వేణుగోపాలస్వామి ఆలయం
వేలాది ఎకరాల భూములు, కేజీల కొద్దీ బంగారు, వెండి ఆభరణాలు.. వజ్ర వైఢూర్యాలు బొబ్బిలి వేణుగోపాల స్వామివారి సొంతం. ‘అన్నీ ఉన్నా అల్లుడినోట్లో శని’ అన్న చందంగా స్వామివారి ధూపదీప నైవేద్యాలకు దాతలు, భక్తులు సమర్పించే కానుకులపై ఆధారపడాల్సిన దుస్థితి. స్వామివారి ఆస్తుల లెక్కల గుట్టు విప్పేందుకు.. ఆలయానికి పూర్వవైభవం తెచ్చేందుకు ప్రభుత్వం నడుంబిగించింది. విచారణ కమిటీ వేసింది. ఆస్తులపై ఆరా తీయిస్తోంది.
సాక్షిప్రతినిధి, విజయనగరం: అపర కుబేరుడైన బొబ్బిలి వేణుగోపాల స్వామి వారికి అలంకరించే ఆభరణాలు ఎన్నో ఉండేవని పూర్వీకులు చెబుతుండే వారు. ఎంతో డబ్బు, వేల కోట్ల రూపాయల విలువైన భూములు, వందల కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, కెంపులు, వైఢూర్యాలు, పచ్చలహారాలు ఉన్న స్వామివారికి అంతే స్థాయిలో మర్యాదలు జరిగేవి. ఆనాడు అనుభవించిన స్థాయిలో కనీసం ఒకటో వంతు కూడా ఇప్పుడు లేదంటే స్వామివారి పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని ఐదు నియోజకవర్గాల్లో స్వామికి 4011.16 ఎకరాల భూములుంటే.. కనీసం ధూపదీప నైవేద్యాలకు కూడా దాతలపై ఆధారపడాల్సి వస్తోందంటే దానికి ఆలయ ధర్మకర్తలే సమాధానం చెప్పాలి. ఈ లెక్కలే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తేలుస్తోంది.
(చదవండి: క్లీనర్ లేని లారీ.. నడిపేవారేరీ!)
ధూళి పట్టి ఉన్న దస్త్రాల మూటలు
సిబ్బంది, అర్చకుల వేతనాల ఖర్చు
సంవత్సరం | ఆదాయం (రూపాయలలో) |
వేతనాలకు చేసిన ఖర్చు శాతం |
2019–20 | 7,22,733 | 15.5 |
2020–21 | 6,86,659 | 73.6 |
2021–22 | 3,63,695 | 15.8 |
ఇక కోటలోని భాండాగారంలో ఉన్న బంగారం విషయానికి వస్తే.. 28 ప్రాపర్టీ రిజిస్టర్ ప్రకారం.. 28 బంగారు ఆభరణాలున్నాయి. అవి 45 తులాల, 82 చిన్నాల, 65 వీసాలు. (548 గ్రాముల 208 మిల్లీ గ్రాములు). 1957 అప్రై జ్‌మెంట్ రిజిస్టర్ ప్రకారం చూస్తే.. 22 తులాల, 103 చిన్నాల,77 వీసాలు (291 గ్రాముల, 600 మిల్లీ గ్రాములు). ఇవన్నీ రికార్డుల ప్రకారం చెబుతున్న లెక్కలు.
బోలెడు బంగారం..
వేణుగోపాలస్వామి, రుక్మిణీ, సత్యభామ అమ్మవార్లకు బోలెడంత బంగారం ఉంది. ఎస్‌బీఐ (బాక్స్ నంబర్ 42/74–2013లో) బ్యాంకు లాకర్లో వేసిన ఆభరణాల సంఖ్య 114. ప్రాపర్టీ రిజిస్టర్ 28 ప్రకారం.. వివిధ ఆభరణాల్లో ఉన్న బంగారం 1094 తులాల 1392 చిన్నాల 621 వీసాలు (అంటే 13 కిలోల 308 గ్రాముల 624 మిల్లీ గ్రాములు). 1957 జనవరి 18న ఆమోదించిన అప్రైజ్‌మెంట్ రిజిస్టర్ ప్రకారం.. వివిధ ఆభరణాల్లో ఉన్న బంగారం 865 తులాల, 633 చిన్నాల, 291 వీసాలు (10 కిలోల 334 గ్రాముల 304 మిల్లీ గ్రాములు).
కొండంత వెండి...
కోటలోని భాండాగారంలో 107 వెండి ఆభరణాలున్నాయి. వీటిని 1998 అక్టోబర్ 12న భద్రపరచినట్టు రికార్డుల్లో ఉంది. 28 ప్రాపర్టీ రిజిస్టర్ ప్రకారం.. 21,332 తులాల 1102 చిన్నాల, 307 వీసాలు (249 కిలోల 248 గ్రాముల 20 మిల్లీ గ్రాములు) వెండి ఉన్నట్టు లెక్కల్లో ఉంది. 1957 అప్రైజ్‌మెంట్ రిజిస్టర్ ప్రకారం.. 21,549 తులాల, 563 చిన్నాల 9 వీసాలు (251 కిలోల 557 గ్రాముల 490 మిల్లీ గ్రాములు) వెండి ఉన్నట్టు చూపిస్తోంది.
బ్యాంకు లాకర్‌లో భక్తుల కానుకలు..
ఈ ఆభరణాలే కాకుండా భక్తులు సమర్పించిన 328 గ్రాముల 130 మిల్లీ గ్రాముల బంగారం, 826 గ్రాముల 320 మిల్లీ గ్రాముల వెండి బొబ్బిలి ఆంధ్రా బ్యాంకులోని ఏ–52 లాకర్‌లో ఉన్నట్టు రికార్డులు ఉన్నాయి.
రథాల శాలలో నిర్వహిస్తున్న దేవాదాయశాఖ కార్యాలయం
ధూపదీపనైవేద్యాలకు దాతలే దిక్కు...
ఇన్ని వేల ఎకరాలు, ఇన్ని కోట్ల రూపాయల విలువ చేసే ఆభరణాలు ఉన్న తరువాత ఎవరైనా ఎలా ఉంటారు. ధూం..ధాంగా ఉంటారు. కానీ వేణుగోపాల స్వామికి ఆ భాగ్యం లేదు. ఈ ఆలయంలో 8 మంది సిబ్బంది, అర్చకులు ఉన్నారు. వీరిలో ముగ్గురు అర్చకులు కాగా ఒకరు జూనియర్ అసిస్టెంట్. మరొకరు టికెట్ సెల్లర్. ఇద్దరు వంట మనుషులు, ఒక స్వీపర్ పనిచేస్తున్నారు. వీరి జీతభత్యాల కోసం ఆలయానికి వచ్చిన ఆదాయంలో నుంచి కొంత శాతాన్ని ఖర్చు చేస్తున్నారు.
ఆ ఆదాయం కూడా దాతల నుంచే వస్తోంది. వచ్చిన ఆదాయం వీరి జీతాలకే సరిపెడుతున్నారు. 2020–21లో ఏకంగా ఆదాయంలో 73.6 శాతం జీతాలకు వెచ్చించామని రికార్డుల్లో రాశారు. ఇక స్వామి వారికి ధూపదీప నైవేద్యాలకు డబ్బులెక్కడివి. ఉన్నదానితోనే సరిపెడుతున్నారు. కనీసం ఆలయాన్ని కూడా అనువంశిక ధర్మకర్తలు అభివృద్ధి చేసింది లేదు. ఆలయాన్ని చూస్తేనే ఆ విషయం అర్ధమవుతుంది.
గతమెంతో వైభవం...
ఆలయ భూములన్నీ స్వామి వారి అధీనంలో ఉన్నప్పుడు ఎంతో వైభవంగా ఉండేది. తమిళనాడులోని శ్రీరంగంలో ఉన్న రంగనాథస్వామి దేవాలయంలో వలే బోగభాగ్యాలు, పూజాధికాలు జరిగేవి. అదంతా ఇప్పుడో కల. ప్రస్తుతం దాతల సహాయంతోనే నెట్టుకొస్తున్నాం.
– భద్రం అప్పలాచార్యులు, ప్రధానార్చకులు, వేణుగోపాలస్వామి దేవస్థానం, బొబ్బిలి
స్వామి ఆస్తులు స్వామికే దక్కాలి
బొబ్బిలి వేణుగోపాల స్వామి ఆలయానికి చెందిన భూములు, ఆభరణాలు ఎక్కడెక్కడ ఉన్నాయో బయట పడాలి. దోషులెవరయినా శిక్షింపబడాలి. వేల కోట్ల రూపాయలు ఆస్తులున్న స్వామివారు చివరకు ధూప దీప నైవేద్యాలకు చేయిచాచే పరిస్థితి నుంచి బయట పడాలి. దేవాలయాల ఆస్తుల పరిరక్షణ, భక్తుల మనోభావాల రక్షణకు ప్రాధాన్యమిస్తూ విచారణకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణలు ఆదేశించడం అభినందించదగ్గ విషయం. ఇక్కడి ట్రస్టీ సభ్యులు కొన్నాళ్ల పాటు అధికారంలో ఉన్నారు. కానీ ఈ వ్యవహారాలన్నీ బయటకు పొక్కలేదు. పైగా చీకటిలో ఉంచారంటే ఏదో జరుగుతోందనేది ప్రజల అనుమానం. వీటిని నివృత్తి చేసి దేవాలయాల ఆస్తులను కాపాడాలన్నదే ప్రభుత్వ ప్రయత్నం.
– శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, ఎమ్మెల్యే, బొబ్బిలి
Comments
Please login to add a commentAdd a comment