మండు వేసవిలోనూ...నిండు నీళ్ళ బోరు | Deep water bore hot summer ... | Sakshi
Sakshi News home page

మండు వేసవిలోనూ...నిండు నీళ్ళ బోరు

Published Mon, Mar 31 2014 11:25 PM | Last Updated on Thu, Jul 11 2019 5:37 PM

మండు వేసవిలోనూ...నిండు నీళ్ళ బోరు - Sakshi

మండు వేసవిలోనూ...నిండు నీళ్ళ బోరు

ప్రయత్నం
 

వేసవి వచ్చిందంటే నో(బో)రెండిపోతుంది. గుక్కెడు నీళ్ళు నోట్లో పోస్తేకాని దాహం తీరదు. అదే చేత్తో బోరులో కూడా కాసిన్ని నీళ్లు పోయమంటున్నారు ఆక్వాఫైర్‌ని కనుగొన్న బృందం. ఒకపక్క తాగడానికే గుక్కెడు నీళ్లు లేవని బోరుమంటుంటే... బోరులో నీళ్లు పోయడమేంటనుకుంటున్నారా? హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ సరోజినీనాయుడు కాలనీకెళితే భూమిలోని నీటిని పెకైలా రప్పించాలో తెలుసుకోవచ్చు.
 

ప్రతి ఆదివారం ఉదయం ఆరుగంటల నుంచి పది గంటలవరకూ మెహర్‌బాబా మందిర ప్రాంగణంలోని మొక్కలను సాగు చేయడం కోసం ఓ ఇరవై ముప్ఫైమంది భక్తులు వస్తారక్కడికి. వారిలో డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, వ్యాపారులు, విద్యార్థులు అందరూ ఉంటారు. ఎకరం విస్తీర్ణంలో ఉన్న కొండపై సిమెంట్‌తో మడులు కట్టి అందులో మట్టి నింపి మొక్కలు పెంచుతున్నారు. అరటి చెట్ల నుంచి దానిమ్మ వరకూ అన్ని రకాల మొక్కలూ, చెట్లు ఉన్నాయక్కడ. వాటికి నీరు పోయడం కోసం మొదలైన జలయజ్ఞం ఫలితంగానే భూమిలోని నీటి నిల్వను పెంచే సరికొత్త పద్ధతిని కనుగొన్నామంటారు భక్తులంతా. దీన్నే ఆక్వాఫైర్ అంటున్నారు.
 
బోరెండిపోవడంతో...

పాతికేళ్లక్రితం కట్టిన మందిరం అది. అక్కడ వేసిన బోరు కూడా అప్పటిదే. పదేళ్లక్రితం ఉన్నట్టుండి బోరు ఎండిపోయింది. ఏం చేస్తారు...మందిర అవసరాలకోసం నీటిని ట్యాంకర్లతో తెప్పించుకోవడం మొదలుపెట్టారు. ఎత్తై ప్రదేశం కావడంతో ఒకసారి నీళ్లట్యాంకరు పెకైక్కుతూ బోల్తాపడింది. అప్పటి నుంచి ట్యాంకర్లవాళ్ళు అక్కడికి రావడానికి వెనుకాడసాగారు. అప్పుడిక చేసేది లేక... 550 అడుగుల లోతుగా బోరు వేశారు. ఆ బోరు కూడా మూడేళ్లక్రితం ఎండిపోయింది. ‘‘పాతికేళ్ల నుంచి ఇక్కడ ప్రాంగణంలో మొక్కలు పెంచుతున్నాం. అలాంటిది నీళ్ళు లేకపోతే... పచ్చని ప్రదేశమంతా ఇప్పుడు తిరిగి రాయిలా మారిపోతుండడంతో డాక్టర్ విజయసారథి మాకు ఒక ఉపాయం చెప్పారు. ఆయన చెప్పిన పద్ధతిని అనుసరించడం వల్ల ఎండిపోయిన బోరులో నుంచి వేసవిలో కూడా పుష్కలంగా నీరు వస్తోంది. మా మందిరం బోరులోనే కాదు... చుట్టుపక్కల ఎక్కడ బోరువేసినా నీళ్లకు కొదవలేదు’’ అని చెప్పారు చార్టర్‌‌డ ఎకౌంటెంట్‌గా పనిచేస్తున్న రాజేందర్.
 
నీటి నిల్వ పెంచడం కోసం...

వర్షపు నీటిని ఫిల్టర్ చేసి బోరు ద్వారా భూమిలోకి పంపడం వల్ల ఇప్పుడు బోరులో బోలెడు నీరు ఉంది. బోరులోకి నీరెలా పంపాలంటారా? వర్షం వచ్చినపుడు మందిరం పైభాగంలో పడ్డ నీరంతా కిందకు పోతుంది. అలాగే కింద రాళ్లపై పడ్డనీరు కూడా పల్లపు ప్రాంతానికి పోతుంది. ఇక్కడే కాదు ఎక్కడైనా వర్షంనీరు 40శాతం ఆవిరైపోతుంది, 40 శాతం డ్రైనేజీలో కలిసిపోతుంది. పదిశాతం మట్టి పీల్చుకుంటుంది. మరో పదిశాతం మాత్రమే భూమిలోని నీటి నిల్వలను చేరుతుంది.  యాభైశాతం వర్షం నీటిని బోరుబావుల ద్వారా భూమిలోకి పంపగలిగితే ఏ కాలంలోనూ నీటికొదవ ఉండదు. ‘‘మా మందిరంపై కురిసే వర్షపు నీరు పడేచోట సిమెంటు ట్యాంకుతో తయారుచేసిన ఇంకుడు గుంతను ఏర్పాటు చేశాం.

ఆ ఇంకుడు గుంతకు కిందిభాగంలో ఒక పైపు పెట్టాం. ఈ ఇంకుడు గుంత వల్ల వర్షపు నీరు ఫిల్టర్ అయిపోతుంది. పది అడుగుల లోతు సిమెంటు, లేదా ప్లాస్టిక్ తొట్టిలో మొదట పెద్దసైజు కంకరరాళ్లు, తర్వాత సన్నకంకర, చివరగా ఇసుక ఒకదాని తరువాత మరొకటిగా పొరలు పొరలుగా పోయాలి. పైన దుమ్ము పడకుండా ఏదైనా ఒక మ్యాట్‌ని వేయాలి. దానిపై పైపులద్వారా పడుతున్న వర్షపునీరంతా ఫిల్టరయి కింద అమర్చిన గొట్టం ద్వారా మరో ట్యాంకులో వెళ్లిపోతాయి. ఆ ట్యాంకు నుంచి నేరుగా బోరుబావిలో పెట్టిన పైపులోకి వెళ్లిపోతాయి.

బోరులో నీటికోసం ఎంతలోతు పైపు వేశామో దానికి ఆనుకునే మరోపైపుని వేసి దానిద్వారా ఈ ఫిల్టరయిన నీటిని లోపలికి పంపించాలి. మేం గత జూన్‌నెల నుంచి మా బోరులోకి కొన్ని లక్షల లీటర్ల నీటిని భూమిలోపలికి పంపించాం. దాని ఫలితం కనిపిస్తోంది. గతంలో మామూలు రోజుల్లో కూడా బోరు స్విచ్ వేశాక ఆరు నిమిషాలకు గానీ నీళ్ళు పైకి వచ్చేవి కావు. కానీ, ఇప్పుడు వేసవికాలంలో యాభై సెకన్లకే నీళ్ళు పైకి వస్తున్నాయి.

అంటే మా బోరుకిందున్న నీటినిల్వలస్థాయి పెరిగిందన్నమాట. అంతేకాదు మా చుట్టుపక్కల ఎక్కడ బోరువేసినా వెంటనే నీళ్లు వచ్చేస్తున్నాయి’’ అని చెప్పారు గిరిధర్ అనే బ్యాంక్ ఉద్యోగి. ఇంకుడు గుంతల వల్ల నీరు నేరుగా నీటి నిల్వలను చేరుకునే అవకాశం తక్కువగా ఉంటుంది. ఇలా బోరుద్వారా కొన్ని వందల అడుగుల లోపలికి నీరు పంపించడం వల్ల మన నీటిని మనమే భద్రంగా దాచుకోవడంతో సమానమంటారు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కీర్తి.
 
అపార్ట్‌మెంట్‌పై నీటితో...

 
భవిష్యత్తులో 90లక్షల లీటర్ల నీళ్ళును నిల్వ చేసే అండర్‌గ్రౌండ్ ట్యాంకు నిర్మాణ పనుల్లో బిజీగా ఉన్నారు ఆక్వాఫైర్ బృందం. దాని ద్వారా వేసవిలో ఉచితంగా నీటిని సరఫరా చేయాలన్నది వారి లక్ష్యం. రోజురోజుకీ వేల సంఖ్యలో పెరుగుతున్న అపార్టుమెంట్ల వల్ల భూమిలోని నీరంతా మాయమైపోతోందన్న మాటలు వింటూనే ఉంటాం. అపార్టుమెంట్ల సంఖ్య పెరిగిన చాలా ప్రాంతాల్లో బోర్లు ఎండిపోతున్నాయి. అలాంటిచోట్ల ఈ నీటినిల్వ ఏర్పాటు పద్ధతి చాలా అవసరం.

ఆక్వాఫైర్ బృందం ప్రతి ఆదివారం ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నారు. ఎవరైనా తమ ప్రాంతంలో నీటి నిల్వలను పెంచుకోవాలనుకుంటున్నవారికి ఉచితంగా ఆ విధానాన్ని బోధించడానికి వీరు సిద్ధంగా ఉన్నారు. ఆకాశగంగను... నేరుగా పాతాళానికి పంపిస్తూ నీటికొరత అనే మాటకు చోటులేకుండా చేసిన వీరి విజయం అందరి సొంతమవ్వాలంటే... ఆక్వాఫైర్ బృంద సభ్యుడు  రాజేందర్ (9849046848)ని సంప్రదించవచ్చు.

 - భువనేశ్వరి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement