సంగమ్మ చెక్కిన శిల్పం మా అమ్మ | special chit chat with Communist Party leader Sivarami Reddy | Sakshi
Sakshi News home page

సంగమ్మ చెక్కిన శిల్పం మా అమ్మ

Published Tue, Aug 30 2016 11:11 PM | Last Updated on Mon, Sep 4 2017 11:35 AM

సంగమ్మ చెక్కిన శిల్పం మా అమ్మ

సంగమ్మ చెక్కిన శిల్పం మా అమ్మ

ఎన్.శివరామిరెడ్డి
‘‘నాలో మీకు ఏదైనా మంచి లక్షణాలు కనిపిస్తే... అవి మా మేనత్త సంగమ్మ నేర్పించినవి, కమ్యూనిస్టు పార్టీ అలవరిచినవే. నాలో మీకు కనిపించే చెడు మాత్రం నాకు స్వతహాగా జన్మతః అబ్బిన గుణం’’...  ఈ మాటలన్నది సీనియర్ నాయకులు నర్రెడ్డి శివరామిరెడ్డి.  ఆయన స్వాతంత్య్ర సమరయోధులు, ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు, దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చట్టసభకు ఎన్నికైన తొలితరం ప్రజాప్రతినిధి. ఇప్పుడు 95వ ఏట భార్య కొండమ్మతోపాటు హైదరాబాద్‌లోని సిఆర్ (చండ్ర రాజేశ్వర్రావు) ఫౌండేషన్‌లో ప్రశాంత జీవనం గడుపుతున్నారు. తల్లి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ‘గంగమ్మ జన్మనిచ్చింది, సంగమ్మ మనిషిగా నిలబెట్టింది’ అన్నారు.


‘‘అమ్మకు నాకంటే ముందు ముగ్గురు పిల్లలు. నేను నాలుగోవాడిని. నాకు నాలుగేళ్లు నిండేలోపే మా అమ్మ పోయింది. మా మేనత్త సంగమ్మ పెంపకంలో నాకు  అమ్మ లేదనే సంగతే గుర్తురాలేదు. మా నాయన, ఇద్దరు చిన్నాయనలు... ముగ్గురు సోదరులకు కలిపి మా మేనత్త ఒక్కటే ఆడపడుచు. ఆమె అంటే అందరికీ గారాబమే. పెళ్లి చేసి అత్తవారింటికి పంపించకుండా మామ కైలాస్‌నాథ్‌రెడ్డిని ఇల్లటం (ఇల్లరికం) తెచ్చుకున్నారు. అలా మా మేనత్త మా ఇంట్లోనే ఉండేది. పుట్టినప్పటి నుంచి నన్ను ఎత్తి తిప్పడం, అన్నం తినిపించడం అన్నీ తనే చేసేది. మా అమ్మ ఉన్నన్ని రోజులూ తన ముచ్చట కొద్దీ మాకు సేవలు చేసింది. అమ్మ పోయిన తర్వాత తానే మాకు అమ్మయింది.


మాది వ్యవసాయ కుటుంబం. మూడు గాండ్ల ఎద్దులు (మూడు జతల ఎడ్లు), ఐదారు పాలిచ్చే గేదెలుండేవి. సేద్యగాళ్లతోపాటు ఇంట్లో అందరూ పని చేసేవాళ్లు. ఆడవాళ్లు కూడా పొలానికెళ్లి పనులు చేయించుకునే వాళ్లు. మా మేనత్త ఇంట్లో మమ్మల్ని చక్కబెటుకుని పొలానికెళ్లేది. జొన్న, కొర్ర, వేరుశనగ పంటలు, చీనీచెట్లలో పనులు దగ్గరుండి చేయించుకునేది.  పండుగ వస్తోందంటే... నా కోసం కజ్జికాయలు, అత్తరాసాలు, లడ్డులు చేసి డబ్బాల్లో పెట్టేది. సెలవులకు ఇంటికి రాగానే ముందు వాటిని పెట్టి నేను తిన్న తర్వాతనే ‘ఎలా చదువుకుంటున్నావు’ అని అడిగేది. మా మేనత్త తన పిల్లల కంటే నా కోసమే ఎక్కువ ఆదుర్దా పడుతుంటుందని మా పిన్నమ్మలు, నానమ్మ అనేవారు. ‘కాలేజీలో ఏం పెడతారో, ఏం తింటాడో. మిగిలిన పిల్లలంతా ఇంట్లో ఉంటారు, ఎప్పుడేది కావాలంటే అది తింటారు. వాళ్లకు నేను చెప్పేదేముంటది’ అనేదట.

 
మా ఇంట్లో నేను తొలితరం విద్యావంతుణ్ని. దాంతో నేనంటే పెద్దవాళ్లకు ఇష్టం, చిన్నవాళ్లకు గౌరవం. మా నాయన నా మీద ఎక్కువ ఆశలు పెట్టుకున్నాడు. పెద్ద చదువులు చదివించాలని, నేను పెద్ద ఉద్యోగం చేస్తే చూడాలని కలలు కన్నాడు. నేను లా కోర్సులో చేరిన తర్వాత లాయరుగా పేరు తెచ్చుకుంటే చూడాలనుకున్నాడు. అయితే... నేను ఇంగ్లిష్ చదువుల ప్రభావంతో ఆయన కోరుకున్నదానికంటే ఎక్కువ చైతన్యవంతం అయ్యాను. నేను నేర్చుకున్న సిద్ధాంతాలతో ఆయనను బేరీజు వేసుకుంటే నాయన తీరు నచ్చేది కాదు. దాంతో ఆయన్నే ప్రశ్నించేవాడిని. ఓ రోజు ఆయన దగ్గర వడ్డీకి డబ్బు తీసుకున్న వాళ్లందరినీ పిలిపించి, అప్పు తీర్చాల్సిన పని లేదని చెప్పి వాళ్లు రాసిచ్చిన దస్తావేజులను ఇచ్చేశాను.


మా మేనత్తకు ఆస్తి పంపకంలో మా నాయన న్యాయంగా వ్యవహరించడం లేదనిపించింది. కొడుకుల ముగ్గురితోపాటు కూతురికి కూడా ఆస్తిలో సమభాగం ఇవ్వాలనుకున్నాడు మా తాత. ఆమె పెళ్లి సందర్భంగా అలా అంగీకారమైంది. ఆనాడే పంచి ఉంటే ఏ గొడవా ఉండేది కాదేమో. నా కళ్లెదురుగా మా మేనత్తకు అన్యాయం జరుగుతుంటే సహించలేకపోయాను. అలాగని నాయనను ఎదిరించి మాట్లాడితే పరిష్కారమయ్యే పరిస్థితీ కనిపించ లేదు. ఊరి వాళ్లకు దస్తావేజులు ఇచ్చేసినంత సులువుగా పరిష్కారమవుతుందని కూడా అనిపించలేదు. నాలో మేనత్తకు న్యాయం చేయాలనే ఆవేశం ఉంది కానీ స్వయంగా పరిష్కరించగలిగిన శక్తి ఉన్నట్లు అనిపించలేదు. దాంతో పక్క ఊళ్లకు వెళ్లి ఆ ఊళ్ల పెద్దవాళ్లకు చెప్పి, వారందరినీ తీసుకువచ్చి ఇంట్లో పంచాయితీ పెట్టించాను.

అలా మా మేనత్తకు సమానంగా ఆస్తి వచ్చింది. అప్పుడామె నన్ను దగ్గరకు తీసుకుని ‘నిన్ను సాకిన రుణం ఇలా తీర్చుకున్నావా’ అని కన్నీళ్లు పెట్టుకుంది. ఆ పరిస్థితిలో కూడా ‘నాన్నతో ఊరికే గొడవ పడొద్దు. నువ్వే పోయి పలకరించు’ అని చెప్పింది. సిద్ధాంతపరంగా విభేదించినా ఆత్మీయత పరంగా దూరం కాకూడదనే గొప్ప గుణం నాలో నెలకొల్పింది. ఆమె ఏ గొప్ప పుస్తకమో చదివి ఇంత గొప్ప మాట చెప్పలేదు. ఆమె మనసు అంత గొప్పది. అందుకే అలా చెప్పగలిగింది. మేనత్తకు నేను చేయగలిగింది చేశాను కానీ, నేను చేసింది రుణం తీరేటంత పెద్ద పని కాదు. ఏం చేసినా ఆ రుణం తీరదు. ఆమె ప్రేమను చెప్పడానికి... నాకు మాటలు చాలవు. ఆమె చూపిన ఆదరం, నా పట్ల వ్యక్తమైన ఆత్మీయతను నా కళ్లతో చూడాల్సిందే, నా మనసుతో తెలుసుకోవాల్సిందే’’.


అమ్మ పోయిన తర్వాత మేనత్తే మాకు అమ్మయింది. మా కంట కన్నీరు రాకుండా పెంచడం తన బాధ్యత అన్నట్లు సాకింది. నేనేమి చేసినా, ఎంత చేసినా ఆ తల్లి రుణం తీరదు. ఆమె ప్రేమను చెప్పడానికి... అప్పుడు అలా జరిగింది, ఇప్పుడు ఇలా జరిగింది అని చెప్పలేను. ఆ ఆదరం నా కళ్లకే కనిపిస్తుంది. ఆ ఆత్మీయత నా మనసుకు మాత్రమే అర్థమవుతుంది. కడప జిల్లా గడ్డం వారి పల్లెలో పుట్టిన నర్రెడ్డి శివరామిరెడ్డి స్వాతంత్య్ర సమరయోధులు, ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చట్టసభకు ఎన్నికైన తొలితరం ప్రజాప్రతినిధుల్లో ఒకరు.  -వాకా మంజులారెడ్డి

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement