ని వినడం కూడా ఉత్తేజభరితమే. 1947... ఆగస్టు 14 అర్ధరాత్రి. ఆ దేశం ఒక మహా ఘటనను వీక్షించింది. స్వేచ్ఛావాయువులు వీచబోయే ప్రభాతకిరణాలకు చేతులు సాచింది. నాటి జ్ఞాపకాలను నిక్షిప్తం చేసుకున్నవారు అన్నవరపు రామస్వామి (95). శివరాజు సుబ్బలక్ష్మి (95). మళ్లీ ఆ ఉద్విగ్న క్షణాలను మన ముందుకు తెస్తున్నారు.
1947, ఆగస్టు 15.. భారతజాతి దాస్య శృంఖలాలు తెంచుకున్న రోజు. అందరికీ పెద్దపండుగ. ఈ పండుగకు ప్రధాన కారకులు గాంధీగారేనని అందరికీ తెలిసిందే. అప్పుడుS నా వయసు 22 సంవత్సరాలు. ఆ పండుగలో నేనూ భాగమయ్యాను. ఒక పేటలో ఉన్నవారంతా ఒకచోట చేరి సంబరంగా వేడుకలు చేసుకున్నారు. బుడబుక్కలవాళ్లు ఎంతో ఉత్సాహంగా ఇల్లిల్లూ తిరుగుతూ స్వాతంత్య్రం గురించి అందంగా మాటలు చెప్పారు. పిల్లలంతా ఒకచోట చేరి పద్యాలు, పాటలు పాడారు. పనిపాటలు చేసేవారంతా ఒక మాస్టారుని నియోగించుకుని ముందురోజు రాత్రి సాధన చేసి, స్వాతంత్య్రం వచ్చిందని ప్రకటన తెలిసిన వెంటనే డప్పులు వాయించారు, నాటకాలు వేశారు. ఎవరికి వారే ‘హమ్మయ్య స్వతంత్రం వచ్చింది’ అంటూ గుండె నిండా ఊపిరి పీల్చుకున్నారు. ఇంటింటా గాంధీగారి చిత్రపటానికి పూలమాలలు వేశారు. కవులంతా కవిత్వం రాసి, గేయంలా పాడారు.
ఆ రోజు గుంటూరులో మహావిద్వాంసులైన మహాద్రి వెంకటప్పయ్య శాస్త్రి (మా ముందు తరం) గారి కచేరీ ఏర్పాటు చేశారు. మేమంతా ఆ కచేరీకి హాజరయ్యాం. ఆ రోజు అక్కడకు వచ్చిన వారిలో ఎవరి ముఖాలలో చూసినా ఆనందమే వెల్లివిరిసింది. అప్పట్లో విజయవాడలో ఆకాశవాణి కేంద్రం ఇంకా రాలేదు. మద్రాసు నుంచి ఆంధ్రపత్రిక మాత్రమే వచ్చేది. ఆ పత్రిక వచ్చిన తరవాతే సమాచారం తెలిసేది. అవి అతి విలువైన రోజులు. ప్రతి విషయానికీ విలువ ఇచ్చేవారు. అప్పటి మాటల్లో ఒక జీవం, పవిత్రత ఉండేవి. ప్రతివారి మాటలకు విలువ ఉండేది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఉండేది. వారే మన దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చారు. నేను ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రారంభించిన నాటి నుంచి అంటే 1948 డిసెంబరు 1వ తేదీ నుంచి పదవీ విరమణ వరకు పనిచేశాను. ఆనాటి జ్ఞాపకాలు ఇప్పటికీ ఎంతో సంతోషాన్నిస్తుంటాయి. – అన్నవరపు రామస్వామి (95), ప్రముఖ వయొలిన్ విద్వాంసుడు, విజయవాడ
Comments
Please login to add a commentAdd a comment