పెండింగ్ జల విద్యుత్ కేంద్రాలు పూర్తిచేస్తాం
పెండింగ్ జల విద్యుత్ కేంద్రాలు పూర్తిచేస్తాం
Published Wed, Aug 3 2016 11:08 PM | Last Updated on Tue, Mar 19 2019 7:00 PM
∙ ఏపీ జెన్‌కో హైడల్ విభాగం డైరెక్టర్ నాగేశ్వరరావు
∙వేటమామిడి చిన్నతరహా విద్యుత్ కేంద్రం పరిశీలన
అడ్డతీగల : అర్ధంతరంగా నిలిచిపోయిన పింజరికొండ, మిట్లపాలెం జలవిద్యుత్ కేంద్రాల పనులను త్వరితగతిన పూర్తిచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం, జెన్‌కో కృత నిశ్చయంతో ఉన్నాయని ఏపీ జెన్‌కో(హైడల్ ప్రాజెక్ట్స్) డైరెక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు వెల్లడించారు. పలువురు జెన్‌కో, ట్రిప్‌కో అధికారులతో కలిసి ఆయన మండలంలోని వేటమామిడి చిన్నతరహా జలవిద్యుత్ కేంద్రాన్ని బుధవారం సందర్శించారు. ఈ రెండు ప్రాజెక్టుల వద్ద మిగిలి ఉన్న సివిల్ పనులు పూర్తి చేయించేందుకు చర్యలు తీసుకోవాలని ట్రిప్‌కో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.రత్నబాబు, పోలవరం పవర్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కొలగాని వీఎస్‌ఎన్ మూర్తిని ఆదేశించారు. గిరిజనుల ఆర్థిక పురోభివృద్ధి కోసమే ప్రభుత్వం చిన్నతరహా జలవిద్యుత్ కేంద్రాల స్థాపనకు పూనుకుందని ఈ సందర్భంగా నాగేశ్వరరావు అన్నారు. ప్రస్తుతానికి వేటమామిడి జలవిద్యుత్ కేంద్రం పనితీరు సంతృప్తికరంగానే ఉందన్నారు. ఈ కేంద్రాల్లోని విద్యుత్ విక్రయం ద్వారా వచ్చే లాభాల్లో 50 శాతం సొమ్మును ప్రాజెక్ట్ చుట్టుపక్కల గ్రామాల అభివృద్ధికి, మిగతా 50 శాతం మొత్తాన్ని ఐటీడీఏ ద్వారా గిరిజన గ్రామాల అభివృద్ధికి ఖర్చుచేస్తారని వీఎస్‌ఎన్ మూర్తిని వెల్లడించారు. జలవిద్యుత్ కేంద్రాల నిర్మాణానికయ్యే మొత్తంలో 50 శాతం కేంద్ర ప్రభుత్వం, 45 శాతం నాబార్డు, మిగతా ఐదు శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తాయని తెలిపారు. వేటమామిడి కేంద్రానికి వచ్చిన అధికారులను ప్రాజెక్ట్ కమిటీ బాధ్యురాలు బలువు సత్యవతి ఆధ్వర్యంలో మహిళలు స్వాగతం పలికి, పలు సమస్యలను వివరించారు. ట్రిప్‌కో సూపరింటెండింగ్ ఇంజనీర్లు స్వామినాయుడు, రంగనాథన్ తదితర అధికారులు ఇక్కడకు వచ్చిన వారిలో ఉన్నారు.
Advertisement
Advertisement