మెడలో ఒత్తుగా ఉన్న తాళ్లను కత్తిరిస్తున్న హోంగార్డు శుభ్రం చేస్తున్న హోం గార్డు ఝాన్సీ రాణి
ఆమె మతి స్థిమితం లేని మహిళ... ఎవరికీ పట్టని వ్యక్తి... పట్టణంలో తిరుగుతూ రోడ్డు పక్కన దొరికిన గుడ్డ పీలికలను, తాళ్లను మెడలో వేసుకొనే ఓ మతి చలించిన మనస్తత్వం. అటువంటి వ్యక్తి ఎదురుపడితే ఎవరైనా ఏమి చేస్తారు... ఛీత్కరిస్తూ అల్లంత దూరానికి పారిపోయే వాళ్లే ఎక్కువ. కానీ ఈ హోంగార్డు అక్కున చేర్చుకుంది. ఆమెకు సేవలందించి తన మంచి మనసును చాటుకుంది.
బొబ్బిలి: కుటుంబ సభ్యుల నిర్లక్ష్యమో మరే కారణమో తెలియదు కానీ.. ఓ మహిళ చిన్న సంచి పట్టుకుని పట్టణంలో తిరుగుతూ తనలో తనే ఏవో పాటలు పాడుకుంటుంది. మాటలాడిస్తే మాట కలుపుతుంది. పట్టణంలోని అన్ని బజార్లలో ఇటూ అటూ తిరుగుతూ తనలో తానే గొణుక్కుంటూ కనిపించిన తాళ్లు, దారాలన్నీ మెడలో వేసుకుంటుంది. ఆ తాళ్లు మెడకు ఉరిలా దగ్గరికంటా బిగుసుకున్నాయి. అటుగా వెళ్తున్న హోంగార్డు ఝాన్సీ రాణి కంట ఈమె పడింది. అయ్యో అనుకుంటూ కొందరి సాయంతో ఆమెను బుజ్జగిస్తూ చిన్నపాటి చాకుతో మెడలోని ఒక్కో పోగూ కత్తిరించింది.
ఆ తర్వాత నువ్వేం చదువుకున్నావంటే ఆరో తరగతనీ, నీ పేరేంటంటే జయలక్ష్మి అనీ చెప్పింది. ఇలా మాటల్లో పెట్టి మొత్తం తన మెడ చుట్టూ చుట్టుకున్న తాళ్లన్నీ తొలగించింది. అనంతరం ఓ నైటీ తీసుకువచ్చి ఆమెకు ధరింపజేసింది. ఆ తరువాత కడుపునిండా భోజనం పెట్టి తన మంచి మనసును చాటుకుంది. ‘మన కుటుంబ సభ్యులైతే ఇలా సపర్యలు చేయమా ... నాకు మాత్రం ఈమె ఓ తల్లి, ఓ అత్తమ్మ’లా అనిపించిందని ఆ హోం గార్డు చెప్పడం తన పెద్ద మనసుకు నిదర్శనం. ఆమెకు సపర్యలు చేయడం పట్ల పలువురు ఝాన్సీరాణిని అభినందనల్లో ముంచెత్తారు.
చదవండి: బాలల కోసం బహువిధ రక్షణ
Comments
Please login to add a commentAdd a comment