ఇండిపెండెన్స్ డే స్పెషల్ నాలుగు గంటలు ఉచితం
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినాన నగరవాసులకు నాలుగు గంటల ఉచిత ప్రయాణం కల్పించేందుకు ఢిల్లీ రవాణా సంస్థ (డీటీసీ) ముందుకు వచ్చింది. ఉదయం 6.00 గంటల నుంచి 10. గంటల వరకు నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా ఉచితంగా ప్రయాణించవచ్చని డీటీసీ తెలిపింది. అలాగే 15వ తేదీన ఎర్రకోట వద్ద సాధారణ ప్రజానీకానికి 10వేల సీట్లు కేటాయించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొదటిసారిగా ఎర్రకోట నుంచి ఉపన్యసించనున్న సందర్భంగా తొలిసారిగా సాధారణ ప్రజలను ఈ వేడుకలకు అనుమతించనున్నారు. ఎర్రకోటకు కుడివైపున ఈ సీట్లు ఏర్పాటు చేయనున్నారు. ఆ వైపునే మరో 10వేల మంది స్కూలు పిల్లలు మూడు రంగుల దుస్తుల్లో ఆసీనులవుతారు. ఈ పదివేల మంది కోసం ట్రాఫిక్ నిర్వహణ, భద్రతాపరమైన తనిఖీల కోసం ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు చెప్పారు.
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తాము కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని డీటీసీ ప్రతినిధి ఆర్‌ఎస్ మిన్హాస్ చెప్పారు. ఆ రోజున ఎర్రకోట వైపు వెళ్లే బస్సుల సంఖ్యను పెంచుతామని తెలిపారు. వేడుకలకు హాజరయ్యే ప్రజలు తమతో పాటు సెల్‌ఫోన్లు, కెమెరాలు, బైనాక్యులర్స్, హ్యాండ్‌బ్యాగులు, బ్రీఫ్‌కేసులు, సిగరెట్ లైటర్లు, రేడియోలు, టిఫిన్ బాక్సులు, నీళ్ల సీసాలు తీసుకుని రాకూడదని అధికారులు స్పష్టం చేశారు.వివిధ ఉగ్రవాద సంస్థల నుంచి ప్రధాని మోడీకి భద్రతాపరమైన ముప్పు ఉందంటూ హెచ్చరికలు జారీ అయిన నేపథ్యంలో భద్రతను మరింత పెంచనున్నామని పేర్కొన్నారు. ఎటువంటి ఉగ్ర దాడులనైనా తిప్పికొట్టేందుకు నగరంలో బహుళ అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. వేల సంఖ్యలో సాయుధ సిబ్బంది నగరంపై డేగకన్ను వేసి ఉంచుతారని చెప్పారు. నగరమంతటా ముఖ్యంగా ఎర్రకోట వద్ద ఉపరితలం నుంచి గగనతలం వరకు భద్రతా ఏర్పాట్లు చేశామని తెలిపారు. రాజ్‌ఘాట్‌తో పాటు, ప్రధాన మంత్రి ఎర్రకోటకు ప్రయాణించే మార్గంలో కూడా భద్రతను మరింత పటిష్టం చేశామని చెప్పారు.
మార్కెట్లు, విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, అంతర్రాష్ట్ర బస్సు టెర్మినల్స్, మెట్రోస్టేషన్లు, వ్యూహాత్మకంగా ప్రాధాన్యతగల ప్రాంతాల్లో వేల సంఖ్యలో ఢిల్లీ పోలీసులు, పారా మిలటరీ దళాలను మోహరించనున్నారు. గగనతలంలో హెలికాప్టర్ల ద్వార గస్తీ నిర్వహించడంతో పాటు ఎర్రకోట చుట్టూ గగనతల రక్షణ యంత్రాంగాన్ని కూడా సిద్ధంగా ఉంచుతామని అధికారులు పేర్కొన్నారు. ఎర్రకోట వద్ద ట్రాఫిక్ నిర్వహణకు, భద్రతకు, తనిఖీలకు ఐదువేల మంది ఢిల్లీ పోలీసులను మోహరిస్తామని తెలిపారు. ఎర్రకోటకు సమీపంలో ఉన్న ఎత్తయిన భవనాలపై జాతీయ భద్రతా దళం (ఎన్‌ఎస్‌జీ)కి చెందిన షార్ప్‌షీటర్లను మోహరించనున్నారు. ఎర్రకోట వద్ద ఏర్పాట్లపై భద్రతా సంస్థలు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నాయని చెప్పారు. ఏదైనా ఉగ్రవాద దాడి జరిగితే వెంటనే ప్రధానితో పాటు ఇతర నాయకులకు రక్షణ కల్పించేందుకు ‘సురక్షిత గృహాల’ను గుర్తించామని కూడా అధికారులు చెప్పారు.