అక్కడ కార్ల తయారీ నిలిపేశారు!
హర్యాణా జాట్ రిజర్వేషన్ల గొడవ మారుతీ సంస్థకు తీవ్ర నష్టాలను తీసుకొచ్చింది. స్థానికంగా జరుగుతున్న ఆందోళనల కారణంగానే మానేసార్, గుర్గావ్ ప్లాంట్లలో కార్ల తయారీని నిలిపివేసినట్లు మారుతీ సుజుకి సంస్థ ఇప్పటికే వెల్లడించింది. శనివారం మధ్యాహ్నం నుంచి ఉత్పత్తిని నిలిపివేశామన్న సంస్థ... తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తామనే వివరాలను మాత్రం తెలుపలేదు.
ప్లాంట్లకు కావలసిన వస్తువులను వివిధ పంపిణీదారుల నుంచి సేకరిస్తామని, ఇప్పుడు ఆందోళనల కారణంగా సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో కార్ల తయారీని నిలిపివేయాల్సి వచ్చిందని మారుతీ సంస్థ చెప్తోంది. ఇదే పరిమాణంలో ఇతర ప్రాంతాలనుంచి వస్తువులను తెప్పించుకునే అవకాశం కూడా లేదని, అది ఎంతో కష్టంతో కూడుకున్న పని అంటోంది. రోజుకు మానేసార్, గుర్గావ్ రెండు ప్లాంట్లలో కలిపి సుమారు 5,000 యూనిట్ల వాహనాలు తయారవుతాయని రిజర్వేషన్ గొడవల నేపథ్యం సంస్థకు భారీ నష్టాన్ని తెచ్చిపెడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇటీవల నూతనంగా ప్రవేశ పెట్టిన మారుతి సుజుకీ బాలెనోకి భారీ డిమాండ్ ఉన్నా... తయారీ నిలిపివేయడం సంస్థకు కష్టాలను తెచ్చిపెట్టిందని చెప్తోంది.
హర్యాణా ఆందోళనలు రోటాక్ పరిసర ప్రాంతాల్లో నివసించే రోజువారీ జీవితాలపై కూడ తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రయాణ సౌకర్యాలు లేకపోవడంతో ఆహారం, పాలు, పెట్రోల్ వంటి వస్తువుల పంపిణీ కూడ కష్టంగా మారింది. ఆందోళనలను అరికట్టడంలో భాగంగా రోటాక్ జిల్లాలో ఏకంగా ఇంటర్నెట్, మొబైల్ సర్వీసులను కూడ నిలిపివేయడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.