
ఆ చెట్టు మీరు నాటిన భూమిలోదే!
వివేకం
స్వాతంత్య్ర పోరాట సమయంలో మనం అనేక మంది నాయకుల్ని చూశాం. దురాక్రమణదారులకు వ్యతిరేకంగా పోరాడిన కాలం అది. కనీవినీ ఎరుగని రీతిలో నాయకత్వ బాధ్యతలు నిర్వర్తించిన మహాత్మాగాంధీనే తీసుకోండి. ఓ దేశాన్ని నిలువరించగల సత్తా ఆయనలోనే కనిపించింది. సత్యాగ్రహ లక్ష్యమంతా ఓ దేశాన్ని ఎలా ఆపడమన్నదే. ఆయన దేశాన్ని నిలువరించడం ద్వారా బ్రిటిష్‌వారిని మోకరిల్లేటట్టు చేశారు. ఈ బందులు, రాస్తారోకోలు, రైల్‌రోకోలు అప్పటినుంచీ వస్తూనే ఉన్నాయి. అయితే, మనం ఇప్పటికీ ఆ అలవాటు నుంచి బయటపడలేకపోతున్నాం.
రోడ్డు మీద బైఠాయించి, రాకపోకల్ని స్తంభింపజేయడం ద్వారా చాలామంది రాత్రికి రాత్రి నాయకులైపోవడాన్ని నేనే అనేక సందర్భాల్లో స్వయంగా, కళ్లారా చూశాను. వాళ్లు చేసిందల్లా కొన్ని చెట్లను నరికి రోడ్డుమీద పడేయడమే.విదేశీయుల దురాక్రమణ ఏనాడో పోయింది. ఇప్పుడిది మన సొంత దేశం. కానీ, ఇప్పటికీ మనం బందులు చేయాలనుకుంటున్నాం. దేశాన్ని ముందుకు నడిపించాల్సిన ప్రభుత్వమే, పాలనా యంత్రాంగమే బంద్ కోసం పిలుపునిస్తుంటుంది. ఇది తమ హక్కని అది భావిస్తుంటుంది. ఒక్క ఈ దేశంలో మాత్రమే ప్రభుత్వం కూడా బంద్‌కు పిలుపునిస్తోంది. దేశాన్ని మూసేయించడం తమ ప్రాథమిక హక్కని వాదిస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది.
ఈ దేశాన్ని మరెవరో పాలిస్తున్నప్పుడు దీన్ని ఆపడంలో అర్థం ఉంది. విదేశీ శక్తులు నిష్ర్కమించిన తరువాత మీరు దేశం ముందుకు వెళ్లేలా చేయాలి. సత్యాగ్రహమంటే దేశాన్ని నిలువరించేలా చేయడం. ఇప్పుడు దేశాన్ని ఎలా ముందుకు నడిపించాలా అన్నది ఆలోచించాలి. దేశాన్ని ముందుకు నడిపించడం ఒక రకమైన నైపుణ్యం, ముందుకు పోకుండా ఆపడం మరో రకమైన నైపుణ్యం. చాలామందికి తాము పాలించాల్సిన ప్రజల పట్ల ఏమాత్రం చింత లేదు.
పరిస్థితి చేయి దాటి పోయిందనా దీని అర్థం? ఇదొక ప్రజాస్వామ్య దేశం. మనం తలచుకుంటే వాళ్లను అయిదేళ్లలో పక్కన పడేయొచ్చు. కానీ, దురదృష్టవశాత్తూ దేశం ఆ దిశలో ప్రయాణించడం లేదు. రాజకీయ వ్యవస్థ గురించి ప్రతిచోటా ప్రతి ఒక్కరూ మాట్లాడుతుంటారు. కానీ, దీనిని సరిచేసేందుకు కనీస బాధ్యతను తలకెత్తుకోరు. అవసరమైనప్పుడు అడుగు బయటపెట్టి ఓటు కూడా వేయరు. ఈ చిన్న పని చేసి కూడా వారు తమ ఆందోళనను బయటికి వ్యక్తం చేయరు.
మీ తీరును మీరు మార్చలేకపోయినప్పుడు, మీరు తయారుచేసే నాయకుడు కూడా మీలాగే ఉంటాడు. దేశాన్ని వివిధ రకాలుగా దుర్వినియోగం చేస్తున్నవారిని నేనేమీ వెలివేసే ప్రయత్నం చేయడం లేదు. నేను చెప్పదలచుకున్నదేమిటంటే, మీరు సాగు చేస్తున్న భూమి పరిస్థితిని మీరు మార్చలేకపోయినప్పుడు, మీకు బ్రహ్మాండమైన పంట చేతికి వస్తుందని అనుకోలేం. మీరు చెట్టుమీద పండు కోసమే చూస్తున్నారు. కానీ, చెట్టు బలం, దాని పండు, పండు నాణ్యత వంటివి మీరు మొక్క నాటిన భూమి మీద ఆధారపడి ఉంటాయి. అవునా?
సమస్య - పరిష్కారం
ఏ పని చేస్తున్నా, ఎప్పుడూ ఏదో బాధలో ఉన్నట్లే ఉంటుంది. అది తగ్గించుకోవడం ఎలా?
- డి.కృష్ణ, గుంటూరు
సద్గురు: మనుషులు రెండు రకాలుగా బాధపడే వీలుంది. శారీరక బాధ, మానసిక బాధ. శారీరక బాధ పలు రకాలుగా కలగవచ్చు కానీ 90 శాతం జనం అనుభవించే బాధ మానసికమైనది. అది మనలో మనకే కలుగుతుంది. మనుషులు దుఃఖాన్ని తమకు తాముగా ప్రతిరోజూ సృష్టించుకుంటారు.
ఈ బాధ పనితీరుని అర్థం చేసుకుందాం. ఈ రోజు సూర్యుడు అద్భుతంగా ఉదయించాడు, పువ్వులు వికసించాయి, ఆకాశం నుంచి ఏ చుక్కలూ రాలలేదు, ప్రతిదీ క్రమంలోనే ఉంది, కానీ మీ తలను తొలుస్తున్న పురుగు మిమ్మల్ని బాధిస్తోంది. మీలోని అల్పమైన ఆలోచనను సృష్టికర్త సృష్టి కంటే పెద్దదిగా చేసుకున్నారు. అన్ని బాధలకూ ప్రాథమిక మూలం ఇదే. మొత్తం సృష్టంతా అద్భుతంగా జరుగుతుండవచ్చు. కానీ ఒక ఆలోచన మొత్తాన్ని నాశనం చేస్తున్నది.
మీరు మీ మనసుగా పిలుస్తున్నది వాస్తవానికి మీది కాదు. మీకంటూ మీదైన మనసేది లేదు. మీరు మీ మనసుగా పిలుస్తున్నది సమాజపు చెత్తకుప్ప మాత్రమే. వచ్చిపోయే ప్రతి ఒక్కరూ మీ తలలో ఏదో పెట్టేసి వెళుతుంటారు. ఎవరి నుంచి తీసుకోవాలి, ఎవరి నుంచి తీసుకోకూడదు అనే విషయం మీకు తెలియదు. అది తెలిస్తే, ఆ సమాచారం మనుగడ సాగించడానికి పనికొస్తుంది. బాధ మనపై కురిసేది కాదు, అది తయారుచేసుకున్నదే. దీని తయారీ కేంద్రం మీ మనసులో ఉంది. మీరే ఈ తయారీ కేంద్రాన్ని మూసివేయాల్సిన సమయం ఆసన్నమైంది.