
మాజీ ఎంపీ ‘మాదల’ కన్నుమూత
సాక్షి, గుంటూరు: సీపీఐ(ఎంఎల్) కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ మాదల నారాయణస్వామి(99) సోమవారం గుంటూరులో కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం మైనంపాడులో జన్మించిన ఈయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. 1948లో రహస్య జీవితంతో పాటు 1962లో భారత-చైనా సరిహద్దు వివాదంలో రెండేళ్ల పాటు ఆయన జైలు జీవితం గడిపారు.
కమ్యూనిస్టు పార్టీపై నిషేధం ఎత్తివేయగానే 1952లో ఒంగోలు నుంచి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీల తరఫున 1962లోనే ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి గెలుపొందారు. నారాయణస్వామి అంత్యక్రియలు మంగళవారం గుంటూరులో జరగనున్నాయి.