
ఉమ్మడి గుంటూరు జిల్లా క్రైస్తవ మతానికీ, కమ్యూనిస్టు ఉద్యమానికీ పేరు. దళితులు ఈరెండింటిలో రాష్ట్రంలో ఎక్కడా లేనంత పెద్ద సంఖ్యలో చేరడం చరిత్ర. ఒకనాటి తెనాలి తాలూకా, ఇప్పటి కొల్లిపర మండలంలోని దావులూరు ఒక పచ్చటి పల్లెటూరు. కమ్యూనిస్టు ఉద్యమం, క్రైస్తవ మిషనరీలు ఇచ్చిన తోడ్పాటుతో ఆ ఊరిలో ఆడ పిల్లలు, మగ పిల్లలు బాగా చదువులపై శ్రద్ధ పెట్టేవారు. ‘పాలేరు’, ‘భూమికోసం’ వంటి నాటికలు, బుర్రకథలు వారిలో ఉత్సాహాన్ని ప్రోదిచేసేవి. వేము సువార్తమ్మ, నాలాది దయమ్మ, గుమ్మడి సత్యవేదం వంటి వారు మోటూరి ఉదయం వంటి నాయకురాళ్ళ దగ్గర బుర్రకథ నేర్చుకున్నారు. తర్వాత బుర్రకథ పితామహుడిగా పేరుగాంచిన షేక్ నాజర్‌తో కలిసి పనిచేశారు.
దావులూరు కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో వేము కుటుంబానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ కుటుంబంలో సుమారు మూడు తరాలవారు ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసి తమ ఆస్తి పాస్తులను ఉద్యమం కోసం త్యాగం చేశారు. 1934లో పుట్టిన సువార్తమ్మ కమ్యూనిస్టు పార్టీ నాయకులైన అంబటి రాజారావు, దీనమ్మల కుమార్తె. వేము రామసుబ్బయ్యకు మేనత్త కూతురు. వారిది ఆ రోజుల్లోనే కమ్యూనిస్టు పార్టీ పద్ధతి ప్రకారం జరిగిన దండల పెళ్లి. ఆమె పదో తరగతి వరకు చదివింది. తర్వాత హిందీ ‘భాషా ప్రవీణ’ పూర్తి చేసింది. సువార్తమ్మ, రామసుబ్బయ్య అనేక నిర్బంధాలను ఎదుర్కొని రాజ మండ్రి, కడలూరు, సేలంలలో జైలు శిక్ష అనుభవించారు. వారికి ఏడుగురు పిల్లలు. వారిలో ఇద్దరు చిన్న వయసులోనే పోషణ కరవై చనిపోగా ముగ్గురు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు మిగిలారు.
చదవండి: International women's day 2025 హోమ్ మేకర్‌కు వేతనమేదీ?
దళిత ఉద్యమంలో పాల్గొంటూ చిన్న కొడుకు శాంతి చనిపోయాడు. భర్త పార్టీ కోసం పొలం ఇవ్వడం, ఉద్యోగం చెయ్యకుండా, ఇల్లు పట్టకుండా, పిల్లల్ని పట్టించుకోకుండా పార్టీ పనులపై తిరుగుతున్నా ఆమెకు ఎప్పుడూ కోపం రాలేదు. ఆయన నిబద్ధతను గౌరవించింది. ఉద్యమం విజయవంతమైతే పేదలు, పీడితుల జీవితాలలో వెలుగు వస్తుందని నమ్మిన గొప్ప ప్రజాస్వామికవాది. సువార్తమ్మ దృష్టిలో విప్లవం, ప్రేమ వేరు కాదు. ఈ నెల ఒకటవ తేదీన మృతి చెందిన వేము సువార్తమ్మ గారికి జోహార్లు!
– ప్రొ.చల్లపల్లి స్వరూపరాణి; ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, గుంటూరు